'రాజభవనం'లో రిమోట్ కంట్రోలు!
వినయం, విధేయత... ఇవే అర్హతా?!
గవర్నర్ అంటే కీలకమైన రాజ్యాంగ పదవి. చిలక్కొయ్యకు తగిలించే తాళం చెవి కాదు. బ్రిటీష్ ఇండియా పాలకులు వారి సౌలభ్యం కోసం పెట్టుకున్న గవర్నర్ల వ్యవస్థ ప్రజాస్వామ్య పాలనలోనూ పెద్దగా మారలేదు. ఈ భర్తీ ప్రక్రియ కేంద్రం కనుసన్నల్లో జరుగుతుంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వారి అనుకూల మనుషులే రాజ్ భవన్ అధిపతులైపోతారు. రాజకీయాల్లోంచి రిటైరై పోయినవారికి కేంద్రం అందించే ఆపన్నహస్తం. బడా నాయకులకు అడ్డుతగిలే అసంతృప్త వాదులను పక్కకు తప్పించే మార్గం. అందుకే ఇది రాజకీయ పునరావాస వ్యవస్థగా మారిపోయింది.
కీలక రాష్ట్రాల్లో మాజీ ఐపీఎస్, ఐఏఎస్లు...
ఆశ్యర్యకరమైన విషయమేమిటంటే- ప్రస్తుతం మన దేశంలోని గవర్నర్లలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ల సంఖ్య పెరిగిపోయింది. దీన్ని శుభపరిణామం కిందే లెక్కించాలా?. ఆయా వ్యక్తుల సమర్ధాసమర్థల మీద ఆధారపడిన విషయమిది. ఆయా రాష్ట్రాల ప్రజాభిప్రాయమే వారి వారి పనితీరుకు కొలమానం. ప్రస్తుతానికి నలుగురు మాజీ సివిల్ సర్వెంట్లుంటే, ఎనిమిది మంది రిటైర్డ్ పోలీసు బాస్లున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారులకూ ఇక్కడ పీట వేస్తున్నారు. సమర్ధులైన మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గవర్నర్ లాంటి రాజ్యాంగ పదవులు చేపట్టి ప్రజా శ్రేయస్సుకు ఆమోద ముద్ర వేస్తే అభిలషణీయమే. కానీ ఈ పోస్టు నిమిత్తమాత్రమేనన్న అపప్రద మూటగట్టుకుంటున్నారు కొంత మంది.
ఏ పనితీరుకు మెచ్చుతునకో...!
ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ లాంటి కీలక బాధ్యతలు నిర్వర్తించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం.కె. నారాయణన్, ఏపీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ లాంటి కొందరి పనితీరు వేలెత్తి చూపించేలా ఉండడం లేదు. ఈమధ్యే సీబీఐ మాజీ చీఫ్ అశ్వని కుమార్(నాగాలాండ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మాజీ అధిపతి నిఖిల్ కుమార్(కేరళ) రాజ్ భవన్లలో అడుగుపెట్టారు.ఎన్ఎస్జీ మాజీ చీఫ్ రంజిత్ శేఖర్ ఇప్పటికే మేఘాలయలో పనిచేస్తున్నారు. యూపీలో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ బీ.ఎల్. జోషి, గోవాలో స్పెషల్ ప్రొటెక్సన్ గ్రూప్ మాజీ డైరెక్టర్ భరత్ వీర్ వాంచూ, మణిపూర్లో జమ్మూ కాశ్మీరు మాజీ డీజీపీ గురుబచన్ జగత్ గవర్నర్లుగా ఉన్నారు. ఇలా ఐపీఎస్లు.. అదీ కేంద్ర స్థాయిలో 'బాగా' పనిచేసిన మాజీలందరూ రాజ్ భవన్ తాళాలు చేతుల్లోకి తీసుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ సర్వీసులో సెక్రెటరీ స్థాయిలో పనిచేసిన ఎన్. వీ. వోహ్రా(కాశ్మీర్), శేఖర్ దత్(ఛత్తీస్ గఢ్), బి.పి. సింగ్(సిక్కిం), తేజేందర్ ఖన్నా(ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్) లాంటి వారు ప్రాధాన్యం సంపాదించారు. ఆర్మీ మాజీ చీఫ్- జనరల్ జె.జె. సింగ్ అరుణాచల్ గవర్నర్ గా ఉంటే...లెఫ్టినెంట్ జనరల్ భూపీందర్ సింగ్(అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్), మాజీ ఆర్మీ అధికారి ఇక్బాల్ సింగ్(పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్)గా పనిచేస్తున్నారు.
కీలక నిర్ణయాల మాటేమిటి?
రాజ్యాంగం ప్రకారం 35 ఏళ్లు దాటిన ఏ వ్యక్తినైనా గవర్నర్ గా నియమించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించి ఏవైనా రాజకీయ, రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తినప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత వారిది. ఇలాంటి పోస్టులకు ఎంపిక చేసప్పుడు ఏ అర్హతలను పరిగణనలోనికి తీసుకుంటున్నారన్నది చర్చ. తాజాగా గవర్నరైన అశ్వని కుమార్ నేపథ్యాన్నే పరిశీలిస్తే- కాంగ్రెస్ అధినాయకులైన గాంధీ కుటుంబానికి భద్రతా వ్యవస్థ చూశారు. ఇలాంటి సేవలందించిన వారంతా గవర్నర్లయ్యారు. యూపీ గవర్నర్ జోషి ఇందిరాగాంధీ సెక్యూరిటీ టీములో ఉండేవారు. అశ్వని కుమార్ మాజీ ప్రధాని రాజీవ్ భద్రతను చూసేవారు. ఎస్పీజీ బాధ్యతలు చూసిన భరత్ వీర్- రాజీవ్ నుంచి సోనియా దాకా భద్రతా వ్యవస్థను నడిపించారు.
ఉత్సవ విగ్రహాలు కారాదన్నదే...!
ఇదొకెత్తయితే రాజకీయాల్లో తలపండిన వృద్దులకూ గవర్నర్ పోస్టులు హైకమాండ్ ఇచ్చే నజరానాగా మారుతున్నాయి. ఇలాంటి వ్యవస్థలో రాజ్యాంగ పదవులైన గవర్నర్ పీఠాలకు స్వయం నిర్ణయాధికారం ఉంటుందా? ఉన్నా అధికారాన్ని ఉపయోగించుకునే అవకాశం వస్తుందా? రాజ్ భవన్లను ఢిల్లీ పెద్దలే రిమోట్తో నడిపిస్తారా? ప్రజాస్వామ్యంలో ఇలాంటివన్నా కామనే అనుకుని జనమే సర్దుకుపోవాలా...
(ఈ పోస్టు ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో రాసినది కాదు. దయచేసి అర్ధం చేసుకుంటారని ఆశిస్తాను- నిహార్, బ్లాగర్)
No comments:
Post a Comment