Saturday, 11 May 2013

'బ్లాగులోకం'లో నా కవిత....

ఉగాది కవిత పోటీలో మొదటి బహుమతి!

బ్లాగర్ మిత్రులారా... 'బ్లాగులోకం' లాస్య రామకృష్ణ గారు నిర్వహించిన ఉగాది కవితల పోటీలో నా కవిత 'ఉగాది డాట్ కామ్' మొదటి బహుమతికి ఎంపికైంది. బహుమతి కింద లాస్య రామకృష్ణ గారు 'గోదావరి కతలు' ఈ బుక్ పంపించారు. చాలా సంతోషం. 'బ్లాగులోకం'లో కవిత ప్రచురించగానే స్పందించి, అభినందనలు తెలియచేసిన జలతారువెన్నెల, చెప్పాలంటే, శర్మ, శృతి రుద్రాక్ష్ తదితరులందరికీ కృతజ్ఞతలు. లాస్య రామకృష్ణ గారి 'బ్లాగులోకం' లింకు...

http://submityourblogs.blogspot.in/2013/05/blog-post_4.html#comment-form

 

ఉగాది డాట్ కామ్!

ఉగాది వచ్చేసిందా...? ఉషస్సే కనిపించలేదు!
కాంక్రీటు జంగిల్లో బతికేస్తున్నాం కదా?!
అంతస్థుల తెరల వెనుక...
ఎన్ని ఉషోదయాలో.. ఎన్ని అస్తమయాలో?!

ఎడారులు పరుచుకున్ననగర జీవితం
ఎన్ని వసంతాలొస్తే చిగురిస్తుంది ?
టెర్రస్ మీద పెరడును సృష్టిస్తే
పల్లె సోయగమెలా పరిమళిస్తుంది ?!

ఇరుకు వరండాల్లో మరుగుజ్జు వృక్షాలు
ఏనాటికైనా కొత్త చిగుర్లు తొడుగుతాయా?!
గాలీవెలుతురూ తెలియని 2BHK ఫ్లాట్లు
ఇక ప్లాస్టిక్ మొక్కలు ప్రాణవాయువునిస్తాయా?

సోషల్ మీడియాతో ప్రపంచానికి కనెక్టయ్యాం
మన ఒంటరిదనానికి కొత్త వేకువలెలావస్తాయి?
పండగా, పబ్బం 'వసుదైకకుటుంబకం' అనుకుంటేనేగా...
మనం విడిచిపెట్టిన ఆసరాల జాడెక్కడో వెతుక్కుందాం!

ఉగాది వచ్చేసింది... కృత్రిమ ప్రకృతి సృష్టించుకుందాం!
జనారణ్యంలోకి మర కోయిలలను ఆహ్వానించండి
రింగ్ టోన్లలో పక్షి గొంతులు ట్యూన్ చేద్దాం!
గాడ్జెట్లతో నడిచే బతుకులకు కుహూరవాలు వినిపిద్దాం!!

తలుపులే తెరవని వాకిళ్లలో...
కాగితపు పూలదండలు వేళ్లాడేద్దాం!
గడపలెరుగని లోగిళ్లలో...
ప్లాస్టిక్ ముగ్గుల షీట్లు అతికించేద్దాం!

రొటీన్ లైఫుల్లో ఆమ్ఆద్మీలకు పరవన్నాలెక్కడివి?
పండుగొచ్చిందిట...స్వగృహకెళ్లి నోరుతీపి చేసుకుందాం!
'పచ్చ' కళ్లజోడెట్టేసుకోండి...
నిలబడిన చోటికే పచ్చదనాన్ని రప్పిద్దాం!

న్యూక్లియర్ ఫ్యామిలీలైపోయాముగా...
సినిమా 'ఉమ్మడి కుటుంబాలు' సేదదీరుస్తాయి !
బుల్లితెర ముందుకూర్చున్నామంటే-
'పరాయితనం' తెలియని సందడొచ్చేస్తుంది!

మనక్కావాల్సినవి కోయిల కూత, వేపపూతా...
'ఫేస్ బుక్'లో వాటి జాడ వెతుక్కోగలమా?
క్రమం తప్పని నవవసంతం వచ్చేసిందిట...
మన ఇంటికీ రమ్మని ఓ ఎస్ఎంఎస్ పంపుదామా...?!


- నిహార్
http://www.niharkid.blogspot.com

  

6 comments:

Anonymous said...

Fantastic!

Anonymous said...

Fantastic!

Unknown said...

అభినందనలు!

nihar said...

అనూ గారు, చిన్ని ఆశ గారూ థాంక్యూ.... నిహార్

జలతారు వెన్నెల said...

ఇది లాస్య గారు పోస్ట్ చేసినప్పుడు చదివాననుకుంటా.. మీకు మరి ఒక్క సారి అభినందనలు.

nihar said...

జలతారువెన్నెల గారూ మళ్లీ మళ్లీ థాంక్స్... బ్లాగులోకంలో నా కవిత చదివి మీరు స్పందించాక ఆ కవితను నేను చూశాను. అందువల్లే ఈ బ్లాగులో పోస్టు చేసినప్పుడు మీ పేరు ప్రస్తావించాను...