Tuesday, 7 May 2013

అందమైన పువ్వు అంతరించిపోతోందిట...!

అరుదైన హిమ సోయగం "రోడొడెండ్రాన్"

సిమ్లా యాపిల్స్ ఎంత ప్రసిద్దో అక్కడ కనిపించే అరుదైన పుష్పాలు "రోడొడెండ్రాన్" అంతే ప్రసిద్ధి. ఈ పుష్పాన్ని హిందీలో "బురాంశ్" అంటారు. హిమాలయ ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, కాశ్మీర్ రాష్ట్రాలతో పాటు నేపాల లోనూ కనిపించే అరుదైన పుష్పమిది. 

 

ఆఫ్రికా, దక్షిణ అమెరికా మినహా  ప్రపంచంలోని శీతల ప్రాంతాల్లో సుమారు వెయ్యి రకాల "రోడొడెండ్రాన్" పుష్పజాతులున్నాయి. 18  రకాలు బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఎన్ని రంగుల్లో పూలు పూస్తాయనేది లెక్కలేదు. హిమాలయ రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన పుష్పమే. సిమ్లాలో ప్రత్యేకంగా రోడొడెండ్రాన్ గార్డెన్స్ పెంచుతున్నారు. 

 శీతల ప్రాంతాల్లోనే పుష్పించే ఈ పువ్వు అంతరించిపోయే ప్రమాదం ఉన్న పుష్ఫజాతుల్లో చేరిపోయింది. ఎక్కువగా హిమపర్వతాల్లో ఈ చెట్లుంటాయి. శంకు ఆకారంలో ఉండే రంగురంగుల పుష్పాలు కనువిందు చేస్తుంటాయి. ముదురాకుపచ్చ రంగులో ఆకులుండే ఈ చెట్లను సంరక్షించడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

 పర్వత ప్రాంతాల్లో భూమి కోతకు గురవకుండా భూసార పరిరక్షణలో ఈ చెట్లు ఉపయోగపడుతున్నాయి. పర్యావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల వల్ల ఈ చెట్లు అంతరించిపోతున్నాయని నిపుణులు తేల్చారు.  అందువల్ల "రోడొడెండ్రాన్" మొక్కలను ప్రత్యేకంగా నర్సరీల్లో పెంచుతున్నారు.

 

ఔషధగుణాలున్న పుష్పం

"రోడొడెండ్రాన్" పువ్వుల్లో ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల వంటల్లో ఈ పుష్పాలను వాడుతుంటారు. చేపల కూరలో వేస్తే ఎముకలు పెళుసుబారకుండా ఉంటాయని అంటారు. తాజా పువ్వులనే కాకుండా  ఎండబెట్టి పౌడరుగా మార్చేసి మందుల తయారీలో వాడుతుంటారు. నలుపు తప్ప అన్ని రంగుల్లోనూ ఈ పువ్వులు పూస్తాయి. అయితే గులాబీ రంగు పుష్పాన్ని హిమాచల్ ప్రదేశ్్ ప్రభుత్వం అధికార పుష్పంగా ప్రకటించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ మొక్కనే అధికార వృక్షంగా ప్రకటించింది. నేపాల్ ప్రభుత్వం కూడా దీన్ని జాతీయ పుష్పం కింద ఎంపిక చేసుకుంది. సిక్కిం ప్రభుత్వం ఈ మొక్కపై జనంలో అవగాహన పెంచేందుకు ఏటా రోడొడెండ్రాన్  ఫెస్టివల్ నిర్వహిస్తోంది.

కేంద్ర తపాలా శాఖ పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేసింది. అమెరికా, జపాన్, జర్మనీల్లో ప్రముఖ గార్డెన్లన్నింటిలో "రోడొడెండ్రాన్" సోయగాలు కనువిందు చేస్తుంటాయి. బ్రిటన్ రాయల్ హార్టికల్చర్ సొసైటీ ఈ తోటల పెంపకం మీద ప్రత్యేక దృష్టి సారించింది. మన దగ్గర ఇలాంటి పుష్పాలు కనిపించవుగానీ కొన్ని రకాల పుష్పజాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉండవచ్చు.  అలాంటి వాటిని కాపాడేందుకు ప్రకృతి ప్రేమికులు నడుంకడితే మంచిది. 


No comments: