Sunday, 5 May 2013

ఓటుకు రెండు వైపులా పదును!

కడుపుమండిన వాడు, కడుపునిండిన వాడూ...!

కర్నాటక విధానసభ ఎన్నికల పోరు పరిసమాప్తమైంది. ఇక ఎనిమిదో తేదీన ఫలితాలు రావడమే తరువాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారన్న ఉత్కంఠను పక్కనపెడితే ఓటరు ఓడిపోయాడనేది నిజం. ఈ ఎన్నికల ప్రక్రియ రెండు రకాల ఓటరు మనస్తత్వాలకు అద్దం పట్టింది. ఒకటి... కడుపునిండిన వాడు ఓటేయడానికి రాడనేది నిరూపితమైంది. కడుపుమండినవాడూ నేతల తీరుకు నిరసనగా ఓటే వేయడనేది రుజువైంది. రెండోదాని మాటెలాగున్నా కడుపునిండిన వాడు అసలు ఓటు ఎందుకు వేయలేదన్నది విస్మయం కలిగించే అంశం.

కడుపునిండిన వాడికి తెలియని ఓటు విలువ

ప్రజాస్వామ్య దేశంలో పౌరుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కదా! మరి బెంగళూరు నగరంలో సగం మంది పోలింగ్ బూత్ మొహమే చూడలేదు. అసలే ఆదివారం. మండుటెండలు. జాలీగా ఎంజాయ్ చేయడానికి మించిన పనేముంటుందని సగటు యువకుడనుకున్నట్లున్నాడు. అందుకే బెంగళూరు అర్బన్ నియోజకవర్గంలో రాష్ట్రంలో 293 నియోజకవర్గాల్లోకెల్లా అతి తక్కువగా 52 శాతం పోలింగ్ నమోదైంది. వేసవి కదా చల్లగా సాయంత్రం వేళయినా ఓటేస్తారనుకుని కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల దాకా పొడిగించింది. అయినా నగర ఓటరుకు తీరికే దొరకలేదు. ఐదేళ్లకోసారి వచ్చే అవకాశం ఓటు. దీన్ని కూడా సక్రమంగా వినియోగించుకోకుండా దేశాన్ని ఉద్దరించడానికి నేను సైతం సిద్ధమంటూ ప్రగల్భాలు పలికే నవతరం ఓటరులారా సిగ్గుతో తలవంచుకోండి. రాష్ట్రంలో సగటున 69 శాతం పోలింగ్ జరిగితే గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఉన్న హవేరి సెగ్మెంటులో అత్యధికంగా 73 శాతం ఓట్లు పడ్డాయి. నిజంగా ఆ గ్రామీణ ఓటర్ల విచక్షణను ప్రసంశించాలి. బెంగళూరు నగరంలో 23 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఉదయం తొలి మూడు నాలుగు గంటలూ పది శాతం పోలింగైనా నమోదు కాలేదు. అసలే గంట పెంచాం కదా భారీగా ఓట్లు పోలవుతాయని ఎన్నికల అధికారులు లెక్కలేసుకున్నా నగర ఓటరు నిరాసక్తత వల్ల ప్రజాస్వామ్యం పరిహాసం పాలైంది. ఇక రెండో తరహా ఓటరు వ్యవహారాన్ని ప్రస్తావించుకుందాం.

కడుపుమండిన వాడికి ఓటే ఆయుధం

కర్నాటకలో చాలాచోట్ల తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ గ్రామీణ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. బహిష్కరణను సమర్ధించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే అయినా... ఏ అండాదండా లేని పల్లె ఓటరుకు ఇంతకంటే మించిన ఆయుధమేముంటుంది. !  మనం ఇప్పుడే చెప్పకున్న హవేరి ప్రాంతంలో అత్యధికంగా ఓట్లు వేసిన జనం తమకు ప్రజాస్వామ్యం పట్ల ఉన్న గౌరవాన్ని చాటిచెప్పారు. అలాగే సమస్యల పరిష్కారానికి ఓటే ఆయుధం అనకున్న ఓటర్లు ఇదే జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో ఎనిమిది సెగ్మెంట్లుంటే ఆరు సెగ్మెంట్లలో జనం పెద్ద సంఖ్యలో  ఎన్నికల బహిష్కరణకు దిగారు. కరువు పరిస్థితులున్నా పట్టించుకునే నాధుడు లేదన్నది వీరి ఆవేదన. కనీసావసరాలు తీరనప్పుడు ప్రజలింతకంటే ఏంచేస్తారు! అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇంతకంటే గుణపాఠం ఇంకేముంటుంది! హవేరితో పాటు చిత్రదుర్గ, దావణగెరె, కోలార్, చిక్కబళ్లాపూర్ జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ ద్వారా అక్కడి ఓటర్లు పాలకులపై తమ నిరసనను తెలియచేశారు. ఐదేళ్లకోసారి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక జనం ముందుకే రాని రాజకీయ నాయకులకు ఇది కనువిప్పు కలిగించాల్సిన అంశం. చామరాజనగర జిల్లాలో సోలిగ అనే గిరిజన తెగ ఓటర్లు కూడా అధికార యంత్రాంగం తమను నిర్లక్ష్యం చేస్తోందంటూ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటేసినా ఫలితం లేనప్పుడు ఓటు వేయకుండా నిరసన తెలపడంలో తప్పేమీ లేదు.

రైట్ టూ రిజెక్ట్ హక్కుంది కదా....

ఈ ఎన్నికల్లో ఓటర్లలో మరో రకం చైతన్యం కూడా కనిపించింది. అదే రైట్ టూ రిజెక్ట్ ప్రొవిజన్ వినియోగించుకోవడం. ప్రజా ప్రతినిధ్య చట్టం(పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్) లోని రూల్ 49 (0) ప్రకారం వేల మంది ఓటర్లు పోటీ చేస్తున్న ఏ కేండిడేటూ  తమకు నచ్చలేదని లిఖితపూర్వకంగా తెలియచేశారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు మనకు నచ్చకపోయినా పోలింగ్ బూత్ లో అందుబాటులో ఉండే ఫామ్ 19(ఎ) నింపేసి నిరభ్యంతరంగా  సబ్ మిట్ చేయగల హక్కు ఓటరుకుంటుంది. బెంగళూరులోని ఓ నియోజకవర్గంలో ఏకంగా నలభై వేల మంది ఓటర్లు ఇలాగే రైట్ టూ రిజెక్ట్ హక్కును వినియోగించుకున్నారుట. రంగంలో ఉన్న ఏ అభ్యర్థీ నచ్చకపోతే ఇంతకంటే ఏ ఓటరైనా ఏంచేయగలడు!  

4 comments:

జలతారు వెన్నెల said...

"రైట్ టూ రిజెక్ట్" ఇంతకు ముందు దీని గురించి వినలేదు.పోస్ట్ బాగుంది నిహార్ గారు.

sarma said...

Really right to reject is good idea but it is not absolute.All parties are fielding candidates of less character or criminal character,if one section of the people reject it will have no effect. Totally all people should reject then only there will be a thinking by the political parties. Is it possible in INDIA that is called BHARAT ?

nihar said...

జలతారువెన్నెల గారూ , శర్మ గారూ నమస్కారం...
రైట్ టూ రిజెక్ట్ ప్రొవిజన్ తో పాటు బ్యాలెట్ పత్రంలోనే అభ్యర్థులందరినీ వ్యతిరేకించే ఆప్షన్ ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా ఎగైనిస్ట్ కరప్ప్షన్ లాంటి సంస్థలు ఉద్యమాలు నడుపుతున్నాయి. అయితే దీన్ని అమలు పరచడం మన దేశంలో అంత సులువేమీ కాదు. కానీ ఓటర్లకు ఇలాంటి ఆప్షన్ ఉంటే మంచిది.... నిహార్

nihar said...

జలతారువెన్నెల గారూ , శర్మ గారూ నమస్కారం...
రైట్ టూ రిజెక్ట్ ప్రొవిజన్ తో పాటు బ్యాలెట్ పత్రంలోనే అభ్యర్థులందరినీ వ్యతిరేకించే ఆప్షన్ ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా ఎగైనిస్ట్ కరప్ప్షన్ లాంటి సంస్థలు ఉద్యమాలు నడుపుతున్నాయి. అయితే దీన్ని అమలు పరచడం మన దేశంలో అంత సులువేమీ కాదు. కానీ ఓటర్లకు ఇలాంటి ఆప్షన్ ఉంటే మంచిది.... నిహార్