Monday, 25 March 2013

అప్పొకరికి...ముప్పొకరిది!

చిన్నదేశం పెద్ద కష్టం!
పక్క వాడు కష్టాల్లో ఉన్నాడుకదాని అప్పిచ్చి నెలాఖరున మన బడ్జెట్ అడ్జస్టవక తెగ ఇబ్బంది పడడం సామాన్యుడికి స్వీయానుభవమే. ఇలాగే సైప్రస్ అనే ఓ చిన్న దేశం కూడా పొరుగునున్న గ్రీసుకు అప్పులిచ్చింది. పీకల్లోతు చిక్కుల్లో పడింది. నిరుడు గ్రీసు ఆర్ధిక సంక్షోభం ప్రపంచాన్నే గడగడలాడించింది. చివరి నిమిషంలో యూరో దేశాల కూటమి సాయమందించడంతో అది గట్టెక్కింది. గ్రీసుకు అప్పులిచ్చిన అనేకానేక దేశాల్లాగే సైప్రస్ కూడా నిలువునా నేల కూలింది. సైప్రస్ గొడవ మనకెందుకని మీకనిపించవచ్చు. గ్లోబలైజేషన్ ఎఫెక్ట్. సైప్రస్ దివాళా తీస్తే యూరో బలహీనపడుతుంది. యూరో నీరసపడితే ప్రపంచ స్టాక్ మార్కెట్లు దెబ్బతింటాయి. ఆ ప్రభావం మన షేర్ మార్కెట్ మీదా ఉంటుంది. ఇది జన సామాన్యం మీద బోలెడ్ ఎపెక్ట్ చూపిస్తుంది. కొన్నాళ్లుగా యూరఫ్, ఏషియా మార్కెట్ల మీద సైప్రస్ ఆర్ధిక సంక్క్షోభం ప్రభావం బాగా కనిపిస్తోంది. ముంబై స్టాక్ మార్కెట్ కూడా ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది.  

పాపం... గట్టెక్కిస్తున్నాయి

చివరికి సైప్రస్ దేశానికి అంతర్జాతీయ సంస్థలు బెయిలౌట్ ప్యాకేజ్ ప్రకటించాయనగానే ప్రపంచ మార్కెట్లన్నీ ఊరట చెందాయి. నిలువునా అప్పుల్లో కూరుకుపోయిన గ్రీసును గట్టెక్కించినట్లే సైప్రస్ దేశాన్ని కూడా యూరో కూటమి, యూరో బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాపాడాయి. కష్టాల్లో ఉన్న ఈ చిన్న దేశం రష్యా, జర్మనీలను అడిగినా ఆ దిగ్గజాలు రెండూ చేతులెత్త్తేశాయి. డబ్బు విలువ తెలియకుండా నిర్వహణ వ్యయం పేరుతో దండిగా ఖర్చు పెట్టిన పాలకులదే ఈ సంక్షోభ పాపమంతా. జనం సొమ్ముతో దర్పం వెలగబెట్టిన బ్యాంకులు తీరా కష్టనష్టాలు వచ్చాక వాటిని జనం మీదకే మళ్లించాయి. డబ్బుండీ లేని వారైపోయిన సైప్రస్ వాసుల అనుభవాలు అనేక దేశాలకు ఓ గుణపాఠం చెప్తున్నాయి.

చరిత్రున్న దీవే..

మధ్యదరాసముద్రంలో చిన్న దీవి సైప్రస్. ఇరుగుపొరుగున గ్రీసు,టర్కీ, సిరియా, లెబనాన్, ఇజ్రాయిల్ దేశాలున్నాయి. 1974లో టర్కీ, గ్రీసు వలస వాదుల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఆ తర్వాత టూరిస్ట్ కంట్రీగా బాగా డెవలప్ అయింది. మళ్లీ అంతటి సంక్క్షోభమే ఇప్పుడు తలెత్తింది. గ్రీసు సంక్క్షోభం దాకా సైప్రస్ వాసులకు యూరో అంటే పెద్ద లెక్క లేదు. ఇప్పుడు చేతుల్లో దమ్మడీ లేని దౌర్భాగ్యం. తక్కువ జనాభా ఉన్న సంపన్న దేశమిది. హై ఇనకమ్ ఎకానమీ కిందే లెక్క. మానవాభివృద్ధి సూచీలో సైప్రస్ గణనీయమైన స్థానంలో ఉంటుంది. బీచ్ రిసార్ట్స్లో హాయిగా కొబ్బరి చెట్ల నీడలో సేద తీరుతూ ఉండే అక్కడి జనం ఏనాడూ అనుకుని ఉండరు తమకింత దుస్థితి దాపురిస్తుందని.

అయ్యయ్యో...జేబులు ఖాళీ ఆయెనే...

దర్జాగా బీచ్ ఒడ్డున జల్సా చేసే వీరికి ఎప్పుడో కానీ డబ్బు అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఏ బ్యాంకు ఏటీఎం దగ్గర చూసినా సింగిల్ యూరో కోసం చాంతాడంత క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. గ్రీసుకు అప్పులిచ్చిన బ్యాంకులన్నీ దివాలా తీశాయి. బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారికి ఆ మొత్తం వెనక్కి వచ్చే మార్గం లేకుండా పోయింది. సుమారు రెండేళ్లుగా అక్కడి ఆర్ధిక రంగంలో ఒడిదుడుకులు నడుస్తున్నాయి. బ్యాంకులు దివాలా దిశగా ఉన్నాయని తెలిసిన జనం డిపాజిట్ల కోసం క్యూలు కట్టారు. చివరికి ప్రభుత్వమే చొరవ తీసుకుని బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. ఏటీఎంలన్నీ మూసేయించింది. దీంతో జనం రోజువారీ షాపింగులకు వెళ్తే క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా పని చేయడం ఆగిపోయాయి. పూట గడిచే మార్గం లేక డబ్బున్న వాడి దగ్గర దోపిడీ చేసిన ఉదంతాలు మొదలయ్యాయి. బ్యాంకుల్లో కావాల్సినంత డబ్బుంది. కానీ తినడానికి ఓ పూట తిండి దొరకని దౌర్భాగ్యం. అంతా యూరో మహిమ.

యూరో కూటమే కాపాడింది.

సైప్రస్ను గట్టెక్కించడానికి యూరో కూటమి, యూరో ఫెడరల్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ముందుకొచ్చాయి. అయితే షరతులతోనే అసలు చిక్కు. లక్ష యూరోలకన్నా ఎక్కువ దాచుకున్న వారి నుంచి పన్నులు వసూలు చేయాలని ఈ సంస్థలు ఇంతకుముందే షరతు పెట్టాయి. ఇలాగైతే భారీగా ఆర్ధిక సాయమందించి ఆదుకుంటామని ఆశపెట్టాయి. దీనిపై ప్రజలంతా తిరుగుబాటుకు దిగారు. దీంతో సర్కారు మొదట వెనక్కి తగ్గినా చివరికి గత్యంతరం లేక ఒప్పేసుకుంది. జనం కూడా దేశమే దివాలా తీసేకంటే ఇదే మంచి మార్గం కదా అంటున్నారు. అయితే సంపన్నులు ఇరకాటంలో పడ్డారు. ఇక్కడి బ్యాంకుల్లో రష్యాలాంటి ఇరుగుపొరుగు దేశాల వారు బోలెడు దబ్బు దాచుకున్నారు. ఇప్పుడా డబ్బంతా గోవిందాయే. లక్ష యూరోలకంటే ఎక్కువున్న డిపాజిట్లన్నీ రద్దయినట్లే. అందుకు తక్కువున్న డిపాజిట్లన్నీ బ్యాంక్ ఆఫ్ సైప్రస్(దీన్నక్కడ ఆరోగ్యకరంగా నడుస్తున్న బ్యాంకుగా గుర్తించారు)కు బదిలీ చేస్తారు. 

డబ్బున్నోడికి దెబ్బే...

చిన్న మొత్తాలకు ఎలాంటి ఢోకా ఉండదు. పెద్ద మొత్తంలో దాచుకున్న వారికే ముప్పొచ్చిపడింది. సంపన్నులే కాదు సర్కారు కూడా అంతర్జాతీయ సంస్థల షరతులకు లోబడి ఖర్చులన్నీ తగ్గించుకోవాల్సి వస్తోంది. దివాలా దీసిన బ్యాంకులను మూసేయబోతున్నారు. మెజారిటీ జనం మాత్రం ఎలాగోలా దేశం బతికిబట్టగలిగేందుకు ఈ బెయిలౌట్ ప్యాకేజ్ తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. సైప్రస్ వాసులకే కాదు, ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా యూరో దేశాల వారందరికీ ఊరటనిచ్చే అంశమిది. సైప్రస్ సంక్క్షోభం ఎఫెక్ట్ మన మీదా ఉంటుందని ఈమధ్యే ఆర్ధిక మంత్రి చిదంబరం కూడా హెచ్చరించారు. ఇప్పటికైనా ఆ దేశం కుదుటపడుతున్నందుకు మనం సంతోషించాల్సిందే. దేశమైనా, బ్యాంకైనా, చివరికి ఓ వ్యక్తయినా నిర్వహణలోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్ధుకోబోతే  నిలువునా మునిగే రోజొస్తుందనడానికి సైప్రస్, గ్రీసు దేశాలు సజీవ సాక్ష్యాలు. 


  

No comments: