Wednesday 22 May 2013

అనుభవం నేర్పిన పాఠం!

అనాధలకు అమ్మానాన్న!
ఆ యువకుడికి పేదరికం ఎన్నో అనుభవాలు నేర్పింది. కన్నవారు నిరుపేదలు. టీ అమ్ముకుంటూ చదువుసాగించాడు. ఉన్నత చదువు పూర్తిచేసి ప్రభుత్వ టీచరుగా ఉద్యోగం సంపాదించాడు. ఇక ఇంతటితో చాలని  సరిపెట్టుకోలేదు. తాను ఏ స్థాయి నుంచి ఎలా పైకెదిగాడో గుర్తుచేసుకున్నాడు. తనలా పేదరికంలో మగ్గుతున్న  నిస్సహాయులకు ఏదైనా చేయాలనుకున్నాడు. అనుకున్నదాన్ని ఆచరణలో పెడుతున్నాడు. విజయానికి చివరి మెట్టుమీద నిలబడిన అజిత్ కుమార్ తన ఆశయసాధనలో అందనత్త ఎత్తులకు ఎదుగుతున్నాడు. ఆయన ఆశయానికి నీడగాతోడుగా నిలిచింది షబ్నం. ఆ దంపతులు పేద పిల్లలకు ఎలాంటి సేవ చేస్తున్నారో బీహారులోని బరౌనీ రైల్వే జంక్క్షన్లో చాలా మంది ప్రయాణికులకు తెలుసు.

ఓపెన్ ఎయిర్ స్కూల్

ప్రభుత్వ టీచరైన అజిత్ బరౌనీ రైల్వే జంక్షన్లో ఫ్లాట్ ఫామ్ మీదే అనాధ పిల్లల కోసం ఓపెన్ ఎయిర్ స్కూలు నడుపుతున్నాడు. మొదట్లో అధికారులు అభ్యంతరం చెప్పినా ఆ తర్వాత వందల మంది పిల్లలకు మేలు జరుగుతోందని తెలిసి అజిత్ దంపతులను ప్రోత్సహించారు. ఈ జంక్షన్లో తలదాచుకుంటున్న అనాధ పిల్లలకు ఈ దంపతులే దేవుడిచ్చిన అమ్మానాన్న. చక్కగా చదువు చెప్తున్నారు. ఉచితంగా భోజనం కూడా అందిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించి జీవితంలో స్థిరపడేందుకు అవసరమైనంత తోడ్పాటునందిస్తున్నారు. ప్రభుత్వ టీచరైన భర్త ఇలా అనాధ పిల్లల సేవకు కంకణం కట్టుకోగానే భార్య నేను సైతం అంటూ తోడుగా నిలిచింది. ఈ జంట చేస్తున్న అనాధ పిల్లల సేవ, విద్యాదానం గురించి ఆ స్టేషన్ గుండా ప్రయాణం చేసే చాలా మందికి తెలుసు.

 ఇళ్ల నుంచి పారిపోయి వచ్చిన చిన్నారులు, ఎవరూ లేని అనాధ పిల్లలూ వీరి దగ్గర చదువు నేర్చుకుంటున్నారు. అనాధలకు ఉన్నట్లుండి కొత్త జీవితం ప్రసాదించలేరేమో గానీ అటువైపు అడుగులు వేయించగలరు. ఇది అభినందనీయమైన సేవే. అయితే పిల్లల్లో గుట్కానమలడం, సిగరెట్లు కాల్చడం, వైట్ నర్(టైప్ రైటర్ స్క్రిప్టు చెరపడానికి వాడే లిక్విడ్) పీల్చడం లాంటి దురలవాట్లు మాత్రం అంత సులువుగా మాన్పించలేకపోతున్నారు. పిల్లలను బుగ్గిపాల్చేస్తున్న ఇలాంటి దురలవాట్లను దూరం చేయడంలోనూ అజిత్, షబ్నం దంపుతులు సక్సెస్ కావాలని కోరుకుందాం.

6 comments:

Anonymous said...

కొందరే మహానుభావులు ఆ కొందరికే వందనాలు!!నిస్వార్థముగా వీధిబాలలకు భోజనంపెట్టి మరీ చదువు చెప్తున్న ఆ దంపతులకు పాదాభివందనం!!

nihar said...

థ్యాంక్యూ సూర్యప్రకాశరావు గారు... అజిత్ లాంటి సేవా భావం ఉన్న వారిని తప్పనిసరిగా అభినందించాలి

జలతారు వెన్నెల said...

సూర్యప్రకాష్ గారనట్టు , ఆ దంపతులకు పాదాభినందనం.

nihar said...

మనలాంటి వారు ప్రోత్సహిస్తేనే సేవాభావం ఉన్నవారు ముందడుగు వేయగలుగుతారు. నా బ్లాగు కోసం కాకపోయినా ఈ దంపతుల కోసమైనా ఎక్కువ మంది స్పందిస్తారని ఆశిస్తాను. సామాజక సేవ మీద దృష్టి పెట్టిన వారిని అందరూ అభినందిస్తారన్న సమాచారం నలుగురికీ చేరవేయడానికైనా మనలాంటి వారు స్పందించాలి... జలతారువెన్నెలగారికి, సూర్యప్రకాశరావుగారికి థ్యాంక్స్....నిహార్

mahadeva vedhapatashala said...

is a leader

mahadeva vedhapatashala said...

is a leader