Sunday 31 March 2013

365 రోజులూ ఫూల్సే!?

డోన్ట్ బీ ఫూలిష్!

ముందుమాట.... 365 రోజులూ ఫూల్స్ లా బతుకుతున్న మనం కనీసం ఏప్రిల్ ఒకటో తేదీన ఎవరి ముందూ ఫూల్ కాకుండా ఉంటేనే నయం.! 

ఏ రెండు ఆటోలు సమాన దూరం, సమాన వేగంతో ప్రయాణించినా మీటర్లు మాత్రం ఒకేలా తిరగవు. జువెలరీ షాపులో సమానమైన నగలు, సమానమైన డబ్బు పెట్టికొన్నాఏ రెండు బిల్లుల మీదా తరుగు మాత్రం ఒకేలా వేయడు. పెద్దదైనా, చిన్నదైనా మోసపోతున్నది మనమే. చింతపిక్కలపొడి కలిపిన టీపొడి,  రంపపుపొట్టు కలిపిన కారం, సర్ఫ్ నీళ్లు కలిపిన పాలు, ఎముకల కొవ్వు కలిపిన నెయ్యి... ఇలా వినియోగదారుడిగా నిత్యం మనం మోసపోతూనే ఉన్నాం. ఒక్క ఏప్రిల్ ఒకటో తేదీన మాత్రమే ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకోవడం ఎందుకు...? 365 రోజులూ ఫూల్స్ డేలే.

అడుగడుగునా ఫూల్ చేసేవాడే...

ఏకంగా 70 శాతం డిస్కౌంటు అన్న బోర్డు చూసి షాపింగు చేస్తున్నాం. పది రూపాయల వస్తువును వంద చేసి డెబ్బై తగ్గించినా మనకు లెక్క తెలియదు. టాప్ టెన్ ర్యాంకులు వంద మందికి వచ్చాయంటున్న కార్పొరేట్ కాలేజీలను నమ్ముతున్నాం. అదే కాలేజీలో లక్ష మంది ఫెయిల్ అయిపోయిన విషయం మనకు పట్టదు. సగటు మనిషిలో పాతుకుపోయిన ఒకేఒక భావం ఫూల్స్ ను చేస్తోంది. 'నేనే గొప్ప... మిగతా వారంతా ఏమీ తెలియని అమాయకులు'  అన్న భ్రమలో మనను మనం మోసం చేసుకుంటున్నాం. ఫాల్స్ ప్రెస్టేజ్ లో బతికేస్తున్నాం. స్వార్ధపు చింతనే మనిషిని ఫూల్ని చేస్తోంది. నేను దగ్గర మొదలై నా కుటుంబం, నా ఊరు, నా కులం, నా మతం... ఇలాగే అర్థం లేని అహంభావంతో కుటుంబంలో, సమాజంలో అశాంతిని రాజేస్తున్నాం. ఇంతకన్నా ఫూలిష్నెస్ మరోటి ఉంటుందా...?


నేతల ట్రిక్కుల ముందు ఎంతటి వారైనా ఫూలే!  

ఐదేళ్లూ సేవచేస్తానంటూ ఓటు పడ్డాక మొహం చాటేసే నాయకుడి దృష్టిలో మనం ఫూల్స్ కాకపోతే ఇంకేమిటి.  రేషన్ బియ్యంతో పూటగడిపే ఖద్దరుచొక్కా మన కళ్లముందే కోట్లకు పడగెత్తితే చూస్తూ ఊరకుండిపోయే మనం ఫూల్స్ గా మిగిలిపోవడం లేదా...? నూటా పాతిక కరెంటు బిల్లుకు నాలుగువందల యాభై సర్ ఛార్జి వేసే పాలకుల తెలివితేటల ముందు మనం ఓడిపోవడం లేదా?. మన డబ్బుతో మనకే ఉచిత పథకాలు ప్రకటించి... మన ఓట్లతోనే గద్దెనెక్కి మనపై పెత్తనం చెలాయించేవాడి కళ్లకు మనం ఫూల్స్ లాగా కనిపించమా?.  
ఫూల్స్ డే ఏమిటి...
ఒకప్పుడు ఫ్రాన్స్ లో ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునే వారుట. 1582లో చార్లెస్ అనే రాజు కేలండర్ పేజీలు చింపేసి జనవరి ఒకటో తేదీనే న్యూ ఇయర్ అన్నాట్ట. అయితే ఈ విషయం జనానికి అంత ఈజీగా చేరదు కదా. సమాచారం తెలిసన వారు జనవరి ఒకటో తేదీన కొత్త సంవత్సరానికి స్వాగతాలు పలికితే, ఆ విషయం తెలియని వారు యధావిధిగా ఏప్రిల్ ఫస్ట్ దాకా ఆగారుట. దీంతో జనవరి బ్యాచ్ ఏప్రిల్ బ్యాచును ఆటపట్టించింది. అదే ఓ సంప్రదాయంగా మారింది. ఫ్రాన్స్ ఫూల్స్ కథ అమెరికా, బ్రిటన్ దాటి ప్రపంచ దేశాలకు చేరింది. ఆనాటి నుంచి ఏటా ఏప్రిల్ ఫస్ట్ తేదీన ఒకరినొకరు ఫూల్స్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సరదాగా, సంతోషంగా సాగాల్సిన ఈ వ్యవహారం కాస్తా ఎదుటివారిని వెధవాయిల్ని చేసేలా తయారవుతోంది. అందుకే నాకనిపిస్తోంది 365 రోజులూ ఫూల్స్ లా బతుకుతున్న మనం కనీసం ఏప్రిల్ ఒకటో తేదీన ఎవరి ముందూ ఫూల్ కాకుండా ఉంటేనే నయం.!

Saturday 30 March 2013

డబ్బు మనుషులు

బజారుకీడ్చిన ఇంటికోడలు!

ఇరవైఒకటో శతాబ్ధంలో బతుకుతున్నా సామాజిక దురాచారాలకు ఇంకా దూరం కాలేకపోతున్నాం. అన్నిటికీ మూలం డబ్బు. "ధనం మూలం ఇదం జగత్" అన్నారు పెద్దలు. కానీ ఆడదే మూలధనంగా మారిపోతోంది. వరకట్నం వేధింపులు, గృహహింసకు తెరపడడం లేదు. మరో వీరేశలింగం పంతులు... మరో రాజారామ్మోహన్ రాయ్ తయారైతే గానీ సొసైటీని సంస్కరించడం సాధ్యం కాదేమో! ప్రజలందరికీ ఆదర్శంగా ఉంటామని రాజ్యాంగం మీద ప్రతినబూనిన నేతలు కూడా మహిళల పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. 

ఇంకానా ఇకపై సాగదంటూ న్యాయ పోరాటం... బర్షాస్వోనీ చౌదురి(మధ్యలో)

ఒడిషా మాజీ మంత్రి రఘునాథ్ మొహంతీ ఇంటి కథ ఒక ఉదాహరణ మాత్రమే. ఇది ఓ టీవీ సీరియల్ లా మలుపులు తిరుగుతోంది. సదరు రఘునాధుడికి వరకట్న వేధింపుల కేసుతో మంత్రి పదవి ఊడింది. పోలీసుల కళ్లుగప్పి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తలదాచుకున్నా... చివరికి కటకటాలు లెక్కించాల్సిన దురవస్థ వచ్చింది.

న్యాయ మంత్రిగా వైదొలిగిన రఘునాధ్ మొహంతి

అన్యాయ మంత్రేనా...

బీజేడీ సీనియర్ నేత రఘునాధ్ గత నెల దాకా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కేబినెట్లో న్యాయశాఖా మంత్రి. మంత్రి కుమారుడు రాజాశ్రీ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. భర్త, అత్తామామలు వేధిస్తున్నారంటూ రాజాశ్రీ భార్య బర్షా స్వోనీ చౌదురి కేసు పెట్టారు. 

వరకట్న వేధింపుల ఆరోపణలున్న రాజాశ్రీ

ఖరీదైన కారు, ముప్పయిఐదు లక్షలు తీసుకురావాలంటూ వేధించారనేది ఫిర్యాదు. దీనిపై వరకట్న వేధింపులు, గృహహింస చట్టాల కింద దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో రఘునాధ్ మంత్రిపదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజశ్రీ గతనెల అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు రఘునాధ్, ఆయన భార్య ప్రీతిలత పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఇతర వరకట్న వేధింపుల కేసుల మాదిరిగానే రఘునాధ్ కుమార్తె రూపాశ్రీ, ఆమె భర్త సువేందు మీదా కేసులు పెట్టారు. వేధింపులతో ఎవరకి ఎంత వరకూ సంబంధం ఉందో తెలియదు గానీ ఈ బడా నాయకుడి ఫ్యామిలీ ఇప్పుడు ఇరకాటంలో పడింది. 

