గనగాపుర శ్రీదత్త క్షేత్రం!
షిర్డీ సాయిబాబాను దర్శించుకోవడానికి భక్తులు మన రాష్ట్రం నుంచి ఎలా వెళ్తున్నారో హైదరాబాద్ సమీపంలో కర్నాటకలో ఉన్న గనగాపుర శ్రీదత్త క్షేత్రం సందర్శనకు కూడా అలాగే వెళ్తున్నారు. గుల్బర్గా జిల్లా అఫ్జల్ పురా సమీపంలో ఉంది గనగాపుర. పవిత్రమైన బీమా, అమర్జ నదుల సంగమంలో వెలిసిన దివ్య క్షేత్రం. ఆదిగురువైన శ్రీ దత్తాత్రేయుని మహిమాన్విత ఆలయం.
శ్రీ దత్తుని దివ్యమంగళరూపం
గురుచరిత్ర ప్రకారం దత్తాత్రేయుడు పంచావతారాల్లో దర్శనమిస్తూ భక్తులకు కొంగుబంగారంగా పూజలందుకుంటున్నాడు. ఆదిగురువు ఐదు అవతారాలు... శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నారసింహ సరస్వతి, శ్రీ మాణిక్ ప్రభు, శ్రీ అక్కల్ కోట్ మహారాజ్, శ్రీ షిర్డీ సాయిబాబా. గనగాపుర క్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభుడు అనంతకోటి భక్తుల కోరికలు తీరుస్తుంటాడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోనూ శ్రీపాద శ్రీవల్లభుడి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది.
సందర్శనీయ స్థలాలు
గనగాపురలో నిర్గుణమఠం, బీమా-అమర్జ నదీ సంగమం, కాళేశ్వర ఆలయం, అదుంబర వృక్షం చూడాల్సిన ప్రదేశాలు. నదీ సంగమంలో స్నానమాచరిస్తే సమస్త పాపాలు తుడిచిపెట్టుకుపోతాయనేది భక్తుల విశ్వాసం. కాళేశ్వరాలయంలో కొలువైన ముక్కంటి మొక్కుంటే కోటి కోర్కెలనైనా తీరుస్తాడని ప్రతీతి. ఇక అదుంబర వృక్షం ఎంతో విశిష్టమైనది. త్రిమూర్తులు కొలువై ఉండే అదుంబర నీడలో గురు చరిత్ర పారాయణం చేస్తే వేయి జన్మల పుణ్యఫలం మనకందుతుందని నమ్మకం.
ఎలా వెళ్లాలి...
గుల్బర్గా నుంచి ముంబై వెళ్లే రైల్వే మార్గంలో ఉంది గనగాపుర రోడ్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి దత్త క్షేత్రం సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి బస్సు, రైలు మార్గంలో గనగాపుర రోడ్ చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు లేదా ఆటో ద్వారా దత్త క్షేత్రానికి వెళ్లవచ్చు.
దత్త క్షేత్రం టెలిఫోన్ నెంబర్
08470 - 274768, 08470 - 274335
హైదరాబాద్లో
దత్తాత్రేయుని ఆలయాలు
- కింగ్ కోఠి- ప్రగతి కాలేజీ సమీపంలోని సాయిబాబా మందిర్లో అంతరాలయం
- మెహదీపట్నం దగ్గరున్న కొండ మీద దత్తక్షేత్రం
- సరూర్ నగర్ నుంచి కర్మాన్ ఘాట్ వెళ్లే మార్గంలో దత్తాత్రేయ మందిరం
- ఎల్బీనగర్ నుంచి బీఎన్ రెడ్డి నగర్ వెళ్లే మార్గంలో దత్తాత్రేయ టెంపుల్
No comments:
Post a Comment