Monday 13 May 2013

ఉప్పు లక్ష్మీ స్వరూపమే!

అక్షయ తృతీయ మార్కెట్ తంత్రం!

మార్కెట్ శక్తులు మనిషినెంతగా ప్రభావితం చేస్తున్నాయంటే మనవికాని సంప్రదాయాలను అంటగడుతున్నాయి. మనకు తెలిసిన దర్మాన్ని దూరం చేస్తున్నాయి. అక్షయ తృతీయనే తీసుకుందాం. ఈ దశాబ్ధంలో బంగారం అమ్ముకునేందుకు వ్యాపారులు, అడ్వర్టయిజ్మెంట్లతో సొమ్ము చేసుకునేందుకు టీవీ చానళ్లు మనమీద రుద్దుతున్న నయా సంప్రదాయమిది.

 మార్కెట్ శక్తుల మాయాజాలంతో మధ్యతరగతి జనం వేలంవెర్రిగా బంగారం కొనుగోళ్లకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే ప్రతి అక్షయ తృతీయకూ సుమారు మూడువందల కోట్ల విలువైన బంగారం అమ్ముడవుతుందని అంచనా. గోల్డ్ కాయిన్స్ అమ్మే  బ్యాంకులు, నగలు అమ్ముకునే జువెలర్స్, ముడి బంగారం విక్రయించే వర్తకులకు ఇది పెద్ద పండుగ. అందుకే నెల రోజుల ముందు నుంచే అక్షయ తృతీయ గురించి ఊదరగొట్టేస్తుంటారు. పేపర్లకు, టీవీ చానళ్లకు బోలెడు అడ్డర్టయిజ్మెంట్లు. బంగారం కొనకపోతే ఏమయిపోతుందోనన్న బెంగతో సామాన్యుడు సతమతమైపోతున్న దౌర్భాగ్యం ఈ దశాబ్ధంలోనే చూస్తున్నాం. అంతకుముందు అక్షయ తృతీయ అంటే ఏమిటో తెలిసింది చాలా తక్కువ మందికే. ఆర్ధిక సరళీకరణ, గ్లోబలైజేషన్ పుణ్యమాని విదేశీ ఉద్యోగావకాశాలు పెరగడంతో జనానికి కొనుగోలు శక్తి కూడా ఎక్కువైంది.  సాప్ట్ వేర్, రియలెస్టేట్, మీడియా, ప్రైవేట్ టెలీకాం తదితర రంగాలు విస్తరించి ఆదాయం పెరిగింది. భార్యాభర్తలు రెండుచేతులా సంపాదించేస్తున్నారు. ఈ డబ్బంతా కూడబెట్టుకోవడానికి డబ్బు రెట్టింపు చేసే పెట్టుబడి మార్గాలు రానురానూ తగ్గిపోతున్నాయి. ఇదే అదనుగా మార్కెట్ శక్తులు ఆకర్షణీయమైన వాణిజ్య ప్రకటనలతో వల విసురుతున్నాయి. అయితే అంతంతమాత్రం ఆదాయంతో ఉక్కిరిబిక్కురవుతున్న  మధ్యతరగతి జనం, అమాయక గృహిణులు అక్షయ తృతీయ లాంటి సందర్భాల్లో డిస్కౌంట్ ప్రకటనలతో గందరగోళానికి గురవుతున్నారు. బంగారంకొంటే అంతా మంచి జరుగుతుందన్న ప్రచారం ఇలాంటి వారి సెంటిమెంటును రెచ్చగొడుతుంది. కొందామంటే చేతుల్లో అంత డబ్బుండదు. పక్కవారు కొనేస్తుంటారు. ఏంచేయాలో పాలుపోదు. ప్రత్యామ్నాయ మార్గాలైన అప్పులు, క్రెడిట్ కార్డులు, జేబదుళ్ల ద్వారా డబ్బు సమకూర్చుకుంటున్నారు. రుణభారం పెంచుకుని లేని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. కొందరైతే పాత బంగారు నగలమ్మేసి కొత్తవి కొనుక్కుని సంబర పడుతుంటారు. ఇందులో తరుగు, తయారీ ఛార్జీలు, తూకంలో మోసాలు ఇలా... సగానికిపైగా నష్టం మనకేనన్నది ఎవరికీ బోధపడదు. అక్షయ తృతీయ రోజున ఎలాగైనా బంగారం కొనేసి సౌభాగ్యవంతులమైపోవాలనే యావ ఒక్కటే మనిషిని బలహీనుడిగా మార్చేస్తోంది. ఈ బలహీనతే మార్కెట్ శక్తులకు వరం... లాభం. అందుకే అక్షయ తృతీయ ప్రచారానికి కార్పొరేట్ నగల వర్తకులంతా కలిపి  హైదరాబాద్ లోనే ఏటా ఎనభై కోట్లు  వెచ్చిస్తున్నారు.

వైశాఖంలో దానాలు చేస్తే సౌభాగ్యం

వైశాఖ మాసం మొదలైన మూడో రోజు అక్షత తృతీయ. అక్షయం అంటే తరగనిది... సమృద్ధిగా ఉండేది. అసలీమాసమే దానాలకు, ధర్మాలకు విశిష్టమైనది. ముఖ్యంగా మండువేసవి కాలమైనందున చల్లని నీరు నింపిన కుండలు దానమిస్తే మంచిది. అలాగే ఎండవేడిమి నుంచి ఉపశమనం కలిగించే గొడుగు, శరీరానికి లేపనంగా రాసుకునేందుకు చందనం, తక్షణం శక్తిని ప్రసాదించే కొబ్బరి బోండాం, వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి పండ్లు దానం ఇవ్వాలని పురాణాలు చెప్తున్నాయి. పూర్వం ఓ వైశ్యుడు అక్షయ తృతీయ రోజునే గోధుమలు, శనగలు, పెసలు లాంటి ధాన్యాలను, మట్టి కుండలను బ్రాహ్మణులకు దానం ఇచ్చి పుణ్యం మూటగట్టుకున్నాడుట. ఈ దానధర్మాల పుణ్య ఫలంతో మరుజన్మలో క్షత్రియునిగా జన్మించి సకల సంపదలు పొందాడుట.అందుకే ఉన్నవారు తోచినంతగా దానాలు చేయాలనేది ఇందులోని పరమార్ధం. ఇలాగే బాగా సంపన్నులైన వారు అక్షయ తృతీయ రోజున బంగారం, వెండిలాంటి ఖరీదైన లోహాలను కూడా దానం చేస్తే మంచిదంటారు. ఇలాచేస్తే ఇచ్చినవారు. పుచ్చుకున్నవారూ లబ్ధిపొందుతారుట. అక్షయ తృతీయలో మంచేమిటంటే ఉన్నంతలో దానాలు చేసి పుణ్యం కట్టుకోవడం. ముఖ్యంగా వైశాఖంలో ఎండవేడిమి నుంచి ఎదుటివాడు సేదదీరేలా చల్లని నీరు నింపిన కుండ దానం చేయమన్నారు. అలాగే మజ్జిగ, పండ్లరసాలు ఇస్తే ఆ క్షణాన ఎదుటివాడు ఇచ్చే ఆశీర్వచనం ముందు ఎన్ని సంపదలున్నా దిగదుడుపే. ఇంతకుమించిన ఆనందమే ఉండదు. ఇవన్నీ మానేసి ఎవడో ప్రచారం చేస్తున్నాడని వేలంవెర్రిగా బంగారం ఎందుకు కొనుక్కోవాలో ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు. విజ్ఞులెవరైనా దీనిపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను.   

ఉప్పుకొన్నాసౌభాగ్యమే...!

వైశాఖమాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని విష్ణుపురాణం చెప్తోంది. విష్ణుమూర్తికి తులసీదళాలతోను, లక్ష్మీదేవికి పసుపు, కుంకుమలతోనూ పూజలు చేస్తే శుభాలుకలుగుతాయి. ముత్తైదువలకు పసుపు, కుంకుమ, పండూ తాంబూలమిస్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుందిట. ఉన్నవాడు బంగారు నాణేలు పూజగదిలో పెట్టుకుంటే మంచిదే గానీ లేనివాడు ఆతృతచెందాల్సిన అవసరం లేదు. బంగారమంటే సిరి. అదే శ్రీ... అంటే లక్ష్మీదేవి. సంపద కలగాలని, ఐశ్యర్యం ప్రాప్తించాలని అందరికీ ఉంటుంది. సిరి దానంతటదే రావాలి గానీ అప్పుచేసి బంగారు నాణేలు కొని పూజలు చేస్తే వస్తుందంటారా? అప్పుల భారం పెరిగి ఉన్న సంపదా, మనశ్శాతీ హరించుకుపోతాయి. నిజానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనక్కర్లేదు. ఉప్పు కొంటే చాలునని ఓ పండితుడు చెప్పాడు. ఎలాగంటే ఉప్పు సముద్రం నుంచి వస్తుంది కదా!. లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుంచి ఉద్భవించింది. అందుకే స్తోత్రంలో చెప్పుకుంటాం...

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |

దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||

అందువల్ల సముద్ర జలాల నుంచి తయారయ్యే ఉప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపమేనంటారు. నిజంగా పేదవాడు అక్షయ తృతీయ మీద అంత విశ్వాసం ఉంటే బంగారం బదులు ఉప్పుకొనుక్కుంటే అదే పదివేలు. వచ్చే సంపద రాకుండా మానదు. చేతుల్లో డబ్బున్నప్పుడు మన స్తోమతను బట్టి బంగారం కొనుక్కుంటూపోతే అదే సంపదగా పోగుబడుతుంది. ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున సెంటిమెంట్ తో తంటాలు పడకుండా ఇది మంచి మార్గమే కదా!.
   

4 comments:

Zilebi said...

అబ్బా,

ఇట్లాంటి లాజిక్కులు లేవదీసి మా ఆండోళ్ళు కొనుక్కునే ఆస్తుల్ని వారికి కాకుండా చేసేస్తున్నారండీ ఇట్లా అందరూ

లక్ష్మి మన ఇంట రావడానికి లాజిక్కులు ఎందుకండీ ?

సుబ్బరం గా, పెనిమిటి జేబు కట్ చేస్తే సరి !

జిలేబి

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఉప్పు జల్లితే అప్పుల పాలవుతారని సామెత.
కానీ ఉప్పు గురించి మీరు చెప్పిన మాట వినలేదు.
అక్షయతృతీయ గురించి మీరు చెప్పినది కరెక్ట్. కానీ ఈ విషయం ఇంకా అందరికీ చేరవల్సి ఉంది. వేలంవెర్రిగా కొని బంగారం ధర పెంచే వారికి ఇది తెలిస్తే బాగుండు.

nihar said...

జిలేబీ గారూ ఆడోళ్ల హక్కులను హరించేందుకు కాదు... పెనిమిటి జేబులకు భారం పడకూడదనే ఈ కథనం... అక్షయ తృతీయ పేరిట హైదరాబాద్ లో ఒకే రోజున టన్ను బంగారం కొన్నారుట మనవాళ్లు. అంటే వెయ్యి కేజీలు. ఇంత డబ్బు వాళ్లకెక్కడి నుంచి వచ్చిదంటారు. ఇందులో ముప్పావు శాతం అవినీతి మార్గాల్లోనో, అప్పనంగానో సంపాదించింది కాదా? ఇలా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి బంగారం పోగేసుకునే వారికి ''అపరిచుతుడు' ఏ శిక్ష వేయాలి...జిలేబి గారూ సమాధానం తీపితీపిగా కాదు హాట్ హాట్గా ఉండాలి.
అలాగే లక్ష్మీదేవి గారూ థాంక్స్. ఉప్పును దరిద్రం కింద లెక్కేసి సందర్భాలు చాలానే ఎదురవుతాయి. అది చాలా చవగ్గా దొరుకుంది కదా... అందుకే అలుసనుకుంటాను.! ఉప్పు లక్ష్మీదేవి స్వరూపమని సంప్రదాయాలు తెలిసన ఓ ప్రముఖులు చెప్పగా విన్నాను. అందుకే నలుగురితో పంచుకున్నాను. ... నిహార్

జలతారు వెన్నెల said...

బాగుంది పోస్ట్ నిహార్ గారు.ఎవరో ఆ "గాలి" గారు ఇంట్లో అన్నీ బంగారపు వస్తువులేనని విన్నాను మరి . :)