Friday 22 March 2013

అందామందరం... 'జైహింద్'!

నమస్కారమే సంస్కారం!

'హాయ్', 'హలో'లకు గుడ్ బై!. దేశంలో ప్రతి ఒక్కరూ 'జైహింద్' అని పలకరించుకోవాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి. కొన్నాళ్లుగా అవినీతి వ్యతిరేకోద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న జీవీజీ రాష్ట్రీయ సైనిక సంస్థ నిర్వహకులుగా ఉన్నారు. సర్కారు ఖజానాకు భారం లేని ఈ ప్రతిపాదనపై ఉత్తర్వులు జారీ చేయాలని జీవీజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విన్నవించారు. జంతర్ మంతర్ లో ధర్నా కూడా నిర్వహించి తన ఆశయం నలుగురికీ తెలిసేలా చేశారు. జీవీజీ వెంట కొద్ది సంఖ్యలోనే మద్దతుదారులున్నా ఈ ప్రతిపాదనను సమర్ధించే వారు మాత్రం కోట్లలోనే ఉంటారన్నది నిజం. అవును ఈ ప్రతిపాదనలో నూరుపాళ్లూ నిజం ఉందనిపిస్తోంది. 

"గుడ్' కానేకాదు...!

మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మంటగలిపేసి 'గుడ్ మార్నింగ్', 'గుడ్ నైట్' అని ఎందుకు చెప్పకోవాలి?. 'హాయ్', 'హలో' అని ఎందుకు పలకరించుకోవాలి?. 
జైహింద్ అనడంలో ఎంతటి హుందాతనం ఉందో చూడండి! ఏడాదికొకటిరెండు సార్లే మన నోటి వెంట జైహింద్ అనే పదం బయటికొస్తుంది. అదీ జాతీయ జెండా ఎగురవేసిన నాడే. కాన్వెంట్ చదువుల పుణ్యమాని రోజూ స్కూళ్లలో ప్రార్ధనా గీతం చదివే సాంప్రదాయం కూడా మొక్కుబడిగా మారింది.  మనదేశాన్ని మనమెందుకు గౌవించుకోకూడదు?. మన సంస్కృతిని మనమెందకు పరిరక్షించుకోకూడదు?! జైహింద్ అనడంలో మతపరమైన అంశమేదీ లేదు. హిందుత్వమంటే ఓ జీవన విధానం. జైహింద్ అంటే మన మాతృమూర్తికి, మన దేశమాతకు గౌరవ వందనం చేయడమే.

జీవీజీ ఆలోచన బహుగొప్పది

డాక్టర్ జీవీజీ కృష్ణమూర్తి 1993 నుంచి 99 దాకా మనదేశానికి ఎన్నికల కమిషనర్ గా పనిచేశారు. వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ఇతర దేశాలూ ఇలాంటి ఎన్నికల నిర్వహణ పద్ధతుల మీద దృష్టి పెట్టేలా చేశారు. అవినీతి వ్యతిరేకోద్యమంలో ముందునిలిచారు. 1934లో చీరాలలో జన్మిచిన జీవీజీ బాల్యంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల వైపు ఆకర్శితులయ్యారు. 1945లో నేతాజీ బాటలోనే ఉద్యమాల్లో అడుగు పెట్టి బ్రిటీష్ హయాంలో ఓసారి అరెస్టై జైలుకు కూడా వెళ్లొచ్చారుట. ఆంధ్రా యూనివర్సిటీలో, ఆ తర్వాత లండన్లో న్యాయవాద పట్టాలు అందుకున్నారు. ఇప్పుడు నేతాజీ ఆశయాల కొనసాగింపుగా దేశంలో అందరూ 'జైహింద్' అని పలకరించుకోవాలన్న నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. 

 వెస్ట్రన్ కల్చర్లో పడికొట్టుకుపోవాలా...?

వెస్ట్రన్ కంట్రీస్ లో పరస్పరం హగ్(ఆప్యాయంగా కౌగలించుకోవడం) ట్రెడిషన్. బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం కూడా కల్చరే. సెలబ్రిటీల గ్యాథరింగ్ లో ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తాయి. చాలా దేశాల్లో చేతుల్లో చేతులు కలపడం(షేక్ హ్యాండ్) ఆనవాయితీ. చైనాలో ఎదుటి వ్యక్తి గౌరవసూచకంగా తల వంచడం, ఛాతీపై చేతులుంచి వందనం సమర్పించడం పద్ధతి. కరాటే, కుంగ్ ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్ లో ఇదే పద్ధతి అలవడింది. ఇస్లామిక్, అరబ్బు దేశాల్లో  భుజానికి భుజం తగిలించి హత్తుకోవడం సంప్రదాయం. ముస్లింలు పరస్పరం అల్లాహ్ కృప, దయ ఉండాలని కోరుకుంటారు.

పలకరింపే బంగారమాయేనా...?!

పెద్ద వారు కనిపిస్తే రెండు చేతులూ జోడించి 'నమస్కారమండీ' అని విష్ చేయడం తెలుగు సంప్రదాయం. అలాగే ఎంతటి వారైనా భేషజాలకు పోకుండా ప్రతి నమస్కారం చేయడం పద్ధతి. నేలకు వంగి పెద్ద వాళ్ల కాళ్లు మొక్కడానికీ  అహం అడ్డొస్తోంది. కుర్రాళ్లకీ నడుం పట్టేస్తోందిట. పాదాభివందనం చేస్తే ఆ పెద్దలు మనసారా మనల్ని దీవిస్తారు. దీవించే మనసుండాలే గానీ ఎన్నో దీవెనలు, ఆశీస్సులు. అలాంటి ఆశీర్వచనాలే శతమానం భవతీ(నిండు నూరేళ్లూ వర్ధిళ్లు), ఆయురారోగ్య ప్రాప్తిరస్తు(ఆయువు, ఆరోగ్యం కలగాలి), ఆడవారైతే...దీర్ఘ సుమంగళీ భవ(చిరకాలం నిండు ముత్తయిదువలా జీవించు), పెళ్లికాని అమ్మాయిలైతే... శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు(తొందరగా పెళ్లి ఘడియలు రావాలి). 

ప్రవాసాంద్రులకు జోహారు

సంస్కృతీ సంప్రదాయాలు కలబోసిన దేశం మనది. పరదేశీయులంతా భారతీయం మీద ఆసక్తి చూపిస్తుంటే మనం మాత్రం పశ్చిమ దేశాల పద్ధతులపై మోజు పెంచుకుంటున్నాం. రెండు చేతులూ జోడించి నమస్కారం చేయడానికే మొహమాట పడే రేపటి తరాన్ని తయారు చేస్తున్నాం. ప్రవాసాంధ్రులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు చక్కగా, ఆప్యాయంగా, తెలుగుదనం ఉట్టిపడేలా నమస్కార, ప్రతి నమస్కారాలతో, కుశలప్రశ్నలతో పలకరించుకుంటారని ఎవరైనా చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మన నేల మీద మాత్రమే ఎందుకిలాంటి పోకడలు?. యువతరం స్టైల్ మాయలో పడిపోతోంది. ఫ్యాషల్ ఒరవడిలో కొట్టుకుపోతోంది. ట్రెండ్ ఊబీలో కూరుకుపోతోంది. గురువులు, పెద్దలు, తెలిసిన వాళ్లూ, అయినవాళ్లూ ఎవరు కనిపించినా పొడిపొడి పలకరింపులే... హలో, హాయ్!

ఒక్క ఓదార్పు మాట...!

'హౌ డూ యూ డూ...?!', 'హౌ ఆర్ యూ...?!'... ఇవన్నీ వెర్బల్ కన్వర్జేషన్లో భాగం. ఫోన్లో ఇలాంటి పలకరింపులు బాగానే ఉంటాయి. మనిషి ఎదురు పడినప్పుడు కూడా ఇదేనా?!. 'ఏవండీ ఎలా ఉన్నారండీ', 'బాగున్నారా?', 'అంతా క్షేమమేనా?', 'ఆరోగ్యమదీ బాగుంటోందా?' ఇలాంటి కుశల ప్రశ్నలకు కాలం చెల్లింది. ఎంతటి కష్టాల్లో ఉన్నవాడికైనా ఓ చక్కని పలకరింపు ఎంతో ఊరటనిస్తుందన్నది వాస్తవం. 'నీళ్లడిగామా... నిప్పడిగామా... ఓ ఓదార్పే కదా...?!' అంటూ అయినవాళ్లు పలకరించని క్షణాన గుండెలు బరువు చేసుకునే పెద్దలు చాలా మంది కనిపిస్తారు. ఎవరేమన్నా మన పలకరింపుల్లో ఆప్యాయత తగ్గిపోతోంది. ఆ పొడిపొడి హాయ్, హాలోల్లో ఆర్ధ్రత ఎండిపోతోంది. మర్యాదా దూరమవుతోంది. భక్తిభావమూ కొరవడుతోంది. అందుకే అందరమూ గర్వంగా అందాం 'జైహింద్'!.

2 comments:

జలతారు వెన్నెల said...

నిహార్ గారు, ఒక్క విషయం. జైహింద్ అన్న, హెల్లో అన్నా, 'హౌ డు యు డూ' అని పాశ్చాత్య స్టైల్ లో పలకరించినా, భారత దేశం లో లా నమస్కారం చేసుకున్నా మనిషిని మనిషి ఇంకా పలకరించుకుంటున్నారు కదా? ఓకరినొకరు పలకరించడం, ఒక చిరునవ్వు నవ్వడం లాంటివి ఉన్నంతవరకు "ఎలా" పలకరించుకున్నా ఫర్వాలేదేమో!

nihar said...

జైహింద్ జలతారువెన్నెల గారూ...
మనుషులు పలకరించుకుంటున్నారు. కాదనలేం. ఆ పలకరింపులో ఆప్యాయత తగ్గిపోతోందేమోనని జీవీజీ గారి ఆవేదన. అందులోనూ కాస్త భారతీయత ఉట్టిపడేలా ఉంటే బాగుంటుందనేది ఆయన భావన. ఈ పోస్టు రాసిన నాదీనూ... కృతజ్ఞతలు....నిహార్