- ప్రజల చేత... ప్రజల కొరకు...!
నవ్విపోదురుగాక
నాకేటి సిగ్గు... అన్న
చందంగా ఉంది పాలకుల తీరూతెన్నూ!. దేశ రాజధానిలో చీకటి పడితే మహిళలు రోడ్డు
మీదకు వచ్చే పరిస్థితి లేదు. చివరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షీలా దీక్షిత్...'నా కూతురు ఒంటిరిగా
తిరగాలంటే భయపడుతోంది' అన్నారంటే మహిళల భద్రతను అందరూ ఎలా గాలికి
వదిలేశారో అర్ధమవుతోంది. ఢిల్లీలో 'నిర్భయ' గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత సుప్రీంకోర్టు పోలీసులకు, పాలకులకు ఎన్నో
హితబోధలు చేసింది. ఉన్న పోలీసులందరినీ వీవీఐపీల సెక్యూరిటీకి
వినియోగించడం మానేసి, మహిళల భద్రత మీద దృష్టి పెట్టాలని ఆదేశించింది. అయినా వ్యవస్థలో మార్పేమీ కనిపించడం లేదు. ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిని ప్రజాప్రతినిధులు మారితే కదా...!
నాయకులకే ప్రజాస్వామ్యం! |
జడ్ ప్లస్ కేటగిరీలో చాంతాడంత జాబితా...
సుప్రీంకోర్టు
ఆదేశాలు పట్టని కేంద్ర సర్కారు వీవీఐపీల సేవలో నిమగ్నమవుతోంది. తాజాగా ఆరుగురు
రాజకీయ నాయకుల్ని జడ్ ప్లస్ కేటగిరి జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో
ఉన్నది ప్రముఖ నేతలా అంటే కానేకాదు. వ్యక్తిగత హోదా కోసమే వారి తాపత్రయం. మన దేశంలో వేల మంది వీవీఐపీలు. ఢిల్లీలోనే కేంద్ర
హోంశాఖ 380 మంది
వీవీఐపీలకు భద్రత కల్పిస్తోంది. ఇందులో సుమారు ముప్పయి మంది జడ్ ప్లస్ కేటగిరీ
వీవీఐపీలకు అటూఇటూగా ఎనభై మంది భద్రతా సిబ్బంది పనిచేస్తుంటారు. మరో యాభై మందికి
ఏ టైములో చూసినా కనీసం ఇరవై మంది సెక్యూరిటీ ఉంటారు. ఇంతేగాకుండా వాళ్ల నివాసాల భద్రత, వారి కుటుంబ
సభ్యుల భద్రత అదనం. ఎంత ప్రజాధనం వృధా అవుతుందో ఒక్కసారి ఆలోచించాల్సింది
మనం కాదు, పాలకులు!
ఉన్న పోలీసులంతా సెక్యూరిటీ డ్యూటీలోనే...
మన దేశంలో పోలీసుల
సంఖ్య ప్రతిలక్ష
జనాభాకు 137 మాత్రమే. దేశవ్యాప్తంగా 22 శాతం పోస్టులు
ఖాళీగానే ఉన్నాయి. దేశ రాజధానిలో ఒక్కఏడాదిలోనే రూ. 341 కోట్లు
వీవీఐపీల భద్రతకు ఖర్చయిందిట. జడ్ ప్లస్ లాంటి పకడ్బంధీ భద్రతా వ్యవస్థ
ఉన్న సుమారు 376 మంది
వ్యక్తులకే ఇంత ఖర్చు. ప్రభుత్వ ఆస్తుల రక్షణకో, మహిళల భద్రతకో
పెట్టిన ఖర్చు నామమాత్రమే.
వీవీఐపీలంటే అన్నిటికీ అతీతులా...?
మన ప్రజాస్వామ్య
దేశంలో పలుకుబడి ఉన్న ప్రతివాడూ వీవీఐపీయే. ఖద్దరు చొక్కా తొడుక్కున్న నాయకుడు, రిటైర్ అయిన
అధికారులు, చివరికి
జర్నలిస్టులు కూడా ప్రజా సొమ్ముతో సొంత భద్రత చూసుకుంటున్నారు. నేర చరిత్ర
ఉన్న ఎందరో రాజకీయ నాయకులు ప్రజల సొమ్ముతో
సెక్యూరిటీ పొందుతున్నారు. అభివృద్ధి పనులకు నిధులు లేవని చేతులెత్తేసే
పాలకులు ఇలాంటి వృధా వ్యయం మీద కోతలు పెట్టరెందుకో?. నాయకులంటే మందీ మార్బలం ఉండాలా?. ప్రజాసేవకే
అంకితమైన వాళ్లు ప్రజల్లోకి వెళ్లాలంటే ఇంత సెక్యూరిటీ అవసరమా?. ఉన్న పోలీసులు ఖద్దరు చొక్కాల సేవలోనే నిమగ్నమైతే ఇక సామాన్యులకు దిక్కెవరు. చివరికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా ప్రభుత్వాలు మారావా?.
ముక్తాయింపు...
ప్రజాప్రతినిధులారా... మన పొరుగునే
ఉన్న పాండిచ్ఛేరిలో సైకిళ్ల మీద అసెంబ్లీకి, అవసరమైతే సచివాలయానికీ వెళ్తున్న మంత్రులున్నారు. వాళ్లను చూసైనా
నేర్చుకోండి.!
No comments:
Post a Comment