Wednesday 27 March 2013

'రంగు'..'భంగు' లేనిదే పండగా?

ఆరోగ్య'భంగ్'మా...?

హోలీ పండుగతో ముడిపడిన ప్రధాన అంశాలు ఒకటి 'రంగు', రెండోది 'భంగు'! ఉత్తరాది నుంచి మనకింకా పూర్తి స్థాయిలో పరిచయం కాని 'భంగ్' గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఈ భంగుకి రంగుల పండుగతో ఎలా ముడిపడిందో తెలియదుకానీ ఆ మత్తుల గమ్మత్తులు లేకుండా హోలీ సంపూర్ణం కాదుట. 'భంగ్' ఫుల్లుగా పట్టించే సంప్రదాయం ఉత్తరాదినే ఎక్కువ.

మత్తెక్కించేది గంజాయి ఆకే!

భంగ్ అంటే గంజాయి ఆకే. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ గంజాయి వినియోగాన్ని, సాగునూ పూర్తిగా నిషేధించారు. దాదాపు అన్ని దేశాల్లోనూ ఐదు నుంచి పధ్నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేలా చట్టాలు అమల్లో ఉన్నాయి. అయితే అనేక రకాల ఆయుర్వేద మందుల తయారీలో దీన్ని వాడుతుంటారు. ప్రత్యేక సందర్భాల్లో ఔషధరూపంలో వినియోగించడానికి అమ్ముతారు. బ్రిటీష్ కాలంలో దీన్ని అనేక రుగ్మతల నివారణకు వినియోగించేవారు. ఇండియాలో అత్యధికంగా కాన్నబీస్ ఇండికా జాతి గంజాయి మొక్కలు పెరుగుతాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ మొక్కలు పెరుగుతుంటాయి. వినియోగం కూడా చాలా ఎక్కువ. మనదేశంలో అక్రమంగా వేల ఎకరాల్లో సాగుచేస్తుంటారు. అలాగే విక్రయాలు, వినియోగం సాగుతుంటాయి. హోలీ రోజున భంగ్ తయారీ కోసం మాత్రల రూపంలో విక్రయిస్తారుట.

శివుడికెందుకో ప్రీతి?

గంజాయి గురించి వేదాల్లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మత్తు బాగా తెలిసినవారెవరంటే శివుడి పేరే ముందుంటుంది. ఆ ఆదిబిక్షువును సంప్రీతి చేసుకునేందుకు ఇప్పటికీ కొన్నిచోట్ల శివరాత్రి రోజున ఈ ఆకులను సమర్పిస్తారుట. శివనామస్మరణలో మునిగితేలే సాధువులు, సన్యాసులు అదేపనిగా గంజాయిని సేవిస్తుంటారు. ధ్యానముద్రలో లీనమవడానికేనని చెప్తారు. మొత్తానికి హోలీ రోజున రంగుకెంత ప్రాధాన్యం ఉందో కొన్ని ప్రాంతాల్లో భంగుకీ అంతే ప్రాధాన్యం ఉంది.

గంజాయిలో ఉన్న మత్తేమిటి?

గంజాయి మత్తుకు అలవాటు పడితే చాలా ప్రమాదం. అందులోంచి బటయపడలేనంతగా బానిసలైపోయే ప్రమాదం ఉంది. హోలీ రోజున భంగ్ పేరుతో అతి స్వల్ప మోతాదులో మాత్రమే స్వీకరిస్తారు. దీనికి జతగా స్వీట్లు ఎక్కువగా తింటారు. గంజాయి ఎంత చెడు చేస్తుందో అంత మంచీ చేస్తుంది.

గంజాయి...మంచీ చెడూ

  • ఇండియాలో కాన్నబీస్ ఇండికా రకం మొక్కలు
  • గంజాయిలో 400 రకాల రసాయనాలుంటాయి
  • కాన్నబిడియోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది
  • యాంటీ బయటిక్ ఔషధంగా పనిచేస్తుంది
  • పెన్సిలిన్తో సమానమంటారు వైద్య నిపుణులు
  • యాంటీ బయటిక్ గా, పెయిన్ కిల్లర్ గా పనికొస్తుంది
  • యాంగ్జిటీని బాగా కంట్రోల్ చేస్తుంది
  • మైగ్రేయిన్, హెడేక్ ట్రీట్ మెంట్కు పనికొస్తుంది
  • ఆస్తమా, పక్షవాతం లాంటి రుగ్మతల నివారిణి
  • కేంద్ర నాడీమండల వ్యవస్థను ఉత్తేజరుస్తుంది
  • రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
  • క్యాన్సర్ లక్షణాలను అదుపు చేస్తుంది
  • కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తుంది
  • కండరాలు బిగుసుకుపోయే గుణాన్ని నిరోధిస్తుంది
  • ఆల్కాహాల్ అలవాటును మాన్పించే ఔషధంగా వాడొచ్చు
  • అతినిద్ర వ్యాధిని అరికడుతుంది

చేటు చేస్తే చిట్కాలు!

సాధారణంగా దీన్ని అక్రమంగా వినియోగించే వారు సిగరెట్ లేదా పైప్ ద్వారా పొడి రూపంలో పీలుస్తారు. హోలీ రోజున దీంతో 'భంగ్ తండాయ్' అనే స్వీటు తయారు చేస్తారు. ఇంకా రకరకాలుగానూ స్వీకరిస్తారు. అయితే స్వీటు అనేది ప్రధానం. భంగ్ జోలికెళ్లే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం...

  • ఖాలీ కడుపుతో భంగ్ తీసుకోవద్దు
  • ఫుల్ గా ఆహారం తిన్నాకే ద్రవరూపంలో స్వీటుతో కలిపి తాగాలి
  • గుండె జబ్బులు, నరాల వ్యాధులు, హైబీపీ ఉన్నవాళ్లు ముట్టుకోవద్దు
  • అందుబాటులో ఉందికదాని ఏ మాత్రం అతిగా తీసుకోవద్దు
  • ఎట్టిపరిస్థితుల్లోనూ ఆల్కాహాలుతో భంగ్ మిక్స్ చేయవద్దు
  • చిన్న పిల్లలు దాని జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి

 డోసుమించితే ఏం చేయాలి?

  • భంగ్ మత్తు అనేక గంటలపాటు ఉంటుంది
  • ఆల్కాహాలు మాదిరిగా అంతతొందరగా దిగిపోదు
  • భంగ్ కిక్కులో నాన్ స్టాపుగా మాట్లాడుతుంటారు
  • ఉలుకూపలుకూ లేకుండా పడిపోనూ వచ్చు
  • మత్తును తగ్గించాలంటే నిమ్మ లేదా బత్తాయి రసం పనికొస్తుంది
  • అరటి పళ్లు. స్ట్రాబెర్రీ, ఆపిల్ తింటే ఫలితం ఉంటుంది
  • ఫ్రూట్ జ్యూసులు, ఫ్రూట్ షేకులతో మత్తు తగ్గుతుంది
  • నీళ్లు బాగా తాగితే తొందరగా ఈ లోకంలోకి వస్తారు
  • చన్నీటి స్నానంతో మత్తు ఇట్టే దిగుతుంది
  • స్వచ్ఛమైన నెయ్యి కాస్త తిన్నా మత్తు తగ్గుతుంది

(గమనిక: ఈ ఆర్టికల్ కేవలం భంగ్ గురించి సమాచారం కోసమే. వైద్య పరమైన వివరాలను సాధికారకమైనవిగా భావించానికి లేదు. అందు వల్ల వైద్య నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఈ ఆర్టికల్లోని అంశాలతో తలెత్తే వైద్య, న్యాయపరమైన వివాదాలకు బ్లాగర్ బాధ్యత వహించడం కుదరదు)

  

No comments: