ఏ పుణ్యం చేసెనో....!
పూరమ్ ఉత్సవాల్లో అంబారీల సంబరం
కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకన్నారోగానీ... ఆ పుణ్యధామమంతటా ఆధ్మాత్మిక, భక్తి పరిమళాలే. అక్కడి ఉత్సవాలు, సంబరాలదీ ఎంతో ప్రత్యేకత. మళయాలీల ఉత్సవాల్లో కొబ్బరి బొండాం, ఏనుగు ప్రముఖంగా కనిపిస్తాయి. త్రిస్సూరులోని వడక్కునాథన్ ఆలయ సమీపంలోని తెక్కింక్కాడు మైదానంలో నిర్వహించిన "పూరమ్" ఉత్సవాలు కనులపండువగా సాగాయి. విదేశీ టూరిస్టులైతే పూరమ్ ఉత్సవాలు కళ్లారా చూసి మైమరచిపోయారు.
రాజవైభోగం చాటిన ఏనుగుల ఊరేగింపు
బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించిన అంబారీ ఏనుగుల ఊరేగింపు పూరమ్ ఉత్సవాల ప్రత్యేకత. త్రిస్సూరులోని పరమెక్కవు, తిరువంబాడీ దేవాలయాల నుంచి ఈ ఏనుగులను పూరమ్ ఉత్సవాల కోసం వడక్కునాథన్ కోవెలకు రప్పించారు. ఏనుగుల మీద అలంకరించిన పల్లకీలకు రాచరిక వైభవం ఉట్టిపడింది.
శతాబ్దాల చరిత్రున్న పూరమ్
త్రిస్సూరులో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం ఇది 215వ సంవత్సరం. అంటే రెండు శతాబ్ధాలకు పైబడిన ప్రాచీన సంప్రదాయమన్న మాట. కొచ్చిన్ సామ్రాజ్యాన్ని ఏలిన రాజా రామ వర్మ త్రిస్సూరు పూరమ్ సంబరాలకు 1798లో శ్రీకారం చుట్టారు. ఆనాటి నుంచీ ఈ ఉత్సవాలు జనాధారణ ఏమాత్రం తగ్గకుండా వైభవోపేతంగా సాగుతున్నాయి. ఏటా దేశవిదేశ భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు.
విదేశీ టూరిస్టులకు కనులపండువ
సంస్క్రృతీ సంప్రదాయాలు కలగలిసిన పూరమ్ సంబరాల్లో భక్తిభావనలు వెల్లివిరిశాయి. ఇందుకు మలయాళీ సంప్రదాయ సంగీతం కూడా జతై సంబరాలు వీనులవిందుగా సాగాయి. కేరళలో పేరెన్నికగన్న వాద్య బృందాలు 'పంచవాద్యం', 'పాండీమేళం' సంగీత స్వరసమ్మేళనాలతో రక్తికట్టించారు. నాలుగైదు గంటల పాటు త్రిస్సూరు వినువీధులు టపాకాయల వెలుగుజిలుగులతో భక్తజనాన్ని మైమరిపిపంచేశాయి.
గాడ్స్ ఓన్ కంట్రీ చుట్టిరావాలనుకునే వారికి సమ్మర్ మంచి సీజన్. కానీ త్రిస్సూరు పూరమ్ ఉత్సవాలు పరిసమాప్తం అయ్యాయి కాబట్టి వచ్చే ఏడు ఏప్రిల్ రెండో లేదా మూడో వారానికి కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మంచిది. కేరళ కొబ్బరి తోటల్లో విహారం, సరస్సుల్లో హౌస్ బోట్ షికారు... ఇలాంటి ఎన్ని సరదా సరదా క్షణాలు గడిపినా పూరమ్ ఉత్సవాలు చూడకపోతే మీ ట్రిప్ పూర్తి కాదు.
No comments:
Post a Comment