కిక్ బ్యాగ్ కింగ్ ఎవరు?
ముడుపూ ముచ్చటా...!
బోఫోర్స్ తరహాలో వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కలకలం రేపుతోంది. ఇందులో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే దర్యాప్తు మొదలెట్టిన సీబీఐ తాజాగా త్యాగీని ప్రశ్నించింది. ఆయన మాత్రం తనకే పాపం తెలియదని అంటున్నా సీబీఐ మాత్రం త్యాగీ బంధువుల్లో ముగ్గురికి లింకు ఉందని అనుమానిస్తోంది. సుమారు 4000 కోట్లు పెట్టి బ్రిటన్లోని ఫిన్ మెకానికా కంపెనీ నుంచి 12 ఆగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్లు కొనుగోలు చేస్తున్నారు. వీవీఐపీల ప్రయాణం కోసం వీటిని వినియోగిస్తారు. త్యాగీ సోదరులు, కొందరు నాయకులు పెద్ద మొత్తంలోనే ముడుపులు పుచ్చుకున్నారనేది ఆరోపణ. ఇటలీలో ఫిన్ మెకానికా సీఈఓను అరెస్ట్ చేసినప్పుడు అక్కడి న్యాయవాదుల ఇంటరాగేషన్లో ఈ స్కాం బయటపడింది.
చాపర్ స్కాం అప్ డేట్స్
- త్యాగీని ప్రశ్నించిన సీబీఐ
- జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిన కేంద్రం
- సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు బీజేపీ డిమాండ్
- ఆగస్టా కంపెనీకి చెడు పేరు రావొద్దు:బ్రిటన్ ప్రధాని కామెరాన్
- హెలికాప్టర్ల సామర్ధ్యానికి ముడుపులకు లింకు లేదన్న కామెరాన్
రక్షణ శాఖకే రక్షణ లేదా...
రక్షణ శాఖ ఒప్పందాలు ముడుపులు లేకుండా, పారదర్శకంగా జరిగే అవకాశం లేదా. ఇందులో జవాబుదారీ తనమే ఉండనక్కరలేదా. రక్షణ కొనుగోలు నిబంధనలు గతంలో ఎనిమిది సార్లు మార్చారు. అయినా ఎక్కడా నిజాయితీ, నీతి జాడ లేవు. బోఫోర్సు శతఘ్నుల నుంచి ఆగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల దాకా అంతా అవినీతే. చివరికి మంచుకొండల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్ల కాలి బూట్ల కొనుగోలు ఒప్పందానికి బురద అంటక తప్పలేదు. అమర జవాన్ల మృతదేహాలను తరలించే శవపేటికల వ్యవహారంలోనూ అక్రమాలే.
లింకున్న పెద్దలెవరో...
ఆగస్టా హెలికాప్టర్ల కొనుగోలు నిర్ణయం పెద్ద స్థాయిలోనే జరిగింది. ముడుపుల వ్యవహారానికి అదే స్థాయిలో లింకులుండాలి. ఒక్కో పేరు బయటకు వస్తోంది. ముందు ఎనిమిది కొనాలనుకున్నారు. ఆ తర్వాత పన్నెండుకు పెంచారు. 18 వేల అడుగుల ఎత్తులో ఎగిరేవి కావాలన్నారు. ఎందుకో 15 వేల ఎత్తుకు ఎగిరేవైనా సర్దుకుపోతామనుకున్నారు. కీలక ఒప్పంద పత్రాల్లో ఇన్ని మార్పులు ఎలా జరిగిపోయాయి.
రూల్స్ గాలికేనా...
డిఫెన్స్ కొనుగోళ్ల ప్రతిపాదనను ప్రధాని కార్యాలయం తప్పనిసరిగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు పరిశీలనకు పంపించాలి. వాస్తవంగా ఎన్టీయే హయాంలోనే ఆగస్టా కొనుగోళ్ల ప్రతిపాదన వచ్చింది. అయితే దీన్ని యూపీఏ సర్కారు ఓకే చేసింది. వీవీఐపీల అవసరాలు, సెక్యూరిటీ, సామర్ధ్యం విషయంలో లోపాలు లేకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆనాడే ఆర్మీ ఉన్నతాధికారులకు ఆదేశాలున్నాయి. 2005 మార్చి నుంచి 2006 సెప్టెంబర్ మధ్య కాలంలో వైమానిక దళం, జాతీయ భద్రతా మండలి, స్పెషల్ ప్రొటెక్సన్ గ్రూప్, ప్రధాని కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు జరిగాయి. వాటికనుగుణంగా ఒప్పందాల్లో మార్పులు జరిగాయి.
ఇద్దరు మధ్యవర్తులేం చేశారో...
కీలక నిర్ణయాలు తీసుకున్న వారు- అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగి, అప్పటి నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం.కె. నారాయణన్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్ భరత్ వీర్. హెలికాప్టర్ల కంపెనీ అధికారులతో పాటు హష్కే, మరో మధ్యవర్తి ఒప్పందాలపై మంతనాలు సాగించారు. ముడుపుల వ్యవహారంలోనూ ఈ ఇద్దరి మీదే ఆరోపణలున్నాయి.
మూడు దేశాల కంపెనీల పోటీ
అమెరికా కంపెనీ షికోర్స్కీ ఎస్-92 హెలికాప్టర్లు, బ్రిటన్ కంపెనీ ఆగస్టా వెస్ట్ లాండ్ ఇహెచ్-101, రష్యా కంపెనీ రోసోబోరోన్ ఎక్స్ పర్ట్ ఎంఐ-172 హెలికాప్టర్లతో ముందుకు వచ్చాయి. 2008లో రష్యా కంపెనీ ఎంఐ-17, వి-5 హెలికాప్టర్ల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నా ఆ తర్వాత వ్యవహారం ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత ఫీల్డ్ ట్రయల్స్ పేరుతో మన అధికార బృందాలు అమెరికా, బ్రిటన్ దేశాల్లో దఫదఫాలుగా పర్యటించి వచ్చాయి. ఇంతకీ భారతీయ వాతావరణంలో ఆ కంపెనీల హెలికాప్టర్లు ఎంత వరకూ పనికొస్తాయన్న పరిశీలన పెద్దగా జరగలేదు. చివరికి బ్రిటన్ కంపెనీ లోహవిహంగాలే మనవారికి నచ్చాయి. ఒప్పందం ఓకే అయిపోయింది. దేశంలో కీలక పదవుల్లో ఉండే నాయకులు, ముఖ్యమైన అధికార బాధ్యతల్లో ఉండే వీవీఐపీల ప్రయాణాల కోసం కొనుగోలు చేసే హెలికాప్టర్ల విషయంలోనే ఇంతటి నిర్లక్ష్యం.
నెగోషియబుల్ కమిటీ చేసిందేమిటి...
ఆగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్లకు మూడు ఇంజన్లుండడం మనవారికి బాగా నచ్చింది. కాంట్రాక్ట్ నెగోషియబుల్ కమిటీ 2008 సెప్టెంబర్ నుంచి ఐదు నెలల పాటు చర్చల మీద చర్చలు జరిపింది. చివరికి 3600 కోట్ల రూపాయలతో ఒప్పందం ఖరారు చేసింది. వ్యవహారాలన్నీ పకడ్బందీగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగినట్లనిపిస్తుంది. తీరా చూస్తే ముడుపుల బాగోతం ఇప్పుడు బయటపడింది. అవినీతి కేంద్రం ఇక్కడుంది. వ్యవహారం చక్కబెట్టిన తలలు ఇటలీలో ఉన్నాయి. అసలు తప్పు ఎక్కడ, ఎలా మొదలైంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రేటింగ్ ప్రకారం ప్రభుత్వాల అవినీతి జాబితాలో 72వ స్థానంలో ఉన్న ఇటలీ చెప్పాలా, 94వ స్థానంలో ఉన్న భారత్ చెప్పాలా...ఇది 4000 కోట్ల రూపాయల ప్రశ్న. 130 కోట్ల భారతీయుల ప్రశ్న.
------
No comments:
Post a Comment