రఘునాధ్ కుటుంబంపై మహిళా సంఘాల పోరాటం

రాజకీయ దుమారం

ఈ వ్యవహారంపై ఒడిషా అసెంబ్లీలో రచ్చరచ్చ సాగింది. అధికార బీజేడీ రఘునాధ్ ను ఎలా రక్షించాలో తెలియక తర్జనభర్జనపడుతోంది. కాంగ్రెస్, బీజేపీలకు ఇదో అస్త్రంగా మారింది. ఉన్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి కుటుంబం వరకట్నం మీదున్న యావతో ఇంటికోడలిని వేధించి చివరికి బజారున పడాల్సి వచ్చింది. ఇలాంటి కథలు, వ్యధలు అనేక కుటుంబాల్లో రగులుతూ ఉంటాయి. కొన్ని బయటికి వస్తాయి. మరికొన్ని పలుకుబడి, కండబలం మధ్య గాలికికొట్టుకుపోతాయి. మనిషిలో మార్పు రానంతవరకూ ఇలాంటి సామాజిక దురాచారాలకు తెర పడటం అసాధ్యం. ఈ మార్పు రావాలంటే ఒక్కరు కాదు వేల మంది వీరేశంలింగం పంతుళ్లు, లక్షల మంది రాజారామ్మోహన్ రాయ్ లు యువతరం నుంచే తయారు కావాలి.  

Friday 29 March 2013

భక్తి వికటిస్తే స్మశానమార్గమే!

శివుడు ప్రత్యక్షమవలేదని...!

తాంత్రిక యాగం చేస్తే పరమశివుడు ప్రత్యక్షమవుతాడని ఆశించారు. రక్తాభిషేకం చేస్తే దేవదేవుడు కరుణిస్తాడని అనుకున్నారు. వికటించిన భక్తిపారవశ్యం చివరికి ఓ కుటుంబాన్ని నిర్జీవంగా మార్చేసింది. వాళ్లు వెళ్లాలనుకున్నది స్వర్గమో, నరకమో తెలియదు కానీ ఐదు మృతదేహాలు స్మశానానికి చేరాయి. భక్తికి మూఢత్వం తోడయితే ఎంతటి విపత్కరమో బోధపడాలంటే రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకోవాలి.

కాంచన్ సింగ్ నివాసంలో తాంత్రిక పూజలు చేసిన దృశ్యం

వికటించిన భక్తి

రాజస్థాన్ లోని గంగాపూర్ సిటీలో కాంచన్ సింగ్ కుటుంబం మూఢభక్తితో ప్రాణాలు పోగొట్టుకుంది. అర్ధంపర్ధలేని శివారాధనతో ఐదుగురు బలయ్యారు. ముగ్గురు కొనఊపిరితో ఆస్పత్రిలో ఉన్నారు. ఫొటోగ్రాఫర్గా పనిచేసే కాంచన్ సింగ్ శివభక్తుడు. దేవదేవుడినే ప్రత్యక్షం చేసే అతీంద్రియ శక్తులేవో ఉన్నాయనే భ్రమ అతనిది. సాదాసీదా పూజలు కాకుండా తాంత్రిక పూజలతో పరమేశ్వరుడిని ఆవాహనం చేసుకోవచ్చని విశ్వసించాడు. హోమాలు, యాగాలతో శివుడు కళ్లముందు నిలబడతాడని నమ్మాడు... కుటుంబ సభ్యులనూ నమ్మించాడు. ఢిల్లీలో ఉండే బంధువులను కూడా రప్పించాడు. రాత్రంతా కాళరుద్రుడికి రహస్యంగా రక్తాభిషేకాలు చేశారు. ఎంతచేసినా దేవుడు కనిపించకపోయే సరికి అందరూ కలిసి విషం కలిపిన లడ్డూలు తినేశారు. ఆత్మార్పణంతో ఆ పరమ శివుడ్ని కైలాసంలోనే డైరెక్టుగా కలుసుకోవచ్చనుకున్నారు. తెల్లవారేసరికి ఆ ఇల్లు స్మశానంలా మారింది. ఐదుగురు విగతజీవులై ఇంట్లోనే పడిపోయారు. మృతుల్లో ముగ్గురు అభంశుభం తెలియని చిన్నారులు. మరో ముగ్గురు కొనఊపిరితో ఉంటే ఇరుగుపొరుగూ ఆస్పత్రికి తరలించారు. వీరంతా చదువుసంధ్యాలేని వారేమీ కాదు. అన్నీ తెలుసనుకునే అజ్ఞానులు. భక్తి వికటిస్తే ఏమవుతుందో తెలుసుకోలేని మూర్ఖులు.

పిజ్జాలు, బర్గర్లే నైవేద్యం

భక్తిలోనూ ఇదే వెరైటీ. రక్తంతో అభిషేకం... శివుడికి పిజ్జా, బర్గర్ల నైవేద్యం. దేవుడు ప్రత్యక్షమైతే వరాలెన్నో కోరుకోవచ్చనుకున్న మూఢభక్త శిఖామణులు పదకొండు రకాల పిండివంటలు సమర్పించుకున్నారు. ఇందులో శాండ్ విచ్, పిజ్జా, బర్గర్ లాంటి మోడ్రన్ డిషెస్ ఉన్నాయంటే వీరి భక్తి ఎంతలా శృతిమించిందో అర్థమవుతోంది.

ఐదేళ్లుగా రక్తాభిషేకాలు

కాంచన్ సింగ్ కుటుంబానికి ఇది పాత అలవాటే. ఐదేళ్లుగా మూడువేల సార్లు తమ రక్తంతోటే శివుడికి అభిషేకం చేశారుట. ఎప్పటికైనా పరమశివుడి కటాక్షం ఉంటుందనుకున్నారు. పాపం ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కాంచన్ సింగ్ తమ బంధువులను రకరకాలుగా నమ్మించాడు. కొడుకు టెన్త్ ఎగ్జామ్స్ కోసం పూజలు చేస్తే ముందురోజే క్వొచ్చన్ పేపరంతా కళ్లముందు ప్రత్యక్షమైందని చెప్పేవాడట.ఇదంతా వీడియోలోనూ రికార్డు చేసుకున్నారు. తమను తాము బలిచేసుకుంటున్న క్షణాలనూ రికార్డు చేశారుట. ఆ వీడియో చూసిన పోలీసులే బిత్తరపోయారు. కాంచన్ సింగ్ తల్లి భగవతీ దేవి, మేనకోడలు రేష్మి కొనఊపిరితో ఉన్నారు. శివుడి కటాక్షం పొందితే ఈ అమ్మాయికి పెళ్లి యోగం వస్తుందనేది ఆ కుటుంబం ఆశ. మూఢభక్తిలో మునిగితేలుతున్న ఆ కుటుంబం... 21 ఏళ్ల ప్రాయంలోనే రేష్మికి చావు ముహూర్తం పెట్టించారు. 

భక్తి పేరుతో కోట్ల వ్యాపారం

భక్తి మోస్ట్ సేలబుల్ కామోడిటీగా మారిపోయింది. భక్తి పేరుతో వందల కోట్ల రూపాయల వ్యాసారం సాగుతోంది. సమాజంలో మనచుట్టూ ఇలాంటి మూఢభక్తులు ఉంటారు. బోగస్ రత్నాలు, నకిలీ రుద్రాక్షలతో దండిగా సంపాదిస్తున్న ఘరానాలు ఉన్న సమాజం మనది.  తాయెత్తులు, కవచాలతో అనుకున్నది నెరవేరుతుందని నమ్మబలికే బురిడీ బాబాలే నడిచే దేవుళ్లుగా చెలామణి అవుతున్న అజ్ఞాన భక్తప్రపంచం మనది. పేరులో అక్షరాలు మార్చుకుంటే అదృష్టం వరించడమే కాదు క్యాన్సర్ లాంటి రోగాలే నయమవుతాయంటూ ప్రచారం చేసే  నయవంచక న్యూమరాలజిస్టులున్న సొసైటీ ఇది. భక్తితో ముడిపెట్టుకున్న వ్యాపారాలు రోజురోజూ విస్తరిస్తున్నాయి. అమాయక భక్తులనే కాదు అన్నీ తెలిసిన వాడినీ భ్రమలో పడేస్తున్నాయి. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే. పల్లెలే కానక్కరలేదు పట్టణాలు, నగరాల్లోనూ భక్తి వికటిస్తోంది. అలాంటి వారిని హెచ్చరించండి. భక్తి వికటిస్తే కనిపించేది మోక్షమార్గం కాదు... స్మశానమార్గమే.

Thursday 28 March 2013

కాశ్మీరీ కన్నె సోయగం!

తులిప్ గార్డెన్స్ పుష్పవిలాసం

వసంతాగమనంతో కాశ్మీరీ కన్నెసోయగాలు  పులకరింపచేస్తున్నాయి. శ్రీనగర్ లో ఆసియాలోనే అతిపెద్దదైన తులిప్ గార్డెన్ను టూరిస్టుల కోసం తెరిచారు. సిరాజ్ బాగ్ గా ప్రసిద్ధి చెందిన తులిప్ గార్డన్స్ కు 2008లో ఇందిరాగాంధీ పేరుపెట్టారు. 

పదిహేను హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు నిలువెల్లా కనులున్నా చాలవు. హిమసరస్సులాంటి డాల్ లేక్ తీరాన ఉన్న ఈ సుందర ఉద్యానవనంలో సుమారు ఎనభై రకాల పుష్పాలు వసంత శోభను వెదజల్లుతున్నాయి. 


  తోట మొత్తం పూల తివాచీ పరిచినట్లు...  చూడగానే హృయదానికి అత్తుకుంటుంది. పదిహేను లక్షలకు పైగా సుమాలు విరబూసాయి. ఏప్రిల్ దాటితే ఎండవేడిమికి సుమ సోయగాలు తగ్గుతాయి. అందుకే ఇప్పటి నుంచే పర్యాటక సందడి. 


ఈ ఏడాది మూడున్నర లక్షల కొత్త మొక్కలు తోటలో చేరాయి. మరో 25 కొత్త వెరైటీ పూల మొక్కలను హాలాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఒకవైపు ఉగ్రవాదదాడులు, అఫ్జల్ గురు ఉరి తదనంతరం తలెత్తిన ఉద్రిక్తత ఉన్నా చలికాలపు కాశ్మీరు అందాలను చూసేందుకు పర్యాటకు తరలివస్తున్నారు. అక్కడి సర్కారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. కేవలం ఫ్లోరికల్చర్ కోసం ఇద్దరు మంత్రులున్నారంటేనే ప్రభుత్వానికి ఎంత శ్రద్దో తెలుస్తోంది. డాల్ సరస్సులో... హౌస్ బోటులో...షికారు చేస్తూ తులిప్ అందాలను ఆస్వాదించడమూ అదృశ్టమే....





135 ఏళ్లు దర్జాగా బతికి...!

బతకడం తెలిసిన తెగ!

అస్సాం అడవుల్లో అరుదైన గిరిజన తెగకు చెందిన పూనాకొన్వర్ చనిపోయాడుట!. ఇందులో ఏముందనిపించవచ్చు. 135 ఏళ్లు దర్జాగా బతికిన గిరిపుత్రుడు. అంటే మన దేశంలో అత్యధిక వయసున్న మనిషి పూనాకొన్వరే. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదీ ముఖ్యమే. ఈ అడవి బిడ్డ చివరి రోజుల్లోనూ ఆరోగ్యంగానే బతికాడు. రెండేళ్ల క్రితం కంటిచూపు మందగించింది. వినికిడి శక్తి తగ్గింది. ఆనాటి వరకూ వృద్ధాప్యఛాయలేవీ కనిపించకుండా చలాకీగానే తిరిగేవాడు. తన పనులు తానే చేసుకునేవాడుట. ఈ వృద్ధుడికి ఓ ప్రత్యేకత ఉంది. అదే ప్రజాస్వామ్యం మీద గౌరవం. ఏనాడూ ఎన్నికల్లో ఓటేయకుండా ఉండలేదు. రెండేళ్ల క్రితం 2011 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న బాధ్యతాయుతమైన పౌరుడు. మనదేశంలో ఏ ఎన్నికల్లోనూ సగటున అరవై శాతం ఓట్లు కూడా పోలవని వ్యవస్థలో పూనాకొన్వర్ ఆదర్శప్రాయుడు కదా. 

 

పూనాకన్వర్ కన్నుమూశాడంటే అస్సాం బారిబంద పల్లె మొత్తం కన్నీరు పెట్టింది. మంచైనా చెడైనా అంతా 'కేశాయ్ ఖైతీ'(ఈ తెగ పూజించే దేవత. కాళికాదేవి అవతారమని విశ్వాసం) మహిమ అంటారు ఈ అడవి బిడ్డలు. పూనాకొన్వర్ తరచూ ప్రచారంలోకి వచ్చేవాడు. దేశంలో అత్యధిక వయస్కుడిగా ఈశాన్య రాష్ట్రాలకు చిరపరిచితుడే. అరవైల్లోనూ ఇరవైల్లా బతకడం తెలిసిన ఈ తెగ గురించి మరికొన్ని వివరాలు...

బతుకు తెలిసిన గిరిజనం

ఆరోగ్యంగా ఎక్కవకాలం బతకడమెలాగో ఈ గిరిజన తెగకు తెలిసిపోయింది. దీన్నే 'ఆయువు'పట్టు తెలియడం అనొచ్చేమో! అస్సాం, మేఘాలయ అడవుల్లో ఎక్కువగా నివసించే గిరిజన తెగ 'తివా లాలుంగ్'. వీరి సగటు ఆయు:ప్రమాణమే 90 ఏళ్లు. నలభైయాభై ఏళ్లకే బతుకుజీవుడా అంటున్న ఈ తరంలో ఆరోగ్యంగా శతాయువు వైపు అడుగులు వేయడం గొప్పే.

మనలాగే బియ్యం, గోధుమలు వీరికి ప్రధాన ఆహారం. చేపలు, మాంసం ఎక్కువగా తింటారు. రోజూ గంజి తాగుతారుట. కాలుష్యం లేని వనాల మధ్య... కల్మషం లేని  జనాల మధ్య ఎంతకాలమైనా ఆరోగ్యంగా గడిపేయవచ్చుననేది వీరి నమ్మకం. పూనాకన్వర్ 135 ఏళ్లు చలాకీగా బతికాడంటే ఇదే కారణం. ఆయన ముని మనవరాలి వయస్సే 68 ఏళ్లు. ఐదు తరాలను చూసిన ఈ శతాధిక వృద్ధుడి తరంలో మరకొంత మంది కూడా సెంచరీలు చేసే వయస్సుమాదీ అంటున్నారు. అవును బతకాలన్న కాంక్ష కూడా మనిషిని బతికిస్తుంది. అయితే ఆరోగ్యంగా బతికేందుకు మనవంతు ప్రయత్నం చేయాలి. పరిసరాలను మార్చుకోవాలి. మనమూ మారాలి.

శ్రమైక జీవన సౌందర్యం

 

Wednesday 27 March 2013

'రంగు'..'భంగు' లేనిదే పండగా?

ఆరోగ్య'భంగ్'మా...?

హోలీ పండుగతో ముడిపడిన ప్రధాన అంశాలు ఒకటి 'రంగు', రెండోది 'భంగు'! ఉత్తరాది నుంచి మనకింకా పూర్తి స్థాయిలో పరిచయం కాని 'భంగ్' గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఈ భంగుకి రంగుల పండుగతో ఎలా ముడిపడిందో తెలియదుకానీ ఆ మత్తుల గమ్మత్తులు లేకుండా హోలీ సంపూర్ణం కాదుట. 'భంగ్' ఫుల్లుగా పట్టించే సంప్రదాయం ఉత్తరాదినే ఎక్కువ.

మత్తెక్కించేది గంజాయి ఆకే!

భంగ్ అంటే గంజాయి ఆకే. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ గంజాయి వినియోగాన్ని, సాగునూ పూర్తిగా నిషేధించారు. దాదాపు అన్ని దేశాల్లోనూ ఐదు నుంచి పధ్నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేలా చట్టాలు అమల్లో ఉన్నాయి. అయితే అనేక రకాల ఆయుర్వేద మందుల తయారీలో దీన్ని వాడుతుంటారు. ప్రత్యేక సందర్భాల్లో ఔషధరూపంలో వినియోగించడానికి అమ్ముతారు. బ్రిటీష్ కాలంలో దీన్ని అనేక రుగ్మతల నివారణకు వినియోగించేవారు. ఇండియాలో అత్యధికంగా కాన్నబీస్ ఇండికా జాతి గంజాయి మొక్కలు పెరుగుతాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ మొక్కలు పెరుగుతుంటాయి. వినియోగం కూడా చాలా ఎక్కువ. మనదేశంలో అక్రమంగా వేల ఎకరాల్లో సాగుచేస్తుంటారు. అలాగే విక్రయాలు, వినియోగం సాగుతుంటాయి. హోలీ రోజున భంగ్ తయారీ కోసం మాత్రల రూపంలో విక్రయిస్తారుట.

శివుడికెందుకో ప్రీతి?

గంజాయి గురించి వేదాల్లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మత్తు బాగా తెలిసినవారెవరంటే శివుడి పేరే ముందుంటుంది. ఆ ఆదిబిక్షువును సంప్రీతి చేసుకునేందుకు ఇప్పటికీ కొన్నిచోట్ల శివరాత్రి రోజున ఈ ఆకులను సమర్పిస్తారుట. శివనామస్మరణలో మునిగితేలే సాధువులు, సన్యాసులు అదేపనిగా గంజాయిని సేవిస్తుంటారు. ధ్యానముద్రలో లీనమవడానికేనని చెప్తారు. మొత్తానికి హోలీ రోజున రంగుకెంత ప్రాధాన్యం ఉందో కొన్ని ప్రాంతాల్లో భంగుకీ అంతే ప్రాధాన్యం ఉంది.

గంజాయిలో ఉన్న మత్తేమిటి?

గంజాయి మత్తుకు అలవాటు పడితే చాలా ప్రమాదం. అందులోంచి బటయపడలేనంతగా బానిసలైపోయే ప్రమాదం ఉంది. హోలీ రోజున భంగ్ పేరుతో అతి స్వల్ప మోతాదులో మాత్రమే స్వీకరిస్తారు. దీనికి జతగా స్వీట్లు ఎక్కువగా తింటారు. గంజాయి ఎంత చెడు చేస్తుందో అంత మంచీ చేస్తుంది.

గంజాయి...మంచీ చెడూ

  • ఇండియాలో కాన్నబీస్ ఇండికా రకం మొక్కలు
  • గంజాయిలో 400 రకాల రసాయనాలుంటాయి
  • కాన్నబిడియోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది
  • యాంటీ బయటిక్ ఔషధంగా పనిచేస్తుంది
  • పెన్సిలిన్తో సమానమంటారు వైద్య నిపుణులు
  • యాంటీ బయటిక్ గా, పెయిన్ కిల్లర్ గా పనికొస్తుంది
  • యాంగ్జిటీని బాగా కంట్రోల్ చేస్తుంది
  • మైగ్రేయిన్, హెడేక్ ట్రీట్ మెంట్కు పనికొస్తుంది
  • ఆస్తమా, పక్షవాతం లాంటి రుగ్మతల నివారిణి
  • కేంద్ర నాడీమండల వ్యవస్థను ఉత్తేజరుస్తుంది
  • రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
  • క్యాన్సర్ లక్షణాలను అదుపు చేస్తుంది
  • కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తుంది
  • కండరాలు బిగుసుకుపోయే గుణాన్ని నిరోధిస్తుంది
  • ఆల్కాహాల్ అలవాటును మాన్పించే ఔషధంగా వాడొచ్చు
  • అతినిద్ర వ్యాధిని అరికడుతుంది

చేటు చేస్తే చిట్కాలు!

సాధారణంగా దీన్ని అక్రమంగా వినియోగించే వారు సిగరెట్ లేదా పైప్ ద్వారా పొడి రూపంలో పీలుస్తారు. హోలీ రోజున దీంతో 'భంగ్ తండాయ్' అనే స్వీటు తయారు చేస్తారు. ఇంకా రకరకాలుగానూ స్వీకరిస్తారు. అయితే స్వీటు అనేది ప్రధానం. భంగ్ జోలికెళ్లే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం...

  • ఖాలీ కడుపుతో భంగ్ తీసుకోవద్దు
  • ఫుల్ గా ఆహారం తిన్నాకే ద్రవరూపంలో స్వీటుతో కలిపి తాగాలి
  • గుండె జబ్బులు, నరాల వ్యాధులు, హైబీపీ ఉన్నవాళ్లు ముట్టుకోవద్దు
  • అందుబాటులో ఉందికదాని ఏ మాత్రం అతిగా తీసుకోవద్దు
  • ఎట్టిపరిస్థితుల్లోనూ ఆల్కాహాలుతో భంగ్ మిక్స్ చేయవద్దు
  • చిన్న పిల్లలు దాని జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి

 డోసుమించితే ఏం చేయాలి?

  • భంగ్ మత్తు అనేక గంటలపాటు ఉంటుంది
  • ఆల్కాహాలు మాదిరిగా అంతతొందరగా దిగిపోదు
  • భంగ్ కిక్కులో నాన్ స్టాపుగా మాట్లాడుతుంటారు
  • ఉలుకూపలుకూ లేకుండా పడిపోనూ వచ్చు
  • మత్తును తగ్గించాలంటే నిమ్మ లేదా బత్తాయి రసం పనికొస్తుంది
  • అరటి పళ్లు. స్ట్రాబెర్రీ, ఆపిల్ తింటే ఫలితం ఉంటుంది
  • ఫ్రూట్ జ్యూసులు, ఫ్రూట్ షేకులతో మత్తు తగ్గుతుంది
  • నీళ్లు బాగా తాగితే తొందరగా ఈ లోకంలోకి వస్తారు
  • చన్నీటి స్నానంతో మత్తు ఇట్టే దిగుతుంది
  • స్వచ్ఛమైన నెయ్యి కాస్త తిన్నా మత్తు తగ్గుతుంది

(గమనిక: ఈ ఆర్టికల్ కేవలం భంగ్ గురించి సమాచారం కోసమే. వైద్య పరమైన వివరాలను సాధికారకమైనవిగా భావించానికి లేదు. అందు వల్ల వైద్య నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఈ ఆర్టికల్లోని అంశాలతో తలెత్తే వైద్య, న్యాయపరమైన వివాదాలకు బ్లాగర్ బాధ్యత వహించడం కుదరదు)

  

Tuesday 26 March 2013

రంగుల్లోనే మనిషి తత్వం!

చిరికి కారులుపేనా...?!

ప్రకృతిని ఆరాధిస్తూ వసంతానికి స్వాగతాలు పలికే పండుగ హోలీ. ఏ దేవతనూ ఆరాధించాల్సిన అవసరం లేని సంబరం. ఫాల్లున మాసంలో పూర్ణిమ తెచ్చిపెట్టే రంగుల హరివిల్లు హోలీ. కామదహనం... ఆ మరుసటి రోజు తెల్లవారుజాము నుంచే రంగులు జల్లుకోవడం ఆనవాయితీ.

వసంతమే రంగుల సోయగం

వసంతాగమనవేళ ప్రకృతి రంగులమయంగా, వర్ణశోభితంగా ఉంటుంది. ఆ రంగులన్నీ మనిషి స్వభావాలకు వర్తించుకోవడమే ఈ పర్వం. ఎరుపు కోపానికి సంకేతమైతే, ఆకుపచ్చ అసూయ, పసుపు ఆనందం, గులాబీ ప్రేమ, నీలం విశాలత్వం, తెలుపు శాంతి, కాశాయం త్యాగం, ఊదా రంగు జ్ఞానానికి సంకేతాలు. అయితే ఈ రంగుల పండుగ రానురానూ ప్రకృతి స్వభావానికి దూరమైపోతోంది. కృత్విమశోభను సంతరించుకుంటోంది. పువ్వులు, ఆకుల రంగులకు బదులుగా ఆరోగ్యానికి హాని చేసే సింథటిక్ కెమికల్స్ హోలీ కలర్స్ రూపంలోకి మారిపోయాయి. రంగుల పండుగ ఆనందోత్సాహాలను పెంచడానికి బదులుగా బతుకుల్లో కారునలుపును పులుముతోంది. తెలిసితెలిసీ విషతుల్యమైన రసాయనిక రంగులను ఒంటి మీద జల్లుకుంటూ మనకుమనమే ముప్పుకొనితెచ్చుకుంటున్నాం. 

 ఆ రంగులతో చీకట్లే...

మార్కెట్లో దొరుకున్న హోలీ రంగుల్లో ప్రధానంగా సిలికా, క్రోమియం, లెడ్(సీసం) పాళ్లెక్కువగా ఉన్నాయని నిన్నమొన్న ఢిల్లీలో ఓ జాతీయ టీవీ చానల్ నిర్వహించిన ల్యాబ్ టెస్టుల్లో తేలింది. సిలికా మోతాదు మించితే మనిషి నాడీమండల వ్యవస్థ దెబ్బతింటుంది. క్రోమియం విషపూరితమైన రసాయనం. లెడ్ తో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది. ఏడెనిమిది షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబులో పరీక్షలు నిర్వహిస్తే ఒక్క గులాల్ మినహా మిగతా అన్ని రంగులతోనూ ప్రమాదం తప్పదని తేలింది. ముఖ్యంగా బ్లాక్, గ్రీన్, సిల్వర్, బ్లూ, రెడ్ తదితర సింథటిక్ కలర్స్ లో టాక్సిక్ ఇంగ్రిడియెంట్స్(విషపూరిత రసాయనాలు) ఎక్కువ. 

 హోలీ తెచ్చిపెట్టే అనారోగ్యాలు

  • చర్మ సంబంధిత అలర్జీలు, క్యాన్సర్

  • కంటి అలర్జీలు, అంధత్వం, చూపు మందగించడం

  • శ్వాస సమస్యలు, ఆస్త్మా, ఆయాసం, కెమికల్ అలర్జీ

  • జుట్టు ఊడిపోవడం

ఇప్పడు ఒక్కో రంగును రసాయనికంగా ఎలా తయారు చేస్తున్నారో, వాటికి ప్రత్యామ్నాయంగా మనమే ప్రకృతిసిద్ధమైన రంగులు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

ఆకుపచ్చతో అంధకారమే...

మార్కెట్లో దొరుకుతున్న గ్రీన్ పౌడరును కాపర్ సల్ఫేట్ తో తయారు చేస్తారు. ఈ కెమికల్ తో కంటి చూపు పోయే ప్రమాదం పొంచి ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కంటికి సంబంధించిన అలర్జీలు వస్తాయి. 

 ఆకులతో అదిరిపోయే రంగు

ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవాలంటే మనకు గోరింటాకు, మందార ఆకులు, గోధుమ గడ్డి, పాలకూర లాంటి వాటితో ట్రై చేయొచ్చు. వీటిని ఉడకబెట్టి వడగడితే ఏ ప్రమాదమూ లేని ఆకుపచ్చ రంగు రెడీ. వీటిని గ్రీన్ కలర్ పౌడర్లుగా వాడుకోవచ్చు. అయితే గోరింటాకుతో శరీరం ఎర్రరంగులోకి మారే అవకాశం ఉంది. అందులో ఎక్కువ మోతాదు నీళ్లు కలిపితే ఆకుపచ్చరంగులా వాడుకోవచ్చు. మార్కెట్లో దొరికే హెన్నా, మెహందీ(కెమికల్స్ లేనివి మాత్రమే)లతోనూ గ్రీన్ కలర్ చేయవచ్చు. 

బ్లాక్ తెచ్చిపెట్టేది అంధకారమే...

బ్లాక్ కలర్ పౌడర్ లో ప్రధానంగా వాడేది లెడ్ ఆక్సైడ్ అంటే సీసం. క్యాన్సర్ ముప్పుంటుంది. కిడ్నీ సమస్యలు తలెత్తవచ్చు.

రక్తం చిందించేది ఎరుపు!

రెడ్ కలరు కోసం మెర్క్యూరిక్ ఆక్సైడ్ లేదా సల్ఫేట్  కలుపుతారు. దీంతో చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో బుద్దిమాంద్యానికి కూడా దారితీయవచ్చు. నరాలకు సంబంధించిన వ్యాధులు లేదా పెరాలసిస్ ముప్పుంటుందిట. 

 మందారాన్ని మించిన ఎరుపేది...

ఎర్రరంగును మన పెరట్లో దొరికే మందార పువ్వులతో సులువుగా తయారు చేసుకోవచ్చు. పువ్వులు ఎండపెట్టి పొడికొట్టించడం ఒక పద్దతైతే... బాగా ఉడకబెట్టి అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకోవడం రెండో పద్ధతి. 

 మోదుగు పూలనూ వాడుకోవచ్చు. లేదంటే కుంకుమ, ఎర్ర చందనం, తమలపాకుల్లో రాసుకునే కాసు ఉపయోగపడతాయి. 

 మనం నిత్యం వాడే పసుపులో కొద్దిగా నిమ్మ రసం పిండినా, తమలపాకుల్లో వాడే నాణ్యమైన సున్నం కొద్దిగా కలిపినా ఎర్ర రంగు రెడీ అవుతుంది. గుల్ మొహర్ పూలు, గోగుపూలు, పారిజాత పుష్పాల కాండాలు(తావి), బీటురూటు ముక్కలు, దానిమ్మ తొక్కలు ఉడకబెట్టడం... ఇలా ఎర్ర రంగు సిద్ధమవుతుంది.

సిల్వర్ తో మెరుపులు కాదు మరకలు!

హోలీ రోజు తెల్లని పేస్టులాగా పూసుకునే రంగిది. అల్యూమినియం బ్రోమైడ్ రసాయనాల సమ్మిళితమిది. కంటి వ్యాధులతో పాటు, శ్వాస సమస్యలు, క్యాన్సర్ ప్రమాదం పొంచివుంది.

బ్లూతో ఒళ్లు మంట!

 నీలం రంగుకు వాడే కెమికల్స్ వల్ల డెర్మటైటిస్ వంటి చర్మవ్యాధులు వస్తాయిట. 

నీలిమందారాలు దొరికితే సరి...

నీలం రంగు మందారాలు(అరుదుగా దొరుకుతాయి) ఎండబెట్టి పౌడరుగా, ఉడకబెట్టి నీళ్లరంగుగా చేసుకోవచ్చు. ఇండిగో అనే కాయలు కూడా నీలం రంగునిస్తాయిట.

పసుపే సోయగం

రసాయన పూరితమైన ఎల్లో బదులుగా మన ఇంట్లో వాడే పసుపు నీళ్లు జల్లుకుంటే ఎంతో ఆరోగ్యం. పసుపు సోయగంతోనే నిజమైన వసంతం వచ్చినట్లు ఉంటుంది.

పసుపు మేని ఛాయను పెంచుతుంది. పసుపును నేరుగా కాకుండా ఏదైనా పిండి కలపడం మంచిది. ముల్తానీ మట్టిని కూడా హోలీ రంగుగా వాడుకోవచ్చు. బంతి పూలు ఎండబెట్టి పౌడరు చేసినా ఎల్లో రెడీ.

గులాల్ తోనూ చెడే...

పింక్ లేదా గులాల్ పౌడరును క్రోమియం అయోడైడ్ లాంటి రసాయనాలతో తయారు చేస్తారు. దీంతో ఆస్త్మా, ఎలర్జీ ప్రమాదాలున్నాయి. అందువల్ల తక్కువ మోతాదులో రసాయనాలుండే గులాబీ రంగు కుంకుమ వాడడం మంచిది. బీట్ రూట్ ఉడకబెట్టినా గులాబీ రంగు ద్రావణం సిద్ధమవుతుంది. మోదుగు పూలను ఉడకబెట్టినా ఈ రంగు వస్తుంది. 

మనం సంప్రదాయాలను వదిలేసుకోకూడదు. ఆడంబరాలు లేని పండుగలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుందాం. ప్రమాదం ఉందని తెలిసినప్పుడైనా జాగరూకతతో వ్యవహరిద్దాం. రేపటి తరానికి ఆరోగ్యకరమైన సంస్కృతిని వారసత్వంగా అందిద్దాం.

అక్కడ జంబలకిడిపంబ!

ఆడ కాదు మగే!

