Thursday 4 April 2013

పూజా...ఏ లక్కీ బేబీ!

సరిహద్దులు దాటినా క్షేమంగానే వెనక్కి!

శత్రుదేశం సైన్యానికి చిక్కితే ఎంతటి చిత్రహింసలకు గురిచేస్తారో సినిమాల్లో చూసుంటారు. ;పులినోట్లో తలపెట్టినట్లే!. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉండే కాశ్మీరు, రాజస్థాన్, పంజాబ్ వాసులకు ఇది అనుభవమే. సరిహద్దుల్లో కంచెకు ఆనుకునే అటూ ఇటూ గ్రామాలుంటాయి. అక్కడి వారు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. రేఖ దాటారో అంతే. శత్రుదేశం సైన్యం బంధించేస్తుంది. గూఢచర్యం కింద కేసులు పెడుతుంది. ఏళ్ల తరబడి దౌత్యపరమైన సంప్రదింపులు జరిపితే గానీ విముక్తి లభించదు. ఇలా పొరుగు దేశంజైళ్లలో గడుపుతున్న అమాయకులు బోలెడు మంది. అయితే రాజస్ధాన్ రాష్ట్రంలోని సరిహద్దు పల్లెకు చెందిన పూజ అనే ఏడేళ్ల బాలిక పొరపాటున సరిహద్దు కంచె దాటేసి పాకిస్థాన్లోకి వెళ్లిపోవడం పెద్ద టెన్షన్ సృష్టించింది. ఆ తర్వాత మూడు రోజులకు కథ సుఖాంతమైంది.

పూజా... అమాయకపు పిల్ల!

బికనీరు సమీపంలోని నీలకంఠ్ పాకిస్థాన్ సరిహద్దుల్లో కంచెకు దగ్గరగా ఉంటుంది. పూజా మేఘ్వాల్ మిగతా పిల్లలతో కలిసి పశువులను మేపడానికి వెళ్లింది. ఆటల్లోపడిన మిగతా పిల్లలు పూజ కనిపించడం లేదన్న సంగతి ఆలస్యంగా గుర్తించి గ్రామస్తుల చెవిన వేశారు. బాలిక తండ్రి సుఖ్ రామ్ సరిహద్దుల్లో వెతికినా బిడ్డ కనిపించలేదు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దృష్టికి తీసుకువెళితే అడుగుజాడల ద్వారా పూజా పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లినట్లు గుర్తించారు. అటువైపు భద్రతా దళాలను సంప్రదించారు. అటువైపు కూడా గాలింపు చర్యలు చేపట్టి మొత్తానికి బాలిక ఆచూకీ కనిపెట్టారు.

నడుచుకుంటూ పొరుగుదేశంలోకి...

పాకిస్థాన్, భారత్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. కానీ ఆ చిన్నారికి ఏం తెలుస్తుంది. తాను అడుగులు వేస్తున్నది శత్రుదేశ భూభాగంలోకని.?!. కంచె దాటేసి నాలుగు కిలోమీటర్ల దాకా ఇసుకలో నడుచుకుంటూ వెళ్లింది. అక్కడ ఓ చిన్న గుడిసెలాంటిదుంటే అక్కడ నిద్రలోకి జారుకుంది. చివరికి మూడు రోజుల తర్వాత ఇంటికి చేరింది. 

మానవత్వం చాటిన పాకిస్థాన్ సైన్యం

కాశ్మీర్ సరిహద్దుల్లో ఈమధ్య పాకిస్థాన్ జవాన్లు ఓ చెక్ పోస్టు మీద దాడిచేసి మన జవాన్ల తలలు తెగనరికారు. ఓ తలను తమ వెంట తీసుకువెళ్లారు. దీనిపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన ఘటన ఇది. 

తమ భూభాగంలోకి వచ్చిన బాలికను ఆప్యాయంగా చూసుకున్న పాకిస్థాన్ జవాన్లు చక్కగా బిస్కెట్లు, క్యాండీలు, బర్ఫీ కొనిపెట్టారు. కొత్త బట్టలు తొడిగి సరిహద్దుల్లోకి తెచ్చి బీఎస్ఎఫ్  చెక్ పోస్టు దగ్గర అప్పగించారు. పూజ క్షేమంగా తిరిగిరావడంతో ఆ ఊర్లో పండుగ జరుపుకున్నారు. నిజమే శత్రుదేశం సైన్యానికి చిక్కితే ఎవరినీ అంత ఈజీగా వదిలిపెట్టరు. ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోవాల్సింది. కంచె దాటి ఒక్క అడుగు వేసిన ఢిల్లీ, ఇస్లామాబాద మధ్య ఏళ్ల తరబడి దౌత్య చర్చలు, న్యాయపరమైన పోరాటాలు జరిగితే గానీ విముక్తి లభించదు. పూజ అదృష్టవంతురాలే. 

1 comment:

vkbabu said...

మొదటగా క్షేమంగా బయటపడినందుకు అభినందిద్దాం.పసిపిల్లను చూసి పాకిస్తానీ ముష్కరుల హృదయాలు కరిగాయా? లేక భారత సరిహద్దులు ఇంత బలహీనంగా వుందని ప్రపంచానికి చాటి చెప్పినందుకు సౌహార్ధ్ర భావంతో వదిలారా. భగవంతుడికే తెలియాలి.