Saturday 18 May 2013

బాలల సేవే భగవానుడి సేవ

ఉచితం, ఉపయోగకరమూ...!

చిన్నారులకు వేసవి సెలవులు ఎంతో విలువైనవి. అందుకే ఆ సమయం వృధా అవకుండా అనేకచోట్ల వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటారు. అయితే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇది వ్యాపార ధోరణితో సాగుతున్న వ్యవహారం. ఎక్కడో ఒకటిరెండు చోట్ల ఉచిత క్యాంపులు నిర్వస్తున్నారు. 

సేవాదృక్పథంతో కాకుండా పక్కా లాభాపేక్షతో సాగే శిబిరాలే ఎక్కువ. పైగా ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాల్లో పిల్లలు ఎంచుకున్న ఏదో ఒక అంశంలో మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. దాదాపు అన్నిచోట్లా కరాటె, స్విమ్మింగ్, క్రికెట్ తదితర క్రీడాంశాలే ఉంటాయి. కొన్నిచోట్ల సంగీతం, డాన్సు లాంటివి ఉన్నా  దండిగా ఫీజులు లాగుతుంటారు. 



  ఆటపాటలే కాదు వ్యక్తిత్వమూ ముఖ్యమే...

వ్యాపారాత్మక వేసవి శిబిరాలకు భిన్నంగా హైదరాబాద్ కొత్తపేట(దిల్ సుఖ్ నగర్)లోని శ్రీరామలింగేశ్వర కాలనీలో సేవాభావంతో పూర్తిగా ఉచితంగా, వైవిధ్య భరితమైన వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. కాలనీకి చెందిన కొంతమంది ఔత్సాహికులు ఇరుగుపొరుగు కాలనీల పిల్లలను చేరదీసి వారికి రకరకాల అంశాలు ఉచితంగా బోధిస్తున్నారు. ఎస్ఆర్ఎల్ కాలనీ రోడ్ నెంబర్ 7లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి. ఆలయ ప్రాంగణంలో మిట్ట మధ్యాహ్నం శిబిరం నిర్వహిస్తున్నా యాభైకి పైగా చిన్నారులు ఉత్సాహంతో వస్తున్నారు.

కేవలం ఆటపాటలే కాకుండా శ్లోకాలు, పద్యాలు నేర్పించడంతో పిల్లలంతా ఆసక్తి చూపిస్తున్నారు. యోగా, ధ్యానం నేర్పిస్తున్నారు. క్విజ్ పోటీలతో మేధోవికాసానికి తోడ్పడుతున్నారు. బాల్యంలోనే తెలుగు ఇంగ్లిషు భాషల్లో  నైపుణ్యం పెంపొందేలా ప్రోత్సహిస్తున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తున్నారు. క్రికెట్ ఆడిస్తున్నారు. డాన్సులు చేయిస్తున్నారు. రకరకాల క్రాప్ట్ వర్కులూ నేర్పించడంతో పిల్లలంతా అల్లరి మానేసి చక్కగా వేసవి శిక్షణ శిబిరానికి వస్తున్నారు. కాలనీకి చెందిన ఔత్సాహికులు సేవా భావంతో తమకు తెలిసిన విద్య నలుగురికీ పంచడం అభినందనీయమే. కేవలం ఆటపాటలతో కాలక్షేపం చేయకుండా వ్యక్తిత్వ వికాసం, యోగా, ధ్యానం నేర్పించడమనేది మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నం రేపటి తరానికి ఎంతో ఉపయోగకరం. ఇలాంటి శిబిరాలతో చిన్నారులకు వేసవి సెలవులు సద్వినియోగం అవుతాయి. సేవాభావంతో పనిచేసిన ఔత్సాహికులకు సంతృప్తీ మిగులుతుంది.  

శిబిరంలో నేర్చుకున్నవిధంగా ఇంట్లోనూ క్యాండిల్స్ తయారు చేస్తున్న చిన్నారులు

No comments: