ప్రజలకు తెలిసిన న్యాయం!
నేరగాళ్లకు వెలి శిక్ష!
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు తేల్చలేని పనిని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తెమల్చలేని కేసును ఒక్కోసారి పల్లెటూరి జనమే సెటిల్ చేసేస్తారు. అదే ప్రజాన్యాయస్థానమంటే. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే దురదృష్టవశాత్తూ ఆటవిక న్యాయం రాజ్యమేలుతుంది. అనేకసార్లు అమాయకులను బలిపీఠం ఎక్కించే ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ ఢిల్లీలో ఐదేళ్ల బాలికను పైశాచికంగా చెరచిన 22 ఏళ్ల మానవ మృగం మనోజ్ కుమార్ ఊరి వాళ్లు మాత్రం తమ చేతుల్లో ఉన్నంత వరకూ సత్వర న్యాయం అంటే ఏమిటో చాటిచెప్పారు. అదే నేరగాడి కుటుంబానికి గ్రామ బహిష్కారం. మనచుట్టూ తిరుగుతున్న నేరగాళ్లను వెలి వేయడమొక్కటే మార్గమని నిర్ణయించారు వారంతా.
కోరలు లేని చట్టాలా...
చట్టాలు తమ పని తాము చేసుకుంటాయనుకుంటే నేరగాళ్లు చెలరేగిపోతుంటారు. చట్టానికి దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుంటారు. చట్టానికి చిక్కినా న్యాయస్థానానికి సాక్ష్యాలు దొరక్కుండా ప్రయత్నిస్తారు. నేరగాళ్లంతా బలాదూర్గా తిరుగుతుంటే మళ్లీ మళ్లీ నేరాలు జరుగుతూనే ఉంటాయి. బీహారులోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్నఓ గ్రామం కాలయాపన లేకుండా, సత్వరమే తేల్చి నిర్ణయం తీసుకున్నారు. తప్పుచేసిన వాడి కుటుంబాన్ని సాంఘికంగా వెలివేశారు. ఢిల్లీలో ఓ పసిదాన్ని అతిక్రూరంగా హింసించి, అత్యాచారం చేశాక తప్పించుకుని వచ్చేసిన రాక్షసుడ్ని చూసి భార్య కంగారుపడింది. ఏమైందో చెప్పకుండానే ఆ పక్కనే ఉన్న చికనౌటా గ్రామంలోని అత్తారింటికి వెళ్లిపోయాడు మనోజ్. జరగరానిదేదో జరిగిందని కుటుంబ సభ్యులు అనుమానించేలోగానే టీవీలు, పేపర్లు ఆ పైశాచిక కాండను వెలుగులోకి తెచ్చాయి. సెల్ ఫోన్ టవర్ సాయంతో మనోజ్ ఎక్కడ తలదాచుకున్నదీ గుర్తించిన పోలీసులు వెంటనే పట్టుకోగలిగారు.
పాపం....బీహారీలు!
అయితే ఢిల్లీలో జరుగుతున్న అఘాయిత్యాల వెనుకున్నది బీహారీలే కావడమనేది సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశమంటారు ఆ రాష్ట్రానికి చెందిన నేత లాలూ ప్రసాద్ యాదవ్. ఆయనొక్కరే కాదు ఏ బీహారీని కదిపినా ఆవేశంతో రగిలిపోయే అంశమిది. బీహారంటే అరాచకాలకు చిరునామాగా మారిపోయింది. అంతకుముందు 'నిర్భయ' అత్యాచార ఘటనలో కీలక నిందితులు ఇక్కడి వారే. బీహారీల వల్లే నేరాలు జరుగుతున్నాయంటూ గతంలో శివసేన నాయకులు చేసిన ప్రకటనలు రాజకీయ దుమారాన్ని రేపాయి. నిజానికి రెండు మూడు ఘటనల్లో నేరగాళ్లు అక్కడి వారైనంత మాత్రాన మొత్తం బీహారునే అనుమానించాల్సిన అవసరం లేదు. అవమానించడమూ మర్యాద కాదు. అరాచకపోకడలుంటే ఉండవచ్చు... కానీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో జేడీయూ సర్కారు ఆ రాష్ట్రాన్ని పురోభివృద్ధి బాటలో నడుపుతున్నది వాస్తవమే. 'నిర్భయ' కేసులో అక్షయ్ కుమార్ ఠాకూర్, 'గుడియా' కేసులో మనోజ్ కుమార్ బీహారీలైనంత మాత్రాన ఆ రాష్ట్రాన్ని వేలెత్తి చూపించలేం. కానీ మనోజ్ సొంత గ్రామం తీసుకున్న నిర్ణయం హర్షించతగినదే. ఆ కుటుంబానికి గ్రామ బహిష్కరణ విధించారు. ఇది అసాంఘిక, అసంబద్ధ చర్యే. పూర్తిగా సమర్ధించలేం.
ఆటవిక న్యాయం కాకూడదు...
ఓ మనోజ్ నేరం చేసినంత మాత్రాన వాడిని కన్న తల్లీతండ్రీ ఎంతవరకూ బాధ్యులవుతారు? వాడిని కట్టుకున్న భార్య ఎందుకు శిక్ష అనుభవించాలి? కుటుంబం గురించి కాసేపు పక్కన పెడితే ఆ పాపాత్ముడు పుట్టిన గ్రామాన్ని ఎందుకు అవహేళనగా చూడాలి? బీహారు రాష్ట్రాన్ని ఎందుకు వేలెత్తిచూపించాలి? ఇలాంటి ఘటన జరగిందనగానే మన దేశాన్ని ప్రపంచమంతా ఎందుకు అనుమానించాలి? అందుకే మచ్చను చెరిపేసుకోవాలనుకుంటున్నారు మనోజ్ పుట్టిన ఆ గ్రామవాసులు. ఆ నేరగాడి కుటుంబానికి సాంఘిక బహిష్కరణ శిక్ష విధించారు. కేసులు నడిచి, విచారణలు జరిగి ఏనాటికో శిక్షలుపడినా... మళ్లీ హక్కుల సంఘాల పోరాటాలు, క్షమాభిక్ష ప్రయత్నాలు మన ప్రజాస్వామ్య దేశంలో సర్వసాధారణమే. ఇక ఎప్పటికి నేరగాళ్లకు భయం కలుగుతుంది? మళ్లీ మళ్లీ నేరాలు జరగకుండా ఏ నాటికి అడ్డుకట్ట పడుతుంది? ఎంత మంది 'నిర్భయ'లు, ఎంతమంది 'గుడియా'లు బలైపోతే మన మృగాళ్ల కామదాహం తీరుతుంది? అందుకే ఆ బీహారీ ప్రజాన్యాయస్థానం ఏంచేసిందో గమనించాలి. తమచుట్టూ ఇలాంటి నేరగాళ్లు తచ్చాడుతుంటే గుర్తించాలి. వెలి శిక్ష అమలుచేయాల్సి వస్తే అందరూ ముందడుగు వేయాలి. లేదంటే నేరగాడికే కాదు వాడిని పెంచిపోషిస్తున్న సమాజానికి రోజూ శిక్షలు పడుతూనే ఉంటాయి. 'నిర్భయ', 'గుడియా' లాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. జాగ్రత్తపడాల్సింది మనమే.
No comments:
Post a Comment