Friday 1 March 2013

మట్టీ చెట్టూ మనిషి

ఇస్తినమ్మా 'పచ్చని' వాయనం

పండగైనా పబ్బమైనా ఇంటికి నలుగురినీ పిలిచీ అతిథి మర్యాదలు చేశాక తాంబూలం ఇచ్చి పంపడం తెలుగు వారి సాంప్రదాయం. పండు అన్నీ ఫలవంతం కావాలంటుంది. తమలపాకు పచ్చదనంగా వర్ధిల్లమంటుంది. పసుపు, కుంకుమ ఆడవారికి సౌభాగ్యాన్ని ప్రస్తాదిస్తే ఇవన్నీ కలిసిన తాంబూలం ఆప్యాయతాభిమానాల్ని పంచుతుంది. ఉభయులూ పరస్పరం పదికాలాల పాటు పచ్చగా వర్ధిల్లాలని దీవించుకునే సందర్భమిది. 




 

బందుమిత్రులకు వస్త్రాలు పెట్టడం ఆనవాయితీ కాబట్టి స్తోమతను బట్టి మగవారికి తువ్వాలు, ఆడవారికి జాకెట్ గుడ్డ ఇవ్వడం సంప్రదాయం. రానురానూ ట్రెండ్, ట్రెడిషన్స్ మారిపోతున్నాయి. గుమ్మంలోకొచ్చిన ముత్తయిదువలకు కనీసం బొట్టు పెట్టే మర్యాదలూ లేవు.పెద్దవారొచ్చినా కనీసం బాగోగులు అడిగే తీరిక లేకుండా పోతోంది. 
చిన్నా పెద్దా అంతా టీవీలకు అతుక్కుపోయే దౌర్భాగ్యం పట్టాక బంధుత్వం, స్నేహం, కుశల పశ్నలు... అన్నీ మరిచిపోయినట్లే. ఇప్పుడు బర్త్ డే పార్టీలైతే  పిల్లలకు బొమ్మలిస్తున్నారు. శుభకార్యాలకు ఎవరైనా ఇంటికొస్తే రిటర్న్ గిఫ్టుల పేరుతో ఏవో ప్లాస్టిక్ డబ్బాలు సంచీల్లో పెట్టిస్తున్నారు. డబ్బున్న వాళ్లకయితే ఇవన్నీ ఘనంగా, డాబుసరిగా, అట్టహాసంగా, వైభవంగా జరిపించినట్లే ఉంటుంది.లేని వాళ్ల పరిస్థితేమిటి. అసలు విషయానికొస్తే... ఫ్యాషన్, మోడ్రన్ కల్చర్, న్యూ ట్రెండ్... ఇలా మనమే పేరు పెట్టుకున్నా మనదైన అసలుసిసలు మంచీ మర్యాదు మంటగలిసిపోతున్నాయి కదా. దీనికి ఎవరు, ఏమని సమాధానం చెప్తారు. ఇంట్లో పెళ్లి, ఉపనయనం, బారసాల, అమ్మాయి పెద్దమనిషి అవడం... ఇలా అనేక సందర్భాల్లో ముత్తయిదువలను ఆహ్వానించడం పద్ధతి. సకల మర్యాదలు చేసి తోచినవిధంగా తాంబూలాలిచ్చి పంపడం మన సంప్రదాయం.తాంబూలం, వాయనం, సారె.. పేరేదైనా అందులో ఉండే జాకెట్ గుడ్డా, స్వీటు ముక్కా ప్రాధాన్యం కాదు. అదిచ్చే వారు చూపించే ఆప్యాయత, ప్రేమానురాగాలు  ముఖ్యం. పెళ్లి, ఒడుగు లాంటి శుభకార్యాలప్పుడు పదహారు రోజుల పండుగ నాడు ఇచ్చే తాంబూలాలకు ప్రత్యేకత ఉంటుంది. నువ్వు, నేను, మనం... ఇంతేకాదు ఈ లోకమంతా పదికాలాలు పచ్చగా వర్ధిల్లాలనే ఆకాంక్ష అది. పుట్టుక నుంచి మరణం దాకా మట్టితోనే మనిషి మనుగడ. నవధాన్యాల పచ్చదనం మనిషికిచ్చే సందేశమిదే.

No comments: