Friday, 31 May 2013

సెలవుల్లో మంచి పని...!

కాలక్షేపం... వ్యక్తిత్వవికాసం!
వందకు వంద మార్కులు రావాలంటే పుస్తకాలు బట్టీ పట్టించే స్కూళ్లు బోలెడున్నాయి. కానీ బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే వ్యక్తిత్వ వికాస నిపుణులు బహు అరుదుగా ఉంటారు. హైదరాబాద్ కొత్తపేట ఎస్సారెల్ కాలనీలో చిన్నారుల కోసం పదిహేను రోజుల పాటు నిర్వహించిన ఉచిత వేసవి శిబిరం సత్పలితం ఇచ్చింది. 

పిల్లలకు... వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలియచెప్పిన ఈ శిబిరం ఉత్సాహంగా ముగిసింది. కాలనీ సంక్షేమ సంఘం, ప్రసన్నాంజనేయస్వామి ఆలయ కమిటీ, స్వయం సేవక్ యోజన ప్రతినిధులు, కొంతమంది ఔత్సాహికులు ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు. ఆటలు, పాటలు, పద్యాలు, శ్లోకాలు, డాన్సులు, యోగా, ధ్యానం ఇలా రకరకాల అంశాల్లో పిల్లలకు ఉచిత శిక్షణ ఇచ్చారు. చాక్లెట్ తయారీ, కొవ్వొత్తుల తయారీ లాంటి విద్యలూ నేర్పించారు. వ్యక్తిత్వ వికాస నిపుణుల చేత పాఠాలు చెప్పించారు. ఇరుగుపొరుగు కాలనీల పెద్దలు, విద్యావేత్తలు ఈ శిబిరంలో పాల్గొని తమ అనుభవాలను చిన్నారులతో పంచుకున్నారు. వారిలో సామాజిక బాధ్యత పెరిగేలా ఉపాన్యాసాలిచ్చారు. 

శిబిరంలో పాల్గొన్న పిల్లలకు వైద్యుల బృందం చేత ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణి చేశారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబరచిన బాలలను ప్రోత్సహిస్తూ మెడల్స్ ప్రదానం చేశారు. కథలు, ఆధ్మాత్మిక పుస్తకాలను  బహుమతిగా అందించారు. 


 

వేసవి సెలవుల్లో కాలక్షేపమే కాకుండా ఆటపాటలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడిన ఇలాంటి శిబిరాలు ప్రతి సందర్భంలోనూ నిర్వహించాలని అందరూ అభిలషించారు.   

No comments: