Tuesday, 14 May 2013

కీటక భక్షకులైపోండి...!

ఆకలికాలం వచ్చేస్తోందా...?!
'సాపాటు ఎటూ లేదు....' అంటూ 'ఆకలిరాజ్యం' సినిమాలో ఉద్యోగంసజ్జోగం లేని గరీబు హీరో పాటపాడుకోవడాన్ని తెలుగు సినీ ప్రేక్షకులు అంత ఈజీగా మచరిపోలేరు. నిజంగానే ప్రపంచంలోని చాలాదేశాల్లో 'ఆకలిరాజ్యం' విస్తరిస్తోంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. పూర్వం కందమూలాలతో కడుపునింపుకున్నట్లుగానే ఇక పురుగులు, కీటకాలు ఆరగించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. 

  పురుగులతో కడుపునింపుకోవాలిట!

ఇప్పటికే ప్రపంచంలో రెండువందల కోట్ల మంది ఇలాంటి ఆహారాన్నే తీసుకుంటున్నారని ఐకర్యరాజ్యసమితి చెప్తోంది. పేదదేశాల్లో ఆకలిని జయించాలంటే పురుగులు, కీటకాలే దిక్కని ఐరాస అనుబంధ ఆహార మరియు వ్యవసాయ సంస్థ సెలవిచ్చింది. మనుషులు భుజించడానికి భూ జలచరాల్లో సుమారు 1900 రకాల పురుగులు, కీటకాలు అందుబాటులో ఉన్నాయని సలహా ఇస్తోంది. పైగా ఈ ఆహారంతో ఆకలి తీరడమే కాకుండా ప్రోటీన్లు, విటమిన్లు దండిగా దొరుకుతాయిట. మనిషి ఆరోగ్యానికి హాని చేసే కొవ్వు శాతం తక్కువగా ఉండడంతో మరింత మేలు జరుగుతుందిట. 

ఆహార భద్రత కాదు 'ఆకలి' భద్రత...

తూనీగ, మిణుగురు, తేనెటీగ, తుమ్మెద, గొల్లభామ, కందిరీగ, ఎర్రచీమ, మిడత... ఒకటేమిటి ఏది కనిపిస్తే అది తినేసే పరిస్థితి వచ్చేస్తోందని ఐరాసా అంచనా వేస్తోంది. ఆహార భద్రత లేని అనేక దేశాల్లో ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుతున్నందున ఇలాంటి ప్రత్యామ్నాయ ఆహారం గురించి ప్రచారం చేస్తోంది. మనుషులే కాదు పెంపుడు జంతువులు, ఆవులు గేదెల్లాంటి పశువులకు కూడా ఇలాంటి ఆహారం మంచిదని సూచించింది.  తిండిగింజల కోసం ధాన్యం పండించినట్లుగానే ఆహారం కోసం పురుగులు, కీటకాలను పెంచుకోవడం ఉత్తమమని ఐరాస నిర్ధారించింది. ఇలా సూక్ష్మజీవరాశిని మనుషులు తినేస్తే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే డౌట్ అక్కర్లేదు. అలాంటి ముప్పేమీ ఉండదని భరోసా ఇస్తోంది ఐరాస. ఇప్పటికే చైనా, థాయ్ లాండ్ లాంటి దేశాల్లో పాములు, కప్పలు, తేళ్లు, కుక్కలు దేన్నీ వదలకుండా చక్కగా వేయించి వడ్డిస్తున్నారు. ఇక బొద్దింకల నుంచి, వానపాముల దాకా భూ జల చరాల్లో కనిపించినదల్లా మెనూ లిస్టులో చేరిపోతోంది. 

 లొట్టలేసుకునే వాడికా... డొక్కలెండినవాడికా...

పేద దేశాల్లో తినడానికేమీ దొరకని దుస్థితే వస్తే ఇక ఎవరైనా ఏం చేస్తారు... పురుగులు, కీటకాలు తినక తప్పుతుందా...? పురుగులు, కీటకాలతో ఆకలి తీర్చుకోవడమే మంచి మార్గమని ఐక్యారాజ్య సమితి సలహా ఇచ్చింది పేదదేశాల్లోని నిరుపేద జీవులకు. జిహ్వకో రుచి అనుకుంటూ పాస్ట్ఫుడ్ సెంటర్లో ఇన్ సెక్ట్స్ ఫైలు లొట్టలేసుకుంటూ లాగించే థాయ్, చైనీయులకు కాదు. జీవావరణంలో ప్రకృతి నిర్ధేశించిన ఆహార చక్రం ప్రకారం ఒక జీవి మరో జీవిని తినేసి మనుగడ సాగించడం అనివార్యమే. కంద మూలాలు తినే కాలం నుంచి పిజ్జాలు ఆరగిస్తున్న మోడ్రన్ ఎరా వరకూ బలవంతులకే కడుపు నిండుతోంది. పేదవాడికే డొక్క ఎండుతోంది. 'అన్నమో రామ చంద్రా...', 'ఆకలో లక్ష్మణా....' అంటూ ఆకలి కేకలు పెడితే ఆలకించేందుకు దేశాన్ని దుర్భిక్షంగా పాలించే ప్రభువులెక్కడున్నారు గనక! రానురానూ ఆకలి రాజ్యాలే గానీ  భూతద్దం పెట్టి వెతికినా రామరాజ్యం జాడ కనిపించే పరిస్థితి ఉండదనేది నిజం!

No comments: