సైకిల్ ఎక్కగలవా...!
సైకిల్ గమ్యం చేర్చేనా?
హైదరాబాద్ మహానగరంలో ప్రధాన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ రద్దీ, రెండోది పర్యావరణ కాలుష్యం, మూడోది రోడ్డు ప్రమాదాలు. మూడు సమస్యలూ ఒకదానికొకటి ముడిపడివున్నవే. కాలుష్యంలో మళ్లీ ధ్వని, వాయు, కాంతి కాలుష్యాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి.
ముప్పయ్యేళ్లలో కోటి వెహికల్స్
స్కూటర్లు, మోటారు బైకులు, కార్లు, జీపుల సంఖ్య ఇప్పుడు సుమారు ఇరవై లక్షలుండవచ్చు. 2011లో అధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 16.75లక్షలు. 2041 నాటికి వ్యక్తిగాత వాహనాల సంఖ్య కోటి దాటుతుందని అంచనా. ప్రస్తుతానిక ప్రతి వెయ్యి మందిలో 152 వాహనాలుంటే వచ్చే మూడు దశాబ్ధాల్లో వెయ్యి మందికి 512 వాహనాలుంటాయని లెక్క. అంటే నగర రోడ్ల మీద కాలినడకన అడుగు కూడా ముందుకు వేయలేమనేది సుస్పష్టం. జనాభాను మించి సెల్ ఫోన్లున్నట్లుగా వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా కుటుంబాలకు కారు, కనీసం రెండు టూవీలర్లు ఉంటున్నాయి. టీనేజీ కూడా దాటని పిల్లలకు స్కూటీలు, బైకులు వచ్చేస్తున్నాయి. సంపన్న కుటుంబాల పిల్లలైతే ఏకంగా లక్షకు పైగా ఖరీదు చేసే స్పోర్ట్స్ బైకులే వేసుకుని రోడ్ల మీద రయ్యిన దూసుకువెళ్తున్నారు.
ఈ రోడ్డు మీద సైకిలుకు చోటుందా...
నగర జీవికి నిత్యనరకం చూపిస్తున్న ట్రాఫిక్ రద్దీ, పర్యావరణ కాలుష్యం, రోడ్డు ప్రమాదాల సమస్యకు పరిష్కారం ఒక్కటే అదే సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడం. ఇందుకోసం బైస్కిల్ ఫ్రెండ్లీ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఓ అధ్యయనం సూచించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో సమగ్ర రవాణా వ్యవస్థ ఎలా వుండాలన్నదానిపై అధ్యయనం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య తగ్గాలంటే బైస్కిల్ ఫ్రెండ్లీ నగరంగా తీర్చిదిద్దాల్సిందేనని నిపుణులు సలహా ఇస్తున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు చకచకా ముందుకు సాగుతుంటే ఏనాటికైనా ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట లభిస్తుందని నగరజీవి ఆశ పెట్టుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు అంతా పూర్తయ్యే నాటికి జనాభా సంఖ్యా, ప్రైవేట్ వామనాల సంఖ్యా పెరిగిపోతుంది. ఆనాటికి సరిఫడా ట్రాఫిక్ అప్పుడుంటుంది.
పార్కింగ్ ప్రధాన సమస్య
ఇంతకీ హైదరాబాద్ నగరాన్ని బైస్కిల్ ఫ్రెండ్లీగా మార్చాలంటే ఏం చేస్తారనేది సందేహం. సైకిళ్లు నిలుపుకునేందుకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలి. ఇప్పటికే టూ వీలర్ ఆపడానికే పర్కింగ్ లేదు. రోడ్డు మీదే పార్కింగ్ అంటూ ఐదు పాతిక రూపాయల దాకా గుంజుతున్నారు. షాపింగ్ మాల్స్లోనూ, కమర్షియల్ కాంప్లెక్స్లోనూ పార్కింగ్ సౌకర్యాం ఉండడం లేదు. ఇక కాలనీల్లో ఏ రోడ్డులో చూసినా ఇళ్ల ముందే కార్లు పెట్టేసి ఉంటాయి. షాపింగ్ ఏరియాలో కూడా ఫుట్ పాత్ సౌకర్యం కనిపించదు. ఇలాంటప్పుడు సైకిల్ మీద వెళ్లేవారు ముందుకు కదిలేదెలాగో... ఎక్కడైనా ఆపాల్సి వస్తే చోటెక్కడుందో హెచ్ ఎం డీ ఏ అధికారులకే తెలియాలి. బైస్కిల్ కారిడార్లు ఏర్పాటు చేయడం, రెస్టింగ్ స్టేషన్లు నిర్మించడం, నీడనిచ్చే ల్యాండ్ స్కేప్స్ పెంచడం... సలహాలు, సూచనలు బాగానే ఉంటాయి. ఆచరణలోకి వచ్చేటప్పటికే అవాంతరాలు. ఎల్ బీ నగర్ నుంచి కూకట్ పల్లి దాకా ట్రాఫిక్ రద్దీ వేళలో టూవీలర్ మీద వెళ్లాలంటే గంటకు పది కిలోమీటర్ల స్పీడుతో వాహనాన్ని దాదాపు నెట్టుకుంటూ వెళ్లాల్సిందే. కారైతే లీటర్లకొద్దీ పెట్రోల్ ఖర్చవుతుంది. గంటలకొద్దీ టైము కూడా కరిగిపోతుంది. రెండున్నర నుంచి మూడు గంటల జర్నీ. బతుకుజీవుడా అంటూ ఆఫీసులకు వెళ్లివస్తున్న వారంతా ఈ రోడ్ల మీద ప్రయాణానికి ప్రత్యామ్నాయమేమిటా అని రోజుకు వంద సార్లయినా ఆలోచిస్తుంటారు.
ఏదీ ప్రత్యామ్నాయం?
అధికార యంత్రాంగాలు ఆలోచిస్తున్నట్లు సైకిల్ అనేది కచ్చితంగా ప్రత్యామ్నాయం కాదు. కాదూకూడదూ అంటే దగ్గరదగ్గర పనులకు వెళ్లివచ్చేందుకు సైకిల్ ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మెట్రో రైళ్లు తిరుగుతుంటే ఆ స్టేషన్ దాకా సైకిల్ మీద వెళ్లి అక్కడి నుంచి మనక్కావాల్సిన రైలెక్కవచ్చు. ఇంతేగాని సైకిల్ను నమ్ముకున్నామంటే ఇంకా అస్తవ్యస్థమే.
No comments:
Post a Comment