నోమితా- ఏ లిటిల్ రాస్కెల్!
నోమితమే హితం !
మితం.. హితం అంటారు పెద్దలు. ఏదైనా అవసరమైనంత ఉంటేనే అందగా ఉంటుంది. నోమితా- ఏ లిటిల్ రాస్కెల్! అని ఎందుకున్నానంటే పిల్లలున్న ఏ ఇంట్లోనైనా నోమితా అనే క్యారెక్టర్ తెలియని వారుండరు. చిన్నారుల స్నేహం, వినోదం, ఆనందం అన్నీ నోమితాయే. జపాన్లో పుట్టి ప్రపంచ దేశాల్లో వందలాది భాషల్లోకి అనువాదమైపోయి టీవీల తెర మీదుగా అందరి డ్రాయింగ్ రూముల్లోకి దూరిపోయిన చిలిపి కుర్రాడు నోమితా. కోట్ల మంది పిల్లల గుండెల్లో కొలువుదీరాడంటే నమ్మకుండా ఎలాఉంటాం.
గాడ్జెట్ గురు.. డోరెమాన్
డోరెమాన్, నోమితా, జియాన్, సునియో, సుజుకా ...ఈ పంచతంత్రం తమ మాటలతో, ఆటలతో, చేతలతో అఖండలోకపు చిన్నారి ప్రపంచాన్ని మంత్రించి టీవీల ముందు కూర్చోబెడుతోంది. పిల్లలు హోంవర్క్ చేయాలంటే డోరెమాన్, బుద్ధిగా అన్నం తినాలంటే నోమితా... ఇలా అన్ని పనులకూ ఈ కార్యక్రమం ఓ గాడ్జెట్లా ఉపయోగపడుతోంది. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ కాలంలో రామాయణ్ సీరియల్ వస్తుందనగానే పిల్లా పెద్దా టీవీలకు అతుక్కుపోయేవారు. ఇప్పుడు నోమితా మిత్రబృందం సృష్టించే కిష్కింధకాండ ఆ రామాయణం కన్నా హిట్టయి కూర్చుంది.
బుద్ధిగా చదువుకునే సుజుకా నచ్చదా...
బుద్ధిగా చదువుకునే సుజుకా కన్నా, చక్కగా ఆటలాడుకునే జియాన్ కన్నా, అమ్మ చెప్పిన మాట వినే సునియో కన్నా, అడిగిన వెంటనే అవసరమైన గాడ్జెట్ ఇచ్చే డోరెమాన్ అందరికీ నచ్చుతాడు. ఈ మిత్రబృందంతో అడపాదడపా కనిపించే మరో క్యారెక్టర్ డేకిసుకి. వీడు క్లాసులో అందరికన్నా బాగా చదువుతాడు. మంచి మార్కులు సాధిస్తాడు. అందుకే మిగతా వారు ఖాళీ సమయాల్లో మన పిల్లలను ఎంటర్టైన్ చేస్తూ ఉంటే డేకిసుకి మాత్రం ఎక్కడోచోట చక్కగా చదువుకుంటాడు. ఒకవేళ ఆ డేకిసుకి క్యారెక్టర్ కథలో ఎక్కువగా కనిపించినా మనవారికి మంచి బోధిస్తే రుచించదు కదా. వీరిలో అందరి కన్నా ఎక్కువగా నచ్చేది నోమితా. వాడిలో ఉన్న నెగెటివ్ క్యారెక్టర్ ఈ తరం పసివారిని ఎట్రాక్ట్ చేస్తోంది. అమ్మ చెప్పిన మాట వినడు. స్కూలు ఎగ్గొట్టే మార్గాలు వెతుక్కుంటాడు. చిలిపిగా తిరుగుతూ అల్లరి పనులు చేస్తుంటాడు. హోంవర్క్ ఎగ్గొడుతూ స్కూల్లోను, తన మిత్ర బృందంలోనూ వెనకబడి పోతుంటాడు. ఎప్పుడు చూసినా డోరెమాన్ను ఎలాగోలా బోల్తా కొట్టించి ఏదో ఒక గాడ్జెట్ తీసుకుని ఇంటి నుంచి పరుగు దీస్తాడు. వాడిలో ఉన్న తెలివితేటలు ఇవే. ఇవే మన చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి.
వీడో సుపరిచితుడు
నోమితాలో ఓ సూపర్మేన్, మరో స్పైడర్మేన్ దాగుంటాడు. శక్తిమాన్, ఈమేన్... అపరిచితుడు సినిమాలోలాగా ఆ రెండో అబ్నార్మల్ కారెక్టరే స్క్రీన్ మీద కనిపిస్తుంది. కథను ముందుకు నడిపిస్తుంది. అల్లావుద్దిన్ అద్భుత దీపం లాగా కోర్కెలు తీర్చే సాధనాలు బోలెడుంటాయి డోరెమార్ దగ్గర. గాల్లోంచి ఏదో గాడ్జెట్ తీసిస్తుంటాడు. ఇక దాంతో మానవమాత్రులకు సాధ్యం కాని టక్కుఠమార విద్యలు ప్రదర్శిస్తుంటాడు నోమిత. రెక్కల గుర్రం మీద ఆకాశానికి ఎగరడం, డ్రాయింగ్ రూములోంచే పాతాల లోకం చుట్టిరావడం, సప్త సముద్రాల అవతల విహార యాత్రలకు వెళ్లడం అన్నీ సునాయాసంగా సాగిపోతుంటాయి. మాయలు, మంత్రాలు, అతీంద్రియ శక్తులు...ఏవి ఉంటే ఇవన్నీ సాధ్యం.
