చైనా 'ఫాస్ట్' లేడీ!
ఎర్రకోటలో పాటల పూదోట!
ఏ దేశంలోనైనా ప్రధానో, రాష్ట్రపతో, వాళ్లవిడో అందంగా ఉన్నారని మనకనిపిస్తే 'మీరు అందంగా ఉన్నారండి' అని చెప్పగల స్వేచ్ఛ ఉంటుందా...? చైనీయులు మాత్రం వాళ్ల ప్రెసిడెంట్ గారి సతీమణి అందంగా ఉందన్న విషయాన్ని మనసులో దాచుకోకుండా పంచేసుకుంటున్నారు. మన ట్విటర్ లాంటి 'సీనో వైబో'లో ఆ అందగత్తెకు బోలెడు ప్రశంసలు. అమెరికన్లకు ప్రెసిడెంట్ సతీమణి మిషెలీ ఒబామా లాగే తమకూ ప్రెసిడెంట్ గ్జి జిన్ పింగ్ సతీమణి పెంగ్ లియౌన్ ఉన్నారంటూ సామాజిక వెబ్ సైట్లలో కొన్ని వందల పోస్టులు దర్శనమిస్తున్నాయి. మిషెలీకి వెస్ట్రన్ మీడియా ఆ మాటకొస్తే ప్రపంచ మీడియా తెగ పబ్లిసిటీ ఇస్తుంది. చైనా మీడియా ఇంకా సాంప్రదాయ ధోరణి నుంచి దూరం కాలేదు. పెంగ్ స్వతహాగా జనాధారణ పొందిన గాయనే అయినా ఆమెకు ఇస్తున్న ప్రచారం తక్కువే.
నిజంగా దేశాధ్యక్షుడి భార్య అవడానికి ముందే ఆమె పాపులర్. యావత్ చైనా మెచ్చిన ప్రజాగాయని ఆమె. 51 ఏళ్ల పెంగ్ స్వరంతో పరిచయం లేని చైనీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. జనం గుండె తలుపుతట్టిన జానపద గాయని పెంగ్. దేశ భక్తి గీతాలు పాడడంలో ఆమెకు ఇంకెవరూ సాటికాదు. పెంగ్ తల్లి కూడా ఓ సాంగ్ ట్రూపులో గాయనే. తండ్రి మ్యూజియంలో క్యూరేటర్. పెంగ్ చిన్న తనంలోనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో 'సోప్రానో'(బృందగాయని)గా చేరారు. సాంప్రదాయ సంగీతంలో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. చైనా సెంట్రల్ టెలీవిజన్-సీసీటీవీ(అధికార టీవీ ఛానెల్)లో ఎప్పటి నుచో ఆమె కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. 1983లోనే ఆమె సూపర్ స్టార్. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పెంగ్ నోటివెంట జాలువారిన గీతాలను ఎన్ని తరాలైనా మరచిపోరు.
మనసులు కలిపిన ప్రేమగీతం
పెంగ్ జనం మధ్య పాటలు పాడుతుండగానే గ్జి మనసుపడ్డారు. ఆపై పెళ్లి చేసుకున్నారు.(వీరిది రెండో వివాహం. ఒక కుమార్తె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది). గ్జి 2007లో చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయతక్వంలో చోటుసంపాదించేంత వరకూ పెంగ్ జానపద గీతాలు పాడుతూనే ఉన్నారు. టీవీ షోలూ ఇచ్చేవారు. గ్జి రాజకీయంగా పైకెదిగాక పెంగ్ జనంలోకి వెళ్లడం తగ్గించి సేవా కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నియత్రించే కార్యక్రమానికి 2009లోనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. టీబీ, హెచ్ఐవీ, ఎయిడ్స్ నిరోధానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో ముందు నిలిచారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ పౌండేషన్ కార్యక్రమాల్లో పెంగ్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. చైనా ఫస్ట్ లేడీ అవడానికి ముందునుంచే ప్రజాజీవితంలో క్షణం తీరికలేని విధంగా సేవా కార్యక్రమాలతో గడిపేవారు. పెంగ్ కు మూగ జీవాలంటే ప్రేమ. హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులైన చిన్నారుల సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా ఆమె సిద్ధం. ఏ దేశవాసులైనా ఇలాంటి ప్రజానాయకులను, వారిని నడిపించే జీవిత భాగస్వాములను కోరుకోవడంలో తప్పేమీ ఉండదు కదా...?!
ఆమెకే పాపులారిటీ
చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ కన్నా ఆయన సతీమణి పెంగ్ లియౌన్ కు ప్రజాకర్షణ ఎక్కువ. ఆమెకెంత క్రేజ్ ఉందంటే డ్రెస్సెస్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా పెంగ్ వాడుతున్న ప్రతి వస్తువుకీ మార్కెట్లో మోడల్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఆన్ లైన్ షాపింగ్లో పెంగ్ పేరు వాడుకోని కంపెనీలే లేవుట.
పెంగ్ మీదే ఫోకస్
గ్జి దేశాధ్యక్షుడయ్యాక మొదటిసారి విదేశీ ట్రిప్పుకెళ్తూ పెంగ్ ను వెంటతీసుకువెళ్లారు. తోటి కమ్యూనిస్టు దేశం రష్యాలో చైనా మొదటి జంటకు అపూర్వ స్వాగతం లభించింది.
ఈమధ్యే దేశాధ్యక్షుడైన గ్జి చైనాకు ప్రపంచ పటంలో సరికొత్త స్థానం చూపిస్తారని ఆ దేశ పైరులు కోరుకుంటున్నారు. అలాగే ప్రజా గాయనిగా ప్రసిద్ధురాలైన పెంగ్ దేశ ఔన్నత్యాన్ని దేశవిదేశాల్లో చాటుతారని ఆశిస్తున్నారు. ఈ ఇద్దరికీ చైనాలో పాపులారిటీ పెరుగుతోంది. సాధారణంగా తమ దేశ మొదటి మహిళలను పట్టించుకోని చైనా మీడియా కొన్నాళ్లుగా పెంగ్ కార్యకలాపాలకు కొంత ఫోకస్ ఇస్తోంది. పెంగ్ పాట మహిమకు ప్రజలంతా మైమరచిపోతున్నారు.
1 comment:
ఇక్కడా జిలేబీ యే!
ఆహా ఇవ్వాళ 'బాలా'గు లోకం మొత్తం జిలేబీ ల మయం గా ఉన్నదే !
చీర్స్
జిలేబి.
Post a Comment