అక్కడ జంబలకిడిపంబ!
ఆడ కాదు మగే!
జంబలకిడి పంబ సినిమాలో లాగా అక్కడ మగవారంతా ఆడవారైపోతారు. ఆ దేవతను ఆలా పూజిస్తేనే కరుణిస్తుందని నమ్మకం. ఆ అరుదైన దేవత గురించి తెలుసుకొవాలంటే మనం కేరళ వెళ్లాల్సిందే. కొల్లం సమీపంలోని చవర గ్రామంలో కొట్టన్ కులంగార ఆలయంలో కొలువైన భగవతీ దేవి అమ్మవారి విశిష్టత ఇది.
చామయవిలక్కులో అందాలు వెలుగులు
మగవారు ఆడరూపంలోకి మారిపోతేనే ఇక్కడ పూజలు చేయనిస్తారు. ఏటా 19 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. చివరి రెండు రోజులూ మగ భక్తులు... అంటే ఆడ వేషంలోకి మారిపోయిన వారి సందడి ఎక్కువ. ఎంతో సాంప్రదాయసిద్ధంగా జరిగే ఈ వార్షిక బ్రహ్మోతవ్సవాలు ఒకెత్తయితే... చివరి రెండు రోజుల 'చామయవిలక్కు' సంబరాలు మరో ఎత్తు. వాలు జడల సోయగాలు, పట్టుచీరల సింగారాలు... మనకు వింతగా, విచిత్రంగా అనిపించినా ఆ భక్తిభావనలో మైమరచిపోయే వారు వేలవేలు.
ఆడదనం ఉట్టిపడే ముస్తాబు
చామయవిలక్కు అంటే అలంకరించిన దీపం అని. అందుకే స్త్రీ అవతారంలోకి మారిపోయిన పురుష భక్తులు అందమైన దీపాలు చేతబట్టుకుని తెల్లవారుజామున రెండు గంటల నుంచే దైవారాధనకు బయలుదేరుతారు. మహిళల్లా చీరకట్టి, సింగారించుకుని ఆ దేవత ముందు నిలబడితే చాలు... మనసులో అనుకున్నవన్నీ ఇట్టే నెరవేరిపోతాయని నమ్మకం. అందుకే ఏటా వేల మంది మగవారు వస్తుంటారు. దేశవిదేశాల్లో స్థిరపడిన మలయాళీలే కాదు, ఈమధ్య కాలంలో విదేశీయులు కూడా ఈ సంబరాలు చూసేందుకు తరలివస్తున్నారు.
భగవతీదేవి మహిమలెన్నో!
మహిమలెన్నో కలిగిన తల్లిగా భక్తుల పూజలందుకుంటున్న భగవతీదేవి స్వయంభువుగా వెలిసిన దేవత. ఈ ఆలయానికి గోపురం ఉండదు. ఇదో విశిష్టత. దేవత స్వయంభుగా వెలిసిందనడానికి ఓ కథ ఉంది. పూర్వం గోవులు కాసే కొంత మంది పిల్లలు కొండకోనల్లో ఓ రాయికి ప్రతినిత్యం పూజలు చేసేవారు. భుజం మీదున్న తుండుగుడ్డనే చీరకొంగుగా కప్పుకుని అమ్మాయిల మాదిరిగా కొలిచేవారు. అక్కడే దొరికిన నాలుగు రకాల పువ్వులు అర్పించడం... కేరళలో ఎక్కువగా లభించే కొబ్బరికాయలు నైవేద్యంగా పెట్టడం...వారికిదో ఆట! ఓ రోజున ఆ రాయే దేవత రూపంలో ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమందిట. ఆ తర్వాత అక్కడే గుడి వెలిసింది. ఆ గ్రామ దేవతే ఇప్పుడు భగవతీ దేవిగా భక్తకోటికి అభయాలిస్తోంది. మహా పుణ్యక్షేత్రంగా మారినా ఆనాటి సంప్రదాయమే కొనసాగుతోంది. చామయవిలక్కు కోసం వచ్చే పురుష భక్తుల కోసం ఆలయం సమీపంలోనే సమస్త అలంకార సామాగ్రి దొరుకుతుంది. రకరకాల చీరలు, సాంప్రదాయ వస్త్రాలు, గాజులు, గొలుసులు, విగ్గులు, పూలజడలు... ఒకటేమిటి ఆ ముస్తాబు పూర్తయ్యాక ఒకటే భక్తిపరవశం!
No comments:
Post a Comment