Friday 31 May 2013

సెలవుల్లో మంచి పని...!

కాలక్షేపం... వ్యక్తిత్వవికాసం!
వందకు వంద మార్కులు రావాలంటే పుస్తకాలు బట్టీ పట్టించే స్కూళ్లు బోలెడున్నాయి. కానీ బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే వ్యక్తిత్వ వికాస నిపుణులు బహు అరుదుగా ఉంటారు. హైదరాబాద్ కొత్తపేట ఎస్సారెల్ కాలనీలో చిన్నారుల కోసం పదిహేను రోజుల పాటు నిర్వహించిన ఉచిత వేసవి శిబిరం సత్పలితం ఇచ్చింది. 

పిల్లలకు... వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలియచెప్పిన ఈ శిబిరం ఉత్సాహంగా ముగిసింది. కాలనీ సంక్షేమ సంఘం, ప్రసన్నాంజనేయస్వామి ఆలయ కమిటీ, స్వయం సేవక్ యోజన ప్రతినిధులు, కొంతమంది ఔత్సాహికులు ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు. ఆటలు, పాటలు, పద్యాలు, శ్లోకాలు, డాన్సులు, యోగా, ధ్యానం ఇలా రకరకాల అంశాల్లో పిల్లలకు ఉచిత శిక్షణ ఇచ్చారు. చాక్లెట్ తయారీ, కొవ్వొత్తుల తయారీ లాంటి విద్యలూ నేర్పించారు. వ్యక్తిత్వ వికాస నిపుణుల చేత పాఠాలు చెప్పించారు. ఇరుగుపొరుగు కాలనీల పెద్దలు, విద్యావేత్తలు ఈ శిబిరంలో పాల్గొని తమ అనుభవాలను చిన్నారులతో పంచుకున్నారు. వారిలో సామాజిక బాధ్యత పెరిగేలా ఉపాన్యాసాలిచ్చారు. 

శిబిరంలో పాల్గొన్న పిల్లలకు వైద్యుల బృందం చేత ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణి చేశారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబరచిన బాలలను ప్రోత్సహిస్తూ మెడల్స్ ప్రదానం చేశారు. కథలు, ఆధ్మాత్మిక పుస్తకాలను  బహుమతిగా అందించారు. 


 

వేసవి సెలవుల్లో కాలక్షేపమే కాకుండా ఆటపాటలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడిన ఇలాంటి శిబిరాలు ప్రతి సందర్భంలోనూ నిర్వహించాలని అందరూ అభిలషించారు.   

Tuesday 28 May 2013

'బొమ్మ'తోనే పుడుతుంది రిమ్మతెగులు...!

బూతు'బొమ్మ'లపై ముంబైలో వేటు
మహిళల మీద రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలకు విరుగుడుగా ముంబైలో కొత్త రూలొచ్చింది. వాస్తవంగా 1986లోనే ఓ చట్టం ఉంది. అదే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ వుమెన్(ప్రొహిబిషన్) యాక్ట్ ,1986. మహిళల శరీర భాగాలను అసభ్యంగా ప్రదర్శించడాన్ని నిషేధించే చట్టమిది. ఈ చట్టానికి దుమ్ముదులిపిని ముంబై అధికారులు నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇక వాణిజ్య రాజధానిలో ఎక్కడా లోదుస్తులు ప్రదర్శించే అమ్మాయిల బొమ్మలు కనిపించవు. శివసేన అధికారంలో ఉన్న బృహన్ముంబై పురపాలక సంస్థ చాలా మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు. బట్టల షాపుల్లో, షాపింగ్ మాల్స్ లో లోదుస్తులతో కనిపించే ప్లాస్టిక్ బొమ్మలపై నిషేధం విధించారు. 

లింగరీలు, బ్రాలు, స్విమ్ సూట్ల అడ్వర్టయిజ్ మెంట్ల కోసం బ్రాండెడ్ కంపెనీలు దాదాపు నిలువెత్తు బొమ్మలను వినియోగిస్తున్నాయి. అచ్చం అమ్మాయి నిలబడిందా అన్నట్లుండే అరడుగుల బొమ్మలకు లొదుస్తులు వేసి షో కేసుల్లో పెడుతున్నారు. షాపింగ్ మాల్స్ ముందు ఈ బొమ్మలెక్కువగా కనిపిస్తుంటాయి. పిల్లలు, యువకులు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి బొమ్మలు కనిపించగానే ఓ క్షణం ఆగిపోవడం అసాధారణమేమీ కాదు. లేత మనసుల్లో చెడు ఆలోచనలను ప్రేరేపించే వ్యాపార ప్రచారం ఇది. దుకాణాలు, మాల్స్లో బొమ్మలే కాదు, రహదారుల మీద హోర్డింగులు కూడా మరీ జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇలాంటివే మగవారిని తప్పుదారి పట్టిస్తున్నాయనేది నిపుణుల ఆందోళన. అందుకే శివసేన పాలకపక్షంగా ఉన్న ముంబై కార్పొరేటర్లు ఇలాంటి బొమ్మలపై నిషేధం విధించేలా తీర్మానం తెచ్చారు. 'పొల్యూషన్ ఆఫ్ మైండ్స్'కు దారితీస్తున్న ఈ తరహా పబ్లిసిటీపై వేటు పడాల్సిందే. ఇలాగే నగరంలో ఉండే హోర్డింగుల మీదా దృష్టి సారించడం మంచింది. ఇది కొంత కష్టమైన పని కావచ్చు. ఎందుకంటే... హోర్డింగులు మున్సిపల్ కార్పొరేషన్ కు ఓ ఆదాయ వనరు. మన హైదరాబాద్ లో ఓ ఆంగ్ల దినపత్రిక హోర్డింగులు చూస్తే డైలీఆ పేపర్ ప్రమోషన్ కు ఇంత బూతు బొమ్మలతో ప్రచారం అవసరమా అనిపిస్తుంది. అయినా ఎక్కడపడితే అక్కడ ఈ తరహా నగ్న ప్రచారాలు సాగిపోతున్నాయి. మహానగరంలో రోడ్డు ప్రమాదాలకు ఇలాంటి హోర్డింగులు ఓ కారణమనేది ట్రాఫిక్ పోలీసుల అంచనా. అయితే ఏ అధికారీ వీటిని తొలగించే చర్య చేపట్టడు. దేశంలో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో నిలిచింది ముంబై. అది దేశ రాజధాని అయితే... ఇది ఆర్ధిక రాజధాని. మహిళలపై అత్యాచారాల్లోనూ ఢిల్లీ, ముంబై మొదటి రెండు ప్లేసుల్లో ఉన్నాయి.

బొమ్మలను చూసి మగవారు అత్యాచారాలకు పాల్పడుతున్నారా అని ఎవరికైనా ధర్మసందేహం రావచ్చు. ఆ మాత్రం నిగ్రహించుకోలేరా అన్న అనుమానమూ ఉండవచ్చు. బ్రహ్మకైనా పుడుతుంది రిమ్మ తెగులు అని పెద్దలు ఊరికే అనలేదు. అనేకానేక అత్యాచార ఘటనలకు ఇలాంటివీ కారణమే. అందుకే ముంబై కార్పొరేషన్ మంచి పని చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇలాంటి లోదుస్తుల బొమ్మలపై నిషేధం విధించాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలను కించపరిచే విధంగా రూపొందించిన హోర్డింగులను తొలగించాలి.బూతు బొమ్మలున్న సినిమా పోస్టర్లు గోడలెక్కకుండా సెన్సార్ కత్తెరకు పదును పెట్టాలి. మన కార్పొరేటర్లకు ఈ సామాజిక బాధ్యతను ఎవరైనా గుర్తుచేస్తే మంచిది. 

Monday 27 May 2013

లేడీసుకు 'రివర్స్' ప్రాబ్లం!

ముందుకైతే దూసుకుపోతారు...!
హైదరాబాద్ నగరమనేంటి రాష్ట్రంలో చిన్నాచితకా పట్టణాల్లోనూ మహిళలు కార్లు నడపేస్తున్నారు. డ్రైవింగ్ స్కూళ్లలో నలభై శాతం మంది మహిళలే ఉంటున్నారు. ఇదివరకు వందలో ఒకటిఅరా వాహనాలు లేడీస్ డ్రైవ్ చేస్తున్నవి కనిపించేవి. ఇప్పుడు కార్లు నడిపే మహిళలు పెరిగారు. మగవారితో పోల్చితే ఆడవారు వాహనాన్ని పర్ ఫెక్ట్ గా నడపగలరనేది నిపుణుల విశ్లేషణ. అయితే రివర్స్ గేరుతోనే ఆడవారికి ప్రాబ్లం ఎక్కువని ఈమధ్య ఓ సర్వేలో తేలింది. 

 

ఎదురుగుండా రోడ్డు క్లియర్ గా ఉంటే ఎన్నికిలోమీటర్లయినా దూసుకుపోయే మహిళలు రివర్స్ లో బండిని పార్క్ చేయాల్సివచ్చిందంటే బెంబేలెత్తిపోతున్నారట. పార్కింగ్ కాంప్లెక్సుల్లో బాక్సులు గీసి ఉన్నా వాహనాన్నిసరైన డైరెక్షన్ లో పెట్టడం ఇబ్బందిగా ఉంటోందిట.


డ్రైవింగ్ లైసెన్సు కోసం వెళ్తున్న మహిళలు రివర్స్ గేరుతో ఎక్కువగా కంగారుపడి టెస్ట్ గట్టెక్కడం లేదని బ్రిటన్ అధ్యయనం తేల్చింది. అయితే డ్రైవింగ్ టెస్టులో మగవారెక్కువగా రోడ్ సిగ్నల్స్ విషయంలో పొరపాట్లు చేస్తున్నారు. ఇంతేకాదు డ్రైవింగ్ టెస్టుల్లో యూటర్న్, సర్కిల్ లాంటి చోట్ల మగవారు ఎక్కువగా తప్పులు చేస్తున్నారు. కానీ ఆడవారు మాత్రం అన్నిచోట్టా దాదాపు పర్ఫెక్టుగానే బండితోలగలరు గానీ రివర్స్ దగ్గరే సమస్య వస్తోందిట.  

    రివర్స్ లో పార్కింగు చేసేప్పుడే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వెహికల్ రివర్స్ లో వెనుక ఉన్న వాహనాలకు, గోడలకు డీకొట్టడమనేది 60 శాతం జరుగుతున్నాయి. రివర్స్ వెళ్తున్నప్పుడు స్టీరింగ్ సరిగ్గా తిప్పడం తెలియక పక్కనే ఆడుకునే పిల్లల మీదకు ఎక్కించేస్తున్న ఘటనలూ జరుగుతున్నాయి. టోటల్ ప్రమాదాల్లో ఇలాంటివి 14 శాతం. అందుకే కార్ల వెనుక వైపున ఎప్పుడూ  ఉండకండి. రివర్స్ గేరు ప్రాబ్లం ఉన్న వారు డ్రైవింగ్ సీటులో కూర్చుంటే మనకు ప్రాబ్లం. జాగ్రత్త సుమీ...!

Friday 24 May 2013

స్టార్స్ తో 'సై' అనిపించిన డూప్లికేటు!

కేన్స్ లో 'సై'య్యాట!

హాలీవుడ్ తారలంతా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడిగా ఉండగా పాప్ సంచలనం 'సై'(PSY) నేనేనంటూ ఒకతను అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రపంచంలో హాలీవుడ్ స్టార్సును మించిన సెలబ్రిటీలు దాదాపు ఉండరు. కానీ హేమీహేమీలైన హాలీవుడ్ స్టార్స్ 'సై'తో ఫొటో దిగేందుకు క్యూ కట్టారు. కొందరు తాము తీయించుకున్న ఫొటోలను గర్వంగా ట్విట్టర్లో పోస్టు చేసుకున్నారు. ఈ సమాచారం అసలుసిసలైన దక్షిణ కొరియా పాప్ సింగర్ 'సై' చూసి కంగుతిన్నాడు. వీడెవడో తనలా ఫోజుకొడుతూ హాలీవుడ్ సినీ ప్రముఖులతో ఫొటోలు దిగుతున్నాడని గ్రహించి వెంటనే ట్విట్టర్లో మెసేజ్ పెట్టాడు. తానసలు కేన్స్ ఫెస్టివల్కే రాలేదని ఒరిజినల్ 'సై' ట్విట్టర్ సందేశం చూసిన హాలీవుడ్ స్టార్స్ తాము ప్పులోకాలేశామని తెలుసుకుని నాలిక్కరుచుకున్నారు.

డూప్లికేటుతో ఫొటో దిగిన హాలీవుడ్ స్టార్...  పక్కనే ఒరిజినల్ 'సై'

కాల్షీటుల లెక్కన క్యాష్ రాబట్టే సినీతారలు ఈ సై అంటే ఎందుకింత క్రేజ్ చూపించారంటారా..? దక్షిణ కొరియా పాప్ సింగర్ సై అంటే ఏ సినీ స్టార్కూ లేనంత క్రేజు ఉంటుంది. పదేళ్లు నానాతంటాలు పడి వందలాది పాప్ ఆల్బమ్స్ రిలీజ్ చేసినా పక్కింటివాడు కూడా గుర్తుపట్టని స్థితి నుంచి సై ప్రపంమే తనతో స్టెప్పులేసే లెవల్ కు ఎదిగిపోయాడు. సై రూపొందించిన 'గంగనమ్ స్టయిల్' పాప్ ఆల్బమ్ యూట్యూబ్ లో యమా చక్కర్లు కొడుతోంది. రిలీజైన గంటల్లోనే యూట్యూబులో హిట్ల మీద హిట్లు వచ్చాయి. వారంలో వందకోట్ల మంది చూసిన వీడియో 'గంగనమ్ స్టయిల్'. నిజంగా సై అదృష్టమే అదృష్టం. ఈమధ్య 'జెంటిల్మన్' అనే మరో ఆల్బమ్ రిలీజ్ చేసినా సంగీతాభిమానులు సై అడుగులో అడుగు కలిపి స్టెప్పులేశారు. 

'సై' అంటే 'సై'...!

ప్రపంచమే దాసోహమనే హాలీవుడ్ తారలే సై అనగానే పక్కన నిలబడి ఫొటో తీయించుకున్నారంటే 'సై' పాప్ మ్యూజిక్ మహిళ అలాంటిది. ఇంతకీ ఇంత మంది స్టార్సును బోల్తా కొట్టించిన ఆ డూప్లికేట్ ఎవరంటారా...? ఫ్రాన్సుకు చెందిన 34 ఏళ్ల డెనిస్ కర్రె. ఫిజిక్ అచ్చం పాప్ సింగర్ 'సై' లాగానే  ఉంది. కాబోతే కళ్లజోడు, డ్రెస్ కోడు, మ్యానరిజం కాస్త మేనేజ్ చేశాడంటే...! ఇంకేముంది ఆకాశం నుంచి రాని హాలీవుడ్ తారలంతా నిజమైన 'సై' అనుకుని ఈ డూప్లికేటు పక్కనే నిలబడి ఫొటో తీయించుకున్నారు. 

Thursday 23 May 2013

చల్లచల్లని విషం గొంతుదిగితే...!

పాలులేని హిమక్రీములు!
ఐస్ క్రీమ్ అనుకుని మనం లొట్టలేస్తూ తినేస్తున్నది చల్లచల్లని విషం. మార్కెట్లో కొన్ని బ్రాండెడ్ ప్రొడక్టులు తప్ప మిగతావన్నీ సింథటిక్ ఐస్ క్రీములేనట. అసలు పాలే లేకుండా తయారవుతున్న హిమ క్రీములను మనం ఎంతో ఆబగా చప్పరించేస్తున్నాం. కృత్రిమ రంగులు, కృత్రిమ ప్లేవర్లు.



ఐస్ క్రీమ్ అంటే మిల్క్ ప్రొడక్ట్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ల్ అథారిటీ ఇండియా నిబంధనల ప్రకారం ఐస్ క్రీములో పది శాతం మిల్క్ ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలుండాలి. సుమారు 3.5 శాతం మిల్క్ ప్రోటీన్స్, రుచి కోసం పంచదార లేదా గ్లూకోజ్ ఉండాలి. ఐస్ క్రీమ్ చిక్కబరిచేందుకు 0.5 శాతం స్టెబిలైజింగ్ ఏజెంట్స్ కలపాలి. పెక్టిన్, ప్రొపీలీన్ లాంటి స్టెబిలైజింగ్ ఏజెంట్లు కలపడం వల్ల క్రీములో మృధుత్వం వస్తుంది. ప్లేవర్స్, రంగుల వివరాలతో పాటు తయారీకి వాడిన పదార్ధాల లెక్కలన్నీ ప్యాకింగ్ మీద కచ్చితంగా ముద్రించి ఉండాలి. కానీ స్కూళ్ల దగ్గర, బీచులు, పార్కులు లాంటి జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అమ్ముతున్న ఐస్ క్రీముల్లో సింథటిక్ పదార్థాలతో తయారు చేసినవే ఎక్కువ. ఇవి ఆరోగ్యానికి ఎంత హానికరమో ఆస్పత్రి పడక ఎక్కేంత వరకూ తెలియదు. అందువల్ల మన పిల్లలు తింటున్న ఐస్ క్రీములు ఎలా తయారుచేసినవో ఒక్కసారి గమనించండి. లేదంటే చల్లచల్లగా విషం గొంతుదిగినట్లే....

Wednesday 22 May 2013

హిందీకో లాల్ సలాం!

మన పేరు, మన తీరూ...!

చైనాలో హిమ, మణి, రేష్మ, అనురాగ్ లాంటి పేర్లున్నవారెవరైనా ఉంటారా!
'నో...ఇంపాజిబుల్... అలాంటి పేర్లతో అక్కడెవరుంటారు' అని బల్లగుద్ది చెప్తున్నారా? అయితే మీరు ఆ కథనం పూర్తిగా చదవాల్సిందే. 

చీనీ వాలా... హిందీ బోలా

బీజింగ్ యూనివర్సిటీలో పదహారణాల భారతీయం ఉట్టిపడుతోంది. లీ, వాంగ్, జింగ్, చుక్ లంతా చక్కగా అచ్చమైన హిందూ పేర్లు పెట్టేసుకుంటున్నారు. ఎప్పుడో నెహ్రూ కాలంలో హిందూ, చీనీ బాయి బాయి అంటూ పంచసూత్రాలు పఠించారు. మళ్లీ ఇప్పుడెందుకిలా ఇండియన్ నేమ్స్ కు షిఫ్ట్ అవుతున్నారనే డౌటొద్దు. ఇది అక్షరాలా నిజం.

క్లాసులు కిటకిట

చైనీయులకెందుకో మన హిందీ మీద తెగ మోజు పెరిగింది. బీజింగ్ వర్సిటీలో హిందీ క్లాసులకు చీనీ యువత ఎగ్గొట్టకుండా అటెండ్ అవుతున్నారుట. సరదాగా హిందీ నేర్చుకున్న చైనా అమ్మాయి వాంగ్ జింగ్ తన పేరును చేతన అని మార్చేసుకుంది. ఇప్పుడు యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా హిందీ పాఠాలు చెప్తోంది. అసలు హిందీ అంటే అక్కడి యువతకు మక్కువ కలిగించింది ప్రొఫెసర్ జియాన్ జింకోయ్. ఇరవయ్యేళ్ల క్రితం మనదేశానికొచ్చినప్పుడు షార్ట్ టర్మ్లో హిందీ నేర్చేసుకున్న ఘనాపాటీ జియాన్. ఔత్సాహికుడైన జియాన్ హిందీ అంటే వల్లమాలిన ప్రేమాభిమానాలు చూపిస్తారు. అందుకే సర్కారును కూడా మెప్పించి ఒప్పించాడు. వర్సిటీల్లో దీన్నో కోర్సుగా పెట్టేందుకు చైనా పాలకులు ప్రోద్బలం అందించారు.

మన వ్యామోహం... వారి ప్రేమ

ఇంగ్లిషు వ్యామోహంలోపడి మనం హిందీ సహా తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం లాంటి ప్రాంతీయ భాషలను మరచిపోతున్నాం. చైనీయులు మాత్రం మన జాతీయ భాషకు గౌరవం ఇచ్చి చక్కగా నేర్చుకుంటున్నారు. దేవేందర్ శుక్లా, విజయ్ సింగ్ లాంటి హిందీ అధ్యాపకులు బీజింగ్ లో పరాయి పిల్లలకు మన భాష బోధిస్తున్నారు. 
చైనాలో వాళ్ల సొంత భాష(చీనీ లేదా మాండరిన్) తప్ప ఇంగ్లిష్ జోలికి అంత ఈజీగా వెళ్లరు. మన దగ్గర ఇంగ్లిష్ అంటే మోజెక్కువ. మాతృభాషలు మృతభాషలుగా మారిపోయిన దౌర్భాగ్యం. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ అన్నీ సగం సగం పదాలు కలిపేసిన 'సంకరభాష'. రిక్షా కార్మికుడు, కిరాణాకొట్టు యజమాని, స్ట్రీట్ వెండర్... అందరిదీ మిక్సుడ్ లాంగ్వేజే. చీనీవాలా మాత్రం మరో భాష జోలికివెళ్లడు. మన హిందీ మాత్రం అభిమానంతో నేర్చుకుంటున్నారు. 

రాగం...తానం...పల్లవి...

భాష నేర్చుకోవడమే కాదు... భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ఇష్టపడుతున్నారు. హిందూస్ధానీ సంగీతం సాధన చేస్తున్నవారు, భరతనాట్యం నేర్చుకుంటున్నవారూ మనకు కనిపిస్తారు. మేరా పడోసి భారత్ మహాన్(మా పొరుగునున్న భారత్ మహాగొప్పది) అనుకుంటూ మన కళలను ఔపోసనపట్టేస్తున్నారు. ఈశా అనే చైనా యువతి భారతీయ సంప్రదాయ నృత్యాలు నేర్పించే గురువుగా సెటిలైపోవడం అభినందించాల్సిన అంశమే.    

మార్కెట్ మంత్ర! 

చైనా యువతకు మన హిందీ అన్నా, మన సంప్రదాయాలన్నా ఇంత  ఆసక్తి పెరగడానికి ఓ బలమైన కారణం ఉంది. అదే విస్తారమైన ఇండియన్ కన్సూమర్ మార్కెట్. ప్రపంచ దేశాలన్నీ సర్వీస్ మార్కెట్ మీద దృష్టి సారిస్తే చైనా ప్రొడక్టివ్ మార్కెట్ మీద కన్నేసింది. ప్రపంచంలో మనం అడుగుపెట్టిన ప్రతిచోటా చైనా పోటీగా నిలబడుతోంది. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, ఇన్ ఫ్రాస్టక్చర్, ఎడ్యుకేషన్... ఇలా అన్ని రంగాల్లో మనకు గట్టి పోటీనిచ్చేది చైనాయే. అంతరిక్ష ప్రయోగాల్లో తప్ప ఇంకా ఆయుధాలు,  రక్షణ సామాగ్రి తయారీలో మనం ముందడుగు వేయలేదు. ప్రపంచ మార్కెట్ లో మన అవకాశాలను కొల్లగొట్టడమే కాకుండా మనదేశంలోనూ విస్తరించాలనేది చైనా వ్యూహం కావచ్చు. 

చుట్టేస్తున్న రెడ్ డ్రాగన్

బ్రహ్మపుత్ర ఎగువన ఇష్టానుసారం ప్రాజెక్టులు కట్టేసింది. ఆ నదీజలాల వివాదం  పరిష్కారమవదు. లడఖ్ సరిహద్దుల్లో చొచ్చుకువచ్చేసి సైనిక శిబిరాలు వేసుకుంది. చివరికి మన భూభాగంలోంచి మనమే వెనక్కి మళ్లాల్సి వచ్చింది. అసలు రెండు దేశాల మధ్య ఆంగ్లేయులు సరిహద్దుగా చూపించిన మాక్ మిలన్ రేఖ భూమి మీద లేదు. కేవలం మ్యాప్ మీదే కనిపిస్తుంది. నెహ్రూ నుంచి రేపు రాహుల్ గాంధీ దాకా ఎన్ని హయాంలు మారినా ఆ వివాదం రావణకాష్టమే. చైనా పీపుల్స్ ఆర్మీ చొరబాట్లు ఏ గుణపాఠం నేర్పించాయి...? ఆ దేశ కొత్త ప్రధాని తొలి విదేశీయాత్ర పేరుతో మనదేశానికి రావడం ఏ హితబోధ చేసింది? మనం చీనీ,హిందీ భాయీ భాయీ అంటూ మితృత్వం చాటుకుంటున్నాం. ఆ డ్రాగన్ మాత్రం మన మార్కెట్ చుట్టేస్తోంది. అందుకే అక్కడి యువతకు మన హిందీ మీద ఇంత ప్రేమ ఉప్పొంగుకొస్తోంది.

అనుభవం నేర్పిన పాఠం!

అనాధలకు అమ్మానాన్న!
ఆ యువకుడికి పేదరికం ఎన్నో అనుభవాలు నేర్పింది. కన్నవారు నిరుపేదలు. టీ అమ్ముకుంటూ చదువుసాగించాడు. ఉన్నత చదువు పూర్తిచేసి ప్రభుత్వ టీచరుగా ఉద్యోగం సంపాదించాడు. ఇక ఇంతటితో చాలని  సరిపెట్టుకోలేదు. తాను ఏ స్థాయి నుంచి ఎలా పైకెదిగాడో గుర్తుచేసుకున్నాడు. తనలా పేదరికంలో మగ్గుతున్న  నిస్సహాయులకు ఏదైనా చేయాలనుకున్నాడు. అనుకున్నదాన్ని ఆచరణలో పెడుతున్నాడు. విజయానికి చివరి మెట్టుమీద నిలబడిన అజిత్ కుమార్ తన ఆశయసాధనలో అందనత్త ఎత్తులకు ఎదుగుతున్నాడు. ఆయన ఆశయానికి నీడగాతోడుగా నిలిచింది షబ్నం. ఆ దంపతులు పేద పిల్లలకు ఎలాంటి సేవ చేస్తున్నారో బీహారులోని బరౌనీ రైల్వే జంక్క్షన్లో చాలా మంది ప్రయాణికులకు తెలుసు.

ఓపెన్ ఎయిర్ స్కూల్

ప్రభుత్వ టీచరైన అజిత్ బరౌనీ రైల్వే జంక్షన్లో ఫ్లాట్ ఫామ్ మీదే అనాధ పిల్లల కోసం ఓపెన్ ఎయిర్ స్కూలు నడుపుతున్నాడు. మొదట్లో అధికారులు అభ్యంతరం చెప్పినా ఆ తర్వాత వందల మంది పిల్లలకు మేలు జరుగుతోందని తెలిసి అజిత్ దంపతులను ప్రోత్సహించారు. ఈ జంక్షన్లో తలదాచుకుంటున్న అనాధ పిల్లలకు ఈ దంపతులే దేవుడిచ్చిన అమ్మానాన్న. చక్కగా చదువు చెప్తున్నారు. ఉచితంగా భోజనం కూడా అందిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించి జీవితంలో స్థిరపడేందుకు అవసరమైనంత తోడ్పాటునందిస్తున్నారు. ప్రభుత్వ టీచరైన భర్త ఇలా అనాధ పిల్లల సేవకు కంకణం కట్టుకోగానే భార్య నేను సైతం అంటూ తోడుగా నిలిచింది. ఈ జంట చేస్తున్న అనాధ పిల్లల సేవ, విద్యాదానం గురించి ఆ స్టేషన్ గుండా ప్రయాణం చేసే చాలా మందికి తెలుసు.

 ఇళ్ల నుంచి పారిపోయి వచ్చిన చిన్నారులు, ఎవరూ లేని అనాధ పిల్లలూ వీరి దగ్గర చదువు నేర్చుకుంటున్నారు. అనాధలకు ఉన్నట్లుండి కొత్త జీవితం ప్రసాదించలేరేమో గానీ అటువైపు అడుగులు వేయించగలరు. ఇది అభినందనీయమైన సేవే. అయితే పిల్లల్లో గుట్కానమలడం, సిగరెట్లు కాల్చడం, వైట్ నర్(టైప్ రైటర్ స్క్రిప్టు చెరపడానికి వాడే లిక్విడ్) పీల్చడం లాంటి దురలవాట్లు మాత్రం అంత సులువుగా మాన్పించలేకపోతున్నారు. పిల్లలను బుగ్గిపాల్చేస్తున్న ఇలాంటి దురలవాట్లను దూరం చేయడంలోనూ అజిత్, షబ్నం దంపుతులు సక్సెస్ కావాలని కోరుకుందాం.

Tuesday 21 May 2013

చదువంటే కీబోర్డు...మానిటరు!

వాహ్... యంగ్ ఎచీవర్!
'ఎప్పుడూ ఆ కంప్యూటర్ ధ్యాసేనా... కాసేపైనా కష్టపడి చదివితే జీవితంలో పైకొస్తావ్...' ఎప్పుడైనా పిల్లల విషయంలో మీ నోటి వెంట ఈ డైలాగ్ వచ్చిందా? ఇంకెప్పుడూ రిపీట్ కానీవకండి. మీ అబ్బాయి లేదా అమ్మాయికి కంప్యూటర్ మీద అంత ఆసక్తి ఉంటే ఏనాటికైనా డేవిడ్ కార్ప్ అయ్యే ఛాన్సొస్తుంది. జీవితంలో పైకెదగాలంటే చదువే అవసరం లేదు, ఏ రంగంలో ఆసక్తి ఉన్నా చాలు... అని నిరూపించిన యంగ్ అచీవర్ అమెరికాకు చెందిన డేవిడ్ కార్ప్.

యాహూలో టంబ్లర్ విలీనం

కనీసం హైస్కూల్ చదువైనా లేని 26 ఏళ్ల డేవిడ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాహూ కంపెనీనే మెప్పించగలిగాడు. అదే డేవిడ్ స్థాపించిన పాపులర్ బ్లాగింగ్ సర్వీస్ ప్రొవైడర్... టంబ్లర్(Tumblr). కంప్యూటర్ సాఫ్ట్ వేర్లు, ప్రోగ్రామింగ్, వెబ్ డిజైనింగ్ వ్యవహారాల్లో నిపుణుడైన డేవిడ్ ఆరేళ్ల క్రితం అంటే ఇరవై ఏళ్ల వయసులో ఈ టంబ్లర్ బ్లాగింగ్ సర్వీస్ మొదలెట్టాడు. దీన్ని యాహూ కంపెనీ నూటాపది కోట్లు వెచ్చించి తాజాగా విలీనం చేసుకుంది. ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగిన డేవిడ్ జీవితంలో బిగ్ సక్సెస్ సాధించాడు.

అమ్మ చెప్పిన మాట...

డేవిడ్ సక్సెస్ వెనుక ఉన్నదెవరో కాదు... అమ్మ. పధ్నాలుగేళ్ల వయసులో చదువంటే బోర్ అంటున్న కొడుకును ఆమె మందలించలేదు. బలవంతంగా పుస్తకం చేతులో పెట్టి చదువుకోమ్మంటూ బెత్తం పట్టుకుని పక్కనే కూర్చోలేదు. బోరుకొడితే బుక్ రీడింగుకు గుడ్ బై చెప్పేయ్... నీకు ఆసక్తి ఉన్న ఆ కంప్యూటర్తోనే ఏదైనా సాధించేందుకు ట్రై చేయ్... అంటూ ఎంకరేజ్ చేసింది. స్కూల్లో సైన్సు పాఠాలంటే విసుగుచెందిన డేవిడ్... బెడ్ రూమ్లో తన కంప్యూటర్తో విసుగూవిరామం లేకుండా కసరత్తు చేసేవాడు. పధ్నాలుగేళ్లలో మొదలైన ఆ తపన 20 ఏళ్ల వచ్చేప్పటికి ఓ కంపెనీ ఓనరును చేసింది. మరో ఆరేళ్లు తిరిగేలోపు అదృష్టమే మారిపోయింది.

చదువొక్కటే కాదు...

చదువంటే పెద్దగా ఆసక్తిలేని కొడుకులో ఇన్నర్ టాలెంట్ ఉందని గుర్తించిన అమ్మ... కంప్యూటర్ రంగంలో ఆకాశానికి ఎదిగేలా ప్రోత్సహించింది. నిజంగా 'చదువు... చదువు' అంటూ అనుక్షణం పోరుపెట్టే తల్లులకు డేవిడ్ కథనం కనువిప్పు. అయితే ఏ అమ్మయినా తన బిడ్డ బాగా చదివి జీవితంలో పైకెదగాలనే కోరుకుంటుంది. కొంత మంది పిల్లలు ఎందుకోగానీ చదువు మీద ధ్యాస పెట్టలేకపోతారు. అలాంటి వారిలో మరేదైనా నైపుణ్యం ఉందేమో గమనించి ప్రోత్సహించాల్సింది తల్లిదండ్రులే. అలాకాకుండా కేవలం చదువొక్కటే మనిషిని నడిపిస్తుందనే గుడ్డినమ్మకంతో పిల్లల మీద ఒత్తిళ్లు పెంచితే చెడు తప్ప మంచెలా జరుగుతుంది? 'టంబ్లర్'తో అద్భుత విజయం సాధించిన డేవిడ్, ఆ విజయం వెనుక ఉన్న ఆ అమ్మ మనందరికీ మార్గదర్శకులు.    
 

ఎవరెస్టే చిన్నబోయెనా...!

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి!

అరుణిమా సిన్హా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. "వాహ్! సాహసం చేసింది' అని ఒక్కమాటలో వదిలేయలేం. ఈ సాహసంలో ఓ విషాదగాధ ఉంది... కఠోరసాధన ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ను మొదటి మహిళ బచేంద్రిపాల్ మొదలు చాలా మంది ఎక్కేసి ఉండొచ్చు. కానీ అరుణిమా సిన్హా విజయంలో ఓ స్ఫూర్తి ఉంటుంది. ఆమె కృత్రిమ కాలితో ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి మహిళ. కేవలం రికార్డు సృష్టించడానికే అరుణిమ ఈ లక్ష్యాన్ని ఎంచుకోలేదు. అణచివేతకు గురవుతున్న మహిళల్లో దైర్యం నింపడానికే ఇంత పెద్ద సాహసం చేసింది. 

 

నిజంగా అరుణిమ జీవితం ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం. ఎగసినప్పుడు ఆత్మవిశ్వాసం కనబరచింది. అలాగే పడిపోయినప్పుడూ ఆమెలో విశ్వాసం సడలిపోలేదు. ఉత్తర ప్రదేశ్ అంబేద్కర్ నగర్ కు చెందిన అరుణిమ జాతీయ స్థాయి మహిళా వాలీబాల్ జట్టులో ప్లేయర్. ఆటల్లో అజేయంగా దూసుకుపోతున్న తరుణంలో ఆమె జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి.

2011లో లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా పద్మావతి ఎక్స్ ప్రెస్ జనరల్ కంపార్ట్మెంట్లో దొంగలు తారసపడ్డారు. అరుణిమ మెడలో గొలుసు లాగేసుకుని పారిపోతుండగా దైర్యం చేసి దొంగలను ఎదిరించింది. ఆ పెనుగులాటలో దొంగలు ఆమెను రైలు కిందకి తోసేశారు. తీవ్రంగా గాయపడిన అరుణిమ... కుడికాలు పోగొట్టుకుంది. ఈ విషాదం గురించి తెలిసిన ఎందరో ఆమెను వ్యక్తిగతంగా కలిసి దైర్యం చెప్పారు. క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా లక్ష రూపాయలు సాయం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని భుజంతట్టి చెప్పాడు. ఆ మాటలే అరుణిమను బతికించాయి. క్యాన్సర్ తో పోరాడిన యువరాజ్ సింగ్ చికిత్స తర్వాత కోలుకుని మునుపటి ఉత్సాహంతోనే మళ్లీ పిచ్లో అడుగుపెట్టడం అరుణిమకు స్ఫూర్తి నింపింది. 

 

ఏదో వికలాంగురాలిగా బతుకీడ్చడం కాదు... జీవితంలో ఏదైనా సాధించి తనపై రైల్లో అమానుషంగా ప్రవర్తించిన దుండగులకు గుణపాఠం చెప్పాలనే కంకణం కట్టుకుంది. అనుకున్నదాన్ని సాధించడానికి కఠోర శ్రమ చేసింది. అనుకున్నట్లుగానే కృత్రిమ కాలితోనే ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు నమోదు చేసింది. స్వతహాగా క్రీడాకారుడైన సోదరుడు అండగా నిలబడ్డాడు. మహోన్నత లక్ష్యాన్ని సాధించడానికి టాటా స్టీల్ ఎడ్వంచర్ ఫౌండేషన్ తోడ్పడింది. ఈ ఫౌండేషన్ చీఫ్ గా వ్యవహరిస్తున్న బచేంద్రిపాల్... అరుణిమకు అడుగడుగునా ఊతమందించింది. ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళగా బచేంద్రిపాల్ అన్ని విధాలా సహకరించడంతో అరుణిమ కృత్రిమ కాలితో ఎవరెస్ట్ అధిరోహించిన తొలిమహిళగా నిలిచింది. జీవితంలో విషాదం నిండిందని దిగులుపడకుండా కొత్త వేకువ కోసం కోటి ఆశలతో ఎదురుచూడడం మంచిదంటుంది ఈ సాహసి.   

Monday 20 May 2013

కలర్ ఫుల్ కార్నివాల్...!

కార్నివాల్ అనగానే బ్రెజిల్ సాంస్కృతిక సోయగం గుర్తుకొస్తుంది. బ్రెజిల్ రాజధాని రియో డి జెనైరోలో ఏటా రెండు వారాల పాటు కార్నివాల్ సీజన్. ఇక ఈవెంట్లతో బ్రెజిల్ అంతా పండగే పండుగ. బెల్లీ డాన్సులు... డ్రమ్స్ వాయిద్యాలు... రోజుకో రకమైన ఊరేగింపు. ఆ గానా భజానాకు అలుపూసొలుపూ ఉండనే ఉండదు. జర్మనీ కార్నివాల్ కూడా ఇలాగే ఉరకలెత్తే ఉత్సాహంతో సాగుతోంది. రాజధాని బెర్లిన్ కల్చర్స్ ఆఫ్ కార్నివాల్ ఫెస్ట్ కు వేదికైంది. ప్రపంచం నలుమూలల నుంచి వేల మంది కళాకారులు తరలివచ్చారు. భిన్న వేష ధారణలు, విభిన్న సంప్రదాయాలు... అన్నీ కలగలిసిన కార్నివాల్ సోయగాలు అందరినీ అలరిస్తున్నాయి.





మందు బిళ్లలో మతలబు!

డాక్టరుకు డబ్బు... రోగికి జబ్బు!
డాక్టర్లు అవసరం ఉన్నా లేకపోయినా విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ మందులు రాసేస్తున్నారని ఈమధ్య ఓ అధ్యయనం తేల్చింది. తమిళనాడులోని వెల్లూరు ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించారు. స్టాక్ హోం కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, క్రిష్టియన్ మెడికల్ కాలేజ్, సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీల నిపుణులు సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో కమీషన్ల కోసం డాక్టర్లు పడుతున్న కక్కుర్తి బయటపడింది. రోగికి ఎంతమేర యాంటీ బయాటిక్స్ అవసరమన్నది చూడకుండా ప్రిస్కిప్సన్ రాసేస్తున్నారనేది ఈ సర్వే సారాంశం. ఈ నివేదికను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ అనే మ్యాగజైన్ లో ప్రచురించారుట. ఓ అంతర్జాతీయ న్యూస్ వెబ్ సైట్ కథనం ఆధారంగా ఈ సమాచారం షేర్ చేసుకుంటున్నాను. కొంత మంది కమర్షియల్ డాక్టర్ల నుంచి ఎదురయ్యే ముప్పు గురించి నలుగురికీ తెలిస్తే మంచిది. అయితే మానవతావాదంతో వైద్య వృత్తిలో సేవలందిస్తున్న డాక్టర్లు చాలా మందే ఉంటారు. అలాంటి వారు ఈ కథనం చదివి నొచ్చుకోకూడదని మనవి.  


యాంటి బయాటిక్స్ తో డేంజరే...

రోగ కారకమైన సూక్ష్మజీవిని నిర్మూలించడానికి యాంటి బయాటిక్స్ నిర్ధేశిత మోతాదులో వాడుతారు. అవసరానుగుణంగా మోతాదు పెంచడం డాక్టర్ల పర్యవేక్షణలో జరగాలి. కానీ మన డాక్టర్లు ఇష్టం వచ్చినట్లు యాంటి బయాటిక్స్ రాసేస్తున్నారనది అధ్యయనం నిరూపించింది. మందులు ఇష్టానుసారం మింగేస్తే మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. డాక్టర్లు ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఆ మందులు తయారు చేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీలు దండిగా కమీషన్లు ముట్టచెప్తున్నాయిట. కంపెనీల తరఫున రిప్రజెంటెటివ్లు డాక్టర్లను కలుస్తుంటారు. శాంపిల్ మందులు ఇచ్చి వెళ్లుంటారు. ఆ డాక్టర్లు లేదా ఆ ఆప్సత్రి చుట్టుపక్కలున్న మందుల షాపుల్లో తమ మందులు దండిగా స్టాక్ పెట్టిస్తారు.ఇక డాక్టర్లు తమ దగ్గరుకొచ్చిన ప్రతి రోగికి ఆ మందులు వీలువెంబడి రాస్తుండాల్సిందే. ఇలా చేసినందుకు ఆ మందుల కంపెనీలు ఇంటెన్సివ్ కింద బోలెడు నగదు బహుమతులు ముట్టచెప్తుంటాయి. ఆస్పత్రులకు, క్లీనిక్ ఓనర్లకు వాటాలు అందుతుంటాయి. 

సేవ కాదు, వైద్యం ఓ వ్యాపారం...

మందులే కాదు మెడికల్ టెస్టులు, ఎక్స్ రేలు, రక్త మల మూత్ర పరీక్షలు, స్కానింగులు, ఈసీజీలు, ఈఎంఆర్ఐలు ఎక్కడికక్కడ డాక్టర్లకు కమీషన్లు అందుతుంటాయి. బిల్లు మీద డాక్టర్లకు కమీషన్ సుమారు ఇరవై నుంచి యాభై శాతం దాకా ఉంటుంది. స్పెషలిస్టు డాక్టర్లకు డెభ్బై శాతం ఇంటెన్సివ్ అందుతుందనేది ఆ రంగంలోని వారే చెప్తున్న మాట.ఏసీ కార్లు, ప్లాస్మా టీవీలు కూడా ఇస్తుంటారని వెల్లూరు ప్రాంతంలో జరిగిన సర్వేలో కొంతమంది డాక్టర్లు నిర్మోహమాటంగా చెప్పారుట.  


ఫీజుల మోతతో పేదవాడికి భయం

పేషెంట్లలో పేద, ధనిక వర్గాలుంటాయి. డబ్బు దగ్గర ఒకసారి పీనాసిగాను, మరోసారి డాంబీకంగానూ  వ్యవహరించే మధ్యతరగతి ఉండనే ఉంటారు. ఆరోగ్యం మీద మనిషికి ఎంత స్పృహ పెరిగినా, ఎంత చైతన్యం వచ్చినా చాలా సందర్భాల్లో డాక్టర్ దగ్గరికెళ్లాలంటేనే జంకేవారి సంఖ్య ఎక్కువే. ఎంత డబ్బు గుంజుతారోనన్న భయం. కన్సల్టింగ్ ఛార్జి  కనీసం వంద, స్పెషలిస్టులైతే మూడు వందలు చెల్లించాల్సిందే. ఇక మందుల లెక్క మూడు వందలు దాటుతుంది.  చిన్న రోగానికైనా చాంతాడంత  ప్రిస్కిప్షన్. మందులు, టెస్టులు కలిసి వెయ్యి రూపాయల పైమాటే. ఇక చిన్నసైజు ఆస్పత్రి గడప తొక్కినా చికున్ గున్యా, డెండ్యూ లాంటి రోగాల పేరుతో పాతిక వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఒకవేళ ఇన్యూరెన్స్ గట్రా ఉందని తెలిసిందంటే ఐసీయూలో వెంటిలేటర్లు, వారానికి పైగా చికిత్స, మరో నెళ్లాళ్లు మందులు... అన్నీ కలిపి అర లకారం. అందుకేనేమో పేద, మధ్య తరగతి ఇళ్లల్లో రోగాలు వచ్చాయంటే బెంబేలెత్తిపోతున్నారు.
 

డాక్టర్లు చదువు'కొన్నారు'గా మరి!

డాక్టర్లు మాత్రం కమీషన్ల కోసం కాకుండా పేదవాడి బాగోగుల గురించి  ఎందుకు పట్టించుకుంటాడు చెప్పండి? ఏడో క్లాస్ నుంచే కార్పొరేట్ స్కూళ్లలో మెడిసిన్ ఇంటెన్సివ్ కోచింగులిస్తున్నారు. కాలేజీ చదువు నాటికి కనీసం మూడు లక్షల ఖర్చు. ఇక రెండేళ్ల ఇంటర్ మీడియట్ చదువుకు కనాకష్టంగా నాలుగు లక్షలపైమాటే. ఆపై మెడిసిన్ పూర్తయ్యేలోగా సుమారు ఆరున్నరేళ్లకు ముప్పయి నుంచి యాభై లక్షలు ఖర్చు. ఇవన్నీ తిరిగిరావాలంటే ఎందరు రోగుల నాడి వెతికిపట్టుకోవాలి... ఎన్ని ప్రిస్కిప్షన్లు రాయాలి... ఎన్ని మందులని గుర్తుపెట్టుకోవాలి... ఎన్ని టెస్టులని చేయించాలి... వైద్యో నారాయణో హరి:

మంచి వైద్యుడిని నమ్మండి

డాక్టర్లనే పూర్తిగా తప్పుబట్టడానికి లేదు. తక్కువ మందులు రాస్తే పేషెంటే శంకిస్తాడు. రోగం ఆ మరుసటి రోజుకు తగ్గుముఖం పట్టకపోతే మందుల మోతాదు పెంచమని పేషెంట్లే అడుగుతారు. ఇలాంటప్పుడు డాక్టర్లు, మందుల కంపెనీలు మననే నమ్ముకుని వ్యాపారం చేస్తున్నారు కదా...వాళ్లకు మాత్రం మన మీద జాలి, దయ, కరుణ ఎందుకుండాలి? ఎప్పటికప్పుడు కొత్త కొత్త మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు వాటిని అమ్ముకోవడానికి డాక్టర్లకు ఇంటెన్సివ్ లు సమర్పించుకోకపోతే ఇక పనేలా జరుగుతుంది? ఇదంతా పేదవాడి ముఖ్యంగా మధ్య తరగతివాడి కర్మ. పేషెంట్ ఆరోగ్య పరిస్థితి, ఆర్ధిక పరిస్ఙతి గమనించి నిదానంగా కుదుటపడేలా వైద్యం చేసే డాక్టర్లను మనం నమ్మపంత వరకూ వైద్యం వ్యాపారంగానే ఉంటుంది. అయ్యా ధన్వంతరీ.... తెల్లకోటూ, స్టెతస్కోపూ సాక్షిగా డాక్టర్లే కమీషన్ ఏజెంట్లుగా మారిపోతున్నారట! ఇక పేద రోగిని ఎవరు కాపాడుతారు?!

డాక్టర్లు రాసే మందు బిళ్లలో మతలబు ఇదే. మన జబ్బు తగ్గడం కాదు. వారి డబ్బు పెరగడం....


Sunday 19 May 2013

ఎన్నెన్నో వర్ణాలు... ఏవేవో అందాలు...!

రంగుల అలలు!
ప్రకృతి చిత్రకారుడి మదిలో మెదిలే భావాలన్నీ నేల మీదో, ఆకాశమ్మీదో రంగులద్దుకుంటాయేమో?! మన చుట్టూ కనిపించే ఈ అందాలన్నీ ఆ ఊహలకు ప్రతిరూపాలేనేమో?! కెనడాలోని అల్బెర్టాలో ఉన్న సుందరమైన సరస్సు అబ్రహం. ఈ సరస్సు జలాలు చూస్తే స్వచ్చమైన నీళ్ల కింద రంగులద్దిన కాన్వాసు పరిచారేమో అనిపిస్తుంటుంది. అదేం మాయోగానీ  జలాశయంలోని అలల కదలికలన్నీ వర్ణ శోభితం...సరస్సు అంచులను తాకినట్లుండే ఆ నిర్మలాకాశం రాగరంజితం!

మీథేన్ వాయువు సృష్టించే సోయగాలు

సరస్సు గర్భంలో మీథేన్ వాయువు నిక్షేపాలున్నాయిట. మంచుతో గడ్డకట్టినట్లుండే నీళ్ల  అడుగు భాగంలో మీథేన్ వాయువు  తెట్టులా తేలడంతో ఆ వాయువు నీళ్లూ కలిసి రంగురంగుల దృశ్యాలు రూపుదాల్చుకుంటున్నాయి. మొత్తానికి ఆ సరస్సంతా రకరకాల పెయింటింగులను ఒక్కచోటికి చేర్చినట్లు ముచ్చటగా ఉంటుంది. నిజంగా ప్రకృతి ఓ వింత కదా...!


(చూడచక్కని ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించిన ఒరిజినల్ ఫొటోగ్రాఫర్లకు, ఆ చిత్రాలను అందించిన వెబ్సైట్లకు కృతజ్ఞతలు)

Saturday 18 May 2013

బాలల సేవే భగవానుడి సేవ

ఉచితం, ఉపయోగకరమూ...!

చిన్నారులకు వేసవి సెలవులు ఎంతో విలువైనవి. అందుకే ఆ సమయం వృధా అవకుండా అనేకచోట్ల వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటారు. అయితే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇది వ్యాపార ధోరణితో సాగుతున్న వ్యవహారం. ఎక్కడో ఒకటిరెండు చోట్ల ఉచిత క్యాంపులు నిర్వస్తున్నారు. 

సేవాదృక్పథంతో కాకుండా పక్కా లాభాపేక్షతో సాగే శిబిరాలే ఎక్కువ. పైగా ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాల్లో పిల్లలు ఎంచుకున్న ఏదో ఒక అంశంలో మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. దాదాపు అన్నిచోట్లా కరాటె, స్విమ్మింగ్, క్రికెట్ తదితర క్రీడాంశాలే ఉంటాయి. కొన్నిచోట్ల సంగీతం, డాన్సు లాంటివి ఉన్నా  దండిగా ఫీజులు లాగుతుంటారు. 



  ఆటపాటలే కాదు వ్యక్తిత్వమూ ముఖ్యమే...

వ్యాపారాత్మక వేసవి శిబిరాలకు భిన్నంగా హైదరాబాద్ కొత్తపేట(దిల్ సుఖ్ నగర్)లోని శ్రీరామలింగేశ్వర కాలనీలో సేవాభావంతో పూర్తిగా ఉచితంగా, వైవిధ్య భరితమైన వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. కాలనీకి చెందిన కొంతమంది ఔత్సాహికులు ఇరుగుపొరుగు కాలనీల పిల్లలను చేరదీసి వారికి రకరకాల అంశాలు ఉచితంగా బోధిస్తున్నారు. ఎస్ఆర్ఎల్ కాలనీ రోడ్ నెంబర్ 7లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి. ఆలయ ప్రాంగణంలో మిట్ట మధ్యాహ్నం శిబిరం నిర్వహిస్తున్నా యాభైకి పైగా చిన్నారులు ఉత్సాహంతో వస్తున్నారు.

కేవలం ఆటపాటలే కాకుండా శ్లోకాలు, పద్యాలు నేర్పించడంతో పిల్లలంతా ఆసక్తి చూపిస్తున్నారు. యోగా, ధ్యానం నేర్పిస్తున్నారు. క్విజ్ పోటీలతో మేధోవికాసానికి తోడ్పడుతున్నారు. బాల్యంలోనే తెలుగు ఇంగ్లిషు భాషల్లో  నైపుణ్యం పెంపొందేలా ప్రోత్సహిస్తున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తున్నారు. క్రికెట్ ఆడిస్తున్నారు. డాన్సులు చేయిస్తున్నారు. రకరకాల క్రాప్ట్ వర్కులూ నేర్పించడంతో పిల్లలంతా అల్లరి మానేసి చక్కగా వేసవి శిక్షణ శిబిరానికి వస్తున్నారు. కాలనీకి చెందిన ఔత్సాహికులు సేవా భావంతో తమకు తెలిసిన విద్య నలుగురికీ పంచడం అభినందనీయమే. కేవలం ఆటపాటలతో కాలక్షేపం చేయకుండా వ్యక్తిత్వ వికాసం, యోగా, ధ్యానం నేర్పించడమనేది మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నం రేపటి తరానికి ఎంతో ఉపయోగకరం. ఇలాంటి శిబిరాలతో చిన్నారులకు వేసవి సెలవులు సద్వినియోగం అవుతాయి. సేవాభావంతో పనిచేసిన ఔత్సాహికులకు సంతృప్తీ మిగులుతుంది.  

శిబిరంలో నేర్చుకున్నవిధంగా ఇంట్లోనూ క్యాండిల్స్ తయారు చేస్తున్న చిన్నారులు

ఏడు నిమిషాల్లో 'HIIT'...రెండు వారాల్లో 'ఫిట్'!

పవర్ ఫుల్ బాడీకి 12 సూత్రాలు!

ఫిట్ నెస్ మీద మనిషికి ధ్యాస పెరిగినకొద్దీ వ్యాయామాల్లో కొత్త కొత్త ట్రెండ్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. నిపుణులు ఎప్పటికప్పుడు కొత్త వ్యాయామాలు కనిపెట్టడం లేదు. ఉన్నవాటికే పేర్లు మార్చి, స్టైల్ మార్చి క్రేజ్ సృష్టిస్తున్నారు. అలాంటిదే HIIT(హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్). చిన్నప్పుడు అందరూ చేసిన ఎక్సర్సైజ్లకే మోడ్రన్ టచ్ ఇచ్చారు. కేవలం ఏడు నిమిషాల్లో చేయతగిన వ్యాయామమిది.  HIITలో పన్నెండు రకాల వ్యాయామాలుంటాయి. దీంతో శరీరం అద్భుతమైన షేపులోకి వచ్చేయడం గ్యారంటీ అని ఈమధ్య ఓ అధ్యయనంలో తేలిందిట. అమెరికాలోని ఓర్లాండోకు చెందిన హ్యూమన్ ఫెర్మార్మెన్స్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్ జోర్డాన్ ఈ స్టడీ చేశారు. ఇందులో పన్నెండు రకాల తేలికపాటి వ్యాయామాలుంటాయి. ఒక్కో దానిక సుమారు ముప్పయి సెకన్లు పడుతుంది. ఒక్కో వ్యాయామం మధ్య కనీసం పది సెకన్ల విరామం ఉంటుంది. ఈ పన్నెండు ఎక్సర్సైజ్లు చేయడానికి ఏడు నిమిషాలు సరిపోతుంది. అవసరాన్ని బట్టి వీటన్నింటినీ రెండు మూడు సార్లు రిపీట్ చేయవచ్చు. సాధారణ పద్ధతుల్లో ఎనిమిది వారాల వ్యాయామంతో కనిపించే ఫలితం కన్నా "హిట్' విధానంతో రెండు వారాల్లోనే ఫిట్ నెస్ వస్తుందని అమెరికాన్ కాలేజ్ ఆప్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రచురించే హెల్త్ అండ్ ఫిట్ నెస్ మ్యాగజైన్ వెల్లడించింది.

(ఇది ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ రాసిన కథనం కాదు. కేవలం ఆసక్తితో తెలుసుకున్న వివరాలను షేర్ చేసుకోవడానికి రాసినదే. అందువల్ల ఈ వ్యాయామాలు చేయాలనుకునే వారు ముందుగా నిపుణులు, వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. గుంజీలు, గోడకుర్చీలు గత తరం పాఠశాలల్లో విద్యార్థులందరికీ ఆనాటి పంతుళ్లు బెత్తంతో నేర్పిన విద్యే! ఈ HIITలోని పన్నెండు సూత్రాల్లోనూ దాదాపు అలాంటివే ఉన్నాయి. కాకపోతే కాస్త జాగ్రత్త తీసుకుంటే చాలు)

పన్నెండు రకాల HIIT వ్యాయామాలు-

1. Jumping jacks (మొత్తం శరీరానికి వ్యాయామం)- నిలబడిన చోటే గెంతడం. చేతులు పైకెత్తడం, కాళ్లు ఎడంగా ఉంచడం... ఇలాంటివి సూర్య నమాస్కారాల్లో ఉంటాయి. అమ్మాయిలైతే తాడాటను కన్వర్ట్ చేసుకోవచ్చు. 

=================================

 

 2. Wall sit (పొట్ట కింది భాగానికి వ్యాయామం)- గోడ కుర్చీ వేయడం లాంటిది. వీపు భాగాన్ని గోడకు ఆన్చి మోకాళ్ల మీద బరువు మోపడం.

==================================

3. Push-up (శరీరంలోని పొట్ట పైభాగానికి వ్యాయామం)- శరీరాన్ని నేలకు అభిముఖంగా ఉంచి... చేతుల మీద బాడీని కిందకీ పైకీ లేపడం. ఇది అందరికీ ప్రాక్టీసులో ఉన్న వ్యాయామమే.  

=======================================

4. Abdominal crunch (శరీరం మొత్తానికి ఉపయోగకరం)- వెల్లకిలా పడుకుని కడుపు భాగం కదిలేలా కాళ్లూ చేతులూ దగ్గరగా... దూరంగా చేయడం.

======================================

5. Step-up onto chair (శరీరం మొత్తానికి లాభం)- ఎదురుగా కుర్చీ ఉంచుకుని కాళ్లను ఒకదాని తర్వాత ఒకటిగా దాని మీద ఉంచడం. మెట్ల మీద ఇలాంటి ఎక్సర్ సైజ్ కొంత అనువుగా ఉంటుందేమో...

=================================

6. Squat (పొట్ట కింది భాగానికి ఎక్సర్సైజ్)- కాళ్లు కొద్దిగా ఎడంగా ఉంచాలి. రెండు చేతులూ జోడించాలి. నడుం భాగాన్నికిందకీపైకీ కదల్చాలి. మోకాళ్ల మీద భారం పడుతుంది. నడుం కింది భాగానికి మంచి వ్యాయామం.

===================================

7. Triceps dip on chair (పొట్ట పైభాగానికి వ్యాయామం)- కుర్చీ ముందు కూర్చుని రెండు చేతులూ దాని మీద వాల్చాలి. చేతుల మీదే శరీరం బరువు మోపుతు నడుం భాగాన్ని కిందకీపైకీ కదల్చాలి. కొంత కష్టమైనదైనా ఈ వ్యాయామంతో చేతులు దృఢంగా మారతాయి. ఛాతీ భాగానికి మంచి వ్యాయామం. 

================================

8. Plank (శరీరం మొత్తానికి మంచిది)- శరీరాన్ని ఏటవాలుగా ఉంచాలి. ఒకచేతి మీద భారం మోపుతూ భుజాలు, తల భాగాన్ని పైకి లేపాలి. శరీరాన్ని చేతి మీదే ఆన్చి మరో చేత్తో భుజం భాగాన్ని కదపాలి. ఒక చేతితో చేసిన తర్వాత రెండో చేత్తో చేయడం వల్ల చాతీ, భుజం భాగాలకు వ్యాయామం అవుతుంది. 

=================================

9. High knees/running in place (శరీరం మొత్తానికి లాభం)- మోకాళ్ల మీద శరీరాన్ని వంచి ఒక కాలి తర్వాత మరో కాలు మార్చుతూ జంపింగ్ చేయడం. అభ్యాసం ద్వారా  ఇది సులువుగా చేయడానికి వీలవుతుంది.

==================================

10. Lunge (పొట్ట కింది భాగానికి వ్యాయామం)- ఒక కాలిని ముందుకు పెట్టి మోకాలి మీద వంగుతూ శరీర భారాన్ని ఆ కాలి మీదే ఆన్చాలి. ఇలా ఒక కాలు తర్వాత మరో కాలు మార్చుకుంటూ చేయవచ్చు. కాళ్ల కండరాలకు, పిక్కలకు, పాదాలకు మంచి ఎక్సర్ సైజ్ అవుతుంది. 

==================================

11. Push-up and rotation (శరీరంలోని పైభాగానికి ఎక్సర్సైజ్)- మూడో ఎక్సర్ సైజులో చెప్పినట్లు ఫుష్ అప్స్ లో ఇంకొంత కష్టతరమైన వ్యాయామమిది. పుష్ అప్స్ తో చేతులు, భుజాలకు వ్యాయామం జరుగుతుంది. రొటేషన్ లో ఛాతీ, పొట్ట కింది భాగానికి కూడా ఉపయోయకరంగా ఉంటుంది. 

======================================

12. Side plank (శరీరం మొత్తానికి లాభం)- ఎనిమిదో ఎక్సర్ సైజ్ మాదిరిగానే చేతులతో పాటు కాళ్లకు కూడా వ్యాయామం అయ్యేలా చూసుకోవాలి. చేతుల మీద శరీరాన్ని ఆన్చి ఉంచాలి కాబట్టి పట్టుకోల్పోకుండా చూసుకోవాలి. అలాగే రెండు పాదాలు ఒకదానిమీద ఒకటిగా భూమి మీదే ఆన్చి ఉంటాయి.

=================================

కేవలం ఏడు నిమిషాల్లో చేయగల ఈ పన్నెండు వ్యాయామాలు(ఎక్సర్ సైజ్ సర్క్యూట్) జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయడం మంచిది. సాధారణ ఎక్సర్ సైజ్ కన్నా త్వరితగతిన బాడీకి ఫిట్ నెస్ వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

సుఖీభవ...!