Tuesday, 28 May 2013

'బొమ్మ'తోనే పుడుతుంది రిమ్మతెగులు...!

బూతు'బొమ్మ'లపై ముంబైలో వేటు
మహిళల మీద రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలకు విరుగుడుగా ముంబైలో కొత్త రూలొచ్చింది. వాస్తవంగా 1986లోనే ఓ చట్టం ఉంది. అదే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ వుమెన్(ప్రొహిబిషన్) యాక్ట్ ,1986. మహిళల శరీర భాగాలను అసభ్యంగా ప్రదర్శించడాన్ని నిషేధించే చట్టమిది. ఈ చట్టానికి దుమ్ముదులిపిని ముంబై అధికారులు నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇక వాణిజ్య రాజధానిలో ఎక్కడా లోదుస్తులు ప్రదర్శించే అమ్మాయిల బొమ్మలు కనిపించవు. శివసేన అధికారంలో ఉన్న బృహన్ముంబై పురపాలక సంస్థ చాలా మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు. బట్టల షాపుల్లో, షాపింగ్ మాల్స్ లో లోదుస్తులతో కనిపించే ప్లాస్టిక్ బొమ్మలపై నిషేధం విధించారు. 

లింగరీలు, బ్రాలు, స్విమ్ సూట్ల అడ్వర్టయిజ్ మెంట్ల కోసం బ్రాండెడ్ కంపెనీలు దాదాపు నిలువెత్తు బొమ్మలను వినియోగిస్తున్నాయి. అచ్చం అమ్మాయి నిలబడిందా అన్నట్లుండే అరడుగుల బొమ్మలకు లొదుస్తులు వేసి షో కేసుల్లో పెడుతున్నారు. షాపింగ్ మాల్స్ ముందు ఈ బొమ్మలెక్కువగా కనిపిస్తుంటాయి. పిల్లలు, యువకులు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి బొమ్మలు కనిపించగానే ఓ క్షణం ఆగిపోవడం అసాధారణమేమీ కాదు. లేత మనసుల్లో చెడు ఆలోచనలను ప్రేరేపించే వ్యాపార ప్రచారం ఇది. దుకాణాలు, మాల్స్లో బొమ్మలే కాదు, రహదారుల మీద హోర్డింగులు కూడా మరీ జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇలాంటివే మగవారిని తప్పుదారి పట్టిస్తున్నాయనేది నిపుణుల ఆందోళన. అందుకే శివసేన పాలకపక్షంగా ఉన్న ముంబై కార్పొరేటర్లు ఇలాంటి బొమ్మలపై నిషేధం విధించేలా తీర్మానం తెచ్చారు. 'పొల్యూషన్ ఆఫ్ మైండ్స్'కు దారితీస్తున్న ఈ తరహా పబ్లిసిటీపై వేటు పడాల్సిందే. ఇలాగే నగరంలో ఉండే హోర్డింగుల మీదా దృష్టి సారించడం మంచింది. ఇది కొంత కష్టమైన పని కావచ్చు. ఎందుకంటే... హోర్డింగులు మున్సిపల్ కార్పొరేషన్ కు ఓ ఆదాయ వనరు. మన హైదరాబాద్ లో ఓ ఆంగ్ల దినపత్రిక హోర్డింగులు చూస్తే డైలీఆ పేపర్ ప్రమోషన్ కు ఇంత బూతు బొమ్మలతో ప్రచారం అవసరమా అనిపిస్తుంది. అయినా ఎక్కడపడితే అక్కడ ఈ తరహా నగ్న ప్రచారాలు సాగిపోతున్నాయి. మహానగరంలో రోడ్డు ప్రమాదాలకు ఇలాంటి హోర్డింగులు ఓ కారణమనేది ట్రాఫిక్ పోలీసుల అంచనా. అయితే ఏ అధికారీ వీటిని తొలగించే చర్య చేపట్టడు. దేశంలో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో నిలిచింది ముంబై. అది దేశ రాజధాని అయితే... ఇది ఆర్ధిక రాజధాని. మహిళలపై అత్యాచారాల్లోనూ ఢిల్లీ, ముంబై మొదటి రెండు ప్లేసుల్లో ఉన్నాయి.

బొమ్మలను చూసి మగవారు అత్యాచారాలకు పాల్పడుతున్నారా అని ఎవరికైనా ధర్మసందేహం రావచ్చు. ఆ మాత్రం నిగ్రహించుకోలేరా అన్న అనుమానమూ ఉండవచ్చు. బ్రహ్మకైనా పుడుతుంది రిమ్మ తెగులు అని పెద్దలు ఊరికే అనలేదు. అనేకానేక అత్యాచార ఘటనలకు ఇలాంటివీ కారణమే. అందుకే ముంబై కార్పొరేషన్ మంచి పని చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇలాంటి లోదుస్తుల బొమ్మలపై నిషేధం విధించాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలను కించపరిచే విధంగా రూపొందించిన హోర్డింగులను తొలగించాలి.బూతు బొమ్మలున్న సినిమా పోస్టర్లు గోడలెక్కకుండా సెన్సార్ కత్తెరకు పదును పెట్టాలి. మన కార్పొరేటర్లకు ఈ సామాజిక బాధ్యతను ఎవరైనా గుర్తుచేస్తే మంచిది. 

No comments: