Wednesday 13 March 2013

ఆశయానికి ఓ అక్షరం!

శతమానం భవతి...!
దిగమింగడమే లక్ష్యం అనుకునే నాయకులున్న మన సమాజంలో... సమాజం కోసం అన్నమే ముట్టని వారుండడం అరుదే. అలాంటి అరుదైన దీక్షాదక్షురాలు ఇరోమ్ శర్మిలా ఛానూ. మార్చి 14న ఆమె బర్త్ డే. మణిపూర్ ఉక్కు మహిళగా గుర్తింపు పొందిన శర్మిల పదమూడేళ్లుగా నిరహార దీక్షలో ఉన్నారు. తన లక్ష్యం నెరవేరే దాకా దీక్ష విరమించేది లేదని న్యాయస్థానంలోనే తేల్చిచెప్పిన శర్మిల కోసం దేశ వ్యాప్తంగా 'సేవ్ శర్మిల' పేరుతో ఉద్యమం సాగుతోంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సామాజికోద్యమానికి శ్రీకారం చుట్టారు. 

శర్మిలను రక్షిద్దాం... ఆ ఆశయానికి అండగా ఉందాం....

 ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనేది ఆమె డిమాండ్. ఆమె దీక్షకు సంబంధించి ఈమధ్యే ఓ పోస్టులో రాశాను. నేను రాసిన పోస్టుల్లో అత్యధికులు చదివినదిదే. చదివిని వారిలో ఏ కొందరైనా ఆమె ఆశయాన్ని అభినందించినా చాలు. సమాజంలో అలాంటి స్ఫూర్తి దాతల అవసరం చాలా ఉంది. 41వ వసంతంలోకి అడుగు పెడుతున్న శర్మిలా ఛానూ ఆశయం నెరవేరాలని కోరుకుందాం.

ఆమె దీక్షపై నేను రాసిన పాత పోస్టు....  

పుష్కరకాలంగా అన్నం ముట్టని హక్కుల నేత

పాదయాత్రలు... నిరహార దీక్షలు...నిరసన ప్రదర్శనలు... జనానికి బోరుకొట్టేశాయి. ప్రజా సమస్యనే బ్యానరు పట్టుకుని ఖద్దరు చొక్కాల గుంపు ఇలాంటివెన్ని చేసినా జనం స్పందించడం లేదు. నాయకులే ప్రజల్లో స్పందించే గుణాన్ని దూరం చేశారు. దీక్ష, యాత్ర, ధర్నా.. ఎవరే ఎజెండాతో ఏం చేస్తున్నారో జనానికి అయోమయం. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు మహాత్ముడు చేసిన సత్యాగ్రహాలు తప్ప ప్రజాస్వామ్యదేశంలో పార్టీలు చేస్తున్నవేవీ ప్రజలకు దగ్గరవడం లేదు. నిస్వార్ధం, నిజాయితీ, అంకితభావం, ప్రచార ఆర్భాటం లేని కొంత మందిని మినహాయించవచ్చు. ఈకోవకు చెందిన దీక్షాదక్షురాలు శర్మిల. అసలుసిసలు ప్రజాహక్కుల ఉద్యమకారిణి ఇరోం శర్మిలా ఛానూ. ఈశాన్యాన విసిరేసినట్లుండే ఇంఫాల్ లోయకు చెందిన అడవి తల్లి బిడ్డ. ఆమెనంతా ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ అని పిలుస్తారు. ఆమెది నిజంగానే ఉక్కు సంకల్పం. ప్రజా హృదయాల్లో చిరకాలం నిలిచేపోయే గుర్తింపు ఆమెది. 

వెలుగుదివ్వె

 నిర్భయం, నిజాయితీ, నిస్వార్ధం...

ఈశాన్య భారతం ఈ యోధురాలిని 'మెంగోబీ' అంటూ అక్కున చేర్చుకుంది. అంటే 'నిజాయితీ'గా ఉండేదని అర్ధం. 12 ఏళ్లుగా పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టలేదు. పోలీసులు హింసించినా రాజీపడలేదు. తన మనుషుల కోసం చేపట్టిన పోరాటంలో ఆమె ఓటమిని ఎప్పటికీ అంగీకరించదు. మణిపూర్ లో జుడిషియల్ కస్టడీలో ఉన్న శర్మలను ఆత్మహత్యాయత్నం కేసులో ఢిల్లీ కోర్టుకు తీసుకువచ్చారు పోలీసులు. జడ్జి ముందు బోనులో నిలబడిన శర్మిల మాటలు కంగున మోగాయి. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. జీవితం మీద ప్రేమ ఉంది. అనుకున్నది సాధించేదాకా విశ్రమించను. కేసులకు భయపడను. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆమరణ నిరహార దీక్ష వీడను. అసలు శర్మిల దీక్ష ఎందుకు మొదలెట్టిందో చూద్దాం...

