Tuesday 2 April 2013

పరాభవం వెనుక ఓ ఆడది!

జారుడుమెట్లు! 

కేబీ గణేశ్ కుమార్... 'మాలీవుడ్'లో ప్రతిభ కనబరచి మంచి నటుడనిపించుకున్నారు. చిన్నవయస్సులోనే రాజకీయాల్లో పైకెదిగి సమర్ధుడైన నాయకుడనిపించుకున్నారు. జీవిత భాగస్వామి విషయంలో అమానవీయంగా ప్రవర్తించి ఎంత స్పీడుగా పైకెదిగారో అంతే స్పీడుగా నేలకుపడిపోయారు.

ఘనకీర్తి... అపఖ్యాతి!

కేరళ కొల్లం జిల్లా పత్తానపురం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన యువనేత గణేశ్ కుమార్. సినిమాటోగ్రఫీ, క్రీడలు, అడవుల శాఖ మంత్రిగా ఉన్న ఈ కేరళ కాంగ్రెస్(బి) యువ నాయకుడు కుటుంబ కలహాలతో అప్రతిష్టపాలై పదవి పోగొట్టుకున్నారు. కేరళ కాంగ్రెస్ (బి) వ్యవస్థాపకుడు బాలకృష్ణ ఈయన తండ్రి. మలయాళీ సినీ పరిశ్రమ 'మాలీవుడ్'లో 1985లో అడుగు పెట్టిన గణేశ్...'ఎరాకల్' సినిమాలో హీరోగా మెప్పించారు. సినిమాలు, టీవీ సీరియళ్లలో అనేక పాత్రలు వేశారు. వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2008లో 'అగ్నిసాక్ష్యాయ్' అనే టెలిఫిల్మ్ కోసం గణేశ్ సాహసోపేతంగా చేసిన ఫైర్ స్టంట్ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్టరుగా ముద్రవేసింది. 'మాధవం' అనే టీవీ సీరియల్ పాత్రతో 2007లోనే ఉత్తమ నటుడు అవార్డునందున్నారు.  2001లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన గణేశ్... కేరళలో ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి నటుడిగా రికార్డు సృష్టించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన యువనేతకు కేరళ సీఎం ఊమెన్ ఛాందీ పెద్దపీట వేశారు. కీలకమైన శాఖను అప్పగించారు. యూడీఎఫ్  సంకీర్ణంలో కీలకభాగస్వామ్య పార్టీ కేరళ కాంగ్రెస్(బి). ఇంతకీ గణేశ్ ఎలావివాదాల్లో ఇరుక్కున్నాడనేది ఆసక్తికరం.

ఇటు భార్య, అటు తండ్రి

ఇంటి పోరు గణేశ్ కుమారుకు బాగా అనుభవంలోకి వచ్చింది. భార్యను వేధించాడన్న కేసులో మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గణేశ్ భార్య డాక్టర్ యామిని భర్త మీద గృహహింస కేసు పెట్టారు. ఆయనేమో భార్యే నన్ను కొట్టిందంటూ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. ఇద్దరి తగవూ పతాక శీర్షికలకు ఎక్కింది. అయితే ఇంత రచ్చ జరగడం వెనుక ఏదో రాజకీయ శక్తి ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇద్దరు పిల్లలున్న వీరికి పద్దెనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. పధ్నాలుగేళ్లుగా రాచిరంపాన పెడుతున్నారంటూ భర్త మీద ఇప్పుడు ఫిర్యాదు చేసిందామె. 

 

 వివాదం వెంట వివాదం

నెలరోజుల క్రితం కూడా గణేశ్ వ్యవహారం సంచలన వార్త అయింది. ఓ మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె భర్త గణేశ్ను మంత్రిత్వ కార్యాలయంలోనే చితక్కొట్టారనేది అప్పటి వార్త. దీనిపై పెద్ద రాజకీయ దుమారం రేగింది. విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఇంతలో ఇంటి గుట్టు రచ్చకెక్కింది. ఇప్పుడు స్వయానా భార్యే  నన్ను హింసించారంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. అసలు తండ్రికి, కొడుకుకూ ఎప్పటి నుంచో రాజకీయ విభేదాలున్నాయి. అవినీతి కేసులో కొన్నాళ్లు శిక్ష అనుభవించిన తండ్రి బాలకృష్ణకు... మంత్రి పదవిలో ఉన్న కొడుకంటే పడదు. పదవి ఊడగొట్టేయండంటూ చాలారోజులుగా ముఖ్యమంత్రి మీద ఒత్తిళ్లు తెస్తున్నారాయన. బొటాబొటీ మెజారిటీతో అధికారంలో కొనసాగుతున్న యూడీఎఫ్ సర్కారుకు కేరళ కాంగ్రెస్(బి) మద్దతు చాలా కీలకం. ఇలాంటి క్లిష్టసమయంలో సర్కారు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం సీఎం ఛాందీ పీఠానికే ఎసరు తెచ్చేలా ఉంది. విపక్షాలు ఆయన పాలననే తప్పుబడుతున్నాయి. రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. దీనంతటికీ కారణమైన గణేశ్ కుమార్... ప్రేక్షకుల్ని మెప్పించిన మంచి నటుడు, ఓటర్లను ఆకట్టుకున్న పవర్ ఫుల్ నాయకుడు, భార్యను గౌరవించలేక విఫలమైన ఓ భర్త.    

No comments: