365 రోజులూ ఫూల్సే!?
డోన్ట్ బీ ఫూలిష్!
ముందుమాట.... 365 రోజులూ ఫూల్స్ లా బతుకుతున్న మనం కనీసం ఏప్రిల్ ఒకటో తేదీన ఎవరి ముందూ ఫూల్ కాకుండా ఉంటేనే నయం.!
ఏ రెండు ఆటోలు సమాన దూరం, సమాన వేగంతో ప్రయాణించినా మీటర్లు మాత్రం ఒకేలా తిరగవు. జువెలరీ షాపులో సమానమైన నగలు, సమానమైన డబ్బు పెట్టికొన్నాఏ రెండు బిల్లుల మీదా తరుగు మాత్రం ఒకేలా వేయడు. పెద్దదైనా, చిన్నదైనా మోసపోతున్నది మనమే. చింతపిక్కలపొడి కలిపిన టీపొడి, రంపపుపొట్టు కలిపిన కారం, సర్ఫ్ నీళ్లు కలిపిన పాలు, ఎముకల కొవ్వు కలిపిన నెయ్యి... ఇలా వినియోగదారుడిగా నిత్యం మనం మోసపోతూనే ఉన్నాం. ఒక్క ఏప్రిల్ ఒకటో తేదీన మాత్రమే ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకోవడం ఎందుకు...? 365 రోజులూ ఫూల్స్ డేలే.
అడుగడుగునా ఫూల్ చేసేవాడే...
ఏకంగా 70 శాతం డిస్కౌంటు అన్న బోర్డు చూసి షాపింగు చేస్తున్నాం. పది రూపాయల వస్తువును వంద చేసి డెబ్బై తగ్గించినా మనకు లెక్క తెలియదు. టాప్ టెన్ ర్యాంకులు వంద మందికి వచ్చాయంటున్న కార్పొరేట్ కాలేజీలను నమ్ముతున్నాం. అదే కాలేజీలో లక్ష మంది ఫెయిల్ అయిపోయిన విషయం మనకు పట్టదు. సగటు మనిషిలో పాతుకుపోయిన ఒకేఒక భావం ఫూల్స్ ను చేస్తోంది. 'నేనే గొప్ప... మిగతా వారంతా ఏమీ తెలియని అమాయకులు' అన్న భ్రమలో మనను మనం మోసం చేసుకుంటున్నాం. ఫాల్స్ ప్రెస్టేజ్ లో బతికేస్తున్నాం. స్వార్ధపు చింతనే మనిషిని ఫూల్ని చేస్తోంది. నేను దగ్గర మొదలై నా కుటుంబం, నా ఊరు, నా కులం, నా మతం... ఇలాగే అర్థం లేని అహంభావంతో కుటుంబంలో, సమాజంలో అశాంతిని రాజేస్తున్నాం. ఇంతకన్నా ఫూలిష్నెస్ మరోటి ఉంటుందా...?
నేతల ట్రిక్కుల ముందు ఎంతటి వారైనా ఫూలే!
ఐదేళ్లూ సేవచేస్తానంటూ ఓటు పడ్డాక మొహం చాటేసే నాయకుడి దృష్టిలో మనం ఫూల్స్ కాకపోతే ఇంకేమిటి. రేషన్ బియ్యంతో పూటగడిపే ఖద్దరుచొక్కా మన కళ్లముందే కోట్లకు పడగెత్తితే చూస్తూ ఊరకుండిపోయే మనం ఫూల్స్ గా మిగిలిపోవడం లేదా...? నూటా పాతిక కరెంటు బిల్లుకు నాలుగువందల యాభై సర్ ఛార్జి వేసే పాలకుల తెలివితేటల ముందు మనం ఓడిపోవడం లేదా?. మన డబ్బుతో మనకే ఉచిత పథకాలు ప్రకటించి... మన ఓట్లతోనే గద్దెనెక్కి మనపై పెత్తనం చెలాయించేవాడి కళ్లకు మనం ఫూల్స్ లాగా కనిపించమా?.
ఫూల్స్ డే ఏమిటి...
ఒకప్పుడు ఫ్రాన్స్ లో ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునే వారుట. 1582లో చార్లెస్ అనే రాజు కేలండర్ పేజీలు చింపేసి జనవరి ఒకటో తేదీనే న్యూ ఇయర్ అన్నాట్ట. అయితే ఈ విషయం జనానికి అంత ఈజీగా చేరదు కదా. సమాచారం తెలిసన వారు జనవరి ఒకటో తేదీన కొత్త సంవత్సరానికి స్వాగతాలు పలికితే, ఆ విషయం తెలియని వారు యధావిధిగా ఏప్రిల్ ఫస్ట్ దాకా ఆగారుట. దీంతో జనవరి బ్యాచ్ ఏప్రిల్ బ్యాచును ఆటపట్టించింది. అదే ఓ సంప్రదాయంగా మారింది. ఫ్రాన్స్ ఫూల్స్ కథ అమెరికా, బ్రిటన్ దాటి ప్రపంచ దేశాలకు చేరింది. ఆనాటి నుంచి ఏటా ఏప్రిల్ ఫస్ట్ తేదీన ఒకరినొకరు ఫూల్స్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సరదాగా, సంతోషంగా సాగాల్సిన ఈ వ్యవహారం కాస్తా ఎదుటివారిని వెధవాయిల్ని చేసేలా తయారవుతోంది. అందుకే నాకనిపిస్తోంది 365 రోజులూ ఫూల్స్ లా బతుకుతున్న మనం కనీసం ఏప్రిల్ ఒకటో తేదీన ఎవరి ముందూ ఫూల్ కాకుండా ఉంటేనే నయం.!
No comments:
Post a Comment