Friday 5 April 2013

సంస్కృతాన్ని బతికిస్తున్న నాలుగు గ్రామాలు

ప్రజల నాలుకల మీద దేవభాష!

ప్రపంచంలో ఒకప్పుడు అతిపెద్ద భాషల కింద లాటిన్, సంస్కృతం ఉండేవి. సకల భాషలకు తల్లి సంస్కృతం. ఇప్పుడది మృతభాష కిందే లెక్క. సంస్కృతమంటే దేవతలు మాత్రమే మాట్లాడుకునే దేవభాషగా స్థిరపడిపోవడంతో ప్రజలకు దూరమైపోయింది. కానీ ఇది దేవభాష కాదు ప్రజాభాష... ప్రజలు మెచ్చిన భాష అని నిరూపిస్తున్న గ్రామాలు మన భారతదేశంలో ఉన్నందుకు మనమంతా గర్వపడాలి. ఇంటర్ మీడియట్లో వందకు వంద మార్కుల కోసం సంస్కృతం చదువును 'మమ' అనిపిస్తున్నారు మన విద్యార్థులు. అయితే మార్కుల కోసం కాకుండా సకల భాషలకు కన్నతల్లిలాంటి సంస్కృతాన్ని తమ జీవనభాషగా మార్చుకున్న మత్తూరు, హోసహల్లి(కర్నాటక), ససానా(ఒడిషా), జిరి(మధ్యప్రదేశ్) గ్రామాల గుండె తలుపు తడితే ఎన్నో అనుభవాలు.

మత్తూరు, హోసహల్లి వేదఘోష

కర్నాటకలోని షిమోగా జిల్లా కేంద్రానికి సమీపంలో రెండు సంస్కృతం మాట్లాడే గ్రామాలున్నాయి. మత్తూరు, హోసహల్లి తుంగ నదీతీరానున్న అగ్రహారాలు. ఇక్కడ సంస్కృతం అధికార భాష. తొంభై శాతం సంస్కృతమే వాడుకభాష. సాధారణంగా సంస్కృతం, కన్నడం, తమిళం భాషలు కలగలిపిన 'సంకేటీ' అనే మాండలికాన్ని వాడుతుంటారు. బ్రాహ్మణులొక్కరే కాదు ముస్లింలు, దళితులు, వెనుకబడిన వర్గాల వారూ అంతా సంస్కృతంలోనే సంభాషించుకుంటారు. గ్రామసభల్లో, స్కూళ్లలో, ఇళ్లలో... ఎక్కడైనా బహు ఇష్టంగా రాజభాషలో మాట్లాడుకుంటారు. 

రాయల కాలంలోనే బీజం

సుమారు 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఇక్కడ దేవభాషకు బీజం పడింది. తమిళనాడులోని  పుదుక్కోటై ప్రాంతం నుంచి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవనోసాధి కోసం తుంగ నదీ తీరానికి వలసవచ్చాయి. వీరి కోసం కొంత భూమిని శ్రీకృష్ణదేవరాయలు దానంగా ఇవ్వాలనుకున్నా ఆ కుటుంబాల వారు స్వీకరించలేదు. ఆ తర్వాతే రాజుగారే బ్రాహ్మణుడి అవతారంలో దూతను పంపించి వీరికి భూమిని అందచేశారు. ఆనాటి నుంచి మత్తూరు, హోసహల్లి అగ్రహారాలుగా వెలుగొందుతున్నాయి. కొబ్బరి, వక్క తోటలు వీరికి ప్రధాన జీవనాధారం. బ్రహ్మముహూర్తం నుంచే మత్తూరులో వేదఘోష మొదలవుతుంది. ఇక్కడి వేద పాఠశాలలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన చిన్నారులు వేదం నేర్చుకుంటారు. ప్రభుత్వం నడుపుతున్న సరస్వతీ విద్యాలయంలోనూ సంస్కృతాన్ని ద్వితీయ భాషగా బోధిస్తుంటారు. వీధుల్లో బోర్డుల మీద సూక్తులు కూడా సంస్కృతంలోనే ఉంటాయి. 

మత్తూరులో విదేశీయుల అధ్యయనం

ఐర్లాండ్, జపాన్ తదితర దేశాల నుంచి ఔత్సాహికులు వచ్చి ఇక్కడే ఉంటూ సంస్కృతాన్ని అభ్యసిస్తుంటారు. మత్తూరుకు చెందిన వందల మంది వేద పండితులు, సంస్కృత అవధానులు దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా ఇతరులకు ఇదే భాష నేర్పిస్తుంటారు. కంప్యూటర్ రంగంలో నిపుణులైన యువకులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. కొంత మంది భాషా నిపుణులు సంస్కృతానికి సబంధించిన తాళపత్రాలను అధ్యయనం చేసి కంప్యూటకీరీకరించే బృహత్తర బాధ్యత చేపట్టారు.

తుంగ నదికి ఆవలి ఒడ్డునున్న గ్రామం హోసహల్లిలోనూ సంస్కృత సంభాషణలు, వేద పఠనం మార్మోగుతుంటాయి. అగ్రహారికుల జీవనశైలి సంప్రదాయసిద్ధంగా ఉంటుంది. చిన్నా పెద్దా, ఆడా మగా అంతా నదీస్నానం, వేదపఠనం(ఆడవారికి మినహాయింపు) మితభోజనం, సంస్కృత సంభాషణం. తెల్లనిధోవతులు, అంగవస్త్రాలు ధరించిన చిన్నారులు చక్కగా సంస్కృతంలో మాట్లాడుకుంటూ వీధిలో వెళుతుంటారు. ఎవరు ఎదురుపడినా 'హరిఓం' అంటూ సంబోధిస్తారు. ఆ తర్వాత సంస్కృతంలోనే మంచీచెడూ మాట్లాడతారు. చివరికి వీధుల్లో క్రికెట్ ఆడుకుంటున్న సంప్రదాయ కుటుంబాల పిల్లలు కూడా క్రికెట్ పరిభాషనంతా సంస్కృతంలోనే అవపోసన పట్టేశారు.

ససానాలోనూ సంస్కృతం

ఒడిషాలోని సముద్రతీర ప్రాంత గ్రామం ససానా. శ్యామసుందర్ గ్రామపంచాయితీలోని శివారు పల్లె సుసానాలో ఎక్కువగా బ్రాహ్మణ కుటుంబాలే. ఇక్కడంతా సంస్కృత అవధానులు, భాషా పండితులు. సంస్కృతం అంతరించిపోకుండా కాపాడి భావితరాలకు అందించాలనే దృఢసంకల్పం సుసానా వాసులది. అందుకే ఎక్కువగా సంస్కృతం చదువుతున్నారు. భాషా బోధకులుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వేదం నేర్చుకున్న వారు దేవాలయాలు, ధార్మిక సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. సుసానా పక్కనే ఉన్న బఖార్పూర్లో 'అభిజ్ఞాన శాకుంతలం' రచించిన సంస్కృతకవి కాళిదాసుకు ఓ ఆలయం ఉంది. తల్లిభాష పట్ల వీరికున్న మమకారం అలాంటిది.

జిరిలో పల్లెటూరి బైతును కదిలించినా దేవభాషే

సంస్కృతాన్ని దేవభాషగా కాకుండా ప్రజాభాషగా గుర్తించిన గ్రామం మధ్య ప్రదేశ్లోని జిరి. దగ్గరదగ్గరగా హిందీలాగా ఉండే మాల్వి మాండలికం వీరి భాష. అయినా సంస్కృతమంటే వీరికి మక్కువ. పొలాల్లో పనిచేసుకునేవారు సంస్కృతంలో మాట్లాడుకుంటారు. విమ్లా పన్నాఅనే ఓ టీచరు అందరికీ సంస్కృతం నేర్పిస్తోంది. క్షత్రియులు, ఠాకూర్లు, సోందియాలు, భిల్ గిరిజనులు ఉండే ఈ గ్రామంలో సంస్కృతమంటే అమిత ప్రేమ. హైస్కూలు స్థాయిలోనూ విద్యార్థులంతా సంస్కృతం చదువుకుంటున్నారు.  

మధ్య ప్రదేశ్లోని మోహాద్, బాగువార్ గ్రామాల్లోనూ సంస్కృతానికి పెద్దపీట వేస్తున్నారని సమాచారం. మత్తూరు, హోసహల్లిలో సంస్కృతం నేర్చుకున్న విదేశీయులు వేల మంది. ఇప్పటికీ మత్తూరు గ్రామాన్ని వెతుక్కుంటూ వచ్చే విదేశీయులు చాలా మందే ఉంటారు. సంస్కృత భాషలోని గొప్పదనాన్ని పరదేశీయులు గుర్తించినంతగా సనాతన దేశమనే పేరున్న భారతీయులు గుర్తించినట్లు లేదు. నూటా ఇరవైకోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో సంస్కృతం జనానికి దూరమైపోయింది. ఓ నాలుగు చిన్న ఊర్లలో దేవభాషను బతికించేందుకు సామాన్యులే కంకణం కట్టుకున్నందుకు అభినందిద్దాం.

No comments: