కరుణచూపే నారసింహుడు!
కదిరిలోఅనుగ్రహరూపం!
మహా విష్ణువు దశావతారాల్లో నాలుగో అవతారం నృసింహావతారం. రాముడైనా, కృష్ణుడైనా దుష్టశిక్షణ, శిష్ట సంరక్షణ కోసమే. నారసింహావతారం మాత్రం ఓ భక్తుడిని కాపాడేందుకు అవతరించిన విష్ణురూపం. అసురుడైన హిరణ్యకశిపుడికి జన్మించి తనను కొలిచిన భక్త ప్రహ్లాదుని అనుగ్రహించిన అవతారం. ఈ అవతారంలో సగం ఉగ్రసింహుడు, మరోసగం నరరూపుడు. మహాభక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడిన తర్వాత నారసింహుడు శాంతమూర్తిగా మారి భక్తులోకానికి దర్శనమిస్తున్నాడు. అలాంటి నవనారసింహ క్షేత్రాల్లో కదిరి ఒకటి.
శాంతమూర్తిగా మారిందిక్కడే!
హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఉగ్రావతరాన్ని చాలించి శాంతమూర్తిగా మారడమే ఈ క్షేత్ర మహత్యం. మహర్షులంతా స్వామివారిని శాంతపరిచేలా స్తోత్రాలు పఠించారుట. అందుకే ఇక్కడి పర్వతాన్ని స్తోత్రాద్రి అంటారు. దీని మీద ఇప్పటికీ విష్ణుమూర్తి పాదాలున్నాయి. 'ఖ' అంటే విష్ణుపాదం. 'అద్రి' అంటే కొండ. అందుకే ఈ ఊరిని పూర్వం ఖాద్రి అనేవారు. ఈ దేవుడ్ని ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని కొలుస్తారు. ఖాద్రి కాలక్రమేణా కదిరిగా రూపాంతరం చెందింది. కదిరి వృక్షం కింద స్వామివారు వెలిసినందున ఆ పేరువచ్చిందన్న విశ్వాసం కూడా ఉంది.
ప్రహ్లాదుడితో నృసింహుడు
భక్త ప్రహ్లాదుడి కోసం అవతరించిన స్వామివారు ఆ అపర భక్తుడితో కలిసి దర్శనమివ్వడం కదిరి క్షేత్ర ప్రత్యేకత. దేవేరులైన అమృతవల్లి, తాయారుల దర్శన భాగ్యమూ కలుగుతుంది. 13వ శతాబ్ధంలో బుక్కరాయలు ఈ ఆలయాన్ని నిర్మించారు.
భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేసి స్వామివారు ఈ చెంతనే ఉన్నారని తెలుసుకున్నారు. అందుకే కదిరి సమీపంలోని భృగుతీర్ధానికెంతో మహత్తు ఉందని భక్తులు విశ్వసిస్తారు.
అది బ్రహ్మరథమే...!
కదిరి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. నారసింహుడి ఊరేగింపు కోసం దేవతలే రోజుకో వాహనాన్ని పంపిస్తారని ప్రతీతి. ఇక రథోత్సవం రోజున స్వయంగా బ్రహ్మదేవుడు రథం లాగుతాడని భక్తుల నమ్మకం. రథోత్సవం జరుగుతున్నప్పుడు ఉత్సవమూర్తి మీదకు భక్తులంతా దవనం జల్లుతారు. పండ్లు సమర్పిస్తారు. మిరియాలు అర్పించడం ఇక్కడి విశిష్టత. ఇలా చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని క్షేత్ర మహాత్యం చెప్తోంది. ఇంతేకాదు రథం వెళ్లిన మార్గంలో పడిన మిరియాలు, పండ్లు ఏరుకుతింటే సకల మనోవాంఛలు సిద్దిస్తాయని నమ్ముతారు. కదిరి మాడవీధుల్లో ఆ తేరును లాగితే జన్మధన్యమైనట్లేననుకుంటూ భక్తజనం పోటీలుపడతారు.
కదిరి విశేషాలు మరికొన్ని...
కదిరి మల్లెపూలకు ప్రసిద్ధి. అందుకే ఏటా వైశాఖశుద్ధ పౌర్ణమి నాడు మల్లెపూల తిరుణాల జరపడం ఆనవాయితీ. ఇక ఈ ప్రాంతంలో మేలురకం పట్టుచీరలు దొరుకుతాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పట్టు వస్త్రాలు కూడా కొనుక్కువెళ్తుంటారు. దగ్గర్లోని కటారుపల్లెలో యోగివేమన ఆలయం ఉంది. వేమన జీవసమాధిపొందిన తర్వాత అక్కడ ఆలయం కట్టారని ప్రతీతి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మర్రి వృక్షం కదిరికి 25 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆరువందల సంవత్సరాల నాటి 'తిమ్మమ్మ మర్రిమాను' అతిపురాతన వృక్షంగా గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. ఐదు ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షానికి ఏకంగా పదకొండు వందల ఊడలున్నాయిట. అందుకే ఇది పర్యాటక ప్రాంతంగా మారింది.
ఎలా వెళ్లాలి...
అనంతపురం జిల్లాలోని కదిరి జాతీయ రహదారికి ఆనుకునే ఉండడంతో రవాణా సౌకర్యాలు ఎక్కువే. బస్సు, రైలు మార్గాలున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 92 కి.మీ., ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టపర్తి నుంచి 100 కి.మీ. దూరంలో ఉంటుంది. కదిరి పుణ్యక్షేత్రం... ఎన్నో విశేషాలున్న పర్యాటక ప్రాంతం.
ఉగ్రరూపం దాల్చిన శ్రీ మహావిష్ణువు... భక్తప్రహ్లాదుడి నిఖార్సైన భక్తిని నిరూపిస్తూ హిరణ్యకశిపుడిని అంతమొందించాడు. ఆ ఉగ్రనారసింహుడే కదిరి క్షేత్రంలో శాంతమూర్తిగా అవతారమెత్తి భక్తకోటిని కరుణిస్తున్నాడు. కటాక్షం చూపిస్తున్నాడు.
2 comments:
Avunu,
Prahlada varada lakshmi narasimha swami darsanam tho janma puneetham avuthundi.
Rendu laksha laku paiga janam tho kadiri pura veedulu pulakinchi poyayi.
Balakishan
Kadiri
బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు... ఓ మిత్రుడు అందించిన సమాచారం మేరకు ఈ పోస్టు రాశాను. మరిన్ని విశేషాలతో మరో సందర్భంలో రాయడానికి ప్రయత్నిస్తాను. నా బ్లాగు చదువుతూ ఉండండి- నిహార్
Post a Comment