Wednesday, 22 May 2013

హిందీకో లాల్ సలాం!

మన పేరు, మన తీరూ...!

చైనాలో హిమ, మణి, రేష్మ, అనురాగ్ లాంటి పేర్లున్నవారెవరైనా ఉంటారా!
'నో...ఇంపాజిబుల్... అలాంటి పేర్లతో అక్కడెవరుంటారు' అని బల్లగుద్ది చెప్తున్నారా? అయితే మీరు ఆ కథనం పూర్తిగా చదవాల్సిందే. 

చీనీ వాలా... హిందీ బోలా

బీజింగ్ యూనివర్సిటీలో పదహారణాల భారతీయం ఉట్టిపడుతోంది. లీ, వాంగ్, జింగ్, చుక్ లంతా చక్కగా అచ్చమైన హిందూ పేర్లు పెట్టేసుకుంటున్నారు. ఎప్పుడో నెహ్రూ కాలంలో హిందూ, చీనీ బాయి బాయి అంటూ పంచసూత్రాలు పఠించారు. మళ్లీ ఇప్పుడెందుకిలా ఇండియన్ నేమ్స్ కు షిఫ్ట్ అవుతున్నారనే డౌటొద్దు. ఇది అక్షరాలా నిజం.

క్లాసులు కిటకిట

చైనీయులకెందుకో మన హిందీ మీద తెగ మోజు పెరిగింది. బీజింగ్ వర్సిటీలో హిందీ క్లాసులకు చీనీ యువత ఎగ్గొట్టకుండా అటెండ్ అవుతున్నారుట. సరదాగా హిందీ నేర్చుకున్న చైనా అమ్మాయి వాంగ్ జింగ్ తన పేరును చేతన అని మార్చేసుకుంది. ఇప్పుడు యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా హిందీ పాఠాలు చెప్తోంది. అసలు హిందీ అంటే అక్కడి యువతకు మక్కువ కలిగించింది ప్రొఫెసర్ జియాన్ జింకోయ్. ఇరవయ్యేళ్ల క్రితం మనదేశానికొచ్చినప్పుడు షార్ట్ టర్మ్లో హిందీ నేర్చేసుకున్న ఘనాపాటీ జియాన్. ఔత్సాహికుడైన జియాన్ హిందీ అంటే వల్లమాలిన ప్రేమాభిమానాలు చూపిస్తారు. అందుకే సర్కారును కూడా మెప్పించి ఒప్పించాడు. వర్సిటీల్లో దీన్నో కోర్సుగా పెట్టేందుకు చైనా పాలకులు ప్రోద్బలం అందించారు.

మన వ్యామోహం... వారి ప్రేమ

ఇంగ్లిషు వ్యామోహంలోపడి మనం హిందీ సహా తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం లాంటి ప్రాంతీయ భాషలను మరచిపోతున్నాం. చైనీయులు మాత్రం మన జాతీయ భాషకు గౌరవం ఇచ్చి చక్కగా నేర్చుకుంటున్నారు. దేవేందర్ శుక్లా, విజయ్ సింగ్ లాంటి హిందీ అధ్యాపకులు బీజింగ్ లో పరాయి పిల్లలకు మన భాష బోధిస్తున్నారు. 
చైనాలో వాళ్ల సొంత భాష(చీనీ లేదా మాండరిన్) తప్ప ఇంగ్లిష్ జోలికి అంత ఈజీగా వెళ్లరు. మన దగ్గర ఇంగ్లిష్ అంటే మోజెక్కువ. మాతృభాషలు మృతభాషలుగా మారిపోయిన దౌర్భాగ్యం. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ అన్నీ సగం సగం పదాలు కలిపేసిన 'సంకరభాష'. రిక్షా కార్మికుడు, కిరాణాకొట్టు యజమాని, స్ట్రీట్ వెండర్... అందరిదీ మిక్సుడ్ లాంగ్వేజే. చీనీవాలా మాత్రం మరో భాష జోలికివెళ్లడు. మన హిందీ మాత్రం అభిమానంతో నేర్చుకుంటున్నారు. 

రాగం...తానం...పల్లవి...

భాష నేర్చుకోవడమే కాదు... భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ఇష్టపడుతున్నారు. హిందూస్ధానీ సంగీతం సాధన చేస్తున్నవారు, భరతనాట్యం నేర్చుకుంటున్నవారూ మనకు కనిపిస్తారు. మేరా పడోసి భారత్ మహాన్(మా పొరుగునున్న భారత్ మహాగొప్పది) అనుకుంటూ మన కళలను ఔపోసనపట్టేస్తున్నారు. ఈశా అనే చైనా యువతి భారతీయ సంప్రదాయ నృత్యాలు నేర్పించే గురువుగా సెటిలైపోవడం అభినందించాల్సిన అంశమే.    

మార్కెట్ మంత్ర! 

చైనా యువతకు మన హిందీ అన్నా, మన సంప్రదాయాలన్నా ఇంత  ఆసక్తి పెరగడానికి ఓ బలమైన కారణం ఉంది. అదే విస్తారమైన ఇండియన్ కన్సూమర్ మార్కెట్. ప్రపంచ దేశాలన్నీ సర్వీస్ మార్కెట్ మీద దృష్టి సారిస్తే చైనా ప్రొడక్టివ్ మార్కెట్ మీద కన్నేసింది. ప్రపంచంలో మనం అడుగుపెట్టిన ప్రతిచోటా చైనా పోటీగా నిలబడుతోంది. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, ఇన్ ఫ్రాస్టక్చర్, ఎడ్యుకేషన్... ఇలా అన్ని రంగాల్లో మనకు గట్టి పోటీనిచ్చేది చైనాయే. అంతరిక్ష ప్రయోగాల్లో తప్ప ఇంకా ఆయుధాలు,  రక్షణ సామాగ్రి తయారీలో మనం ముందడుగు వేయలేదు. ప్రపంచ మార్కెట్ లో మన అవకాశాలను కొల్లగొట్టడమే కాకుండా మనదేశంలోనూ విస్తరించాలనేది చైనా వ్యూహం కావచ్చు. 

చుట్టేస్తున్న రెడ్ డ్రాగన్

బ్రహ్మపుత్ర ఎగువన ఇష్టానుసారం ప్రాజెక్టులు కట్టేసింది. ఆ నదీజలాల వివాదం  పరిష్కారమవదు. లడఖ్ సరిహద్దుల్లో చొచ్చుకువచ్చేసి సైనిక శిబిరాలు వేసుకుంది. చివరికి మన భూభాగంలోంచి మనమే వెనక్కి మళ్లాల్సి వచ్చింది. అసలు రెండు దేశాల మధ్య ఆంగ్లేయులు సరిహద్దుగా చూపించిన మాక్ మిలన్ రేఖ భూమి మీద లేదు. కేవలం మ్యాప్ మీదే కనిపిస్తుంది. నెహ్రూ నుంచి రేపు రాహుల్ గాంధీ దాకా ఎన్ని హయాంలు మారినా ఆ వివాదం రావణకాష్టమే. చైనా పీపుల్స్ ఆర్మీ చొరబాట్లు ఏ గుణపాఠం నేర్పించాయి...? ఆ దేశ కొత్త ప్రధాని తొలి విదేశీయాత్ర పేరుతో మనదేశానికి రావడం ఏ హితబోధ చేసింది? మనం చీనీ,హిందీ భాయీ భాయీ అంటూ మితృత్వం చాటుకుంటున్నాం. ఆ డ్రాగన్ మాత్రం మన మార్కెట్ చుట్టేస్తోంది. అందుకే అక్కడి యువతకు మన హిందీ మీద ఇంత ప్రేమ ఉప్పొంగుకొస్తోంది.

2 comments:

జలతారు వెన్నెల said...

intresting!

nihar said...

థాంక్యూ జలతారువెన్నెల గారూ... బ్లాగులో చాలా మంది మిత్రులు కవిత్వం, సీరియస్ వ్యవహారాలు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి నా అభిరుచి మేరకు ఇలాంటి సామాజిక అంశాలను నలుగురితో పంచుకోవాలనుకుంటున్నాను. రెగ్యులర్ గా చదువుతున్నందుకు ధ్యాంక్యూ....నిహార్