Friday 22 March 2013

ఎర్త్ అవర్... అవర్ హెల్త్!

భూగోళాన్ని కాపాడుకుందాం..!

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ దినోత్సవం(మార్చి23) సందర్భంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. వాతావరణాన్ని పరిరక్షించకపోతే ఎదురయ్యే ముప్పు ఏమిటో అవగతం కావడంతో ఏడు వేల నగరాల్లో ప్రజలంతా ఈసారి ఎర్త్ అవర్లో పాల్గొంటున్నారు. ఈ ఉద్యమంతో 150 దేశాలు చేతులు కలిపాయి. 

పాలస్థీనా, టునీషియా, గాలాపొగాస్, సురీనామ్, ఫ్రెంచ్ గుయానా, సెయింట్ హెలెన్, రువాండా లాంటి చిన్న దేశాలు కూడా ఎంతో చైతన్యంతో మొదటిసారి ఈ గ్లోబల్ ఈవెంటులో పాల్గొంటున్నాయి. మనదేశంలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా 150 నగరాలు, పట్టణాలు ఎర్త్ అవర్ పాటించబోతున్నాయి.
మార్చి 23న ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్
రాత్రి 8.30 నుంచి 9.30 దాకా విద్యుత్ బంద్

ముఖ్యమైన ప్రాంతాలు...

  • ఢిల్లీలో గేట్ వే ఆఫ్ ఇండియా
  • సిడ్నీలో ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్
  • కౌలాలంపూర్లో పెట్రోనాస్ టవర్
  • సింగపూర్లో మెరినా బే సాండ్స్
  • టో్క్యోలో సిటీ టవర్స్, తైపీ 101
  • బీజింగ్లో బర్డ్స్ నెస్ట్
  • దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా
  • ప్యారిస్ ఈఫిల్ టవర్
  • యూకేలో పార్లమెంటు భవనం, బకింగ్హమ్ ప్యాలేస్
  • ఎంపైర్ స్టేట్ బిల్డింగ్
  • నయాగరా జలపాతం

స్విచ్ ఆఫ్ చేయడమే మన బాధ్యత

ది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యుడబ్ల్యుఎఫ్) ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తోంది. ఈసారి భారత్ లాంటి దేశాల నుంచి భాగస్వామ్యం ఆశాజనకంగా పెరుగుతుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆండీ రిడ్లే అంచనా. ఈసారి సుమారు రెండు వందల కోట్ల మందిని ఇందులో భాగస్వాముల్ని చేయాలనేది లక్ష్యం. నిరుడు కూడా దాదాపు ఇంతేమంది ఎర్త్ అవర్ పాటించారు. నిరుడు ఎర్త్ అవర్ పాటిస్తున్న వేళ నాసా తీసిన భూగోళ చిత్రపటాలు చూస్తే దీని ఎఫెక్ట్ ఎంత వుందో తెలుస్తుంది(ఫొటో గమనించండి).

చైతన్యం తెస్తున్న ఎర్త్ అవర్ 

ఎర్త్ అవర్ అంటే ఓ గంట పాటు విద్యుత్ వినియోగాన్ని ఆపేయడమే. కరెంట్ బల్బులు, టీవీలు, ఫ్రిజ్లు, కంప్యూటర్లు... కరెంటుతో నడిచే ఉపకరణాలన్నీకాసేపు స్విచ్ ఆఫ్ చేయాల్సిందే.  ఇలా విద్యుత్ ఆదా చేస్తే ఆ మేరకు భూ వాతావరణాన్ని పరిరక్షించినట్లే. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దీన్ని మొదలెట్టారు. ఆరేళ్లలో ప్రజలు కూడా స్వచ్చందంగా ఎర్త్ అవర్ పాటించే విధంగా చైతన్యం తీసుకురాగలిగారు. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కరెంట్ కట్ చేస్తే బోలెడు ఆదా అవుతుంది. మోబైల్ ఫోన్ల ద్వారా విస్త్రుత పరచారం చేస్తున్నారు. స్వచ్చంద సంస్థలు బాధ్యతగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసే యువతరం దీన్ని భుజానికెత్తుకుంటున్నారు. రేపటి భారతం అంధకారం అవకుండా ఉండాలంటే ఈరోజు కాసేపైనా చీకటి అనుభవించక తప్పదు. నిరుడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్ కత్తా లాంటి మహానగరాలతో పాటు గుణ, ఇటావా లాంటి చిన్నచిన్నపట్టణాల్లోనూ గంట పాటు విద్యుత్ వినియోగం నిలిపివేశారు.




క్లైమేట్ ఛేంజ్ తో ముప్పు

  • కోల్ కత్తా, ముంబై, ఢిల్లీలకు క్లైమేట్ ఛేంజ్ రిస్క్
  • డేంజర్ జోన్లో ఢాకా, మనీలా, బ్యాంగాక్, యాంగోన్, జకార్తా
  • చికాగో, లండన్, పారిస్ నగరాలకు రిస్క్ స్వల్పం
  • ఈ శతాబ్దాంతానికి అమెరికా టెంపరేచర్లో10 డిగ్రీల పెరుగుదల 

మన చేతుల్లోనే మన భూగోళం... ఎర్త్ అవర్ కోసం ఓ గంట పాటు విద్యుత్ పరికరాలన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ పోస్టును షేర్ చేయండి. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఎర్త్ అవర్ లో భాగస్వాముల్ని చేయండి. ఎర్త్ అవర్... అవర్ హెల్త్!

No comments: