బూచాళ్లమ్మా... బూచాళ్లు... చుట్టుపక్కలే ఉన్నారు!
భద్రతలేని భావిభారతం...!.
మెరుపు మెరిస్తే... వాన కురిస్తే... ఆకాశాన హరివిల్లు విరిస్తే అన్నీ తమకే అనుకునే అమాయకులు పిల్లలు. నేటి బాలలే రేపటి పౌరులని గర్వంగా చెప్పుకుంటాం. తల్లిదండ్రులు, పాలకులు, అధికారులు, చివరికి చట్టాలు కూడా బాలల భద్రతకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. దేశంలో ప్రతి గంటకూ ఏడెనిమిది మంది చిన్నారులు అదృశ్యమవుతున్నారుట. తప్పిపోవడం, పారిపోవడం, అపహరించడం... రకరకాలుగా కన్నవారికే దూరమవుతున్న పిల్లలను ఎవరు రక్షిస్తారు?
పొంచివున్న ప్రమాదాలు
- కిడ్నాప్ చేసి మన నుంచే పెద్ద మొత్తంలో డబ్బు గుంజడం
- పిల్లలు లేని వారికి అమ్మేయడం
- బాల కార్మికులుగా మార్చేసి వెట్టి చాకిరీ చేయించడం
- నగరాల్లో బెగ్గింగ్ గ్యాంగులకు విక్రయించడం
- అమ్మాయిలైతే వేశ్యా వాటికల్లో నిర్బంధించడం
- మైనర్లతో పెళ్లికి ఉబలాటపడే షేకులకు విక్రయించడం
- అరబ్ దేశాలకు అక్రమంగా తరలించడం
(ఒంటెల పోటీల్లో పిల్లలను హింసించి వికృతానందం పొందే వారుంటారక్కడ)
కొలిక్కి రాని మిస్సింగ్ కేసులు
కనిపించకుండా పోయిన బిడ్డ ఏనాటికైనా ఇంటికి చేరకపోతాడా అని ఆ తల్లిదండ్రులు ఎన్నేళ్లయినా ఎదురు చేస్తూనే ఉంటారు. కనిపించిన వారినల్లా ఆరా తీస్తారు. వెతికినచోటల్లా కనిపించడం లేదంటూ ఫొటో ఉన్న పోస్టరు అతికిస్తారు. అయితే ఆ గుండెకోతను అర్థం చేసుకునే వారెంతమంది?! ఆ కన్నీళ్లను తుడిచే ఆపద్భాందవులెవరు?!.
- మూడేళ్లలో రెండున్నరల లక్షల మంది అదృశ్యం
- ఎలాగోలా ఆచూకీ దొరికిన వారు లక్షా ఇరవై వేలు
- జాడేలేకుండా పోయిన చిన్నారులు లక్షకు పైనే
- హైదరాబాద్ సహా ఐదు మెట్రోల్లో పాతిక వేల మంది లాపత్తా
- బాధితులవుతున్నది అత్యధికంగా బాలికలే
- వ్యభిచార ముఠాలకు తరలించే గ్యాంగులెక్కువ
అడుగడుగునా అభద్రతే...
ప్రపంచంలో పధ్నాలుగేళ్లలోపు బాలకార్మికులు ఎక్కువగా ఉన్న దేశం మనదే. ఒకచోట కిడ్నాప్ చేసిన పిల్లలను మరోచోటికి తరలించే బాల కార్మికులుగా మార్చేస్తారు. ఆ పసి చేతుల చేత నిర్బంధంగా వెట్టి చాకిరీ చేయిస్తారు. నగరాల్లో బెగ్గింగ్ అనేది కోట్ల రూపాయల వ్యాపారం. పిల్లలను బలవంతంగా అవిటి వారిగా మార్చేసి ఆ సెంటిమెంటుతో నాలుగు రాళ్లెక్కువ కూడబెట్టుకుంటున్నారు. హైదరాబాద్ లాంటి చోట్ల ఇలా అడుక్కునే వారి సంఖ్య పెరిగిపోతోంది. పిల్లలు నిజంగా వాళ్ల వారేనా, కాదా అనేది నిర్ధారించడానికి డీఎన్ఏ టెస్టులు చేయాలని నిర్ణయించారు. రేపటి పౌరులిలా అనాధలు కావడానికి తల్లిదండ్రులు, సమాజం బాధ్యత వహించాల్సిందే.బాలల సంక్షేమం పేరుతో కోట్ల రూపాయల నిధులు దిగమింగుతున్న స్వచ్ఛంద సంస్థలు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
కనురెప్పే కంటికి భారమా...
- పేదరికం వల్ల పేరెంట్సే డబ్బున్న వారికి విక్రయించడం
- పెళ్లవకుండా పుట్టిన బిడ్డను వదిలించుకోవడం
- ఆడపిల్ల అన్న వివక్ష కారణంగా చెత్త కుప్పల పాల్జేయడం
- ఇళ్లు, స్కూళ్లలో వేధింపులతో పిల్లలే పారిపోవడం
పిల్లల మీదే నరహంతక పంజా
- పశ్చిమ బెంగాల్ లో ఏటా పన్నెండు వేల మంది మిస్సింగ్
- మధ్యప్రదేశ్లో ఎనిమిది వేలు, ఢిల్లీలో ఐదున్నర వేలు
- దేశంలో మొత్తం నేరాల్లో 45 శాతం పిల్లలపై జరుగుతున్నవే...
- మిస్సింగులు, కిడ్నాపులు, హత్యలు, అత్యాచారాలు
అపసవ్యంగా నడిచే వ్యవస్థ
పోలీసు స్టేషన్ దాకా వెళ్లిన కేసులే ఇన్ని ఉంటే ఇక వెలుగు చూడనివి ఎన్నో. పోలీసు స్టేషన్ గడపతొక్కినా సహాయం లబిస్తుందన్న భరోసా లేదు. వారికి సిబ్బంది కొరత. కిడ్నాప్ జరిగిందన్నా మిస్సింగ్ కింద రాసుకునే వ్యవహారం. అందుకే ఇలాంటి కేసుల్లో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జనవరిలో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. పోలీసు వ్వవస్థలో బాధ్యతను, జవాబుదారీ తనాన్ని పెంచడానికి న్యాయస్థానం ప్రయత్నించింది. కేంద్ర సర్కారు కూడా అన్ని స్టేషన్లలోనూ పిల్లలకు సంబంధించిన కేసులు డీల్ చేయడానికి ప్రత్యేకంగా జువెనైల్ ఆఫీసర్లను పెట్టాలని ఆదేశించంది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన జస్టిస్ జే ఎస్ వర్మ కమిటీ కూడా పిల్లల రక్షణకు అనేక సిఫారసులు చేసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో తప్పనిసరిగా చిన్నారుల మిస్సింగ్ రికార్డులు నమోదు చేయాలని సూచించింది. అనాధలైన చిన్నారుల ఆలనా పాలనా చూసేందుకు చిల్డ్రన్ హోమ్స్ పెట్టాలని సలహా ఇచ్చింది. ఇవన్నీ ఆచరణలో కనిపించాలంటే చాలా రోజులు పట్టవచ్చు.
పిల్లలూ మీకు మీరే రక్ష
ఎక్కడికీ ఒంటరిగా వెళ్లకండి
ఆటపాటలప్పుడు అపరిచితుల మీద కన్నేసి ఉంచండి
ఎవరైనా చాక్లెట్, బిస్కెట్ ఇవ్వజూపితే మర్యాదగా తిరస్కరించండి
స్కూలు నుంచి తీసుకొచ్చే ఆటో డ్రైవరునైనా నమ్మకండి
మన ఇంట్లో షెల్టర్ తీసుకుంటున్న చుట్టాలబ్బాయిలతో జాగ్రత్త
పుస్తకాల బ్యాగులో అమ్మానాన్న ఫోన్ నంబర్లు రాసుంచుకోండి
ఎమర్జెన్సీలో మాట్లాడేందుకు సెల్ ఫోన్ దగ్గరుంచుకున్నా పర్వాలేదు
అపరిచితులు ఎక్కడికైనా రమ్మంటే నో చెప్పేయండి
అమ్మాయిలైతే మరింత అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం
ఎవరైనా అసభ్యంగా తాకినా, మాట్లాడినా అలర్ట్ అవండి
వెంటనే టీచర్స్ లేదా పేరెంట్స్ ను అలర్ట్ చేయండి
మరి రేపటి తరానికి ఎవరు భద్రత కల్పిస్తారు...? భావి భారతానికి బంగారు భవిష్యత్తుందని ఎవరు భరోసా ఇస్తారు?!
No comments:
Post a Comment