Friday, 29 March 2013

భక్తి వికటిస్తే స్మశానమార్గమే!

శివుడు ప్రత్యక్షమవలేదని...!

తాంత్రిక యాగం చేస్తే పరమశివుడు ప్రత్యక్షమవుతాడని ఆశించారు. రక్తాభిషేకం చేస్తే దేవదేవుడు కరుణిస్తాడని అనుకున్నారు. వికటించిన భక్తిపారవశ్యం చివరికి ఓ కుటుంబాన్ని నిర్జీవంగా మార్చేసింది. వాళ్లు వెళ్లాలనుకున్నది స్వర్గమో, నరకమో తెలియదు కానీ ఐదు మృతదేహాలు స్మశానానికి చేరాయి. భక్తికి మూఢత్వం తోడయితే ఎంతటి విపత్కరమో బోధపడాలంటే రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకోవాలి.

కాంచన్ సింగ్ నివాసంలో తాంత్రిక పూజలు చేసిన దృశ్యం

వికటించిన భక్తి

రాజస్థాన్ లోని గంగాపూర్ సిటీలో కాంచన్ సింగ్ కుటుంబం మూఢభక్తితో ప్రాణాలు పోగొట్టుకుంది. అర్ధంపర్ధలేని శివారాధనతో ఐదుగురు బలయ్యారు. ముగ్గురు కొనఊపిరితో ఆస్పత్రిలో ఉన్నారు. ఫొటోగ్రాఫర్గా పనిచేసే కాంచన్ సింగ్ శివభక్తుడు. దేవదేవుడినే ప్రత్యక్షం చేసే అతీంద్రియ శక్తులేవో ఉన్నాయనే భ్రమ అతనిది. సాదాసీదా పూజలు కాకుండా తాంత్రిక పూజలతో పరమేశ్వరుడిని ఆవాహనం చేసుకోవచ్చని విశ్వసించాడు. హోమాలు, యాగాలతో శివుడు కళ్లముందు నిలబడతాడని నమ్మాడు... కుటుంబ సభ్యులనూ నమ్మించాడు. ఢిల్లీలో ఉండే బంధువులను కూడా రప్పించాడు. రాత్రంతా కాళరుద్రుడికి రహస్యంగా రక్తాభిషేకాలు చేశారు. ఎంతచేసినా దేవుడు కనిపించకపోయే సరికి అందరూ కలిసి విషం కలిపిన లడ్డూలు తినేశారు. ఆత్మార్పణంతో ఆ పరమ శివుడ్ని కైలాసంలోనే డైరెక్టుగా కలుసుకోవచ్చనుకున్నారు. తెల్లవారేసరికి ఆ ఇల్లు స్మశానంలా మారింది. ఐదుగురు విగతజీవులై ఇంట్లోనే పడిపోయారు. మృతుల్లో ముగ్గురు అభంశుభం తెలియని చిన్నారులు. మరో ముగ్గురు కొనఊపిరితో ఉంటే ఇరుగుపొరుగూ ఆస్పత్రికి తరలించారు. వీరంతా చదువుసంధ్యాలేని వారేమీ కాదు. అన్నీ తెలుసనుకునే అజ్ఞానులు. భక్తి వికటిస్తే ఏమవుతుందో తెలుసుకోలేని మూర్ఖులు.

పిజ్జాలు, బర్గర్లే నైవేద్యం

భక్తిలోనూ ఇదే వెరైటీ. రక్తంతో అభిషేకం... శివుడికి పిజ్జా, బర్గర్ల నైవేద్యం. దేవుడు ప్రత్యక్షమైతే వరాలెన్నో కోరుకోవచ్చనుకున్న మూఢభక్త శిఖామణులు పదకొండు రకాల పిండివంటలు సమర్పించుకున్నారు. ఇందులో శాండ్ విచ్, పిజ్జా, బర్గర్ లాంటి మోడ్రన్ డిషెస్ ఉన్నాయంటే వీరి భక్తి ఎంతలా శృతిమించిందో అర్థమవుతోంది.

ఐదేళ్లుగా రక్తాభిషేకాలు

కాంచన్ సింగ్ కుటుంబానికి ఇది పాత అలవాటే. ఐదేళ్లుగా మూడువేల సార్లు తమ రక్తంతోటే శివుడికి అభిషేకం చేశారుట. ఎప్పటికైనా పరమశివుడి కటాక్షం ఉంటుందనుకున్నారు. పాపం ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కాంచన్ సింగ్ తమ బంధువులను రకరకాలుగా నమ్మించాడు. కొడుకు టెన్త్ ఎగ్జామ్స్ కోసం పూజలు చేస్తే ముందురోజే క్వొచ్చన్ పేపరంతా కళ్లముందు ప్రత్యక్షమైందని చెప్పేవాడట.ఇదంతా వీడియోలోనూ రికార్డు చేసుకున్నారు. తమను తాము బలిచేసుకుంటున్న క్షణాలనూ రికార్డు చేశారుట. ఆ వీడియో చూసిన పోలీసులే బిత్తరపోయారు. కాంచన్ సింగ్ తల్లి భగవతీ దేవి, మేనకోడలు రేష్మి కొనఊపిరితో ఉన్నారు. శివుడి కటాక్షం పొందితే ఈ అమ్మాయికి పెళ్లి యోగం వస్తుందనేది ఆ కుటుంబం ఆశ. మూఢభక్తిలో మునిగితేలుతున్న ఆ కుటుంబం... 21 ఏళ్ల ప్రాయంలోనే రేష్మికి చావు ముహూర్తం పెట్టించారు. 

భక్తి పేరుతో కోట్ల వ్యాపారం

భక్తి మోస్ట్ సేలబుల్ కామోడిటీగా మారిపోయింది. భక్తి పేరుతో వందల కోట్ల రూపాయల వ్యాసారం సాగుతోంది. సమాజంలో మనచుట్టూ ఇలాంటి మూఢభక్తులు ఉంటారు. బోగస్ రత్నాలు, నకిలీ రుద్రాక్షలతో దండిగా సంపాదిస్తున్న ఘరానాలు ఉన్న సమాజం మనది.  తాయెత్తులు, కవచాలతో అనుకున్నది నెరవేరుతుందని నమ్మబలికే బురిడీ బాబాలే నడిచే దేవుళ్లుగా చెలామణి అవుతున్న అజ్ఞాన భక్తప్రపంచం మనది. పేరులో అక్షరాలు మార్చుకుంటే అదృష్టం వరించడమే కాదు క్యాన్సర్ లాంటి రోగాలే నయమవుతాయంటూ ప్రచారం చేసే  నయవంచక న్యూమరాలజిస్టులున్న సొసైటీ ఇది. భక్తితో ముడిపెట్టుకున్న వ్యాపారాలు రోజురోజూ విస్తరిస్తున్నాయి. అమాయక భక్తులనే కాదు అన్నీ తెలిసిన వాడినీ భ్రమలో పడేస్తున్నాయి. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే. పల్లెలే కానక్కరలేదు పట్టణాలు, నగరాల్లోనూ భక్తి వికటిస్తోంది. అలాంటి వారిని హెచ్చరించండి. భక్తి వికటిస్తే కనిపించేది మోక్షమార్గం కాదు... స్మశానమార్గమే.

1 comment:

Unknown said...

chala bagundhi...