(జాతీయ బాలికల దినోత్సవం)
లింగ నిర్థారణ పరీక్షలు చట్టవ్యతిరేకమని, భ్రూణహత్యలు శిక్షార్హమైన నేరాలని ప్రభుత్వం ఎంతగా హెచ్చరికలు చేస్తున్నా, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు లేదని మన రాష్ట్ర జనాభా లెక్కలు ఘోషిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల వివరాలను పరిశీలిస్తే రాష్ట్రంలో బాలికల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తేటతెల్లమవుతోంది.
బాలురతో పోలిస్తే బాలికల నిష్పత్తి గణనీయంగా తగ్గుతున్నట్లు, మరోవైపు పట్టణ ప్రాంతాల్లో స్ర్తి, పురుష నిష్పత్తి కూడా తగ్గుతున్నట్లు జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఆరేళ్ల లోపు వయసులో ప్రతి వెయ్యి మంది బాలురకు 943 మంది బాలికలు ఉన్నట్లు తేలడం ఎవరినైనా కలవరపెడుతుంది. బాలబాలికల నిష్పత్తిలో ఇంతటి తేడా ఉండడం రాబోయే కాలంలో సమాజంపై తీవ్ర దుష్ఫలితాలు చూపే ప్రమాదం ఉంది.
మన రాష్ట్రంలో మొత్తం 1128 మండలాలు ఉండగా, 1066 మండలాల్లో ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు. బాలికలు తక్కువగా ఉన్న మండలాల సంఖ్య 2001లో 12 మాత్రమే కాగా, 2011లో ఈ సంఖ్య 122 కావడం గమనార్హం. ప్రతి వెయ్యి మంది బాలురకు గ్రామీణ ప్రాంతాల్లో బాలికల సంఖ్య 942 కాగా, పట్టణ ప్రాంతాల్లో 946గా నమోదైంది. 2001లో గ్రామాలకు సంబంధించి బాలికల సంఖ్య 963, పట్టణ ప్రాంతాల్లో 955గా ఉంది.
దశాబ్ద కాలంలో పల్లెలు, పట్టణాలనే వ్యత్యాసం లేకుండా బాలికల సంఖ్య తగ్గుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలికల సంఖ్య (వెయ్యి మంది బాలురకు) మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ మండలంలో 704 ఉండగా, నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో 528గా ఉంది. 2001లో ఏ మండలంలోనూ బాలికల సంఖ్య 800 కంటే తక్కువగా లేదు. 2001లో 111 మండలాల్లో బాలుర కంటే బాలికల జనాభా ఎక్కువగా ఉండేది. పదేళ్ల కాలంలో అనూహ్యంగా బాలికల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తేలింది. 2011 లెక్కల మేరకు 62 మండలాల్లో మాత్రం బాలికలు సల్వ సంఖ్యలో అధికంగా ఉన్నారు.
బాలికల సంఖ్య 900 కన్నా తగ్గడం ఆందోళనకర పరిణామమని నిపుణులు అంటున్నారు. 15 మండలాల్లో బాలికల సంఖ్య 850 కన్నా మించకపోవడం మరో విపరిణామం. ఇక- జనాభాలో మహిళల నిష్పత్తి కూడా తగ్గిపోతోంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళల నిష్పత్తి 992గా ఉంది. 481 మండలాల్లో పురుషుల కంటే మహిళలు అధికంగా ఉన్నారు. ఆదిలాబాద్, విజయనగరం జిల్లాల్లో మాత్రం మహిళల జనాభా ఎక్కువగా ఉంది. 76 మండలాల్లో మహిళల నిష్పత్తి 950 కన్నా తక్కువగా ఉంది. 5 మండలాల్లో ఈ సంఖ్య 900 కన్నా తగ్గిపోయింది. రాష్ట్ర రాజధానిలోని గోల్కొండ, ఖైరతాబాద్, జిన్నారంతో పాటు శ్రీశైలం, విజయవాడ రూరల్ మండలాల్లో మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారని తేలింది. ఇక గత పదేళ్లలో పట్టణ జనాభా వృద్ధి రేటు పెరిగి, గ్రామీణ జనాభా వృద్ధి రేటు తగ్గింది. పట్టణ ప్రాంతాలకు వలసలు పెరగడం, ఉమ్మడి కుటుంబాల సంఖ్య బాగా తగ్గిపోవడంతో పిల్లల జనాభా తగ్గుతోంది.
బాలికలైతే భారమని, మగపిల్లలైతే లాభమన్న భావన కారణంగానే తల్లిదండ్రులు ఆడశిశువులంటేనే అయిష్టత చూపుతున్నారు. ఈ కారణంతోనే కొందరు లింగ నిర్ధారణ పరీక్షలకు, మరికొందరైతే భ్రూణహత్యలకు సైతం తెగిస్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా గత దశాబ్ద కాలంలో శిశు జనాభా తగ్గింది. 2001- 2010 కాలంలో పిల్లల జనాభా -7.23 నుంచి -15.03గా నమోదైంది.
గ్రామీణ జ నాభా పెరుగుదలలో ఆదిలాబాద్ అగ్రభాగాన, కృష్ణా జిల్లా దిగువ భాగాన ఉన్నాయ. పట్టణ జనాభా వృద్ధిలో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలోనూ, ఆదిలాబాద్ చివరి స్థానంలోనూ నిలిచాయి.ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే అబార్షన్‌లు చేయించేందుకు గర్భిణులపై కొన్ని కుటుంబాల్లో వత్తిడి చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి.
No comments:
Post a Comment