Tuesday, 26 March 2013

రంగుల్లోనే మనిషి తత్వం!

చిరికి కారులుపేనా...?!

ప్రకృతిని ఆరాధిస్తూ వసంతానికి స్వాగతాలు పలికే పండుగ హోలీ. ఏ దేవతనూ ఆరాధించాల్సిన అవసరం లేని సంబరం. ఫాల్లున మాసంలో పూర్ణిమ తెచ్చిపెట్టే రంగుల హరివిల్లు హోలీ. కామదహనం... ఆ మరుసటి రోజు తెల్లవారుజాము నుంచే రంగులు జల్లుకోవడం ఆనవాయితీ.

వసంతమే రంగుల సోయగం

వసంతాగమనవేళ ప్రకృతి రంగులమయంగా, వర్ణశోభితంగా ఉంటుంది. ఆ రంగులన్నీ మనిషి స్వభావాలకు వర్తించుకోవడమే ఈ పర్వం. ఎరుపు కోపానికి సంకేతమైతే, ఆకుపచ్చ అసూయ, పసుపు ఆనందం, గులాబీ ప్రేమ, నీలం విశాలత్వం, తెలుపు శాంతి, కాశాయం త్యాగం, ఊదా రంగు జ్ఞానానికి సంకేతాలు. అయితే ఈ రంగుల పండుగ రానురానూ ప్రకృతి స్వభావానికి దూరమైపోతోంది. కృత్విమశోభను సంతరించుకుంటోంది. పువ్వులు, ఆకుల రంగులకు బదులుగా ఆరోగ్యానికి హాని చేసే సింథటిక్ కెమికల్స్ హోలీ కలర్స్ రూపంలోకి మారిపోయాయి. రంగుల పండుగ ఆనందోత్సాహాలను పెంచడానికి బదులుగా బతుకుల్లో కారునలుపును పులుముతోంది. తెలిసితెలిసీ విషతుల్యమైన రసాయనిక రంగులను ఒంటి మీద జల్లుకుంటూ మనకుమనమే ముప్పుకొనితెచ్చుకుంటున్నాం. 

 ఆ రంగులతో చీకట్లే...

మార్కెట్లో దొరుకున్న హోలీ రంగుల్లో ప్రధానంగా సిలికా, క్రోమియం, లెడ్(సీసం) పాళ్లెక్కువగా ఉన్నాయని నిన్నమొన్న ఢిల్లీలో ఓ జాతీయ టీవీ చానల్ నిర్వహించిన ల్యాబ్ టెస్టుల్లో తేలింది. సిలికా మోతాదు మించితే మనిషి నాడీమండల వ్యవస్థ దెబ్బతింటుంది. క్రోమియం విషపూరితమైన రసాయనం. లెడ్ తో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది. ఏడెనిమిది షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబులో పరీక్షలు నిర్వహిస్తే ఒక్క గులాల్ మినహా మిగతా అన్ని రంగులతోనూ ప్రమాదం తప్పదని తేలింది. ముఖ్యంగా బ్లాక్, గ్రీన్, సిల్వర్, బ్లూ, రెడ్ తదితర సింథటిక్ కలర్స్ లో టాక్సిక్ ఇంగ్రిడియెంట్స్(విషపూరిత రసాయనాలు) ఎక్కువ. 

 హోలీ తెచ్చిపెట్టే అనారోగ్యాలు

  • చర్మ సంబంధిత అలర్జీలు, క్యాన్సర్

  • కంటి అలర్జీలు, అంధత్వం, చూపు మందగించడం

  • శ్వాస సమస్యలు, ఆస్త్మా, ఆయాసం, కెమికల్ అలర్జీ

  • జుట్టు ఊడిపోవడం

ఇప్పడు ఒక్కో రంగును రసాయనికంగా ఎలా తయారు చేస్తున్నారో, వాటికి ప్రత్యామ్నాయంగా మనమే ప్రకృతిసిద్ధమైన రంగులు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

ఆకుపచ్చతో అంధకారమే...

మార్కెట్లో దొరుకుతున్న గ్రీన్ పౌడరును కాపర్ సల్ఫేట్ తో తయారు చేస్తారు. ఈ కెమికల్ తో కంటి చూపు పోయే ప్రమాదం పొంచి ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కంటికి సంబంధించిన అలర్జీలు వస్తాయి. 

 ఆకులతో అదిరిపోయే రంగు

ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవాలంటే మనకు గోరింటాకు, మందార ఆకులు, గోధుమ గడ్డి, పాలకూర లాంటి వాటితో ట్రై చేయొచ్చు. వీటిని ఉడకబెట్టి వడగడితే ఏ ప్రమాదమూ లేని ఆకుపచ్చ రంగు రెడీ. వీటిని గ్రీన్ కలర్ పౌడర్లుగా వాడుకోవచ్చు. అయితే గోరింటాకుతో శరీరం ఎర్రరంగులోకి మారే అవకాశం ఉంది. అందులో ఎక్కువ మోతాదు నీళ్లు కలిపితే ఆకుపచ్చరంగులా వాడుకోవచ్చు. మార్కెట్లో దొరికే హెన్నా, మెహందీ(కెమికల్స్ లేనివి మాత్రమే)లతోనూ గ్రీన్ కలర్ చేయవచ్చు. 

బ్లాక్ తెచ్చిపెట్టేది అంధకారమే...

బ్లాక్ కలర్ పౌడర్ లో ప్రధానంగా వాడేది లెడ్ ఆక్సైడ్ అంటే సీసం. క్యాన్సర్ ముప్పుంటుంది. కిడ్నీ సమస్యలు తలెత్తవచ్చు.

రక్తం చిందించేది ఎరుపు!

రెడ్ కలరు కోసం మెర్క్యూరిక్ ఆక్సైడ్ లేదా సల్ఫేట్  కలుపుతారు. దీంతో చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో బుద్దిమాంద్యానికి కూడా దారితీయవచ్చు. నరాలకు సంబంధించిన వ్యాధులు లేదా పెరాలసిస్ ముప్పుంటుందిట. 

 మందారాన్ని మించిన ఎరుపేది...

ఎర్రరంగును మన పెరట్లో దొరికే మందార పువ్వులతో సులువుగా తయారు చేసుకోవచ్చు. పువ్వులు ఎండపెట్టి పొడికొట్టించడం ఒక పద్దతైతే... బాగా ఉడకబెట్టి అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకోవడం రెండో పద్ధతి. 

 మోదుగు పూలనూ వాడుకోవచ్చు. లేదంటే కుంకుమ, ఎర్ర చందనం, తమలపాకుల్లో రాసుకునే కాసు ఉపయోగపడతాయి. 

 మనం నిత్యం వాడే పసుపులో కొద్దిగా నిమ్మ రసం పిండినా, తమలపాకుల్లో వాడే నాణ్యమైన సున్నం కొద్దిగా కలిపినా ఎర్ర రంగు రెడీ అవుతుంది. గుల్ మొహర్ పూలు, గోగుపూలు, పారిజాత పుష్పాల కాండాలు(తావి), బీటురూటు ముక్కలు, దానిమ్మ తొక్కలు ఉడకబెట్టడం... ఇలా ఎర్ర రంగు సిద్ధమవుతుంది.

సిల్వర్ తో మెరుపులు కాదు మరకలు!

హోలీ రోజు తెల్లని పేస్టులాగా పూసుకునే రంగిది. అల్యూమినియం బ్రోమైడ్ రసాయనాల సమ్మిళితమిది. కంటి వ్యాధులతో పాటు, శ్వాస సమస్యలు, క్యాన్సర్ ప్రమాదం పొంచివుంది.

బ్లూతో ఒళ్లు మంట!

 నీలం రంగుకు వాడే కెమికల్స్ వల్ల డెర్మటైటిస్ వంటి చర్మవ్యాధులు వస్తాయిట. 

నీలిమందారాలు దొరికితే సరి...

నీలం రంగు మందారాలు(అరుదుగా దొరుకుతాయి) ఎండబెట్టి పౌడరుగా, ఉడకబెట్టి నీళ్లరంగుగా చేసుకోవచ్చు. ఇండిగో అనే కాయలు కూడా నీలం రంగునిస్తాయిట.

పసుపే సోయగం

రసాయన పూరితమైన ఎల్లో బదులుగా మన ఇంట్లో వాడే పసుపు నీళ్లు జల్లుకుంటే ఎంతో ఆరోగ్యం. పసుపు సోయగంతోనే నిజమైన వసంతం వచ్చినట్లు ఉంటుంది.

పసుపు మేని ఛాయను పెంచుతుంది. పసుపును నేరుగా కాకుండా ఏదైనా పిండి కలపడం మంచిది. ముల్తానీ మట్టిని కూడా హోలీ రంగుగా వాడుకోవచ్చు. బంతి పూలు ఎండబెట్టి పౌడరు చేసినా ఎల్లో రెడీ.

గులాల్ తోనూ చెడే...

పింక్ లేదా గులాల్ పౌడరును క్రోమియం అయోడైడ్ లాంటి రసాయనాలతో తయారు చేస్తారు. దీంతో ఆస్త్మా, ఎలర్జీ ప్రమాదాలున్నాయి. అందువల్ల తక్కువ మోతాదులో రసాయనాలుండే గులాబీ రంగు కుంకుమ వాడడం మంచిది. బీట్ రూట్ ఉడకబెట్టినా గులాబీ రంగు ద్రావణం సిద్ధమవుతుంది. మోదుగు పూలను ఉడకబెట్టినా ఈ రంగు వస్తుంది. 

మనం సంప్రదాయాలను వదిలేసుకోకూడదు. ఆడంబరాలు లేని పండుగలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుందాం. ప్రమాదం ఉందని తెలిసినప్పుడైనా జాగరూకతతో వ్యవహరిద్దాం. రేపటి తరానికి ఆరోగ్యకరమైన సంస్కృతిని వారసత్వంగా అందిద్దాం.

2 comments:

Dantuluri Kishore Varma said...

బాగుంది. ఉపయోగకరంగా ఉంది.

nihar said...

దంతులూరి కిశోర్ వర్మ గారు, జలతారువెన్నెల గారూ...
ఇద్దరికీ బ్లాగు చదివినందుకు కృతజ్ఞతలు.... నిహార్