Thursday 9 May 2013

లై'సెన్సు'లేని కుక్కలు...!

ఓనర్లకు ముకుతాడు!
మన హైదరాబాద్ లో వీధి కుక్కలకు, జాతి కుక్కలకు సెన్సులేదు. లైసెన్సూలేదు. నగర సింహాల్లా చెలరేగిపోతుంటాయి. వీధికుక్కలైతే బలాదూర్. జాతి కుక్కలైతే మీద పడి కండలుపీకేదాకా తెలియదు. రోజూ డజన్లకొద్దీ ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలను తెలుగు పేపర్లు పెద్దగా ఫోకస్ చేయవు గానీ ఇంగ్లిష్ జర్నలిస్టులు కుక్క కాటు బాధితుల వేదనను పేరాలకొద్దీ రాస్తుంటారు. మన జీహెచ్ఎంసీ అధికారులు ఎలాగూ కుక్కలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందుకే కనీసం ఓనర్లనైనా కంట్రోల్ చేయడానికి ఇప్పుడు లైసెన్సింగ్ విధానం అమల్లోకి తెస్తున్నారు.

ఒకరికి దర్జా... ఒకరికి దడ

కుక్కను పెంచుకోవడం ప్యాషన్ సింబల్ అయిపోయింది. ఇంటి ఆవరణలో బొచ్చుకక్క ఉంటే ఆ ఇంటి యజమానికి దర్జా, దర్పం. డబ్బున్న మహానుభావుడు ఏం వెలగబెట్టినా బాగానే ఉంటుంది. కానీ టైంబాగోక ఏ అమాయకుడో ఆ కుక్కబారిన పడితేనే కష్టం, నష్టం. బొడ్డూ చుట్టూ ఇంజెక్షన్లు బోలెడు ఖర్చు. కుక్కలు పెంచుకునేవారు వాటికి ఖరీదైన బిస్కెట్లు పెడుతున్నారు. పోషకాలున్న డాగ్ ఫుడ్ తినిపిస్తున్నారు. వెండి బంగారం చైన్లదాకా వెళ్లకపోయినా దండిగా ఖర్చుపెట్టి ఫారిన్ ఇంపోర్టెడ్ బెల్టులు తెప్పించి శునకాలను కడుతున్నారు. ఇంతచేస్తున్నారు బాగానే ఉంది. కానీ ఎవరినీ కరవకూడదన్న ఇంగిత జ్ఞానాన్ని మాత్రం బోధించలేకపోతున్నారు. తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఇల్లు దాటి బయటకు వెళితే వీధి కుక్కల గోల. ఏ వీధిలోకి వెళ్లినా డజన్లకొద్దీ ఊరకుక్కలు. వీటికి తోడు ఆంబోతుల్లాంటి జాతి కుక్కలు. యజమానులు దగ్గరుండి శునకరాజాల్ని షైర్ తిప్పుతుంటారు. కానీ అటువైపు నడిచి వెళ్లే వారికే గుండెళ్లో రైళ్లుపరుగెడుతుంటాయి. పిల్లలు, వృద్ధులు, మహిళలు... చివరికి ఆజానుబావులైన మగవాళ్లూ  భయపడుతూ అడుగులు వేస్తుంటే కుక్కల యజమానులు మాత్రం అదేదో చోద్యం చూస్తుంటారు. ఇంతోటి కుక్కకు తానే ఓనరునన్న ఫీలింగు. 

శునక బాధితుల గోడు వినేదెవరు...

ఈమధ్య సినీనటుడు వేణుమాధవ్ కుక్క ఓ ఇంటర్ విద్యార్థిని కరిచేసింది. బాధితుడి కుటుంబం పోలీసు కంప్లయింట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేశారు. అంతకుముందు రోడ్డు మీద నడిచివెళ్తున్న ఓ ఆర్మీ అధికారిని ఎవరి పెంపుడు కుక్కో కాటేసింది. బలిష్టంగా ఉన్న ఆర్మీ అధికారే కుక్కను నిలువరించలేకపోయాడంటే ఇక బక్కపలుచనివారి సంగతేంటి. అసలు శునకాలను పెంచుకునేవారి లెక్కాపద్దూ ప్రభుత్వం దగ్గర లేకుండా పోతోంది. ఒకవైపు వీధికుక్కలూ కరిచేసి, డబ్బున్నవారి పెంపుడు కుక్కలూ కరిచేస్తే ఇక రోడ్డు మీద తిరిగేవాళ్ల పరిస్థితేమిటి?.   వీధి కుక్కలకు ఏమైనా అయితే బ్లూక్రాస్ సభ్యులు వత్తాసు పలుకుతారు. పరదేశీ సంతతి శునకాల ఆలనాపాలనాకు డోకా ఉండదు. యజమానులకు అసోసియేషన్లు, బొచ్చుకుక్కలకు కెన్నెల్ క్లబ్బులూ ఉండనే ఉన్నాయి. ఇంతకీ కుక్క కరిచిన బాధితుల గోడు వినేవాడే ఉండడు. కుక్క కరుస్తుందని తెలుసు కదా... వాటి జోలికెందుకు వెళ్లావని నీతిబోధలు చేసే వారే ఎక్కువ. ఎవరికైనా ఓసారి కుక్క కరిస్తేగానీ తెలియదు... ఆ తర్వాత భయం ఎంతకాలం వెంటాడుతుందో.

కుక్క చెవికి ట్యాగు

పెంపుడు కుక్కలను జులాయిల్లా వదిలేసే ఓనర్లకు ఇక ముకుతాడు పడబోతోంది. అసలు లైసెన్సు లేకుండా కుక్కను పెంచుకునే ఛాన్సేలేకుండా అధికారులు  పాత చట్టాల దుమ్ముదులుపుతున్నారు. శునకాల పెంపకానికి వర్తించే యానిమల్ బర్త్ కంట్రోల్  యాక్ట్ 2007 ప్రకారం ఇకపై కుక్కను పెంచుకోవాలంటే లైసెన్స్ తప్పనిసరి. ఏడాదికి మామూలు శునకానికి  యాభై రూపాయలు, కెన్నెల్ జాతి కుక్కలైతే ఏడాదికి వెయ్యి రూపాయలు రుసుం కింద జీహెచ్ఎంసీకి చెల్లించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. లైసెన్సుతో పాటు కుక్క చెవికి కట్టేందుకు ఓ ట్యాగ్ కూడా ఇస్తారు. ఇక అనుమతి లేకుండా కుక్కలను పెంచుకోవడం కుదరదు. ఒకవేళ ఆ కుక్క ఎవరినైనా కరిచినా సదరు లైసెన్స్ రద్దవుతుంది. శిక్షలు కూడా పడతాయి. సో శునక బాధితులు కొంతైనా భరోసాగా తిరగొచ్చు. కానీ కుక్కలను పెంచుకునేవారికే అదనపు భారం... ఏటేటా లైసెన్సు రుసుం కట్టాలి. హైబ్రీడ్ శునకాలకు ఫారిన్ బిస్కెట్లు పెట్టేవాళ్లు ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా ఏంటి?!

3 comments:

Anonymous said...

కుక్కకాటుబాధితులసంఘం పెట్టి రిజిస్టర్ చేయాలి!

nihar said...

సూర్యప్రకాశ్ గారూ మీరన్నట్లు కుక్కకాటు బాధితులకు ఏ అండా లేకుండాపోతోంది. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వలేని సర్కారు ఆస్పత్రులు, కుక్కకాటుకైనా వేలల్లో బిల్లు వేసే ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల పాలిట కుక్కలకన్నా ప్రమాదకరంగా మారాయి. కుక్క కాటు భయం మనిషిని జీవితాంతం వెంటాడుతుంది. కుక్క కరిస్తే ఏదేదో అవుతుందన్న భయాలున్నాయి కదా!. అందువల్ల బాధితుల పక్షాన రకరకాల పోరాటాలు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే మంచిది... నిహార్

Praveen Mandangi said...

They can tame donkeys instead of dogs. A donkey may kick but not bite.