మర తుపాకులకు ఎదురొడ్డిన ధీర

2000 సంవత్సరం... మణిపూర్ లోయలో అస్సాం రైఫిల్స్ కాల్పుల్లో పది మంది యువకులు అమరులయ్యారు. మనుషులను పిట్టల్లా కాల్చిపారేసే స్వేచ్ఛను సైనిక దళాలకు ఎవరిచ్చారని శర్మిల ప్రశ్నించింది. జవాన్లకు ఈ అమానుష అధికారం కట్టబెట్టిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం - 1958ని రద్దు చేయాలని ఉద్యమం మొదలెట్టింది. ఆమె వెనుక ఈశాన్య యువతంతా నిలబడింది. ఇప్పుడు ఆమె సంకల్పం ముందు యావత్ ప్రపంచమే తలవంచింది. కానీ కించిత్ కనికరమైనా లేని పాలకులు మాత్రం పన్నేండేళ్లుగా ఆమె సాగిస్తున్న నిరహార దీక్షకు ఏమాత్రం స్పందించలేదు. 2006లో ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నం కింది పోలీసులు కేసులు పెట్టారు. డాక్టర్లను సాయంతో బలవంతంగా ఆహారం తీసుకునేలా ఒత్తిళ్లు తెచ్చారు. శర్మిల మాత్రం తన లక్ష్యం ముందు ఇవన్నీ బలాదూరేనంది. కొంత కాలంగా ముక్కులోంచి గొట్టాల ద్వారా ద్రవాహారాన్ని పంపిస్తున్నారు. ఆమె ప్రాణాలు నిలబడ్డం కాదు, ఆశయం నిలబ్డం ముఖ్యం.

త్యాగం కాదు... అంకితం

ఇప్పుడామె వయస్సు 40. అంటే 27 ఏళ్ల ప్రాయంలో ప్రజాహక్కుల పోరాటం మొదలెట్టింది. ఆమె త్యాగాన్ని మాత్రమే కాదు, అంకిత భావాన్ని చూసిన ఎన్నో చేతులు శర్మిలకు అండగా నిలిచాయి. పూణెకి చెందిని థియేటర్ ఆర్టిస్ట్ ఓజాస్(అంటే వెలుగురేఖ) శర్మిల పోరాట స్ఫూర్తిని ఏకాపాత్రాభినయంతో ముందుకు తీసుకువెళ్తోంది. 'లే మిశాల్...'(కాగడా అందుకో) అంటూ నినదించిన ఆ ఉద్యమ కాగడా... కొత్త వేకువకోసం కోట్ల  కాగడాలను వెలిగిస్తోంది. శర్మిల కాపాడాల్సింది ఓ అన్ననో  ఓ తమ్ముడినో కాదు... సాయుధ దళాల తుపాకులకు బలవకుండా ఈశాన్యంలోని వేల మంది సోదరులను. ప్రపంచంలోనే సుదీర్ఘకాలం నిరహార దీక్ష చేసిన ఈ 'మెంగోబీ' ఏనాటికైనా అనుకున్నది సాధించాలి. యాత్రలు, దీక్షలు, ధర్నాలంటూ కష్టపడినా ప్రజామద్దతులేని, ప్రజామోదం పొందలేని నాయకులకు శర్మిల దీక్ష కనువిప్పు కావాలి.

 

2 comments:

జలతారు వెన్నెల said...

శర్మిలా ఛానూ చేసే పోరాటం లో గెలుపు తనది కావాలని కోరుకుంటూ , ఈ పోస్ట్ రాసిన మీకు అభినందనలు

nihar said...

జలతారువెన్నెల గారే...
మీ అసలు పేరే అయితే చాలా బాగుంది. శర్మిల పోరాటానికి మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు. అలాగే నా పోస్టును అభినందించినందుకు కూడా....
-నిహార్