జంబలకిడి పంబ సినిమాలో లాగా అక్కడ మగవారంతా ఆడవారైపోతారు. ఆ దేవతను ఆలా పూజిస్తేనే కరుణిస్తుందని నమ్మకం. ఆ అరుదైన దేవత గురించి తెలుసుకొవాలంటే మనం కేరళ వెళ్లాల్సిందే. కొల్లం సమీపంలోని చవర గ్రామంలో కొట్టన్ కులంగార ఆలయంలో కొలువైన భగవతీ దేవి అమ్మవారి విశిష్టత ఇది. 

 చామయవిలక్కులో అందాలు వెలుగులు

మగవారు ఆడరూపంలోకి మారిపోతేనే ఇక్కడ పూజలు చేయనిస్తారు. ఏటా 19 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. చివరి రెండు రోజులూ మగ భక్తులు... అంటే ఆడ వేషంలోకి మారిపోయిన వారి సందడి ఎక్కువ. ఎంతో సాంప్రదాయసిద్ధంగా జరిగే ఈ వార్షిక బ్రహ్మోతవ్సవాలు ఒకెత్తయితే... చివరి రెండు రోజుల 'చామయవిలక్కు' సంబరాలు మరో ఎత్తు. వాలు జడల సోయగాలు, పట్టుచీరల సింగారాలు... మనకు వింతగా, విచిత్రంగా అనిపించినా ఆ భక్తిభావనలో మైమరచిపోయే వారు వేలవేలు.

ఆడదనం ఉట్టిపడే ముస్తాబు

చామయవిలక్కు అంటే అలంకరించిన దీపం అని. అందుకే స్త్రీ అవతారంలోకి మారిపోయిన పురుష భక్తులు అందమైన దీపాలు చేతబట్టుకుని తెల్లవారుజామున రెండు గంటల నుంచే దైవారాధనకు బయలుదేరుతారు. మహిళల్లా చీరకట్టి, సింగారించుకుని ఆ దేవత ముందు నిలబడితే చాలు... మనసులో అనుకున్నవన్నీ ఇట్టే నెరవేరిపోతాయని నమ్మకం. అందుకే ఏటా వేల మంది మగవారు వస్తుంటారు. దేశవిదేశాల్లో స్థిరపడిన మలయాళీలే కాదు, ఈమధ్య కాలంలో విదేశీయులు కూడా ఈ సంబరాలు చూసేందుకు తరలివస్తున్నారు.

భగవతీదేవి మహిమలెన్నో!

మహిమలెన్నో కలిగిన తల్లిగా భక్తుల పూజలందుకుంటున్న భగవతీదేవి స్వయంభువుగా వెలిసిన దేవత. ఈ ఆలయానికి గోపురం ఉండదు. ఇదో విశిష్టత. దేవత స్వయంభుగా వెలిసిందనడానికి ఓ కథ ఉంది. పూర్వం గోవులు కాసే కొంత మంది పిల్లలు కొండకోనల్లో ఓ రాయికి ప్రతినిత్యం పూజలు చేసేవారు. భుజం మీదున్న తుండుగుడ్డనే చీరకొంగుగా కప్పుకుని అమ్మాయిల మాదిరిగా కొలిచేవారు. అక్కడే దొరికిన నాలుగు రకాల పువ్వులు అర్పించడం... కేరళలో ఎక్కువగా లభించే కొబ్బరికాయలు నైవేద్యంగా పెట్టడం...వారికిదో ఆట! ఓ రోజున ఆ రాయే దేవత రూపంలో ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమందిట.  ఆ తర్వాత అక్కడే గుడి వెలిసింది.  ఆ గ్రామ దేవతే ఇప్పుడు భగవతీ దేవిగా భక్తకోటికి అభయాలిస్తోంది. మహా పుణ్యక్షేత్రంగా మారినా  ఆనాటి సంప్రదాయమే కొనసాగుతోంది. చామయవిలక్కు కోసం వచ్చే పురుష భక్తుల కోసం ఆలయం సమీపంలోనే సమస్త అలంకార సామాగ్రి దొరుకుతుంది. రకరకాల చీరలు, సాంప్రదాయ వస్త్రాలు, గాజులు, గొలుసులు, విగ్గులు, పూలజడలు... ఒకటేమిటి ఆ ముస్తాబు పూర్తయ్యాక ఒకటే భక్తిపరవశం!

Monday 25 March 2013

చైనా 'ఫాస్ట్' లేడీ!

ఎర్రకోటలో పాటల పూదోట!
ఏ దేశంలోనైనా ప్రధానో, రాష్ట్రపతో, వాళ్లవిడో అందంగా ఉన్నారని మనకనిపిస్తే 'మీరు అందంగా ఉన్నారండి' అని చెప్పగల స్వేచ్ఛ ఉంటుందా...? చైనీయులు మాత్రం వాళ్ల ప్రెసిడెంట్ గారి సతీమణి అందంగా ఉందన్న విషయాన్ని మనసులో దాచుకోకుండా పంచేసుకుంటున్నారు. మన ట్విటర్ లాంటి 'సీనో వైబో'లో ఆ అందగత్తెకు బోలెడు ప్రశంసలు. అమెరికన్లకు ప్రెసిడెంట్ సతీమణి మిషెలీ ఒబామా లాగే తమకూ ప్రెసిడెంట్ గ్జి జిన్ పింగ్ సతీమణి పెంగ్ లియౌన్ ఉన్నారంటూ  సామాజిక వెబ్ సైట్లలో కొన్ని వందల పోస్టులు దర్శనమిస్తున్నాయి. మిషెలీకి వెస్ట్రన్ మీడియా  ఆ మాటకొస్తే ప్రపంచ మీడియా తెగ పబ్లిసిటీ ఇస్తుంది. చైనా మీడియా ఇంకా సాంప్రదాయ ధోరణి నుంచి దూరం కాలేదు. పెంగ్ స్వతహాగా జనాధారణ పొందిన గాయనే అయినా ఆమెకు ఇస్తున్న ప్రచారం తక్కువే.

నిజంగా దేశాధ్యక్షుడి భార్య అవడానికి ముందే ఆమె పాపులర్. యావత్ చైనా మెచ్చిన ప్రజాగాయని ఆమె. 51 ఏళ్ల పెంగ్ స్వరంతో పరిచయం లేని చైనీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. జనం గుండె తలుపుతట్టిన జానపద గాయని పెంగ్. దేశ భక్తి గీతాలు పాడడంలో ఆమెకు ఇంకెవరూ సాటికాదు. పెంగ్ తల్లి కూడా ఓ సాంగ్ ట్రూపులో గాయనే. తండ్రి మ్యూజియంలో క్యూరేటర్. పెంగ్ చిన్న తనంలోనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో 'సోప్రానో'(బృందగాయని)గా చేరారు. సాంప్రదాయ సంగీతంలో మాస్టర్స్ డిగ్రీ  అందుకున్నారు. చైనా సెంట్రల్ టెలీవిజన్-సీసీటీవీ(అధికార టీవీ ఛానెల్)లో ఎప్పటి నుచో ఆమె కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. 1983లోనే ఆమె సూపర్ స్టార్. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పెంగ్ నోటివెంట జాలువారిన గీతాలను ఎన్ని తరాలైనా మరచిపోరు.

మనసులు కలిపిన ప్రేమగీతం

పెంగ్ జనం మధ్య పాటలు పాడుతుండగానే గ్జి మనసుపడ్డారు. ఆపై పెళ్లి చేసుకున్నారు.(వీరిది రెండో వివాహం. ఒక కుమార్తె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది). గ్జి 2007లో చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయతక్వంలో చోటుసంపాదించేంత వరకూ పెంగ్ జానపద గీతాలు పాడుతూనే ఉన్నారు. టీవీ షోలూ ఇచ్చేవారు. గ్జి రాజకీయంగా పైకెదిగాక పెంగ్ జనంలోకి వెళ్లడం తగ్గించి సేవా కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నియత్రించే కార్యక్రమానికి 2009లోనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. టీబీ, హెచ్ఐవీ, ఎయిడ్స్ నిరోధానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో ముందు నిలిచారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ పౌండేషన్ కార్యక్రమాల్లో పెంగ్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు.  చైనా ఫస్ట్ లేడీ అవడానికి ముందునుంచే ప్రజాజీవితంలో క్షణం తీరికలేని విధంగా సేవా కార్యక్రమాలతో గడిపేవారు. పెంగ్ కు మూగ జీవాలంటే ప్రేమ. హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులైన చిన్నారుల సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా ఆమె సిద్ధం. ఏ దేశవాసులైనా ఇలాంటి ప్రజానాయకులను, వారిని నడిపించే జీవిత భాగస్వాములను కోరుకోవడంలో తప్పేమీ ఉండదు కదా...?!

ఆమెకే పాపులారిటీ

చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ కన్నా ఆయన సతీమణి పెంగ్ లియౌన్ కు ప్రజాకర్షణ ఎక్కువ. ఆమెకెంత క్రేజ్ ఉందంటే డ్రెస్సెస్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా పెంగ్ వాడుతున్న ప్రతి వస్తువుకీ మార్కెట్లో మోడల్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఆన్ లైన్ షాపింగ్లో పెంగ్ పేరు వాడుకోని కంపెనీలే లేవుట.

పెంగ్ మీదే ఫోకస్

గ్జి దేశాధ్యక్షుడయ్యాక మొదటిసారి విదేశీ ట్రిప్పుకెళ్తూ పెంగ్ ను వెంటతీసుకువెళ్లారు. తోటి కమ్యూనిస్టు దేశం రష్యాలో చైనా మొదటి జంటకు అపూర్వ స్వాగతం లభించింది. 

ఈమధ్యే దేశాధ్యక్షుడైన గ్జి చైనాకు ప్రపంచ పటంలో సరికొత్త స్థానం చూపిస్తారని ఆ దేశ పైరులు కోరుకుంటున్నారు. అలాగే ప్రజా గాయనిగా ప్రసిద్ధురాలైన పెంగ్ దేశ ఔన్నత్యాన్ని దేశవిదేశాల్లో చాటుతారని ఆశిస్తున్నారు. ఈ ఇద్దరికీ చైనాలో పాపులారిటీ పెరుగుతోంది. సాధారణంగా తమ దేశ మొదటి మహిళలను పట్టించుకోని చైనా మీడియా కొన్నాళ్లుగా పెంగ్ కార్యకలాపాలకు కొంత ఫోకస్ ఇస్తోంది. పెంగ్ పాట మహిమకు ప్రజలంతా మైమరచిపోతున్నారు.

అప్పొకరికి...ముప్పొకరిది!

చిన్నదేశం పెద్ద కష్టం!
పక్క వాడు కష్టాల్లో ఉన్నాడుకదాని అప్పిచ్చి నెలాఖరున మన బడ్జెట్ అడ్జస్టవక తెగ ఇబ్బంది పడడం సామాన్యుడికి స్వీయానుభవమే. ఇలాగే సైప్రస్ అనే ఓ చిన్న దేశం కూడా పొరుగునున్న గ్రీసుకు అప్పులిచ్చింది. పీకల్లోతు చిక్కుల్లో పడింది. నిరుడు గ్రీసు ఆర్ధిక సంక్షోభం ప్రపంచాన్నే గడగడలాడించింది. చివరి నిమిషంలో యూరో దేశాల కూటమి సాయమందించడంతో అది గట్టెక్కింది. గ్రీసుకు అప్పులిచ్చిన అనేకానేక దేశాల్లాగే సైప్రస్ కూడా నిలువునా నేల కూలింది. సైప్రస్ గొడవ మనకెందుకని మీకనిపించవచ్చు. గ్లోబలైజేషన్ ఎఫెక్ట్. సైప్రస్ దివాళా తీస్తే యూరో బలహీనపడుతుంది. యూరో నీరసపడితే ప్రపంచ స్టాక్ మార్కెట్లు దెబ్బతింటాయి. ఆ ప్రభావం మన షేర్ మార్కెట్ మీదా ఉంటుంది. ఇది జన సామాన్యం మీద బోలెడ్ ఎపెక్ట్ చూపిస్తుంది. కొన్నాళ్లుగా యూరఫ్, ఏషియా మార్కెట్ల మీద సైప్రస్ ఆర్ధిక సంక్క్షోభం ప్రభావం బాగా కనిపిస్తోంది. ముంబై స్టాక్ మార్కెట్ కూడా ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది.  

పాపం... గట్టెక్కిస్తున్నాయి

చివరికి సైప్రస్ దేశానికి అంతర్జాతీయ సంస్థలు బెయిలౌట్ ప్యాకేజ్ ప్రకటించాయనగానే ప్రపంచ మార్కెట్లన్నీ ఊరట చెందాయి. నిలువునా అప్పుల్లో కూరుకుపోయిన గ్రీసును గట్టెక్కించినట్లే సైప్రస్ దేశాన్ని కూడా యూరో కూటమి, యూరో బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాపాడాయి. కష్టాల్లో ఉన్న ఈ చిన్న దేశం రష్యా, జర్మనీలను అడిగినా ఆ దిగ్గజాలు రెండూ చేతులెత్త్తేశాయి. డబ్బు విలువ తెలియకుండా నిర్వహణ వ్యయం పేరుతో దండిగా ఖర్చు పెట్టిన పాలకులదే ఈ సంక్షోభ పాపమంతా. జనం సొమ్ముతో దర్పం వెలగబెట్టిన బ్యాంకులు తీరా కష్టనష్టాలు వచ్చాక వాటిని జనం మీదకే మళ్లించాయి. డబ్బుండీ లేని వారైపోయిన సైప్రస్ వాసుల అనుభవాలు అనేక దేశాలకు ఓ గుణపాఠం చెప్తున్నాయి.

చరిత్రున్న దీవే..

మధ్యదరాసముద్రంలో చిన్న దీవి సైప్రస్. ఇరుగుపొరుగున గ్రీసు,టర్కీ, సిరియా, లెబనాన్, ఇజ్రాయిల్ దేశాలున్నాయి. 1974లో టర్కీ, గ్రీసు వలస వాదుల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఆ తర్వాత టూరిస్ట్ కంట్రీగా బాగా డెవలప్ అయింది. మళ్లీ అంతటి సంక్క్షోభమే ఇప్పుడు తలెత్తింది. గ్రీసు సంక్క్షోభం దాకా సైప్రస్ వాసులకు యూరో అంటే పెద్ద లెక్క లేదు. ఇప్పుడు చేతుల్లో దమ్మడీ లేని దౌర్భాగ్యం. తక్కువ జనాభా ఉన్న సంపన్న దేశమిది. హై ఇనకమ్ ఎకానమీ కిందే లెక్క. మానవాభివృద్ధి సూచీలో సైప్రస్ గణనీయమైన స్థానంలో ఉంటుంది. బీచ్ రిసార్ట్స్లో హాయిగా కొబ్బరి చెట్ల నీడలో సేద తీరుతూ ఉండే అక్కడి జనం ఏనాడూ అనుకుని ఉండరు తమకింత దుస్థితి దాపురిస్తుందని.

అయ్యయ్యో...జేబులు ఖాళీ ఆయెనే...

దర్జాగా బీచ్ ఒడ్డున జల్సా చేసే వీరికి ఎప్పుడో కానీ డబ్బు అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఏ బ్యాంకు ఏటీఎం దగ్గర చూసినా సింగిల్ యూరో కోసం చాంతాడంత క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. గ్రీసుకు అప్పులిచ్చిన బ్యాంకులన్నీ దివాలా తీశాయి. బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారికి ఆ మొత్తం వెనక్కి వచ్చే మార్గం లేకుండా పోయింది. సుమారు రెండేళ్లుగా అక్కడి ఆర్ధిక రంగంలో ఒడిదుడుకులు నడుస్తున్నాయి. బ్యాంకులు దివాలా దిశగా ఉన్నాయని తెలిసిన జనం డిపాజిట్ల కోసం క్యూలు కట్టారు. చివరికి ప్రభుత్వమే చొరవ తీసుకుని బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. ఏటీఎంలన్నీ మూసేయించింది. దీంతో జనం రోజువారీ షాపింగులకు వెళ్తే క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా పని చేయడం ఆగిపోయాయి. పూట గడిచే మార్గం లేక డబ్బున్న వాడి దగ్గర దోపిడీ చేసిన ఉదంతాలు మొదలయ్యాయి. బ్యాంకుల్లో కావాల్సినంత డబ్బుంది. కానీ తినడానికి ఓ పూట తిండి దొరకని దౌర్భాగ్యం. అంతా యూరో మహిమ.

యూరో కూటమే కాపాడింది.

సైప్రస్ను గట్టెక్కించడానికి యూరో కూటమి, యూరో ఫెడరల్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ముందుకొచ్చాయి. అయితే షరతులతోనే అసలు చిక్కు. లక్ష యూరోలకన్నా ఎక్కువ దాచుకున్న వారి నుంచి పన్నులు వసూలు చేయాలని ఈ సంస్థలు ఇంతకుముందే షరతు పెట్టాయి. ఇలాగైతే భారీగా ఆర్ధిక సాయమందించి ఆదుకుంటామని ఆశపెట్టాయి. దీనిపై ప్రజలంతా తిరుగుబాటుకు దిగారు. దీంతో సర్కారు మొదట వెనక్కి తగ్గినా చివరికి గత్యంతరం లేక ఒప్పేసుకుంది. జనం కూడా దేశమే దివాలా తీసేకంటే ఇదే మంచి మార్గం కదా అంటున్నారు. అయితే సంపన్నులు ఇరకాటంలో పడ్డారు. ఇక్కడి బ్యాంకుల్లో రష్యాలాంటి ఇరుగుపొరుగు దేశాల వారు బోలెడు దబ్బు దాచుకున్నారు. ఇప్పుడా డబ్బంతా గోవిందాయే. లక్ష యూరోలకంటే ఎక్కువున్న డిపాజిట్లన్నీ రద్దయినట్లే. అందుకు తక్కువున్న డిపాజిట్లన్నీ బ్యాంక్ ఆఫ్ సైప్రస్(దీన్నక్కడ ఆరోగ్యకరంగా నడుస్తున్న బ్యాంకుగా గుర్తించారు)కు బదిలీ చేస్తారు. 

డబ్బున్నోడికి దెబ్బే...

చిన్న మొత్తాలకు ఎలాంటి ఢోకా ఉండదు. పెద్ద మొత్తంలో దాచుకున్న వారికే ముప్పొచ్చిపడింది. సంపన్నులే కాదు సర్కారు కూడా అంతర్జాతీయ సంస్థల షరతులకు లోబడి ఖర్చులన్నీ తగ్గించుకోవాల్సి వస్తోంది. దివాలా దీసిన బ్యాంకులను మూసేయబోతున్నారు. మెజారిటీ జనం మాత్రం ఎలాగోలా దేశం బతికిబట్టగలిగేందుకు ఈ బెయిలౌట్ ప్యాకేజ్ తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. సైప్రస్ వాసులకే కాదు, ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా యూరో దేశాల వారందరికీ ఊరటనిచ్చే అంశమిది. సైప్రస్ సంక్క్షోభం ఎఫెక్ట్ మన మీదా ఉంటుందని ఈమధ్యే ఆర్ధిక మంత్రి చిదంబరం కూడా హెచ్చరించారు. ఇప్పటికైనా ఆ దేశం కుదుటపడుతున్నందుకు మనం సంతోషించాల్సిందే. దేశమైనా, బ్యాంకైనా, చివరికి ఓ వ్యక్తయినా నిర్వహణలోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్ధుకోబోతే  నిలువునా మునిగే రోజొస్తుందనడానికి సైప్రస్, గ్రీసు దేశాలు సజీవ సాక్ష్యాలు. 


  

Friday 22 March 2013

ఎర్త్ అవర్... అవర్ హెల్త్!

భూగోళాన్ని కాపాడుకుందాం..!

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ దినోత్సవం(మార్చి23) సందర్భంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. వాతావరణాన్ని పరిరక్షించకపోతే ఎదురయ్యే ముప్పు ఏమిటో అవగతం కావడంతో ఏడు వేల నగరాల్లో ప్రజలంతా ఈసారి ఎర్త్ అవర్లో పాల్గొంటున్నారు. ఈ ఉద్యమంతో 150 దేశాలు చేతులు కలిపాయి. 

పాలస్థీనా, టునీషియా, గాలాపొగాస్, సురీనామ్, ఫ్రెంచ్ గుయానా, సెయింట్ హెలెన్, రువాండా లాంటి చిన్న దేశాలు కూడా ఎంతో చైతన్యంతో మొదటిసారి ఈ గ్లోబల్ ఈవెంటులో పాల్గొంటున్నాయి. మనదేశంలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా 150 నగరాలు, పట్టణాలు ఎర్త్ అవర్ పాటించబోతున్నాయి.
మార్చి 23న ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్
రాత్రి 8.30 నుంచి 9.30 దాకా విద్యుత్ బంద్

ముఖ్యమైన ప్రాంతాలు...

  • ఢిల్లీలో గేట్ వే ఆఫ్ ఇండియా
  • సిడ్నీలో ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్
  • కౌలాలంపూర్లో పెట్రోనాస్ టవర్
  • సింగపూర్లో మెరినా బే సాండ్స్
  • టో్క్యోలో సిటీ టవర్స్, తైపీ 101
  • బీజింగ్లో బర్డ్స్ నెస్ట్
  • దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా
  • ప్యారిస్ ఈఫిల్ టవర్
  • యూకేలో పార్లమెంటు భవనం, బకింగ్హమ్ ప్యాలేస్
  • ఎంపైర్ స్టేట్ బిల్డింగ్
  • నయాగరా జలపాతం

స్విచ్ ఆఫ్ చేయడమే మన బాధ్యత

ది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యుడబ్ల్యుఎఫ్) ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తోంది. ఈసారి భారత్ లాంటి దేశాల నుంచి భాగస్వామ్యం ఆశాజనకంగా పెరుగుతుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆండీ రిడ్లే అంచనా. ఈసారి సుమారు రెండు వందల కోట్ల మందిని ఇందులో భాగస్వాముల్ని చేయాలనేది లక్ష్యం. నిరుడు కూడా దాదాపు ఇంతేమంది ఎర్త్ అవర్ పాటించారు. నిరుడు ఎర్త్ అవర్ పాటిస్తున్న వేళ నాసా తీసిన భూగోళ చిత్రపటాలు చూస్తే దీని ఎఫెక్ట్ ఎంత వుందో తెలుస్తుంది(ఫొటో గమనించండి).

చైతన్యం తెస్తున్న ఎర్త్ అవర్ 

ఎర్త్ అవర్ అంటే ఓ గంట పాటు విద్యుత్ వినియోగాన్ని ఆపేయడమే. కరెంట్ బల్బులు, టీవీలు, ఫ్రిజ్లు, కంప్యూటర్లు... కరెంటుతో నడిచే ఉపకరణాలన్నీకాసేపు స్విచ్ ఆఫ్ చేయాల్సిందే.  ఇలా విద్యుత్ ఆదా చేస్తే ఆ మేరకు భూ వాతావరణాన్ని పరిరక్షించినట్లే. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దీన్ని మొదలెట్టారు. ఆరేళ్లలో ప్రజలు కూడా స్వచ్చందంగా ఎర్త్ అవర్ పాటించే విధంగా చైతన్యం తీసుకురాగలిగారు. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కరెంట్ కట్ చేస్తే బోలెడు ఆదా అవుతుంది. మోబైల్ ఫోన్ల ద్వారా విస్త్రుత పరచారం చేస్తున్నారు. స్వచ్చంద సంస్థలు బాధ్యతగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసే యువతరం దీన్ని భుజానికెత్తుకుంటున్నారు. రేపటి భారతం అంధకారం అవకుండా ఉండాలంటే ఈరోజు కాసేపైనా చీకటి అనుభవించక తప్పదు. నిరుడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్ కత్తా లాంటి మహానగరాలతో పాటు గుణ, ఇటావా లాంటి చిన్నచిన్నపట్టణాల్లోనూ గంట పాటు విద్యుత్ వినియోగం నిలిపివేశారు.




క్లైమేట్ ఛేంజ్ తో ముప్పు

  • కోల్ కత్తా, ముంబై, ఢిల్లీలకు క్లైమేట్ ఛేంజ్ రిస్క్
  • డేంజర్ జోన్లో ఢాకా, మనీలా, బ్యాంగాక్, యాంగోన్, జకార్తా
  • చికాగో, లండన్, పారిస్ నగరాలకు రిస్క్ స్వల్పం
  • ఈ శతాబ్దాంతానికి అమెరికా టెంపరేచర్లో10 డిగ్రీల పెరుగుదల 

మన చేతుల్లోనే మన భూగోళం... ఎర్త్ అవర్ కోసం ఓ గంట పాటు విద్యుత్ పరికరాలన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ పోస్టును షేర్ చేయండి. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఎర్త్ అవర్ లో భాగస్వాముల్ని చేయండి. ఎర్త్ అవర్... అవర్ హెల్త్!