Monday, 18 March 2013

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా?!

పిట్టగోడు వినాల్సింది మనమే!

చీమా చీమా ఎందుకు కుట్టావంటే ఏదో కథ చెప్తుంది. అలాగే మనిషిని ఏదడిగినా ఏదో ఓ సాకు చెప్తాడు. మనకు నేస్తమైన ఊర పిచ్చుక  అంతరించిపోతోంది కదా కారణమేంటని అడిగినా అంతే!  ఏ స్పీల్ బర్గో దయతలచి 'ది నెస్ట్ ఆఫ్ హౌస్ స్పారో' అనే టైటిల్తో సినిమా తీస్తే గానీ ఈ తరానికి ఊర పిచ్చుక గురించి తెలిసే పరిస్థితి లేదు. మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను, జీవజాలాన్ని విస్మరిస్తున్నాడు. పిచ్చుక మీద మనం ప్రయోగించిన బ్రహ్మాస్త్రాలేమిటో ఓ సారి పరిశీలిద్దాం...

చిట్టి పొట్టకు ఎవరు రక్ష?

సూపర్ మార్కెట్లు పిట్ట కడుపుకొట్టాయి!

మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది వడ్లగింజలో బియ్యం గింజ ఉంటుందన్నంత నిజం. ఇది వరకు కిరాణా షాపు నుంచి తెచ్చుకున్న బియ్యం, పప్పుల్ని వసరాలో కూర్చున్నఅమ్మలు అక్కలు చేటతో చెరిగి శుభ్రం చేసేవారు. ఇప్పుడు సూపర్ మార్కెట్లు వచ్చేశాయిగా. అలాంటి పనులేవీ లేనప్పుడు ఇక పిచ్చుకలకు నాలుగు గింజలెలా దొరుకుతాయి? దీన్ని అంగీకరించే వారు రోజూ గుప్పెడు గింజలను ఇంటి వాకిట్లో, బాల్కనీలో లేదంటే డాబా మీదో పిచ్చుకల కోసం వేస్తే ఆ మూగ జీవాలు మీ పేరు చెప్పుకుంటాయి.

సెల్ టవర్లే ఉరితాళ్లు బిగుస్తున్నాయి

సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ పక్క్షుల మనుగడకు ముప్పులా పరిణమిస్తోంది. ఎక్కువగా బలవుతున్నవి కాకులు, గబ్బిలాలు, పిచ్చుకలే. అయితే ఇందులో నిజం లేదని ఆమధ్య కొన్ని టెలీఫోన్ కంపెనీలు వాదించినట్లు గుర్తు!. అయితే నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్నందున పక్షులకు గూళ్లు పెట్టుకునేందుకు జానెడు జాగా కూడా కరువైపోతోంది.

పెంకుటిళ్లతో పాటు పక్షి గూళ్లూ మాయం

పక్షులకు ఆవాసాల కొరతొచ్చి పడింది. నగరాలు, పట్టణాల్లో అపార్ట్ మెంట్ల కారణంగా పెంకుటిళ్లు, సాంప్రదాయ గృహాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేందుకు చోటే దొరకడం లేదు. ఇంతేకాదు చెట్లు కూడా అంతరించిపోతున్నాయి. రణగొణధ్వనులు, ఉరుకులు పరుగుల జీవితాల మధ్య ఇక పిట్ట గోడు ఎవరు పట్టించుకుంటారు?! ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు పీకేసి అంతస్థులకంతస్థులు లేపేస్తున్నాం. ఇలా కిచెన్ గార్డెన్లు కూడా మాయమవుతున్నాయి. అందుకే ఏ మాత్రం స్థలమున్నా పక్షికి ఇంత చోటిచ్చేలా మొక్కలు పెంచండి. ఆ పక్షుల గుండెల్లో చోటు దక్కించుకోండి.

కృత్రిమంగా అమర్చిన గూడు

 పొలాల్లో పురుగుమందులతో ముప్పు

పల్లె పట్టున ఉందామనుకున్నా గుప్పెడంత పిట్టను ఎవరూ బతకనిచ్చేట్లు లేరు. పొలాల్లో పురుగు మందులు, క్రిమి సంహారకాలు జల్లేస్తున్నారు. ఇక ఆ కళ్లాల్లో స్వచ్చమైన గింజలెలా దొరుకుతాయి?. ఆ జొన్న కంకుల మీద వాలినా క్రిమికీటకాలెలా దక్కుతాయి? రియల్ ఎస్టేట్ విస్తరణ కారణంగా ఊర్లలోనూ ఖాళీ స్థలాలే లేకుండా పోతున్నాయి. పచ్చిక మైదానాలుంటే అందులో పురుగుపుట్రా వెతుక్కుంటూ కాలం గడిపేసేవి పిట్టలు.

విషం చిమ్ముతున్న వాహన కాలుష్యం

వాహన కాలుష్యం, దుమ్మూధూళితో జీవజాలమంతా అంతరించిపోయే ప్రమాదంలో పడింది. ముఖ్యంగా పెట్రోలు మండడం వల్ల ఉత్పన్నమయ్యే కార్బన్ డై ఆక్సైడ్, మిథైల్ నైట్రేట్ లాంటి రసాయనాలు మూగ జీవాలపై విషం చిమ్ముతున్నాయి. ఈ విషయంలో మనం ఉన్నట్లుండి ఏమీ చేయలేం. అయితే ఈ మూగజీవిని దేవుడు కాదు, మనిషే కాపాడాలి!

మనం చేయాల్సిందల్లా...

  • మన నివాసం చుట్టూ ఎక్కడ ప్లేసున్నా చెట్లు పెంచడం

  • చెట్లుంటే పక్షుల కోసం గూళ్లు ఏర్పాటు చేయడం

  • మూగజీవాల కోసం గుప్పెడు గింజలు జల్లడం

  • ముఖ్యంగా వేసవిలో పక్షులు తాగేందుకు మట్టికుండీల్లో కాసిని నీళ్లు పోయడం

ఇందులో ఏ ఒక్కటి చేసినా ఆ మరుసటి రోజు తెల్లవారుజామున మీరు వాకిటి తలుపు తెరువగానే కిలకిలారావాలు వినిపిస్తాయి. అంటే ఆ పక్షులు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లే...!  

(ఫిబ్రవరి3న ఈ బ్లాగులో రాసిన పోస్టును మరో సారి ఇక్కడ అందిస్తున్నాం...)

 KIDS AWARENESS: SAVE HOUSE SPARROW

ఊర పిచ్చుకను కాపాడుకుందాం...

మన చుట్టూ ఉండాల్సిన ఎన్నో జీవాలు క్రమేణా అంతరించిపోతున్నాయి. పంటలపై జల్లుతున్న రసాయనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు పిచుకలకు మరణశాసనం లిఖిస్తున్నాయి. చిన్నాచితకా గ్రామాల్లో కూడా సెల్ ఫోన్ టవర్స్ వెలుస్తున్నాయి. వీటి నుంచి వెలువడే రేడియేషన్ పిచుకల ఊపిరి తీస్తోంది. వచ్చే తరం పిచుక అంటే ఏమిటో తెలియదనే పరిస్థితి... మన చుట్టూ ఉండే జీవాలను మనమే కాపాడుకోవాలి. లేదంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నట్లే...

ఓ పిచుకమ్మా... ఎటుపోతావమ్మా...!

నీ గూడు చెదిరింది... నీరూటు మారింది...



ఓ చిట్టి పిట్టా... నువ్వు ఎక్కడికెళ్లావు...

4 comments:

జలతారు వెన్నెల said...

ను మరచిపోయి కొన్ని యుగాలయ్యింది.

పిచ్చుకను గుర్తుకు తెచిన మీకు థాంక్ యు. పిచ్చుకలు కూడా ఎన్ని ఇక్కట్లో! బాగుంది పోస్ట్.

Sudha Rani Pantula said...

నాకెంతో ఇష్టమయిన నా నేస్తం గురించి ఎంతో చక్కగా రాసారు. ఈ విషయాలనే నేనూ ఇక్కడ రాసుకున్నాను. http://illalimuchatlu.blogspot.in/2011/03/blog-post_20.html

♛ ప్రిన్స్ ♛ said...

మంచి పోస్ట్ అండి వాటిని చూసి చాలారోజులు అయింది... మీ పోటో చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు ధన్యవాదములు...ఉహ తెలిసినప్పటి నుంచి నాతోనే ఉన్న నేస్తం.. అద్దం కనిపిస్తే కోతికి పోటి పడేవి.. చిన్నప్పుడు వాటిని పట్టుకోవటానికి చాలా కష్టాలు పడేవాడిని ఇప్పుడు చూద్దాం అన్నా ఎక్కడ కనిపించటం లేదు.. భూమి మీద ఉన్న జీవాలు కనుమరుగు కావటానికికారణం ఒక్కటే మృగం... అది మానవుడే...

nihar said...

స్పందించిన పక్షి ప్రేమికులందరికీ కృతజ్ఞతలు. ఈ ఉదయాన్నే ఇల్లాలి ముచ్చట్లు బ్లాగులోనూ చదివాను. బాగుంది.... నిహార్