మందు బిళ్లలో మతలబు!
డాక్టరుకు డబ్బు... రోగికి జబ్బు!
డాక్టర్లు అవసరం ఉన్నా లేకపోయినా విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ మందులు రాసేస్తున్నారని ఈమధ్య ఓ అధ్యయనం తేల్చింది. తమిళనాడులోని వెల్లూరు ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించారు. స్టాక్ హోం కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, క్రిష్టియన్ మెడికల్ కాలేజ్, సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీల నిపుణులు సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో కమీషన్ల కోసం డాక్టర్లు పడుతున్న కక్కుర్తి బయటపడింది. రోగికి ఎంతమేర యాంటీ బయాటిక్స్ అవసరమన్నది చూడకుండా ప్రిస్కిప్సన్ రాసేస్తున్నారనేది ఈ సర్వే సారాంశం. ఈ నివేదికను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ అనే మ్యాగజైన్ లో ప్రచురించారుట. ఓ అంతర్జాతీయ న్యూస్ వెబ్ సైట్ కథనం ఆధారంగా ఈ సమాచారం షేర్ చేసుకుంటున్నాను. కొంత మంది కమర్షియల్ డాక్టర్ల నుంచి ఎదురయ్యే ముప్పు గురించి నలుగురికీ తెలిస్తే మంచిది. అయితే మానవతావాదంతో వైద్య వృత్తిలో సేవలందిస్తున్న డాక్టర్లు చాలా మందే ఉంటారు. అలాంటి వారు ఈ కథనం చదివి నొచ్చుకోకూడదని మనవి.
యాంటి బయాటిక్స్ తో డేంజరే...
రోగ కారకమైన సూక్ష్మజీవిని నిర్మూలించడానికి యాంటి బయాటిక్స్ నిర్ధేశిత మోతాదులో వాడుతారు. అవసరానుగుణంగా మోతాదు పెంచడం డాక్టర్ల పర్యవేక్షణలో జరగాలి. కానీ మన డాక్టర్లు ఇష్టం వచ్చినట్లు యాంటి బయాటిక్స్ రాసేస్తున్నారనది అధ్యయనం నిరూపించింది. మందులు ఇష్టానుసారం మింగేస్తే మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. డాక్టర్లు ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఆ మందులు తయారు చేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీలు దండిగా కమీషన్లు ముట్టచెప్తున్నాయిట. కంపెనీల తరఫున రిప్రజెంటెటివ్లు డాక్టర్లను కలుస్తుంటారు. శాంపిల్ మందులు ఇచ్చి వెళ్లుంటారు. ఆ డాక్టర్లు లేదా ఆ ఆప్సత్రి చుట్టుపక్కలున్న మందుల షాపుల్లో తమ మందులు దండిగా స్టాక్ పెట్టిస్తారు.ఇక డాక్టర్లు తమ దగ్గరుకొచ్చిన ప్రతి రోగికి ఆ మందులు వీలువెంబడి రాస్తుండాల్సిందే. ఇలా చేసినందుకు ఆ మందుల కంపెనీలు ఇంటెన్సివ్ కింద బోలెడు నగదు బహుమతులు ముట్టచెప్తుంటాయి. ఆస్పత్రులకు, క్లీనిక్ ఓనర్లకు వాటాలు అందుతుంటాయి.
సేవ కాదు, వైద్యం ఓ వ్యాపారం...
మందులే కాదు మెడికల్ టెస్టులు, ఎక్స్ రేలు, రక్త మల మూత్ర పరీక్షలు, స్కానింగులు, ఈసీజీలు, ఈఎంఆర్ఐలు ఎక్కడికక్కడ డాక్టర్లకు కమీషన్లు అందుతుంటాయి. బిల్లు మీద డాక్టర్లకు కమీషన్ సుమారు ఇరవై నుంచి యాభై శాతం దాకా ఉంటుంది. స్పెషలిస్టు డాక్టర్లకు డెభ్బై శాతం ఇంటెన్సివ్ అందుతుందనేది ఆ రంగంలోని వారే చెప్తున్న మాట.ఏసీ కార్లు, ప్లాస్మా టీవీలు కూడా ఇస్తుంటారని వెల్లూరు ప్రాంతంలో జరిగిన సర్వేలో కొంతమంది డాక్టర్లు నిర్మోహమాటంగా చెప్పారుట.
ఫీజుల మోతతో పేదవాడికి భయం
పేషెంట్లలో పేద, ధనిక వర్గాలుంటాయి. డబ్బు దగ్గర ఒకసారి పీనాసిగాను, మరోసారి డాంబీకంగానూ వ్యవహరించే మధ్యతరగతి ఉండనే ఉంటారు. ఆరోగ్యం మీద మనిషికి ఎంత స్పృహ పెరిగినా, ఎంత చైతన్యం వచ్చినా చాలా సందర్భాల్లో డాక్టర్ దగ్గరికెళ్లాలంటేనే జంకేవారి సంఖ్య ఎక్కువే. ఎంత డబ్బు గుంజుతారోనన్న భయం. కన్సల్టింగ్ ఛార్జి కనీసం వంద, స్పెషలిస్టులైతే మూడు వందలు చెల్లించాల్సిందే. ఇక మందుల లెక్క మూడు వందలు దాటుతుంది. చిన్న రోగానికైనా చాంతాడంత ప్రిస్కిప్షన్. మందులు, టెస్టులు కలిసి వెయ్యి రూపాయల పైమాటే. ఇక చిన్నసైజు ఆస్పత్రి గడప తొక్కినా చికున్ గున్యా, డెండ్యూ లాంటి రోగాల పేరుతో పాతిక వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఒకవేళ ఇన్యూరెన్స్ గట్రా ఉందని తెలిసిందంటే ఐసీయూలో వెంటిలేటర్లు, వారానికి పైగా చికిత్స, మరో నెళ్లాళ్లు మందులు... అన్నీ కలిపి అర లకారం. అందుకేనేమో పేద, మధ్య తరగతి ఇళ్లల్లో రోగాలు వచ్చాయంటే బెంబేలెత్తిపోతున్నారు.
డాక్టర్లు చదువు'కొన్నారు'గా మరి!
డాక్టర్లు మాత్రం కమీషన్ల కోసం కాకుండా పేదవాడి బాగోగుల గురించి ఎందుకు పట్టించుకుంటాడు చెప్పండి? ఏడో క్లాస్ నుంచే కార్పొరేట్ స్కూళ్లలో మెడిసిన్ ఇంటెన్సివ్ కోచింగులిస్తున్నారు. కాలేజీ చదువు నాటికి కనీసం మూడు లక్షల ఖర్చు. ఇక రెండేళ్ల ఇంటర్ మీడియట్ చదువుకు కనాకష్టంగా నాలుగు లక్షలపైమాటే. ఆపై మెడిసిన్ పూర్తయ్యేలోగా సుమారు ఆరున్నరేళ్లకు ముప్పయి నుంచి యాభై లక్షలు ఖర్చు. ఇవన్నీ తిరిగిరావాలంటే ఎందరు రోగుల నాడి వెతికిపట్టుకోవాలి... ఎన్ని ప్రిస్కిప్షన్లు రాయాలి... ఎన్ని మందులని గుర్తుపెట్టుకోవాలి... ఎన్ని టెస్టులని చేయించాలి... వైద్యో నారాయణో హరి:
మంచి వైద్యుడిని నమ్మండి
డాక్టర్లనే పూర్తిగా తప్పుబట్టడానికి లేదు. తక్కువ మందులు రాస్తే పేషెంటే శంకిస్తాడు. రోగం ఆ మరుసటి రోజుకు తగ్గుముఖం పట్టకపోతే మందుల మోతాదు పెంచమని పేషెంట్లే అడుగుతారు. ఇలాంటప్పుడు డాక్టర్లు, మందుల కంపెనీలు మననే నమ్ముకుని వ్యాపారం చేస్తున్నారు కదా...వాళ్లకు మాత్రం మన మీద జాలి, దయ, కరుణ ఎందుకుండాలి? ఎప్పటికప్పుడు కొత్త కొత్త మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు వాటిని అమ్ముకోవడానికి డాక్టర్లకు ఇంటెన్సివ్ లు సమర్పించుకోకపోతే ఇక పనేలా జరుగుతుంది? ఇదంతా పేదవాడి ముఖ్యంగా మధ్య తరగతివాడి కర్మ. పేషెంట్ ఆరోగ్య పరిస్థితి, ఆర్ధిక పరిస్ఙతి గమనించి నిదానంగా కుదుటపడేలా వైద్యం చేసే డాక్టర్లను మనం నమ్మపంత వరకూ వైద్యం వ్యాపారంగానే ఉంటుంది. అయ్యా ధన్వంతరీ.... తెల్లకోటూ, స్టెతస్కోపూ సాక్షిగా డాక్టర్లే కమీషన్ ఏజెంట్లుగా మారిపోతున్నారట! ఇక పేద రోగిని ఎవరు కాపాడుతారు?!
డాక్టర్లు రాసే మందు బిళ్లలో మతలబు ఇదే. మన జబ్బు తగ్గడం కాదు. వారి డబ్బు పెరగడం....
No comments:
Post a Comment