లేత మనసులకు చేటు...
చదువుకుంటూ, మంచి తెలుసుకుంటూ, సైన్స్ పరిజ్ఞానాన్నిపెంచుకుంటూ, హేతుబద్ద ఆలోచనలు, ఆరోగ్యకరమైనవ్యక్తిత్వంతో పెరగాల్సిన చిన్నారులు ఎటు వైపు అడుగులు వేస్తున్నారు. నోమితాలోని పెంకి తనం, సోమరి తత్వం, బద్ధకం, చదువంటే మార్కులే కొలబద్దకాదనే నిర్లక్ష్యపు పోకడ మన చిన్నారులను తప్పుదారిన నడిపించడం లేదా. అందుకే బంగ్లాదేశ్ లో పిల్లలను అమితంగా ప్రభావితం చేస్తున్న ఇలాంటి కార్టూన్ సీరియళ్ల ప్రసారంపై ఆంక్షలు విధించారు. జపనీస్ భాషలోంచి హిందీలోకి అనువాదం చేసి ప్రసారం చేయడం వల్ల అక్కడి పిల్లలు బెంగాలీ భాషకు దూరమైపోతున్నారనేది సర్కారు ఆలోచన. అంతకన్నా పెద్ద ముప్పు మన చిన్నారి లోకానికి పొంచి ఉంది. ఎదిగే వయస్సులో పిల్లల మీద ఇలాంటి క్యారెక్టర్లు నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వారి ఆలోచన, వ్యక్తిత్వం, నడవడి అన్నింటి మీదా నోమితా మార్క్ పడుతోంది.
లాఫింగ్ బుద్ధ వికటాట్టహాసాలు...
ఇప్పటికే చైనా వాడు నూడిల్స్, పాస్తా రుచి చూపించి మన పిల్లల్ని వశపరుచుకున్నాడు. మన ఉప్మా అంటే మొహం మొత్తేలా చేశాడు. మన ఇడ్లీ అంటే డోకొచ్చేలా మార్చాడు. కమ్మనైన చిక్కని ఆవుపాలైనా చైనా వాడి కార్న్ ప్లేక్స్, చాకోస్ కలపందే గొంతుదిగడం లేదు. మార్కెట్ మొత్తాన్ని చైనా కంపెనీలు డ్రాగెన్లా కమ్మేస్తున్నాయి. మన వంటింట్లో చైనా నూడిల్స్ పాముల్లా బుసలు కొడ్తున్నాయి. మన నట్టింట్లో వాస్తు దేవుడిలా 'లాఫింగ్ బుద్ధ' కొలువుదీరాడు. సకల విఘ్నాలను దూరం చేసే మన బొజ్జ వినాయకుడిని మనమే అటకెక్కించేస్తున్నాం.
ఆటలే ఖరీదు
వీడియో గేములు, బ్యాటరీ కార్లు, వాకీటాకీలు, టెడ్డీ బేర్లు... ప్రపంచీకరణ, మార్కెట్ స్వామ్య వ్యవస్థ మధ్యతరగతిని తన గుప్పెట్లో బంధిస్తోంది. అమ్మానాన్న కష్టసుఖాలు పిల్లలకు అనవసరం. వాళ్లకు కావాల్సింది డోరెమాన్ గాడ్జెట్లే. నోమితా మార్క్ ఆటలే. అందుకే అన్నాను "నోమితా... ఏ లిటిల్ రాస్కెల్ !". ఏదైనా మితంగా ఉంటేనే హితం.
3 comments:
మీ అనాలసిస్ బావుంది కానీ మనం సాంప్రదాయం అని భావించే వాటిలో కూడా ఇలాంటివే ఉన్నాయి కదా. చిన్ని కృష్ణుడు వెన్న దొంగలించడం లాంటివి. చిన్ని కృష్ణుడు కూడా చిలిపి వాడే. నోమితా క్యారక్టరు నెగటివుగా కొన్ని పనులు చేసినా ... చివరలో సరిదిద్దడం జరుగుతోంది, అలా చేయడం తప్పని చెప్పడం జరుగుతోంది. ఈ కార్టూన్ల కారణంగా చిన్న పిల్లలలో మాయాలు మంత్రాలూ కాకుండా సైన్సు, గాడ్గెట్లు అనేవి బలంగా పాతుకుపోతాయి, కొద్దే గొప్పో సైంటిఫిక్ గా వివరణలు ఉండడముతో చిన్న పిల్లలో సైన్సు పట్ల ఆసక్తిని పెంచిన వారమవుతాము అనిపిస్తోంది.
అతి సర్వత్రా వర్జయేత్ అనేది నేను ఒప్పుకుంటాను. కాస్త కంట్రోలులో పెట్టాలి దైనినైనా.. తల్లిదండ్రులు ఎలానూ ఆపనిచేస్తారు. ఇక మన సాంప్రదాయ బద్దమైన కథలు, భాషలు అవన్నీ మిగిలిన చోట ఎలానూ ఉంటాయి.
Even i like this character :-)
థ్యాంక్యూ సర్... సదరు సీరియళ్లో గాడ్జెట్ అనేది అద్భుతాలేవో సాధించినట్లు చూపిస్తున్నారు.. ఏదైనా సాధించడానికి దగ్గర మార్గాలున్నాయనేది చిన్నారులకు నేర్పుతున్నారు. సాద్యమైన, హేతుబద్ధమైన విధానం కాకుండా పిల్లలను ఊహాలోకంలో, ఆశలపల్లకిలో ఊరేగించడం నష్టదాయకమే కదా...
...please keep reading my blog - Nihar
Post a Comment