'రాజా'వారి మొసళ్ల చెరువు!
ఓటేసినవాడు 'ఖల్ నాయక్'!
ఓ ఊరు... అక్కడో జమిందారు. అక్కడ ఆయన మాటే వేదం! ఒకానొక రోజున ఓ యువకుడు ఎదురుతిరుగుతాడు. చిర్రెత్తుకొచ్చిన జమిందారు కన్నెర్రచేస్తాడు. ఆ తర్వాత వారింటి వెనుకున్న చెరువు 'ఎర్ర'బారుతుంది! ఒడ్డున పెద్ద మొసలి సేదదీరుతుంటుంది. జమిందారు గారేమో వసారాలో హాయిగా పడక కుర్చీలో కునుకుతీస్తుంటాడు. ఆ చెరువు ఇలా ఎర్రబారినప్పుడల్లా రావుగోపాలరావు సినిమా డైలాగు 'ఆకాశం ఎర్రబారినట్లు లేదూ...!' అన్న మాట గుర్తొస్తుంది. తిని తొంగుండే మనుషులకి ఈ డైలాగ్ గుర్తొస్తుందో లేదో...! సినిమాసినిమాకీ సీన్లో తేడా ఉన్నా టోటల్ 'థీమ్' మాత్రం ఒక్కటే. 'బలవంతుడు దుర్బల జాతిని బలహీనుల గావించాడు....'!
భయపడితేనే భయపెడతాడు!
ఇప్పుడు 'రాజా' వారి మొసళ్ల చెరువు దగ్గరికొద్దాం. ఇది కల్పన కాదు, అలాగని పూర్తిగా వాస్తవం కూడా కాకపోవచ్చు. ఒకానొక రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్ కాదు)లో పేరుమోసిన మంత్రి. ఓ పోలీసధికారిని కాల్చిచంపేసిన కేసు మెడకు చుట్టుకుంది. ఇలాంటివి జరిగినప్పుడల్లా ఆయన పేరు వినిపిస్తుంటుంది. అలాగని ఎప్పుడూ ఆయన చేతికి రక్తం మరకంటలేదని అనుచరులు చెప్తుంటారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆ చిన్న పట్టణంలో ఆయనే నాయకుడు... ఆయన ఉన్నదే పార్టీ. నియోజకవర్గానికి దగ్గర్లోనే చిన్ని గ్రామంలో చెరువుంది. అక్కడే ఆయనకో గెస్టహౌస్ లాంటి విడిదుంటుంది. ఆ చెరువునే జనం 'మొసళ్ల' చెరువు అనుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ చెరువు నీళ్లు ఎర్రబారాయా లేదా అంటే ఎవరు చూసొచ్చారు?. ఆయనంటే అందరికీ భయం!
రాజకీయ ఘనాపాటీయే...!
ఉట్టప్పుడూ ఎన్నికలప్పుడూ సదరు నాయకుడికి ఎదురే లేదు. రెండు దశాబ్దాలుగా ఎన్నికల్లో గెలవడం, మంత్రిగా అధికారం చెలాయించడం కామనే. ఇన్నాళ్లకు ఎలాంటి మొగాడికైనా ఎదురనేది ఉంటుందని తెలిసొచ్చింది. అప్పుడెప్పుడో వ్యతిరేక పార్టీ నాయకురాలు ముఖ్యమంత్రి అయ్యాక ఓసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ నేరారోపణ. అందుకే మంత్రి పదవి నుంచి తప్పుకున్నాడు. పోలీసధికారి హత్య వెనుకున్నదెవరో తేల్చేందుకు చట్టం తనపని తాను చేసుకుపోతోంది. ఈ హత్యకు ముందు మరో రెండు హత్యల కథ ఉంది. ఓ ఊర్లో ఓ వర్గం అమ్మాయిని ఓ కులం అబ్బాయి ప్రేమించాడు. ఇది అటూఇటూ తిరిగి పెద్ద గొడవైంది. దీంతో 'కులం', 'మతం' మనుషుల మధ్య గొడవ ముదిరి దహనకాండకు దారితీసింది. ఇంతలో ఊరి పెద్దనీ, ఆయన సోదరుడినీ ఎవరో చంపేశారు. ఈ ఘటనల పరంపరకు బ్రేక్ వేయాలనుకున్నారు అధికారులు. ఏ నాయకుడో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నాడని అనుమానించిన ఓ సిన్సియర్ పోలీసాధికారి గొడవలు జరిగిన ఊర్లో అడుగుపెట్టాడు. అనుమానించడమే కాదు ఆ నాయకుడి నేరాల చిట్టా సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఇక తాత్సారం చేస్తే కొంపమునుగుతుందనుకున్న నాయక్ అనుచరులు... చోటా ఖల్ నాయక్లు ఆ అధికారిని కాల్చిచంపేశాడు. ఇక దీని చుట్టూ రాజకీయం తిరుగుతోంది. అది రకరకాల మలుపులు తిరుగుతూ ఉంటుంది.
చరిత ఘనం...!
ఊర్లో తిరుగులేని నాయకుడంటే అందరూ భయపడతారని కాదు. ఎన్నికల్లో నెత్తికెక్కించుకుంటారు, అందలం ఎక్కిస్తారూ అని! మంచి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివిన అతను కలియుగ రాజకీయ నీతిని బాగా ఒంటబట్టించుకున్నాడు. తాతల కాలం నుంచే చదువుకొన్న కుటుంబం. వెనుకటి తరంలో మంచి పదవుల్లో కొనసాగిన వారున్నారు. మన నాయకుడి తీరు చూస్తే ఇలా...! అందుకే తిట్టే వారు తిడుతుంటారు. పొగిడే వారు పొగుడుతూ ఉంటారు. ప్రజాస్వామ్య దేశంలో ఎలాగోలా ఓట్లు సంపాదించే వాడే నాయకుడు కదా...!
ఈ ప్రశ్నకు బదులేది?
సమాజం చెడిపోతోందనుకుంటూ... తీరా ఎన్నికలప్పుడు ఓటేయడానికి కూడా సమయం కేటాయించలేని మనమే మనకు సమాధానం చెప్పుకోవాలి. ఇందులో చెప్పిందంతా... ఓ రాజకీయ నాయకుడు తన మనుగడ కోసం సాగిస్తున్న 'దుష్టావతారం' గురించి కాదు... నాయకుల చీకటి కోణాలు వెతుకుతూపోతే సహస్రావతారాలు కనిపిస్తాయి. మనం ఆలోచించాల్సింది నాయకుల గురించి కాదు, 'ఖల్ నాయక్'లుగా మారిన మనలో మనవారి గురించి. నాయకుల్లో మంచి వారిని మాత్రమే అందలం ఎక్కించే ప్రజాస్వామ్యవాదులు ఓటు విలువ గురించి ఒక్క సారైనా ఆలోచించాలనేదే ఇందులో సారాంశం...!
No comments:
Post a Comment