Wednesday, 6 March 2013

సిరికాంతుల కోవెలలో సిరులిచ్చే తల్లి!

శ్రీపురం గోల్డెన్ టెంపుల్
ఏడుకొండలవాడు కొలువైన తిరుమలేశుని సన్నిధికి వెళ్లినప్పుడు అక్కడికి దగ్గర్లోనే ఉన్న అపురూప పుణ్యక్షేత్రం శ్రీపురం సందర్శిచి రావాల్సిందే. మనదేశంలో గోల్డెన్ టెంపుల్ అనగానే పంజాబ్ అమృత్సర్ స్వర్ణ దేవాలయం ఒక్కటే గుర్తొస్తుంది. మనకు పొరుగునే ఉన్న తమిళనాడులో శ్రీపురం శ్రీ మహాలక్ష్మిఅమ్మవారి ఆలయం కూడా చూసేందుకు ఎన్ని కన్నులున్నా చాలని అద్భుత నిర్మాణం.పూర్తిగా బంగారు తాపడంతో కళాత్మకంగా తీర్చిదిద్దిన గోపురం, గర్భగుడి భక్తులను అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి.

ప్రకృతి ఒడిలో ధార్మిక క్షేత్రం

చెన్నై-బెంగళూరు జాతీయ రహదారికి దగ్గర్లో ఉందీ దివ్యక్షేత్రం. నార్త్ ఆర్కాట్ జిల్లా కేంద్రమైన వెల్లూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని మలైక్కోడి గ్రామం వద్ద పచ్చని ప్రకృతి సోయగాల మధ్య ధగద్ధగాయమానంగా మెరిసిపోతుంటుంది శ్రీ మహాలక్ష్మీ స్వర్ణ దేవాలయం.

సిరివెన్నెల కాంతులు

శ్రీనారాయణి పీఠం అధిపతి శ్రీ శక్తి అమ్మ ఈ స్వర్ణ దేవాలయాన్ని నిర్మించారు. వంద ఎకరాల విస్తీర్ణంలో 55వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఈ పుణ్యధామం కొలువైంది. 600 కోట్లు ఖర్చుపెట్టి అతితక్కువ కాలంలో నిర్మానం పూర్తి చేశారు. టీటీడీ ఆలయ శిల్పకారుల నైపుణ్యానికి శ్రీపీఠం గోపుర కళా వైభవం దర్పణం పడుతుంది. రాత్రి వేళలో విద్యుత్ దీపాల కాంతులు, పండు వెన్నెల వెలుగుల్లో ఈ బంగారు కోవెల మెరిసిపోతుంటుంది.

శ్రీపురంలోని మహాలక్ష్మి స్వర్ణదేవాలయం


సర్వం దైవస్వరూపమే...

ముక్కోటి దేవతలున్నారని విశ్వసిస్తారు హిందూ భక్తజనం. శ్రీనారాయణి పీఠం మాత్రం More than one god అనే భావనతో అనంతకోటి దేవతా స్వారూపాలను మనముందు ఆవిష్కరిస్తుంది. గర్భగుడిలో శ్రీమహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు.
సర్వమత సమానత్వం
ఆలయ నిర్మాణం శ్రీచక్రం(నక్షత్రం) ఆకారంలో ఉంటుంది. గర్బగుడి దాకా భక్తులు నడిచి వెళ్లే మార్గంలో వున్న ఆలయ ప్రాకారాలు సర్వ మత భక్తి భావనలను చాటుతాయి. భగవద్గీత శ్లోకాలు, బైబిల్ వాక్యాలు, గురుగ్రంధ్ సాహెబ్ బోధనలు, ఖురాన్  సూక్తులు... ఇలా సర్వమత సమానత్వాన్ని చాటే విశిష్ట ధార్మిక క్షేత్రమిది. ఆలయంలో ప్రత్యేకంగా శక్తిపీఠానికి సంబంధించిన పద్దతిలోనే పూజాదికాలు నిర్వహిస్తారు.

తిరుపతి టూ వెల్లూరు

శ్రీపీఠం చెన్నై-బెంగళూరు హైవే నెంబర్ 46కు దగ్గరలో ఉంటుంది. వెల్లూరు నుంచి శ్రీపీఠానికి ఎనిమిది కిలోమీటర్లు. వెల్లూరుకు చెన్నై నుంచి 150కి.మీ, బెంగళూరు నుంచి 220కి.మీ, తిరుపతి నుంచి 95కి.మీ, హైదరాబాద్ నుంచి 510కి.మీ దూరం ఉంటుంది. తిరుపతి నుంచి వెల్లూరు వైపు కాట్పడి దాకా రైలు సౌకర్యం ఉంది. హైవే మీద ఉన్నందున బస్సు సౌకర్యానికి ఇబ్బందులుండవు. సెలవుల్లో ఆలయ దర్శనం, ప్రకృతి ఆరాధన.. రెండూ ఏకకాలంలో సాధ్యమయ్యే ట్రిప్ ఇదే. ముఖ్యంగా సిరి మహాలచ్చిమి కొలువున్న బంగారు కోవెల కదా...
 

No comments: