Friday, 8 March 2013

ప్రపంచబ్యాంకు లేకుండా బతికించేవాడు!

ప్రజలకే సంపద..!

పెట్టుబడిదారెప్పుడూ పెత్తనం చేస్తాడు. దాన్ని కాదనుకుని బతకడం కష్టం. ప్రపంచ పెట్టుబడిదారు, పెత్తందారూ అయిన అమెరికానే ఎదిరించి నిలిచిన దేశం వెనిజులా. ఆ దేశాధ్యక్షుడు హ్యూగో చావెజ్ అగ్రరాజ్యానికి పక్కలోబళ్లెమయ్యాడు. సారూప్య భావాలున్న మిగతా లాటిన్ అమెరికా దేశాలను ఏకతాటిపై నడిపించాడు. దేశీయంగానే సంపద సృష్టించాడు. ప్రపంచ బ్యాంకు గుప్పిట్లోకి వెళ్లలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో మిగతా దేశాలు బహుళజాతి కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిస్తే చావెజ్ మాత్రం 'అనుమతిలేదు' అని బోర్డు వేళ్లాడగట్టాడు. పేదవాడు బతికిబట్టకట్టాలంటే పొరుగు కంపెనీల పెత్తనం ఉండకూడదని కుండబద్దలుకొట్టినట్లు చెప్పిన పాలనాదక్షుడు చావెజ్.

యోదుడికి ప్రజాభిమానమే ఆయుధం


చమురు రాజకీయాలు....

ప్రపంచంలో చమురు నిల్వలు భారీగా ఉన్న దేశాల్లో వెనిజులా ఒకటి. ఆ చమురు బావుల మీద కన్నేసిన అమెరికా ఎప్పటి నుంచో వెనిజులాలో వేలుపెట్టే ప్రయత్నం చేస్తోంది. చావెజ్ ఆ దేశాధ్యక్షుడైన ఈ ఒకటిన్నర దశాబ్ధంలో అమెరికా మాట చెల్లలేదు.చావెజ్ తన దేశంలోని విదేశీ చమురు కంపెనీలను సాగనంపేలా ఆ రంగాన్ని జాతీయం చేశాడు. దీంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. సంపద రెట్టింపైంది. పేదవాడికి దర్జాగా బతకగలమనే ధీమా వచ్చింది. చావెజ్ పాలనను అస్థిర పరిచేందుకు ఎన్నికుట్రలు జరిగినా అన్నిటినీ సమర్ధంగా తిప్పికొడుతూ నెట్టుకురాగలిగాడు. అందుకే లాటిన్ అమెరికా దేశాలకు చావెజ్ ఓ 'కొదమసింహం'లా రక్షణ ఇవ్వగలిగాడు.సోదర దేశాల్లో చీకట్లు సోకకుండా వెలుగులు నింపిన 'ఎర్రసూరీడ'ని పించుకున్నాడు. 

సామ్యవాదాన్ని నమ్మిన యోధుడు

మిలటరీలో పారాట్రూపర్ ఉద్యోగం నుంచి వచ్చాడంటే నియంతృత్వం అనుకుంటాం. కానీ చావెజ్ ప్రజాస్వామ్య పద్ధతిలో దేశాధ్యక్షుడిగా ఎదిగి ప్రజలకు స్వేచ్ఛాజీవితం అందించాడు. విప్లవ భావజాలంతో పాలకులపై పోరాటం చేసి జైలుకు వెళ్లడంతో చావెజ్ రాజకీయ జీవితం మొదలైంది. ఆ తర్వాత ప్రజాస్వామ్య, సామ్యవాద మార్గంలోనే దేశాన్ని ముందుకు నడిపించాడు. ఆర్ధిక సంస్కరణలు చేపట్టినా ప్రజల మీద భారం మోపలేదు. అవినీతిని అరికట్టేలా కఠిన చట్టాలు తెచ్చాడు. పారదర్శకంగా ముందుకెళ్తున్న మంచి పాలకుడనిపించుకున్నాడు. ప్రజాస్వామ్య భావనలు, సామ్యవాద సిద్ధాంతాలే ఆలంబనగా పాలన సాగించాడు. క్యూబా, నికరాగువా, బొలీవియా, పెరూ, అర్జెంటినా, బ్రెజిల్ లాంటి దేశాలను ఏకతాటిపై నడిపిస్తూ అగ్రరాజ్యాల సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోగలిగాడు.

ఆ బాటలోనే నికోలస్...

చావెజ్ వారసుడిగా తాత్కాలిక అధ్యక్షుడైన నికోలస్ నిర్ణయాలపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అక్కడి చమురు బావుల మీద దృష్టి పెట్టిన అగ్రరాజ్యాలు అప్పుడే ఎత్తులు వేస్తున్నాయి. నికోలస్ సరళీకరణ బాటలో అడుగేస్తాడా అన్న ఆలోచన కొందరిది. అయితే చావెజ్ను పుణికిపుచ్చుకున్న అనుచరుడు నికోలస్. త్వరలో ఎన్నికలు జరుగుతాయి. అగ్రరాజ్యాల కుట్రలను ఎదురొడ్డి నిలబడగలిగితే నికోలస్ పూర్తి స్థాయి  అధ్యక్షుడయ్యే ఛాన్సుంది. చావెజ్ ఆశయాలను కొనసాగిస్తేనే వెనిజులా మనుగడకు, లాటిన్ అమెరికా దేశాల ఉనికికి ముప్పుండదు. చావెజ్ కూడా తన గురువైన బొలివార్ నడిచిన బాటలోనే లాటిన్ అమెరికా ఐక్యత కోసం కట్టుబడి ఉన్నాడు. బొలివారియన్ సోషలిస్టు పార్టీ పాలనలో కార్మిక, కర్షక లోకమంతా భరోసాతో బతికేలా బాటలు వేశాడు. అందుకే కేన్సర్ తో పోరాడి ఓడిన చావెజ్ పార్ధివ దేహాన్ని చూసి జనం బోరున విలపించారు. ప్రియతమ నేత తమకు దూరం అవకూడదంటూ ఆ పార్ధివ దేహాన్ని అద్దాల పెట్టెలో భ్రదపరిచి మ్యూజియంలో ప్రదర్శనకు పెడుతున్నారు. ప్రపంచంలో ఎంత మంది నాయకులకు దక్కుతుంది ఇంతటి ప్రజాభిమానం. ఒకటిన్నర దశాబ్ధంగా ప్రజల మేలుకోరిన నేతకు ఇంతకంటే నీరాజనమేముంటుంది.

No comments: