Sunday, 17 March 2013

పవర్ ఆఫ్ సోషల్ మీడియా

నీ గుప్పిట్లో ప్రపంచం!
ప్రపంచంలో 21వ శతాబ్ధం తీసుకొచ్చిన సరికొత్త విప్లవమే సోషల్ మీడియా. ఈ మాధ్యమం బాగా విస్తరిస్తోంది. ఉద్యమాలకు, తిరుగుబాట్లకు ఊపిరి పోస్తోంది. ఈజిప్టు లాంటి దేశాల్లో ప్రజానీకాన్ని ఏకతాటి మీద నడిపించి ప్రజాయుద్ధానికి నాదిపలికింది. పాలకులనే గడగడలాడించింది. బంగ్లాదేశ్లోనూ సామాజిక సమస్యలపై స్పందిస్తున్న బ్లాగర్లు ప్రజాభిప్రాయాన్ని బలోపేతం చేస్తున్నారు. పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ సోషల్ మీడియా వేదికగా తన లాంటి వేల మంది బాలికల దీనగాధలను ప్రపంచానికి చాటింది. తాలిబన్ అరాచకశక్తులపైనే అక్షర పోరాటం ప్రకటించి భళా అనిపించుకుంది. అటు ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాల్లోనూ టెక్నాలజీ ఆలంబనగా వేల మేధస్సులు ఒక్కటవుతున్నాయి. 


 'నిర్భయం' చాటిన మీడియా...!

మన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన యావద్భారత దేశాన్ని ఒకే సెంటిమెంటుతో ముడివేసిందంటే సోషల్ మీడియాయే కారణం. ఏ పార్టీ పిలుపునివ్వకపోయినా సామాజిక మాధ్యమం ద్వారా ఒకరినొకరు సమాచారం అందించుకుంటూ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు ఉవ్తెత్తున ఎగసి పడేలా చేయగలిగిన శక్తి ఈ మీడియాది. విస్తరిస్తున్న సామాజిక మాధ్యమం ప్రాధాన్యాన్ని గుర్తించిన ముంబై పోలీసులు దేశంలో తొలిసారిగా సోషల్ మీడియా ల్యాబ్ ఏర్పాటు చేశారు.


సోషల్ మీడియా ల్యాబ్ ఏం చేస్తుంది...

ప్రజాభిప్రాయాన్ని మలచడంలో సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తోంది. ఒక దినపత్రిక జీవితకాలం ఒక్క రోజు. ఓ టీవీలో ప్రసారమయ్యే వార్త జీవితకాలం ఆ కొన్ని క్షణాలే. ఒక సామాజిక మాధ్యమంలో ఏదైనా సమాచారం విస్తరించడం మొదలైందంటే ఆ నిప్పు కణిక దావానలంలా రగిలినట్లే. దీన్ని గుర్తించిన ముంబై పోలీసులు ల్యాబ్ ఏర్పాటుచేశారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇతర వెబ్ సైట్లు,బ్లాగులు... ఈ మీడియాలో ఏ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 24 గంటలూ ఈ విభాగం చేసే పని ఇదే. ఏ అంశాల మీద చర్చ జరుగుతోంది... ప్రజాభిప్రాయం ఏమిటి... ఈ మీడియాలో భాగస్వాములవుతున్న ప్రముఖుల అభిప్రాయలేమిటి... ఇలాంటివన్నీ పరిశీలిస్తారు. ఇవన్నీ పూసగుచ్చినట్లు పాలకులకు నివేదించడం... ఆ తర్వాత వాటి మీద సంబంధించిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలనా యంత్రాంగం స్పందిస్తారా, లేదా అనేది వేరే అంశం. ప్రజల అభిప్రాయమనేది పాలకుల దృష్టికి వెళ్తోందా లేదా అనేది ముఖ్యం. ఈ అవకాశం కల్పిస్తోంది సోషల్ మీడియా.


సమస్యపై చటుక్కున స్పందిస్తున్న తీరు...

ఈమధ్య రాహుల్ గాంధీ ముంబై టూర్ అక్కడి వారికి ట్రాఫిక్ చిక్కులు తెచ్చిపెట్టింది. రోడ్ల మీద ఎక్కడి వాహనాలక్కడే గంటలకొద్దీ నిలిచిపోయాయి. మధ్యలో ఇరుక్కుపోయిన చాలా మంది వెంటనే లాప్ టాప్ ద్వారా తమ నిరసనను బయటి ప్రపంచానికి తెలియజెప్పారు. ట్విట్టర్, ఫేస్ బుక్, బ్లాగ్ ... వందల మంది సెలబ్రిటీల పోస్టింగుల్లో ఆవేళ రాహుల్ రాకతో ఎదురైన సమస్యే ప్రధానాంశం. అలాగే శివసేన చీఫ్ బాల్ ఠాక్రే మరణం తర్వాత బందుల వ్యవహారం మీద కొందరు తమ లభిప్రాయాలను ఈ మాధ్యమం ద్వారా పంచుకుని లేనిపోని చిక్కులు కూడా తెచ్చిపెట్టుకున్నారు. ఇంతకీ ముంబై పోలీసులు ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ల్యాబ్ నిర్మాణాత్మకంగా ఏం చేస్తుందన్నది చూస్తేగానీ తెలియదు. మొత్తానికి ఈ మీడియా పోకడను పోలీసు యంత్రాంగం కళ్లింత చేసుకుని గమనిస్తుందన్నది వాస్తవం.

ఓ మాట...

బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతి...అని శతకకారుడేనాడో మనకు దైర్యం నూరిపోశాడు. గడ్డిపోచలనే తాడుగా పేనితే మదపుటేనుగునైనా చిటికెలో మట్టి కరింపించవచ్చని 'సమైక్య' భావనలో శక్తిని చాటిచెప్పాడో కవి. అందుకే సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా, నిర్భీతితో, నిరంతరాయంగా పోరాటం చేస్తూనే ఉందాం...    

2 comments:

జలతారు వెన్నెల said...

'సమైక్య' భావనలో శక్తిని చాటిచెప్పాడో" తెలుగు వారిలో లోపించినది అదే!ఇంకే రాష్ట్రం చూసినా,ఆ సమైక్య భావన మెండుగానే కనపడుతుంది.

nihar said...

జలతారు వెన్నెల గారూ... మీలా చటుక్కున స్పందించే గుణం మన తెలుగువారందరికీ, మన భారతీయులందరికీ అలవడాలని కోరుకుంటున్నా... నిహార్