Friday 15 March 2013

అనగనగా ఓ నూడుల్స్ కింగ్...!

కల ఎలా నిజమైంది?!
ఓ కోటీశ్వరుడు... ముంబై తాజ్ హోటల్స్ లో వాటాలున్నాయి. అనేక సందర్భాల్లో అదే హోటల్లో స్టే చేస్తుంటారు. అయితే ఏమాత్రం వీలుచిక్కినా ఆ హోటల్ పక్కనే ఉన్న రోడ్డు మీద కాసేపు నిలబడి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. 16 ఏళ్ల వయసున్నప్పుడూ ఇలాగే ముంబై వచ్చారు. ఆ మహా రాజ సౌధాన్ని అలాగే చూస్తూ రోడ్డు మీద నిలబడిపోయారు. అప్పుడు తనతోడుగా వచ్చిన పెద్దాయన 'అలా చూసి ఆనందించు... అంతేగానీ లోపలికి అడుగు పెట్టావంటే అక్కడున్న సెక్యూరిటీ లాగి ఒక్కటిస్తాడు' అనడం ఇప్పటికీ గుర్తు. ఆనాడు అదో కల. ఇప్పుడదే నిజం. కలను నిజం చేసుకున్నదెవరో కాదు...నూడుల్స్ కంపెనీల్లో పాపులర్ బ్రాండ్ అయిన 'వై వై' అధినేత బినోద్ చౌదరి.

కల కంటే సరిపోదు, కృషి, పట్టుదల తోడవ్వాలంటున్న 'నూడుల్ కింగ్'

డ్రీమ్ బిగ్...!

పేదరికానికి చిరునామాగా మారిన నేపాల్ నుంచి తొలిసారిగా ఫోర్భ్స్ బిలియనీరు జాబితాలో చేరిన వ్యాపారవేత్త 'నూడుల్ కింగ్' బినోద్ చౌదరి. 57ఏళ్ల చౌదరి ప్రపంచ సంపన్నుల్లో 1342వ స్థానంలో నిలిచారు. వై వై నూడుల్స్ భారతీయ మార్కెట్ అంతా విస్తరించింది. అయితే కెన్యా, సౌతాఫ్రికా, సౌదీ అరేబియా, చైనా తదితర దేశాల్లోనూ వైవై ఫ్యాక్టరీలు పెట్టాలనేది నూడుల్ కింగ్ బినోద్ చౌదరి సంకల్పం. కాంబోడియా, ఫిలిప్పైన్స్, మొజాంబిక్... ఇలా చాలా దేశాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనేది ప్రణాళిక. ఒక్క నూడుల్స్ కంపెనీలే కాదు, హోటల్స్, ప్యాకేజ్డ్ ఫుడ్, రియల్ ఎస్టే్... చాలా పథకాలున్నాయి. మనదేశంలో ఉత్తరాఖండ్, అస్సాం, సిక్కంలలో ప్లాంట్లు నడుస్తున్నాయి. రాజస్థాన్, ఆంద్రప్రదేశ్ లలో తయారీ కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఒక్కరోజులో నిర్మించింది కాదు. 'డ్రీమ్ బిగ్' అన్న సూత్రాన్ని బాగా నమ్ముకున్న బినోద్ దాన్నే సక్సెస్ మంత్రగా మలుచుకున్నారు.

వలస బాటలోంచి సంపన్నుల జాబితాలోకి...

బినోద్ చౌదరి తాత 19వ శతాబ్ధం తొలినాళ్లలో రాజస్థాన్ నుంచి హిమాలయ దేశమైన నేపాల్ కు వలస వెళ్లారు. ఓ వస్త్ర దుకాణంలో ఉద్యోగం చేస్తున్న బినోద్ వాళ్ల తండ్రి సొంతగా ఖాట్మండులో ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్స్ ప్రారంభించారు.  ఆ తర్వాత రకరకాల వ్యాపారాలు చేస్తూ కోట్లు గడించారు. అలాఅలా ఎదుగుతూ వచ్చిన ఆ వ్యాపార సామ్రాజ్యం....మూడో తరంలోని బినోద్ చౌదరిని ప్రపంచ సంపన్నుల జాబితాలో చేర్చింది. ఓ పేద దేశం నుంచి ప్రపంచ సంపన్నుల జాబితాలో  చోటు సంపాదించడం అంత ఆశామాషీ వ్యవహారం కాదు. కలలు కనే నేటితరం యువతకు బినోద్ చౌదరి విజయ సూత్రం చక్కని పాఠం. విజయానికి దగ్గరి దారులేవీ ఉండవు. కృషి, పట్టుదల మెట్లే మనల్ని విజయసోపానాలెక్కిస్తాయి. నూడుల్ కింగ్ కూడా ఇలాగే ఎవరెస్ట్ కన్నా పైకెదిగిపోతున్నాడు.!  

2 comments:

జలతారు వెన్నెల said...

మాగి నూడుల్స్ తెలుసు. వై వై నూడుల్స్ మొదటిసారి వినడం.

Unknown said...

pl call me once..whenever you feel free..

tq

vsn murty
9000015131