Tuesday 30 April 2013

గోలీలాటలో క్రీడాతంత్రం

పల్లె ఆటలే పిల్లలకు మేలు!
'ఇదేం పిల్లలాడుకునే గోలీలాట కాదు...' అంటూ గోలీలాటను ఏదో ఆశామాషీ వ్యవహారంలా లెక్కేసి మాట్లాడటం మనకు తెలుసు. కానీ ఈ గోలీలాట అంత సులువైనదేమీ కాదు. పిల్లల స్థాయిలో ఇది చాలా టఫ్ గేమ్. ఎత్తుగడలుంటాయి. జట్టుకట్టడాలుంటాయి. వ్యూహాలు పన్నడముంటుంది. గెలుపోటములను అంచనా వేయడముంటుంది. గెలిచిన గోలీక్కాయలను లెక్కేసుకోవడం... ఒక్కటీ మిస్సవకుండా భద్రంగా దాచుకోవడం తెలుస్తుంది. అందమైన రుంగుల్లో ఉన్న వాటిని ఒకవైపు, కళావిహీనంగా ఉన్నవాటిని ఒకవైపు విభజించడం... మనకు నచ్చని వాటిని ముందుగా ఆటలో వదిలేయడం... ఇలా ఎన్నో రకాల లోకజ్ఞానాలు పిల్లలకు గోలీలాటతో అబ్బుతుంది. అన్నింటికన్నామిన్నగా నాలుగు గోలీలను నలభై, నలభై గోలీలను నాలుగు వందలు చేయడమెలాగన్నది వంటబడుతుంది. అంటే సంపద పోగేయడం చిన్నప్పటి నుంచే అలవడుతుందన్న మాట. జీవితంలో పైకి రావడమంటే సంపద పోగేయడమే కదా. అయితే ఆ సంపదను కష్టపడి పోగేయడం  ముఖ్యం. మన సొసైటీలో వక్రమార్గాల్లో పోగేసే వాళ్లే ఎక్కువ. అయితే గోలీల వయసులోనే పిల్లలకు ధర్మబుద్ధితో సంపద కూడబెట్టడం గురించి చెప్పడానికి వీలు చిక్కుతుంది. ఇంత చిన్న గోలీలాటలోనే ఇంత పరమార్ధం ఉందా అని నిష్టూరాలాడకండి. పిల్లలకు మంచిని బోధించాలంటే ఆటపాటల్లోనే అవకాశం చిక్కుతుంది.

తక్కువ ఖర్చు... బోలెడు మజా

వేసవిలో రకరకాల క్రీడా వినోద శిక్షణ శిబిరా ఏర్పాటు చేస్తారుగానీ ఎవరైనా గోలీలాటకు ప్రచారం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే బాగుండు. ఖర్చుతక్కువతో బోలెడు కాలక్షేపం. పిల్లలకు శారీరకంగా మంచి ఎక్సర్సైజ్. బుర్రను పదునుబెట్టే ఆట. అన్నింటికీ మించి కుల, మత, వర్గ, ప్రాంత, ధనిక, పేద తారతమ్య భావనలేవీ లేకుండా అందరూ కలిసిపోయి నిష్కల్మషంగా ఆడుకోగల ఆట ఇది. పల్లెటూర్లలో ఇప్పటికీ చెక్కుచెదరని ఆదరణ ఉంది. పట్టణ, నగర ప్రాంతాల్లో పిల్లలకు పెద్దగా దీని గురించి తెలియదు. అస్తమానూ టీవీ రిమోట్లకు, కంప్యూటర్ కీ బోర్డులకు అతుక్కుపోయే చిన్నారులకు మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. వీటివల్ల కాలక్షేపం కాదు కాలహరణమే. కోపం, చిరాకు, అసహనం... చివరికి ఊబకాయం పెరగడం తప్ప ఏమీ ప్రయోజనం కనిపించదు. వీటికి బదులుగా ఆటల మీద దృష్టి పెడితే శారీరక దృఢత్వం, మేధోవికాసం కొంతైనా వస్తాయన్నది నూటికి నూరుపాళ్లూ నిజం. 365 రోజులూ క్రికెట్ ఆడిఆడీ బోరు కొట్టేసిన పిల్లలు ఈ ప్రపంచంలో క్రికెట్ తప్ప ఇంకే ఆటా లేదనుకుంటారు. పదకొండు మంది ఫూల్స్ ఆడుతుంటే పదకొండు వేల మంది ఫూల్స్ సమయం వృధా చేసుకునే ఆటని ఓ ప్రముఖ రచయిత క్రికెట్ గురించి వర్ణించారు. ఇది అక్షరసత్యమే. 

 వేసవి సెలవుల్లో గ్రామీణ ఆటల గురించి చిన్నారులకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎండాకాలంలో పిల్లలు మలమలామాడిపోకుండా నీడపట్టున ఆడేలా జాగ్రత్త పడాలి. పల్లెటూర్లలో చెరువుగట్లు, చింత, వేప చెట్లు ఆటలాడే పిల్లలకు అడ్డా. అందుకే చిన్న ప్రయత్నంగా పిల్లలకు ఎంతో ఇష్టమైన గోలీలాట గురించి ఓ లుక్కేద్దాం.వీలు వెంబడి గోలీలాటలోనే మరిన్ని ప్యాటర్న్స్ గురించి ప్రస్తావించుకుందా.

గురి చూసి కొట్టు...

గోలీలాట ఒక్కో ప్రాంతంలో ఒక్కో లాగా ఉంటుంది. గురిచూసి కొట్టడమనేది ప్రధానమైన గేమ్. దాదాపు అన్నిచోట్లా ఇలాంటి ఆటలుంటాయి. నేల మీద పెద్ద గుండ్రం(సర్కిల్) గీయాలి. అంటే ఒకటిన్నర లేదా రెండు అడుగుల వ్యాసార్ధంలో సర్కిల్ ఉండాలి. మరీ పెద్ద పిల్లలు ఆడేట్లయితే పెద్ద సర్కిల్ గీసుకోవచ్చు. ఈ సర్కిల్ కు రెండు లేదా మూడు అడుగుల దూరంలో ఓ లైన్ గీయాలి. పెద్ద పిల్లలకు కొంత దూరం పెంచుకోవచ్చు. ఇప్పుడు ఎంత మంది ఆడుతున్నారో చూసుకుని ఎన్ని గోలీల చొప్పున పోటీ పెట్టుకుంటారో తేల్చుకోవాలి. ముగ్గురు ఆడుతూ ఒక్కొక్కరూ ఐదేసి గోలీలు వేసుకుంటే మొత్తం పదిహేను గోలీలుంటాయి. అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. ముగ్గురిలో గురి చూసి కొట్టే వంతు మందుగా ఎవరికి వస్తుందో తేలాలి. అంటే బొమ్మా బొరుసు వేసుకుని ఎవరి నెంబరు ఏంటో తేల్చుకోవాలి. మొదటి నెంబరు ఆటగాడు మొత్తం గోలీలను లైన్ దగ్గర నుంచి సర్కిల్ లోకి విసరాలి. ఇక్కడే ఆటగాడి నేర్పు ప్రదర్శించాల్సి ఉంటుంది. సర్కిల్ దాటిపోయిన గోలీలను పక్కకు తీసేస్తారు. ఒకవేళ గెలిస్తే సర్కిల్ లో పడిన గోలీలే మనవంతవుతాయి. అందువల్ల గోలీలన్నీ సర్కిల్ లో పడేలా వేయాలి. ఇప్పుడు సర్కిల్లో ఉన్న వాటిల్లో ఒకదాన్ని ప్రత్యర్థి సెలెక్ట్ చేసి దాని చుట్టూ చిన్న రౌండు చుడతాడు. ఆటగాడు కరెక్ట్ గా ఆ గోలీని గురి చూసి కొట్టాలన్న మాట. మనం కొట్టినప్పుడు ఆ గోలీ సర్కిల్ లోని ఇతర గోలీలకు తగలకుండా టక్కున సర్కిల్ బైటకు వచ్చేయాలి. మిగతా వాటికి తగిలితే రెండో ఆటగాడి వంతు వచ్చేస్తుంది. ముగ్గురిలో ఎవరు ప్రత్యర్థి చూపించిన గోలీని గురిచూసి కొడతారో వారే విజేతలు. సర్కిల్లో ఉన్న గోలీలన్నీఆ ఆటగాడి సొంతమవుతాయి.

ఈ ఆటతో ప్రయోజనాలు

  • లేవడం కూర్చోవడం వల్ల శారీరకంగా మంచి ఎక్సర్ సైజ్ అవుతుంది
  • కూడికలు, తీసివేతల్లాంటి లెక్కలపై ఈజీగా అవగాహన కలుగుతుంది
  • ఎత్తులు, వ్యూహాలు పన్నడంలో మేధోకుశలత పెరుగుతుంది
  • ఆటల్లో గెలుపు అవకాశాలున్నవారితో జట్టుకట్టడం వల్ల జీవితంలో పైకెదిగే లక్షణాలు అలవడతాయి
  • ఎక్కువ గోలీలున్నవాడికెంత క్రేజ్ ఉంటుందో జీవితంలో సంపదుంటేనే విలువ అనేది బోధపడుతుంది


టైముంటే పెద్దవాళ్లయినా గోలీలాడుకోవచ్చు. రోజూ ఆడుతూ ఉంటే ట్రెడ్ మిల్లుల అవసరం పెద్దగా రాకపోవచ్చు. మరో పోస్టులో గోలీలాటలో మరో గేమ్ గురించి... ఆ తర్వాత మరిన్ని పల్లెటూరి ఆటల గురించి షేర్ చేసుకుందాం. మీకూ చిన్నప్పుడు ఆడిన ఇలాంటి ఆటల గురించి తెలిస్తే షేర్ చేసుకోవచ్చు. ఆల్వేస్ వెల్కమ్.....

బామ్మ ఏంచేసిందో తెలుసా...?!

సాహసం చేయండి బామ్మలా...!

ఎనభై వసంతాలు చూసిన ఈ అమెరికా బామ్మ నిజంగా సాహస వనితే! ఇంతకీ ఆమె ఏంచేసిందో తెలుసుకోవడానికి ముందు ఓసారి వర్తమాన సమాజం పోకడపై ఫోకస్ చేయాలి. హైదరాబాద్లో ఈమధ్య చదువుకున్న కుర్రాళ్లకి ఈజీమనీ మార్గమేంటయ్యా అంటే ఆడవాళ్ల మెడల్లో గొలుసులు తెంపుకుపోవడం. ఓసారి రిస్కు తీసుకుంటే కనీసం రెండు తులాల బంగారం గొలుసు చిక్కినా అరవై వేలపైమాటే. తలకు హెల్మెట్ తగిలించుకోవడం, బైకు మీద రావడం రోడ్డు మీద వెళ్తున్న మహిళల మెడల్లోంచి గొలుసులు లాగేసుకోవడం. ఇదీ వరస. ఇంజనీరింగులు, ఎంబీఏలు చదివిన బడా బాబులకీ ఇదే పని. చిన్నాచితకా ఉద్యోగాలు వెలగబెడుతున్న కుర్రాల్లదీ ఇదే పని. పబ్బులకు, బార్లకీ అలవాటుపడిన జులాయిలు, పోకిరీలంతా తమ జల్సాల కోసం ఇతరుల కుటుంబాల్లో విషాదం మిగులుస్తున్నారు. ఇంతేకాదు సిగ్నల్ దగ్గర ఆగిన కార్ల డోర్లలోంచి లాప్ టాప్లు, సెల్ ఫోన్లు, ఆడవాళ్ల పర్సులు, బ్యాగులు ఏది కనిపిస్తే దాని లాగేసుకునే బ్యాచులు ఎక్కువైపోయాయి. బాధితులు పోలీసుల దగ్గరికెళితే ఉల్టా మనకే గీతోపదేశాలు. మార్నింగ్ వాక్ చేస్తున్న వారు, ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు వేస్తున్న వారు, సందెవేళ పక్కవీధి షాపులకని వెళ్లున్న వారూ... బాధితులు మహిళలే. కానీ ఏ మహిళా ఇలాంటి హఠాత్పరిణామం నుంచి  తేరుకుని దుండగుల్ని వెంటాడి పట్టుకున్న ఘటనలు మనమెరుగం. కాపాడండి... కాపాడండి అని నెత్తీనోరూ బాదుకుంటే ఎవరైనా స్పందించినా దొంగలు పరారైపోవడమే గానీ ఫలితం ఉండదు. మన వస్తువును వెనక్కి తెచ్చిచ్చే సినిమాల్లో కనిపించే హీరోల్లాంటి కుర్రాళ్లు ఎవరూ ఉండరు. ఇలాంటి బాధితులకు అమెరికా బామ్మగారు చక్కని మార్గదర్శి. ఇప్పుడామె గురించి తెలుసుకుందాం.

సాహసానికి నిలువుటద్దం....

చటుక్కున తేరుకుని....

కనెక్టికట్ నగరం క్రోమ్ వెల్ పోస్టాఫీసులో పనుండి వెళ్లింది వృద్ధ మహిళ మాక్విజ్. కారు డోరు తీసి దిగీదిగకుండానే ఎవడో దుండగుడు చటుక్కున ఆమె చేతిలో ఉన్న పర్సులాక్కొని పలాయనం చిత్తగించాడు. అయితే మిగతా మహిళల్లా మాక్విజ్  ఎవరికోసమో ఎదురుచూడలేదు. ఎవరో వచ్చి కాపాడతారనీ ఆశించలేదు. వచ్చినవాడు ఎంత స్పీడుగా పర్సు లాక్కెళ్లాడో అంతే స్పీడుగా కారు దిగి వాడ్ని వెంబడించింది. ఇరవై అడుగుల దూరంలోనే పట్టేసుకుని తన పర్సు తాను తీసేసుకుంది. ఇంత సాహసం చేసిన ఆ వృద్ధనారి వయసెంతో తెలుసా...? 81 ఏళ్లు.! అందరూ ఆమెలా సమయస్ఫూర్తితో వ్యవహరించగలరనీ, వ్యవహరిస్తారనీ కాదు. కనీసం మనని మనం కాపాడుకునేందుకు ఓ ప్రయత్నం చేయడం మంచిదే కదా...!? ఉదాహరణకు హైదరాబాద్ చైన్ స్నాచింగ్ వ్యవహారాలనే తీసుకుందాం. రోజూ సగటున అరడజను ఘటనలు జరుతున్నాయి. కొందరు పోలీసుల దాకా వెళ్తారు. కొందరు తమ ఖర్మనుకుని నోరుమూసుకుని కూర్చుంటారు. అదే నాలుగు చోట్ల నలుగురు మహిళలు ఎదురునిలిచి తలపడ్డారనుకోండి... అలాంటి వార్తలు ఆనోటా ఈనోటా మిగతా మహిళల్లోనూ దైర్యాన్ని నింపుతాయి. సులువుగా బంగారు గొలుసులు లాక్కుపోయే దొంగవెధవలకు కాస్తయినా భయం పట్టుకుంటుంది. అందుకే 81 ఏళ్ల మాక్విజ్ సాహసగాధను పై నుంచి కింది దాకా ఓ డజను సార్లయినా చదవండి. మరో డజను మందితో చదివించండి. దైర్యం ప్రాప్తిరస్తు!

Monday 29 April 2013

రష్యన్లు మెచ్చిన సైకత గణపతి

ఇసుకకు ప్రాణంపోసే పట్నాయక్!

ఒక్క కాకికి కష్టమొస్తే వంద కాకులు గుమికూడుతాయి. మానవత్వం ఉన్న మనిషి ప్రపంచంలో ఏ మూల ఎవరికి కష్టమొచ్చినా స్పందిస్తాడు. ఈరోజుల్లో అలా స్పందించే వారే కరువైపోతున్నారు. తెనాలిలో ఆకతాయిలు తన బిడ్డను అల్లరిచేస్తే అడ్డుకున్న ఓ తల్లిని నిర్ధాక్షిణ్యంగా లారీ కిందకు తోసేశారు. కొన ఊపిరితో ఉన్న ఆ తల్లిని రక్షించుకోవడానికి ఆ బిడ్డ ఎంత ప్రాధేయపడినా చుట్టుపక్కలవారెవరూ ముందుకు రాలేదు. ఏ ఒక్కరిలో స్పందించే గుణమున్నా ఆ తల్లి బతికేందుకు కొంత అవకాశముండేది. రాజస్థాన్ జైపూర్ లో బండి మీదెళ్తున్న ఓ కుటుంబాన్ని వాహనం ఢీకొట్టేసింది. తల్లీ, బిడ్డా నడిరోడ్డు మీద రక్తం మడుగులో కొట్టుకుంటున్నా ఒక్క వాహనమూ ఆగలేదు. ఎవరైనా సాయం చేయండి బాబూ అంటూ ఆమె భర్త రోడ్డు మీద పడిపోయిన మరో బిడ్డను పట్టుకుని  నెత్తీనోరూ బాదుకున్నా ఏ మనిషీ కనికరించలేదు. గుండెలను బండరాళ్లలా మార్చేసుకున్న మనుషులు ఎక్కువైపోయిన సమాజమా మనది?!. కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ సమాజానికి ఆపద వచ్చినా ఓ వ్యక్తి మాత్రం స్పందిస్తాడు అతడే సుదర్శన్ పట్నాయక్. 

సైకత గణపతి పక్కనేసుదర్శన్ పట్నాయక్

పరమార్ధం తెలిసిన పట్నాయక్

సుదర్శన్ పట్నాయక్ కు తెలిసిన విద్య... సముద్రం ఒడ్డున ఇసుకతో శిల్పాలు తీర్చిదిద్దడం. ఒడిషాలోని పూరి జగన్నాధుడంటే అందరికీ తెలిసినట్లుగానే అదే పూరికి చెందిన సుదర్శన్ పట్నాయక్ కూడా ప్రపంచ కళాకారులందరికీ చిరపరిచితుడయ్యాడు. మనదేశంలో మొట్టమొదటి సైకతశిల్లి ఇతనే. సమాజానికి దర్పణం పట్టే కళాకారుడితడు. 

ఎయిడ్స్ పై అవగాహన కల్పించే శిల్పాలు

 ఆ చేతి వేళ్లు తాకిన ఇసుక... కరువు కాటేసిన రైతు రూపంలోకి మారిపోతుంది. కామాంధుడు కాటేసిన ఢిల్లీ "నిర్భయ"కు కన్నీటి నివాళులర్పిస్తుంది. సుదర్శన్ పట్నాయక్ కళా హృదయం అన్నిరకాల అంశాలకు స్పందిస్తుంది. ఇసుక మేటల్లో  బావుకతనిండిన సైకత రూపాలను సృష్టిస్తుంది.

ఒబామాను అభినందిస్తూ

మాస్కోలో జైబోలో గణేశ్...

ఇప్పుడు ఈ సైకత శిల్పి గురించి ఎందుకింతలా స్పందించానంటే... మాస్కోలో నిర్వహించిన వరల్డ్ ఆర్ట్ ఛాంపియన్ షిప్  పోటీల్లో అరుదైన భారతీయ సైకతశిల్పికి బహుమతి వచ్చింది. పన్నెండడుగుల వినాయకుడి శిల్పాన్ని ఇసుకతో రూపొందించి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు పట్నాయక్. ప్రపంచ శాంతికి బొజ్జ గణపయ్య చిహ్నమనేది ఈ సైకతశిల్పి భావన. నిజమే సర్వ విఘ్నాలనూ దూరం చేసి లోకానికి శాంతి ప్రసాదించే ఏకదంతుడు శాంతి కాముకుడే. "గ్లోబల్ శాంతి బహుమతి' వినాయకుడికే సొంతం.

భూమాతను రక్షించడమే మన కర్తవ్యం

పిచ్చుకగూళ్ల వయసులోనే...

రష్యాలో గణపయ్యకు రూపమిచ్చి అవార్డు అందుకున్న పట్నాయక్ ఇలాంటి బహుమతులను ఎన్నో సొంతం చేసుకున్నారు. ఇసుకలో పిచ్చుకగూళ్లు కట్టుకునే బాల్యం నుంచే పట్నాయక్ కు కళాఖండాలు తీర్చిదిద్దే విద్య అబ్బింది. ఏడేళ్ల వయస్సు నుంచే సైకత శిల్పాలు చెక్కుతూ 1998 నుంచి ఇప్పటివరకూ వందల పురస్కారాలు అందుకున్నాడు. గోల్డెన్ శాండ్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేసి వందల మంది ఔత్సాహికులకు ఈ కళలో శిక్షణ ఇస్తున్నాడు. 

వివేకానందుడి జయంతి వేళ అరుదైన నివాళి

 ఎయిడ్స్ నిరోధం, పర్యావరణ పరిరక్షణ, మహిళల భద్రత, గ్లోబల్ వార్మింగ్ తదితర సామాజిక అంశాలపై సమయానుకూలంగా శిల్పాలు రూపొందించి జనంలో అవగాహన పెంచుతున్నాడు. ఇప్పటికే యాభైకిపైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. అవార్డులు రివార్డులకన్నా ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే గుణం, మంచి మనసున్న ఈ కళాకారుడిని ప్రజలంతా మెచ్చారు. 36 ఏళ్ల వయసులో ఇంతకంటే ఏం సాధిస్తే సంతృప్తి  దొరుకుతుంది...?!

(ఇమేజెస్ అన్నీ గూగుల్ ద్వారా తీసుకున్నవే. ఒరిజినల్ ఫొటోగ్రాఫర్లకు, వాటిని ప్రచురించిన వెబ్ సైట్ ఓనర్లకు కృతజ్ఞతలు)

'మగ'దంటే ఇలాగుండాలి...!

సంవ్రదాయాల సంకెళ్లు తెంపేయ్...!
పెళ్లంటే మగాడు రాజాలా దర్పం వెలగబెడతాడు. లక్షల రూపాయలు కట్నం పుచ్చేసుకుంటాడు. నగానట్రా కానుకలు దండేసుకుంటాడు. మూడుముళ్లేసిన మరుక్షణం నుంచి కొందరు డబ్బు మనుషులకు  పెళ్లమంటే ఏటీఎం కింద లెక్కే. పైగా పెళ్లి మండపానికి వచ్చే దాకా, ఆ తర్వాత అత్తారింటికి వెళ్లేదాకా దర్జా. గుర్రం మీద ఊరేగింపులు, బ్యాండు మేళం ఆహ్వానాలు, బరాత్ లో తీన్మార్ డాన్సులు, కొత్త అల్లుడు కాలు కింద పెట్టకుండా ఎన్నో అరేంజ్మెంట్స్. అదే పెళ్లికూతురు మగాడి వెంట వేలుపుచ్చుకుని తలొంచుకుని నడవాల్సిందే. మహా అంటే మేనమామలంతా కలిసి వెదురుబుట్టలో పెళ్లిమండపం దాకా మోసుకురావడమొక్కటే పెళ్లికూతురికి జరిగే వైభోగం.

గుర్రమెక్కి పెళ్లికొడుకింటికే వెళ్లిన రజనీ

గుర్రమెక్కావచ్చు...!

ఆడది మాత్రం తలొంచుకుని ఎందుకు తాళి కట్టించుకోవాలనుకుంది మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పాతికేళ్ల రజని. ఎప్పుడూ పెళ్లికొడుకే గుర్రమెక్కి ఊరేగింపుగా పెళ్లికూతురింటికి రావాలా అనేది ఈ లా స్టూడెంట్ ప్రశ్న. ట్రెడిషన్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుందని ప్రశ్నించింది. పెద్దలు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తుండగానే గుర్రం ఎక్కేసింది. ఊరేగింపుగా పొరుగునే ఉన్న పెళ్లికొడుకు ఇంటి దాకా వెళ్లింది. 


సంప్రదాయాలెప్పుడూ ఒకేలా ఉండవని చాటిన పెళ్లికూతురు

 ముందు కాసేపు ముక్కున వేలేసుకున్న జనం రజని సాహసాన్ని అభినందిస్తూ ఊరేగింపులో జతకలిశారు. బ్యాండ్ మేళం, కుర్రాళ్ల డాన్సులతో బరాత్ ముందుకు సాగింది. గుర్రం మీద ఝాన్సీ రుద్రమదేవిలా వచ్చిన రజనీని చూసి పెళ్లికొడుకు తరఫువారు కూడా ముచ్చటగా చూశారు. ఈ పోస్టు చదవిన కాబోయే పెళ్లికూతుర్లెవరైనా వెరైటీగా రజనీని ఫాలో అవుతే బోల్డు క్రేజ్ వస్తుంది. బెస్టాఫ్ లక్.

Tuesday 23 April 2013

అమీనా... ఎందరో అనామికలు!

కాటేస్తున్న వృద్ధ షేకులు

చార్ సౌ సాల్ కీ షహర్ అంటూ చారిత్రక వైభవాన్ని చాటుతూ ఏనాడో ఉత్సవాలు జరుపుకున్నది మన  హైదరాబాద్ నగరం. భిన్న సంస్కృతుల సమ్మేళనమైన  రాజధానిలో ఎన్నో పర్యాటక సొగసులు, ఎంతో చారిత్రక వైభోగం!. హెల్త్ టూరిజం బాగా అబివృద్ధి చెందింది. ఇలాగే సెక్స్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతోందన్న బాధాకరమైన వాస్తవమిది. పాతబస్తీలో కొన్ని కుటుంబాల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని విదేశీ వృద్ధులు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారనేది ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక 'టెలీగ్రాఫ్' బయట పెట్టిన వార్త.

ప్రతికాత్మక చిత్రం

అమీనా  నుంచి 'అనామికల' దాకా....

2006లో ఇదే పాతబస్తీ నుంచి ఓ అమాయకపు యువతిని ఎనభయ్యేళ్ల అరబ్ షేకు పెళ్లి చేసుకుని పది మంది సంతానమున్న ఆ కుటుంబానికి కేవలం పది వేల రూపాయలు ముట్టచెప్పిన వైనాన్ని నగరవాసులు మరచిపోలేదు. ఆ తర్వాత విషయం బయటకు పొక్కడంతో అరబ్ వృద్ధ షేకు అరెస్ట్ అయ్యాడు. 2005 ఆగస్టులో ఇద్దరు వృద్ధ అరబ్బులకిచ్చి ఇద్దరు మైనర్ కుమార్తెల వివాహం జరిపించారు తల్లిదండ్రులు.
డబ్బు మాయలో పడి బాలికల బతుకుల్లో చీకట్లు చిమ్మేందుకు వెనుకాడలేదు ఆ మధ్యవర్తులు, మతపెద్దలు. ఆ తర్వాత పోలీసుల జోక్యంతో బాధిత బాలికలను రక్షించారు. అలాగే 2004 సెప్టెంబరులో ఒమన్ కు చెందిన ఓ వృద్ధుడు పెళ్లి చేసుకుని నాలుగు రోజులకే ముంబైలో వదిలేసి వెళ్లిపోతే... బాధితురాలైన ఆ పదిహేనేళ్ల బాలికను హైదరాబాద్ పోలీసులు రక్షించారు. 2004 మేలో 73 ఏళ్ల యూఏఈ షేకు 19 ఏళ్లు కూడా నిండని ఓ యువతిని పెళ్లాడి మోసగించాడు. వీటన్నిటికంటే దారుణానికి 1991లో పాతబస్తీ వేదికైంది. 14ఏళ్ల అమీనా అనే బాలికను అరబ్బు వృద్ధ షేకు పెళ్లాడి వెంట తీసుకుపోతోంటే ఓ ఎయిర్ హోస్టెస్ రక్షించిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఆ షేకు తిరిగి రాడు.... (ఫైల్ ఫొటో)

సరదాల కోసం షేకుల రాక...

అమీనా వ్యధ దేశాన్ని కన్నీళ్లు పెట్టించి రెండు దశాబ్ధాలు దాటినా ఇలాంటి అమీనాల కథలు ఇంకా ఇంకా పాతబస్తీలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దుబాయి షేకులు శాశ్వత బంధాల కోసం వెంపర్లాడడం లేదు. టూరిస్టు వీసాల మీద నెల రోజుల ట్రిప్పు కోసం వస్తున్నారు. ఉన్నన్నాళ్లూ సరదాల కోసం డబ్బు వెదజల్లుతున్నారు. ఇదే సెక్స్ టూరిజం. పేదరికంలో మగ్గుతున్న ఆడతనాన్ని, పసితనాన్ని కాసులతో కొనేసే అమానుషమిది. అమ్మాయిలను నమ్మించి తూతూమంత్రం  వివాహాలు జరిపిస్తున్నారనేది మహిళా హక్కుల సంఘాల ఆవేదన. నాలుగువారాల కోసం భార్యగా చేసుకోవడం, ఆ తర్వాత తన కర్మకు తనను వదిలేసి ఇంచక్కా దుబాయ్ ఫ్లైట్ ఎక్కేయడం. అరబ్బు వృద్ధులు తమ సరదాల కోసం అమాయక బాలికలకు ఎంత అన్యాయం చేస్తున్నారు?

పేరుకే నిఖా... చేతులో పెట్టేది తలాఖ్ నామా!

'టెలిగ్రాఫ్' వార్త వెలుగులోకి తెచ్చిన ఓ అభాగ్యురాలి ఆవేదన కూడా వందల మంది అమీనాల లాంటిదే. సూడాన్ దేశం నుంచి నాలుగు వారాల ట్రిప్పు కోసం వచ్చిన 44 ఏళ్ల షేకు పాతబస్తీకి చెందిన  మైనరు బాలికను కాంట్రాక్టు మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ బాలిక బంధువైన మహిళే ఈ తతంగమంతా దగ్గరుండి నడిపించింది. ఇందుకు షేకు ఖర్చుపెట్టింది కేవలం లక్ష రూపాయలు. ఇందులో బాధితురాలి కుటుంబానికి 70 వేల రూపాయలిచ్చిన మధ్యవర్తి మహిళ తాను 20 వేలు ఉంచేసుకుంది. నిఖా జరిపించిన కాజీ(మతపెద్ద)కి ఐదు వేలు, దుబాసి(ఉర్ధూ తర్జుమా చేసిన వ్యక్తి)కి ఐదు వేలు ముట్టచెప్పింది. సదరు షేకు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్న తండ్రి. నిఖా పేరుతో ఈ పెద్దలంతా ఆ మైనరు బాలిక గొంతును తడిగుడ్డతో కోసే ప్రయత్నం చేశారు. తండ్రి కన్నా పెద్ద వయస్సున్న వ్యక్తితో గడపలేక ఆ అమాయకురాలు పోలీసులను ఆశ్రయించింది. తతంగం నడిపిన పెద్దలంతా అరెస్ట్ అయ్యారు. ఇంతకీ వీళ్లంతా ఏం చేశారంటే నాలుగు వారాలు మాత్రమే నగరంలో ఉండే ఈ సూడాన్ పెద్ద మనిషికి అమాయక బాలికను అప్పగించారు. ఆ షేకు టూరు పూర్తవగానే ఈ బాలిక చేతుల్లో తలాఖ్ నామా పెట్టేసి చక్కగా విమానం ఎక్కేస్తాడు. కట్టుకున్న పాపానికి ఈ బాలిక రోదిస్తూ కూర్చుంటుంది. పోలీసుల జోక్యంతో ఈ బాలిక కథ కొన్ని మలుపులు తిరిగింది గానీ ఇలాగే వృద్ధ షేకుల ధనమదాంధకారం ముందు ఎన్నో సుమాలు నలిగిపోతున్నాయనేది నిజం.

Monday 22 April 2013

వివేకం నేర్పని పాఠాలు!

విలువలు తెలిస్తేనే విజ్ఞానం!
చిన్నారులకు ముఖ్యంగా బాలికలకు భద్రత కరువైన దౌర్భాగ్యం పట్టింది మనసమాజానికి. చిన్నారులు రోజులో ఎక్కువ భాగం ఉండేది  స్కూళ్ల లోనే. రేపటి తరాన్ని తీర్చిదిద్దే విద్యాలయాల్లోనే సేఫ్టీ లేకుండాపోతోంది. 

ఢిల్లీ సహా అనేకచోట్ల పిల్లల మీదే అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయ. ఈమధ్య ఢిల్లీ స్కూల్లో ఓ 32 టీచరు ఎల్కేజీ చదువుతున్న అబ్బాయిని చాకొలెట్ ఆశచూపించి టాయ్లెట్లోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డ దారుణం కళ్లచూశాం. ఆ బాధిత పిల్లాడు ఇంటికొచ్చాక గానీ పేరెంట్స్ కు విషయం తెలియలేదు.

చాకొలెట్ ఎరతో చిన్నారులు బలి

చిన్నారులకు చాకొలెట్ అంటే అమితమైన ఇష్టం. అయితే వాటివల్లే 70 శాతం పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారని వైద్యనిపుణులు చెప్తున్నారు. అందుకే మన పిల్లలు మారాం చేసినప్పుడల్లా చాకొలెట్ ఆశ చూపించే పద్దతులు మార్చుకుంటే మంచిదేమో!. చాకొలెట్లే చిన్నారులకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఢిల్లీలో 'గుడియా'ను ఇద్దరు కామంధులు చాకొలెట్ ఎరతోనే పట్టిబంధించారు. పళ్లు పాడైపోతాయంటూ తల్లిదండ్రులు కొనివ్వని చాకొలెట్లు ఎవరో ఇస్తున్నారనగానే  అభంశుభం తెలియని చిన్నారులు అమాయకంగా ఆ వలలో పడిపోతున్నారు. అసలు చాకొలెట్ తో ఆరోగ్యపరంగా ఎన్ని అనర్థాలున్నాయో పిల్లలకు తెలియచెప్పకపోవడం పెద్దవారి తప్పిదం. చాకొలెట్ తింటే ఆరోగ్యపరంగా పెద్ద ముప్పుంటుందని తెలిస్తే ఎవరో ఇచ్చే దాని కోసం ఆశపడి జీవితాన్నే ముప్పుపాల్చేసుకోరుకదా!

  • చాకొలెట్ తో నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది
  • దంతాలు పాడైపోతాయి, పళ్లు పుచ్చిపోతాయి
  • చెడు కొలెస్టరాల్ పెరుగుతుంది
  • శరీరం బరువు పెరుగుతుంది
  • ఊబకాయానికి దారితీస్తుంది
  • తరచూ దగ్గు, జలుబు లాంటివి బాధిస్తాయి
  • ఆయాసం, ఉబ్బసం ఉన్నపిల్లలకు మరింత ఇబ్బంది

విజ్ఞానంతో పాటు వివేకమూ...

గురువు పిల్లలకు విజ్ఞాన సంపదను అందించడమే కాదు నైతిక విలువలు బోధించి మంచి నడవడి తెలిసిన పౌరులుగా తీర్చిదిద్దాలి. సమాజంలో ఇందుకు భిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్లో ఓ పేరున్న ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపాలే తొమ్మిది, పది క్లాసుల అమ్మాయిలతో రాసక్రీడలు జరిపిన ఘటనలు కలకలం రేపాయి. ఇలా ఒకటి రెండూ కాదు నిత్యం డజన్లకొద్దీ వార్తలు. విద్యాలయాలు కూడా పిల్లలకు భద్రం కాదనేది రుజువైపోయింది. ఎత్తయిన గోడలు, నలుగురైదుగురు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నంత మాత్రాన అంతా భద్రం అనుకోడానికి లేదు.

 ఢిల్లీ స్కూళ్ల ముందడుగు

స్కూళ్లలో వేధింపులకు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఢిల్లీ విద్యాసంస్థలు గుర్తించాయి. ఇటీవలి ఘటనల నేపథ్యంలో దేశరాజదాని విద్యాసంస్థల యజమాన్యాలు తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి వేధింపుల అంశంపై చర్చిస్తున్నాయి. క్లాస్ రూమ్ లోనే కాకుండా స్కూలు ఆవరణలో ఎక్కడ ఏ విద్యార్థి ఏం చేస్తున్నాడనేది మానిటర్ చేసేందుకు సీసీ కెమెరాలు అమర్చే పనిలో పడ్డారు. అంతేకాదు టీచర్లు, ఇతర సహాయ సిబ్బంది ప్రతికదిలిక మీదా సీసీ కెమెరా కన్ను ఉంటేనే గానీ విద్యార్థికి భద్రత లభించదు. సీసీ కెమెరాలుంటేనే సరిపోదు అనుమానాస్పద కదలికలు పసిగట్టగానే వారిపై నిఘా పెట్టడం, కఠిన చర్యలు తీసుకోవడం అవసరం. ఘోరాతిఘోరాలు జరిగాక దిక్కులు చూసేకన్నా ముందుజాగ్రత్తలు తీసుకోవడం తక్షణావసరం.

నైతికతే మొదటి పాఠం

బాలికలకు భద్రత కల్పించడం ఒకెత్తయితే, బాలురకు నైతిక ప్రవర్తన బోధించడం రెండో ఎత్తు. భద్రత కన్నా నైతిక ప్రవర్తనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రతి స్కూల్లో పోలీసు అధికారులే సెమినార్లు నిర్వహించి లైంగిక వేధింపుల మీద పిల్లల్లో అవగాహన పెంచాల్సిన తరుణమిది. సామాజిక వేత్తలు, స్వచ్చంధ సంస్థల కార్యకర్తల సహాయం కూడా తీసుకోవచ్చు.

      ముఖ్యంగా బాలికలకు స్వీయభద్రతపై జాగ్రత్తలు చెప్పాలి. అప్రమత్తంగా వ్యవహరించడమెలాగో తెలియచేయాలి. కావాలంటే ఆత్మరక్షణ విద్యలైన కరాటె, కుంగ్ ఫూ లాంటివి నేర్పించాలి. అబ్బాయిలకు తప్పుచేస్తే ఎలాంటి శిక్షలు పడతామో స్పష్టంగా వివరించాలి. ప్రేమ, ఆకర్షణ పేరుతో అమ్మాయిల వెంట పడితే ముప్పుతప్పదని తెలియచేయాలి. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు లైంగిక వేధింపులను ఎలా ఎదుర్కోవాలో తల్లదండ్రులే అర్థమయ్యేలా చెప్పాలి. ఫ్రెండ్స్, బంధువులు, అపరిచితులు, టీచర్లు ఏ విధంగా అసహజంగా ప్రవర్తిస్తారో, అనుమానాస్పదంగా మాట్లాడతారో, అనైతిక చర్యలకు దిగుతారో పిల్లలకు ముందుగానే తెలిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.  ఇవన్నీ ఎప్పుడో యుక్త వయసు వచ్చాక వారంతటవారే తెలుసుకుంటారులే అనే ఉదాసీనత తగదు. కేజీ చదువలప్పటి నుంచే హితబోధ మొదలైతే పీజీ వయసుల నాటికి తత్వం బోధపడుతుంది. సత్ పౌరులుగా, బాధ్యత తెలిసిన మనుషులుగా మన పిల్లల్ని మనే తీర్చిదిద్దాలి. ఇందుకు స్కూళ్లలోనే మొదటి అడుగు పడితే మంచిది.

స్కూళ్లలోనే ముప్పెక్కువ!

యూనిసెఫ్ సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు ఎక్కువగా వేధింపులు ఎదుర్కొంటున్నది స్కూళ్లలోనే అనేది వాస్తవం. ఈమధ్య ఘటనలు చూస్తే లైంగిక వేధింపులు కూడా ఎక్కువేనని తెలుస్తోంది. వేధింపులంటే స్కూళ్లో పిల్లలకు ఎదురవుతున్న ప్రతి చేదు అనుభవమూ వేధింపు కిందే లెక్క. టీచర్లు అమానుషంగా దండించడం, పరుష పదాలు ఉపయోగించి తిట్టడం, టీచర్లు, సిబ్బంది లేదా సహచర విద్యార్థులు లైంగికంగా వేధించడం, భౌతికంగా దాడులకు పాల్పడడం, అవమానించడం అన్నీ బాధిత చిన్నారులను మానసికంగా, శారీరకంగా కుంగదీసేవే. అందుకే విద్యాసంస్థలు చైల్డ్ ఫ్రెండ్లీగా మారాల్సిన అవసరం ఉంది. ఇందుకు పేరెంట్స్, లోకల్ కమ్యూనిటీస్, పోలీస్, ఎక్స్ పర్ట్స్ సహాయం తీసుకోవాలి. సెమినార్ల ద్వారా చిన్నారుల్లో అవగాహన పెంచుతూ స్కూలంటే పూర్తిస్థాయి భద్రత ఉన్న దేవాలయం అనే భరోసా ఇవ్వాలి.

పవిత్రమైన సరస్వతీ నిలయాలుగా...

విద్యాసంస్థలను పవిత్రమైన సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దే బాధ్యత యజమాన్యాల మీదే ఉంది. తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు ఈ బృహత్తర బాధ్యతకు నైతిక మద్దతునివ్వాలి. టీచర్లే ఐదారేళ్ల పాపల మీద అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ఇక 'గురు శిష్య బంధానికి' విలువేముంటుంది? చిన్నారులంతా చాచాజీగా పిలుచుకునే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చెప్పిన ఆధునిక దేవాలయాలైన పాఠశాలలే చిన్నారులకు భద్రత కల్పించలేకపోతే ఇక సరస్వతీ నిలయాలకు పరమార్ధం ఏముంటుంది?   
 

Sunday 21 April 2013

ఏ పుణ్యం చేసెనో....!

పూరమ్ ఉత్సవాల్లో అంబారీల సంబరం

కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకన్నారోగానీ... ఆ పుణ్యధామమంతటా ఆధ్మాత్మిక, భక్తి పరిమళాలే. అక్కడి ఉత్సవాలు, సంబరాలదీ ఎంతో ప్రత్యేకత. మళయాలీల  ఉత్సవాల్లో కొబ్బరి బొండాం, ఏనుగు ప్రముఖంగా కనిపిస్తాయి. త్రిస్సూరులోని వడక్కునాథన్ ఆలయ సమీపంలోని తెక్కింక్కాడు మైదానంలో నిర్వహించిన  "పూరమ్" ఉత్సవాలు కనులపండువగా సాగాయి. విదేశీ టూరిస్టులైతే పూరమ్ ఉత్సవాలు కళ్లారా చూసి మైమరచిపోయారు.

రాజవైభోగం చాటిన ఏనుగుల ఊరేగింపు

బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించిన అంబారీ ఏనుగుల ఊరేగింపు పూరమ్ ఉత్సవాల ప్రత్యేకత.  త్రిస్సూరులోని పరమెక్కవు, తిరువంబాడీ దేవాలయాల నుంచి ఈ ఏనుగులను పూరమ్ ఉత్సవాల కోసం వడక్కునాథన్ కోవెలకు రప్పించారు. ఏనుగుల మీద అలంకరించిన పల్లకీలకు రాచరిక వైభవం ఉట్టిపడింది. 

 శతాబ్దాల చరిత్రున్న పూరమ్

త్రిస్సూరులో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం ఇది 215వ సంవత్సరం. అంటే రెండు శతాబ్ధాలకు పైబడిన ప్రాచీన సంప్రదాయమన్న మాట. కొచ్చిన్ సామ్రాజ్యాన్ని ఏలిన రాజా రామ వర్మ త్రిస్సూరు పూరమ్ సంబరాలకు 1798లో శ్రీకారం చుట్టారు. ఆనాటి నుంచీ ఈ ఉత్సవాలు జనాధారణ ఏమాత్రం తగ్గకుండా వైభవోపేతంగా సాగుతున్నాయి. ఏటా దేశవిదేశ భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు.

విదేశీ టూరిస్టులకు కనులపండువ

సంస్క్రృతీ సంప్రదాయాలు కలగలిసిన పూరమ్ సంబరాల్లో భక్తిభావనలు వెల్లివిరిశాయి. ఇందుకు మలయాళీ సంప్రదాయ సంగీతం కూడా  జతై సంబరాలు వీనులవిందుగా సాగాయి. కేరళలో పేరెన్నికగన్న వాద్య బృందాలు 'పంచవాద్యం', 'పాండీమేళం' సంగీత స్వరసమ్మేళనాలతో రక్తికట్టించారు. నాలుగైదు గంటల పాటు త్రిస్సూరు వినువీధులు టపాకాయల వెలుగుజిలుగులతో భక్తజనాన్ని మైమరిపిపంచేశాయి.

గాడ్స్ ఓన్ కంట్రీ చుట్టిరావాలనుకునే వారికి సమ్మర్ మంచి సీజన్. కానీ త్రిస్సూరు పూరమ్ ఉత్సవాలు పరిసమాప్తం అయ్యాయి కాబట్టి వచ్చే ఏడు ఏప్రిల్ రెండో లేదా మూడో వారానికి కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మంచిది. కేరళ కొబ్బరి తోటల్లో విహారం, సరస్సుల్లో హౌస్ బోట్ షికారు... ఇలాంటి ఎన్ని సరదా సరదా క్షణాలు గడిపినా పూరమ్ ఉత్సవాలు చూడకపోతే మీ ట్రిప్ పూర్తి కాదు. 

ప్రజలకు తెలిసిన న్యాయం!

నేరగాళ్లకు వెలి శిక్ష!

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు తేల్చలేని పనిని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తెమల్చలేని కేసును ఒక్కోసారి పల్లెటూరి జనమే సెటిల్ చేసేస్తారు. అదే ప్రజాన్యాయస్థానమంటే. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే దురదృష్టవశాత్తూ ఆటవిక న్యాయం రాజ్యమేలుతుంది. అనేకసార్లు అమాయకులను బలిపీఠం ఎక్కించే ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ ఢిల్లీలో ఐదేళ్ల బాలికను పైశాచికంగా చెరచిన 22 ఏళ్ల మానవ మృగం మనోజ్ కుమార్ ఊరి వాళ్లు మాత్రం తమ చేతుల్లో ఉన్నంత వరకూ సత్వర న్యాయం అంటే ఏమిటో చాటిచెప్పారు. అదే నేరగాడి కుటుంబానికి గ్రామ బహిష్కారం. మనచుట్టూ తిరుగుతున్న నేరగాళ్లను వెలి వేయడమొక్కటే మార్గమని నిర్ణయించారు వారంతా.

కోరలు లేని చట్టాలా...

చట్టాలు తమ పని తాము చేసుకుంటాయనుకుంటే నేరగాళ్లు చెలరేగిపోతుంటారు. చట్టానికి దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుంటారు. చట్టానికి చిక్కినా న్యాయస్థానానికి సాక్ష్యాలు దొరక్కుండా ప్రయత్నిస్తారు. నేరగాళ్లంతా బలాదూర్గా తిరుగుతుంటే మళ్లీ మళ్లీ నేరాలు జరుగుతూనే ఉంటాయి. బీహారులోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్నఓ గ్రామం కాలయాపన లేకుండా, సత్వరమే తేల్చి నిర్ణయం తీసుకున్నారు.  తప్పుచేసిన వాడి కుటుంబాన్ని సాంఘికంగా వెలివేశారు. ఢిల్లీలో ఓ పసిదాన్ని అతిక్రూరంగా హింసించి, అత్యాచారం చేశాక తప్పించుకుని వచ్చేసిన రాక్షసుడ్ని చూసి భార్య కంగారుపడింది. ఏమైందో చెప్పకుండానే ఆ పక్కనే ఉన్న చికనౌటా గ్రామంలోని అత్తారింటికి వెళ్లిపోయాడు మనోజ్. జరగరానిదేదో జరిగిందని కుటుంబ సభ్యులు అనుమానించేలోగానే టీవీలు, పేపర్లు ఆ పైశాచిక కాండను వెలుగులోకి తెచ్చాయి. సెల్ ఫోన్ టవర్ సాయంతో మనోజ్ ఎక్కడ తలదాచుకున్నదీ గుర్తించిన పోలీసులు వెంటనే పట్టుకోగలిగారు.

పాపం....బీహారీలు!

అయితే ఢిల్లీలో జరుగుతున్న అఘాయిత్యాల వెనుకున్నది బీహారీలే కావడమనేది సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశమంటారు ఆ రాష్ట్రానికి చెందిన నేత లాలూ ప్రసాద్ యాదవ్. ఆయనొక్కరే కాదు ఏ బీహారీని కదిపినా ఆవేశంతో రగిలిపోయే అంశమిది. బీహారంటే అరాచకాలకు చిరునామాగా మారిపోయింది. అంతకుముందు 'నిర్భయ' అత్యాచార ఘటనలో కీలక నిందితులు ఇక్కడి వారే. బీహారీల వల్లే నేరాలు జరుగుతున్నాయంటూ గతంలో శివసేన నాయకులు చేసిన ప్రకటనలు రాజకీయ దుమారాన్ని రేపాయి. నిజానికి రెండు మూడు ఘటనల్లో నేరగాళ్లు అక్కడి వారైనంత మాత్రాన మొత్తం బీహారునే అనుమానించాల్సిన అవసరం లేదు. అవమానించడమూ మర్యాద కాదు. అరాచకపోకడలుంటే ఉండవచ్చు... కానీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో జేడీయూ సర్కారు ఆ రాష్ట్రాన్ని పురోభివృద్ధి బాటలో నడుపుతున్నది వాస్తవమే. 'నిర్భయ' కేసులో అక్షయ్ కుమార్ ఠాకూర్, 'గుడియా' కేసులో మనోజ్ కుమార్ బీహారీలైనంత మాత్రాన ఆ రాష్ట్రాన్ని వేలెత్తి చూపించలేం. కానీ మనోజ్ సొంత గ్రామం తీసుకున్న నిర్ణయం హర్షించతగినదే. ఆ కుటుంబానికి గ్రామ బహిష్కరణ విధించారు. ఇది అసాంఘిక, అసంబద్ధ చర్యే. పూర్తిగా సమర్ధించలేం.

ఆటవిక న్యాయం కాకూడదు...

ఓ మనోజ్ నేరం చేసినంత మాత్రాన వాడిని కన్న తల్లీతండ్రీ ఎంతవరకూ బాధ్యులవుతారు? వాడిని కట్టుకున్న భార్య ఎందుకు శిక్ష అనుభవించాలి? కుటుంబం గురించి కాసేపు పక్కన పెడితే ఆ పాపాత్ముడు పుట్టిన గ్రామాన్ని ఎందుకు అవహేళనగా చూడాలి? బీహారు రాష్ట్రాన్ని ఎందుకు వేలెత్తిచూపించాలి? ఇలాంటి ఘటన జరగిందనగానే మన దేశాన్ని ప్రపంచమంతా ఎందుకు అనుమానించాలి?  అందుకే మచ్చను చెరిపేసుకోవాలనుకుంటున్నారు మనోజ్ పుట్టిన ఆ గ్రామవాసులు. ఆ నేరగాడి కుటుంబానికి సాంఘిక బహిష్కరణ శిక్ష విధించారు. కేసులు నడిచి, విచారణలు జరిగి ఏనాటికో శిక్షలుపడినా... మళ్లీ హక్కుల సంఘాల పోరాటాలు, క్షమాభిక్ష ప్రయత్నాలు మన ప్రజాస్వామ్య దేశంలో సర్వసాధారణమే. ఇక ఎప్పటికి నేరగాళ్లకు భయం కలుగుతుంది? మళ్లీ మళ్లీ నేరాలు జరగకుండా ఏ నాటికి అడ్డుకట్ట పడుతుంది? ఎంత మంది 'నిర్భయ'లు, ఎంతమంది 'గుడియా'లు బలైపోతే మన మృగాళ్ల కామదాహం తీరుతుంది? అందుకే ఆ బీహారీ ప్రజాన్యాయస్థానం ఏంచేసిందో గమనించాలి. తమచుట్టూ ఇలాంటి నేరగాళ్లు తచ్చాడుతుంటే గుర్తించాలి. వెలి శిక్ష అమలుచేయాల్సి వస్తే అందరూ ముందడుగు వేయాలి. లేదంటే నేరగాడికే కాదు వాడిని పెంచిపోషిస్తున్న సమాజానికి రోజూ శిక్షలు పడుతూనే ఉంటాయి. 'నిర్భయ', 'గుడియా' లాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. జాగ్రత్తపడాల్సింది మనమే. 
 

Saturday 20 April 2013

నేరగాళ్లను ప్రజలకు అప్పగిస్తేనే...!

దుష్టసంహారం చేయాల్సింది మనిషే!

అత్యాచారాలకు పాల్పడే వారిని జైళ్లకు పంపించడం కాదు...జనానికి అప్పగించాలన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూచనకు వంద మార్కులు పడతాయి. అవును పోలీసులు, చట్టాలు. న్యాయాలు ఏమీ చేయలేనప్పుడు రాక్షస సంహారం చేయాల్సింది ప్రజలే. 

 గత యుగాల్లో మాదిరిగా మహావిష్ణువు పదకొండో అవతారం ఎత్తే తరుణం ఈ కలియుగంలో రానేరాదు. ఏ మహానుబావుడో దుష్టసంహారానికి కంకణం కట్టుకుంటాడని ఆశించడం అవివేకమే అవుతుంది. మహిళలను, ఆడపిల్లలను చిదిమేస్తున్న మదమెక్కిన మగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఏళ్ల తరబడి విచారణలతో కాలయాపన చేసే న్యాయవ్యవస్థలు నేరగాళ్లకు ముకుతాడు వేయగలవా...?. అవినీతి, అక్రమార్జనలతో జేబులు నింపుకునే పోలీసు వ్యవస్థ నేరాలను నిలువరించగలదా...?. అంతా అయ్యాక... అన్యాయం జరిగాక మొసలి కన్నీళ్లు కార్చే ఓదార్పు నాయకులు ఈ దుష్టకాండకు అంతం పలకగలరా...? వీళ్లెవరూ చేయలేని పనిని జనం చేయగలరు.

మన భద్రత మన చేతుల్లోనే.... 

మనచుట్టూనే మృగాళ్లున్నారు. కాబట్టి సదా అప్రమత్తంగా ఉండాలి. మన బిడ్డలను పిల్లల కోడిలా కనిపెట్టుకుని ఉండడం మన తక్షణావసరం. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా తన్నుకుపోయేందుకు డేగలు కాచుక్కూర్చున్నాయి. కారడివికి వెళితేనే ఏ పులో మీదపడే ప్రమాదం ఉంటుంది. తుప్పల్లోకి అడుగుపెడితేనే ఏ పామో బుసలుకొట్టే  అవకాశం ఉంది. కానీ మనుషులు తిరిగే జనారణ్యంలో ఒకటి రెండూ కాదు వేలకువేల మృగాలు. నరరూపంలో తిరుగాడుతున్న క్రూరాతిక్రూరమైన రాక్షసులు.  మనం జాలిదలచి నీడనిచ్చిన మనిషే తోడేలు రూపంలోకి మారిపోవచ్చు. మనం పాపమనుకుని పట్టెడు అన్నం పెడితే కడుపునిండిన మనిషే ఎలుగుబంటిలా వికటాట్టహాసం చేయవచ్చు. పిల్లాపెద్దా తేడా లేదు. పాపల నుంచి పండు ముదుసలి దాకా... మహిళలకే రక్షణలేని సమాజంలో మనం బతుకుతున్నాం.

ఎందరు నిర్భయలో...

ఢిల్లీలో నిరుడు డిసెంబర్లో ఓ నిర్భయ నిర్జీవమైపోయింది. ఈ దారుణ మారణకాండతో తర్వాత సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంది. భారతదేశంలోనూ ఇంతటి ఘోరాలు జరుగుతున్నాయేమిటంటూ దేశవిదేశాల్లో అందరూ ముక్కునవేలేసుకున్నారు. పవిత్ర భారతావని అంటే ఇంతకాలం... వేదాలు, యోగాలు, ధ్యానాలు, యాగాలు, రుషులు, మంత్రాలు, జపాలు, తపాలు, శ్లోకాలు అనుకున్న అంతర్జాతీయ సమాజం 'ఛీ' అంటూ ఈసడించుకునే దురవస్థకు దిగజారిపోతున్నాం. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే నేల మీద కామాంధులు స్వైరవిహారం చేస్తున్నారన్న పతాక శీర్షికలు రోతపుట్టిస్తున్నాయి. మహిళలను పూజించే మన నేల మీద దేవతలు తిరుగుతుంటారని విశ్వసించే వారంతా వర్తమాన సమాపు విపరీత, విషపూరిత పోకడలు చూసి విస్తుపోయే పరిస్థితి. రోజూ అత్యాచారాలు. అఘాయిత్యాలు, కిడ్నాపులు, హత్యలు జరుగుతున్నాయని తెలిశాక మన దేశం పరువు మంటగలిసిపోకుండా ఉంటుందా ?.

పాపం చిన్నారి....

నిర్భయకు జరిగిన అన్యాయం మరే మహిళకూ జరగకూడదంటూ జనమంతా గొంతెత్తి నినదించింది. న్యాయస్థానాలు పోలీసు వ్యవస్థకి చీవాట్లు పెట్టాయి. చట్టసభలు కోరలు లేని పాత చట్టాలను పదునుపెట్టాయి. అయినా అవే ఘటనలు పునరావృతమవుతున్నాయి. అదే ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేశాడు ఓ రాక్షసుడు. చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా అదే భవనంలో సెల్లారు గదిలో వారం క్రితమే అద్దెకు దిగిన బీహారీ కామాంధుడు అపహరించాడు. అక్కడే నిర్బంధించి అత్యాచారం చేసినా ఇరుగు పొరుగూ ఎవరూ గుర్తించలేకపోయారుట. ఇంతకీ ఆ యువకుడి మంచీచెడూ తెలుసుకోకుండానే అద్దెకెలా ఇచ్చారన్నది ప్రశ్న. మన ఆవరణలో ఏం జరుగుతోందన్న స్పృహ కూడా లేకుండానే బతికేస్తున్న ఈ జనాన్ని ఏమనాలన్నది సందేహం. ఓ పసిబిడ్డను అపహరించి అక్కడే నిర్బంధించి అమానుషంగా అత్యాచారం జరుపుతున్నా చుట్టుపక్కల వారు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఎందుకుండిపోయారో. 

రాక్షసులకు ఆశ్రయమిస్తే...

మహబూబ్ నగర్లోనూ ఇలాంటి ఘటనే. ఉద్యోగం ఇచ్చిన యజమాని బిడ్డనే కాటేశాడో రాక్షసుడు. అంటే తన దగ్గర పనిచేసే ఉద్యోగి మీద సరైన నిఘా పెట్టకపోవడం వల్ల ఎంతటి నష్టం జరిగిందో చూశారా... ?. ఆమధ్య హైదరాబాద్లో  తల్లి చంకలో ఉన్న బిడ్డను అపహరించుకుని వెళ్లారు దుండగులు. ఇంతకీ చేసిందెవరంటే... ఆ తల్లికి ఒకప్పటి సహోద్యోగి ఘనకార్యమట!. అత్యాచారాలు, అపహరణల కేసుల్లో సగానికిపైగా తెలిసిన వారే తెలివిగా మాటేసి, కాటేస్తున్నారనది తేలింది. అంటే మనం ఎవరినీ చేరదీయడానికి లేదు. చేరదీసినా ప్రతి కదలికనూ జాగ్రత్తగా గమనించాల్సిందే!. మన జాగ్రత్తలో మనం ఉన్నాం కదాని దీమాగా ఉండే పరిస్థితి లేదు. మన జోలికి ఎవరొస్తార్లే అన్న ఏమరుపాటూ పనికిరాదు. మనవారిని మనమే కాపాడుకోవాలి. మన తల్లిని, భార్యని, అక్కని, చెల్లిని, బిడ్డనీ... మనచుట్టూ ఉండే మన ఆడబిడ్డలకు మనమే రక్ష.  

Friday 19 April 2013

ఓ నియంత పరాభవానుభవం!

పర్వేజ్ ప్రజాస్వామ్యం ముసుగు!

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారనేది పర్వేజ్ ముషారఫ్ కు తెలిసొచ్చింది. జూలుంటేనే అడవిలో సింహానికి విలువ. ఇప్పుడు ముషారఫ్ సాధు జీవిలా సరికొత్త మాస్క్ వేసుకుని ఎన్నికల గోదాలోకి దిగాడు. తనపై ఉన్న నియంత ముద్రను చెరిపేసుకుని ప్రజాస్వామ్య పాలకుడనిపించుకోవాలన్న ఆతృతలో ప్రత్యర్థి పక్షం ముందు బోల్తాకొట్టేశాడు ముషారఫ్. పాకిస్థాన్ను పదేళ్లు నియంతలా పాలించిన ఈ మిలటరీ జనరల్ ఇప్పుడు మళ్లీ రాజకీయ ముసుగేసుకుని దేశాన్ని ఉద్దరిస్తానంటూ వస్తే జనం నమ్ముతారా? అసలే శతృపక్షం ముప్పేటదాడికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్లైంది. రాజకీయ వర్గాలు ఒకవైపు, న్యాయ వ్యవస్థ మరోవైపు, సైనిక సమూహాలు ఇంకో వైపు... ముషారఫ్ కు మూడు వైపులా ముప్పు పొంచి ఉన్నట్లే. నాలుగో వైపు మతచాంధస తీవ్రవాద మూకలు ఉండనే ఉన్నాయి.


నామినేషన్ల దగ్గరే బోల్తా

ఆ... ఏమవుతుందిలే  అనుకుంటూ స్వీయ ప్రవాస జీవితం ముగించి మళ్లీ పాకిస్థాన్లో అడుగు పెట్టిన క్షణం నుంచే అపశ్రుతులు. స్వాగత సన్నాహంగా కరాచీలో తన సొంత పార్టీ ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తే పాకిస్థాన్ పాలకులు సెక్యూరిటీ పేరు చెప్పి అనుమతి ఇవ్వలేదు. ఆర్భాటంగా అడుగుపెదామనుకుంటే ఆదిలోనే గండికొట్టారు. మేలో జరిగే జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుని నాలుగు చోట్ల నామినేషన్లు వేస్తే న్యాయవ్యవస్థ పాత కేసులు తిరగతోడింది. ఒక్క నామినేషనూ ఓకే కాలేదు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.

ప్రవాసంలో పదనసలు...

దుబాయ్, లండన్, అమెరికాల్లో నాలుగేళ్లుగా ప్రవాస జీవితం గడిపినా ముషారఫ్ దృష్టి ఎప్పుడూ పాకిస్థాన్ రాజకీయాల మీదే. ఎలాగోలా గద్దెనెక్కేయాలనే ఉబలాటం. ఈదఫా ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కాలని వ్యూహం పన్నినా ఫలించలేదు. చివరికి ఇస్లామాబాద్ హైకోర్టులో ముషారఫ్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైంది. బెయిల్ పొడిగించాలంటూ కోర్టుకొస్తే న్యాయస్థానంలో భంగపాటు ఎదురైంది. బెయిల్ ఇవ్వడం కుదరదంటూ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఎంతటి నియంతకైనా కొన్నిసార్లు దుర్లభ క్షణాలు తప్పవు. ముషారఫ్ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో కోర్టు నుంచి పరుగందుకున్నాడు. ఒకప్పటి తిరుగులేని దేశాధ్యక్షుడికి ఇది మొదటి ఓటమి. ఇస్లామాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్ లో తలదాచుకున్న 'నియంత'ను పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది హౌస్ అరెస్ట్ చేశారు. ఏమీ పాలుపోని స్థితిలోనూ చివరి ప్రయత్నంగా ఆయన పార్టీ నాయకులు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా పరాభవమే ఎదురైంది. ఆ తర్వాత అరెస్టు... రిమాండు మామూలే. తన మాటకు తిరుగులేదని విర్రవీగిన నియంతగా ఇంతకంటే పరాజయమేముంటుంది ?!

రగులుతున్న పాత పగలు

అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరాయి పార్టీల నాయకులను నిర్ధాక్షిణ్యంగా అణచివేశాడు. సైన్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పరిహసించాడు. పోలీసు వ్యవస్థను తనకు బానిస సంస్థగా మార్చేసుకున్నాడు. చివరికి న్యాయవ్యవస్థకూ 'జీ హుజూర్' అనే ఏకాక్షర మంత్రం నేర్పించాడు. ఒకప్పుడు అందలం ఎక్కడానికి మెట్లుగా వాడుకున్న వ్యవస్థలే ఇప్పుడు అమాంతం కింద పడేసిన జారుడు బల్లలయ్యాయి.

వెంటాడిన దేశద్రోహం కేసు 

మిలటరీ పాలకుడి మీద ప్రత్యర్థులు పెట్టినది దేశద్రోహం కేసు. 2007లో దేశంలో అకారణంగా ఎమర్జన్సీ విధించి అరవై మంది న్యాయమూర్తులకు ఉద్వాసన పలికాడు ముషారఫ్. న్యాయవ్యవస్థలో చాలా మందికి ముషారఫ్ మీద పీకల్లోతు కోపముంది. అలాగే సైనికదళాల్లోనూ ముషారఫ్ మీద వ్యతిరేక భావం ఎక్కువైంది. అక్కడి ప్రజాస్వామ్యం మిలటరీ గుప్పిట్లోనే మనుగడ సాగిస్తోంది. రాజ్యాంగాన్ని మార్చేయగల సర్వాధికారం సైనిక దళాధిపతి దగ్గరుంటుంది. మిలటరీ ఉద్యోగిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన ముషారఫ్ ఎకాఎకీ దేశాధ్యక్షుడై పోయాడంటే కారణమిదే.

ఉచ్చులోకి దింపింది కయానీ!

ముషారఫ్ వెనక్కి రావడమే ఆశ్చర్యకరమైన అంశం. నియంత వెనక్కి వస్తున్నాడంటే సైనిక దళాల అధిపతి కయానీ ఎలా అనుమతి ఇచ్చాడని అందరూ అనుకున్నారు. స్వీయ ప్రవాసం పేరుతో పరాయి దేశాల్లో విలాసాలు అనుభవిస్తున్న ముషారఫ్ ను ఎలాగోలా స్వదేశానికి రప్పించడానికి పెద్ద కుట్రే జరిగిందనిపిస్తోంది. ముషారఫ్  అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు... ఎన్నో కేసులు. వాటన్నింటికీ దోషిని చేసి ముషారఫ్ ను బోనులో నిలబెట్టాలన్నది  పాలకుల దృఢసంకల్పం. ఒకప్పుడు ముషారఫ్ సాయంతో సైనికాధిపతి అయిన కయానీయే ఇప్పుడు గురువుగారిని తెలివిగా స్వదేశం రప్పించి ఎటూ పారిపోకుండా చేశాడన్నది విశ్లేషణ. కయానీ మతచాంధస జిహాదీ వర్గాలకు ఎంతో ఇష్టుడు. ముషారఫ్ మతనిష్ఠ లేని అమెరికా అనుకూల వాది. సైన్యాన్ని నమ్ముకుని వచ్చిన ముషారఫ్ ను సైనిక, న్యాయ వ్యవస్థలే రఫ్పాడిస్తున్నాయి. దేశద్రోహం కేసులో దొరికిపోయిన ముషారఫ్ కు ఇక ఊపిరి సలపకుండా చేసేందుకు నాలుగు వ్యవస్థలూ ఒక్కటయ్యాయి.

పాపాలు ఊరకేపోవంటారు...!

దేశద్రోహమొక్కటే కాదు... 2007లో మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో దారుణ హత్య కేసు, 2006లో బలూచీస్థాన్ వేర్పాటువాద నాయకుడు నవాజ్ అక్బర్ బుగ్తీని సైనిక దళాలు కాల్చిచంపిన కేసు లాంటివి కూడా ముషారఫ్ మెడకు చుట్టుకున్నాయి. కుట్రలు, కుతంత్రాలతో అందలం ఎక్కిన నియంతను ఇప్పుడు పట్టిబంధించారు. ఇస్లామాబాద్ కోర్టు నుంచి పారిపోయినంత సులువుగా దేశం విడిచి పరారవడం కుదరదనేది ఆయనకు ఇప్పటికే బోధపడి ఉండవచ్చు.

అధికార పీఠం ఎక్కడానికి కార్గిల్ తొలిమెట్టు

1999లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను అర్ధాంతరంగా పదవీచ్యుతుడిని చేసి పాకిస్థాన్ పగ్గాలు చేపట్టాడు ముషారఫ్. ఆనాడు కార్గిల్ అంశం బాగా ఉపయోగపడింది. పాకిస్థాన్లో సహజసిద్ధంగా ఉండే భారత వ్యతిరేక భావాన్ని రెచ్చగొట్టి పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.  కార్గిల్ సరిహద్దుల్లో చొరబాట్లను ఎగదోసిన ముషారఫ్ సైనికాధిపతి హోదాలో భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాడు. దౌత్యపరమైన ఈ ఉల్లంఘనలను, దురహంకారపూరిత పోకడలను ఈమధ్య కూడా సమర్ధించుకున్నాడు.

పొంచివున్న ప్రత్యర్థులు

ఒకప్పుడు నవాజ్ షరీఫ్ ను ముప్పుతిప్పలు పెట్టిన ముషారఫ్ ఇప్పుడు అదే అనుభవాన్ని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ విపక్షంలోనే ఉన్నా జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ ను గెలిపించడానికి సైనికాధిపతి కయానీ శాయాశక్తులా తోడ్పాటునందిస్తున్నాడు. అటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదురికి కూడా ముషారఫ్ విరోధి. 2007లో ఇఫ్తికార్ ను ముషారఫ్ తొలగించాడు. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే... రాజ్యాంగాన్నే తనకు అనుకూలంగా మార్చుకున్న ముషారఫ్ 2008లో ఎమర్జన్సీ విధించి ఇఫ్తికార్ సహా అరవై మంది న్యాయమూర్తులను ఇంటికి పంపించాడు. ఇప్పుడా ఇఫ్తికార్ ఎదురుగానే బోనులో నిలబడ్డాడు ముషారఫ్. పదేళ్ల పాటు హవాసాగించిన మిలటరీ పాలకుడు, ఆధునిక నియంత ముషారఫ్ 2008లో పార్లమెంటు అభిశంసించే ప్రమాదం ఉందని ముందే గ్రహించి దేశం విడిచి పారిపోయాడు. అయితే దానికి స్వీయ ప్రవాస జీవితం అనే ముద్దు పేరొకటి తగిలించాడు. ఇప్పుడు స్వదేశంలోనే ఫామ్ హౌస్ లో బతుకుజీవుడా అంటూ తలదాచుకుంటే పోలీసులు అరెస్ట చేసి తీసుకువెళ్లారు.

నియంతలకే నియంత

పాకిస్థాన్ కు నియంతల పాలన కొత్త కాకపోయినా ముషారఫ్ నియంతల్లోకెల్లా నియంత. అంతకుముందు 1958లో అయూబ్ ఖాన్ సైనిక తిరుగుబాటు ద్వారా గద్దెనెక్కాడు. 1977లో జియా ఉల్ హక్ ప్రభుత్వాన్ని కూల్చేసి నిర్బంధంగా పాలనా పగ్గాలు చేబట్టాడు.  1999లో ముషారఫ్ కూడా సైనిక తిరుగుబాటుతో నవాజ్ షరీఫ్ సర్కారును గద్దెదింపేసి ప్రెసిడెంట్ అయ్యాడు. పాకిస్థాన్ చరిత్రలో ఆరుగురు అధ్యక్షులు వివిధ పార్టీలకు చెందిన  నాయకులు. ఇందులో నలుగురు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ వారే. నలుగురు అధ్యక్షులు మిలటరీ అధికారులు. ఇందులో ముగ్గురు సైనికకుట్రతో గద్దెనెక్కారు. అయితే మిగతా ముగ్గురూ తమ పాలన ముగిశాక మళ్లీ అధికార పీఠం వైపు చూడలేదు. ముషారఫ్ మాత్రం అలాకాదు... జరిగినన్నాళ్లూ నియంతలా పాలించాడు. టైం బాగోనప్పుడు తోకముడిచి ప్రవాసం అన్నాడు. ఇప్పుడు ఎన్నికలవేళ రాజకీయ నాయకుడి అవతారమెత్తి ప్రజాస్వామ్యం ముసుగేసుకుని మళ్లీ దేశంలో అడుగుపెట్టాడు. అందుకే ప్రత్యర్థులకు అంత ఒళ్లుమంట!

Thursday 18 April 2013

ఓట్లు రాలుకాలం...!

రామా... కనవేమిరా...?!

రామరాజ్యం అంటే ప్రజా సంక్షేమం. ధర్మబద్ధమైన పాలన. పన్నుల వడ్డనలేని రాజ్యం. ధనికుడు మరింత ధనికుడు, పేదవాడు మరింత పేదవాడుగా మారిపోయే పరిస్థితులకు తావులేని సమసమాజం. మనదేశంలో చిన్నా చితకా ఏడున్నరవేల సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. అయినా సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా అశాంతి. ప్రజలు సంతృప్తి చెందడంలేదా... పాలకులే విఫలమవుతున్నారా... ?. ఏటా లక్షల కోట్లు సంక్షేమం పేరుతో గుమ్మరిస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఇంత డబ్బు ఏమయిపోతున్నట్లు...?. రామరాజ్యం ఎప్పటికైనా వస్తుందనేది ఉట్టి భ్రమేనా...?. నేటికి ఏనాటికీ ఆకలి రాజ్యమేనా...?!


'పని'లేకపోతే సమస్యే...

మనిషి బతకాలంటే ఉపాధి కావాలి.  అంటే సంపాదనా మార్గం ఉండాలి. అందుకు ప్రభుత్వం ఉద్యోగావకాశమైనా ఇవ్వాలి. లేదంటే స్వయంగా ఉపాధి పొందేందుకు మార్గమైనా చూపించాలి. సుమారు ఏడు దశాబ్ధాల స్వతంత్ర భారతదేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం. అసలు నిరుద్యోగం సమస్యే కాదు... మన విద్యార్థుల్లో నైపుణ్య స్థాయి తక్కువగా ఉండడమే అసలు సమస్య అని విశ్లేషించారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎలివేట్ అవుతున్న రాహుల్ గాంధీ. నైపుణ్యమెందుకు లేదంటే మన యూనివర్సిటీలు బోధిస్తున్న విద్యంతా డొల్లేనంటారాయన. పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ విద్యార్థుల్లో పెంపొందించాలి. అందుకు యూనివర్సిటీలు, పరిశ్రమలు అనుసంధానంగా పనిచేస్తూ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. విద్యావ్యవస్థ సంస్కరణలనే అంశం చాలా విస్తృతమైంది. కార్మికులకు ఉపాధి కావాలి. యువతకు ఉద్యోగం కావాలి. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలంటే ఏదో ఊతం కావాలి. పథకాలైతే ఉన్నాయి. ఫలితాలెందుకు ఆశాజనకంగా ఉండడం లేదన్నది సందేహం.

 కరువు చూపిన ఉపాధి మార్గం

మనదేశంలో అమలవుతున్న ఉపాధి హామీ పథకం(ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం) సుమారు నాలుగు దశాబ్దాల నాటిది. ఇందులో ఎన్నో వైపల్యాలున్నాయి. మొదట మహారాష్ట్రలో ఈ పథకం అమలు చేశారు. 1972లో మహారాష్ట్రలో కనీవినీ ఎరుగని కరువు పరిస్థితులు వచ్చాయి. ఈ ఏడాది కూడా ఆ రాష్ట్రంలో తీవ్రమైన కరువు తాండవిస్తోంది. ప్రపంచంలో... చివరికి కమ్యూనిస్టు పాలిత దేశాల్లోనూ లేనివిధంగా ఉపాధి హామీ పథకాన్ని డిజైన్ చేశారు.  పేదలకు రోజు గడిచేలా ఉపాధి చూపించడమే దీని లక్ష్యం. క్షామపీడిత ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, సాగునీటి కాలువలు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పడేలా పనులు చేపట్టాలనేది ఆశయం. దీనివల్ల గ్రామాల్లో సౌకర్యాలు పెరుగుతాయి. రెండోది అక్కడి వారికి ఉపాధి మార్గం ఉంటుంది. ఈ పథకం మొదట సత్ఫలితాలనే సాధించింది. అనేకానేక దేశాల వారు దీనిపై అధ్యయనాలు జరపడానికి వచ్చేవారుట. దీన్నే ఆ తర్వాత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో ఇలాంటి పథకాలే ఉన్నాయి. అయితే ఇలాంటి ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త సామాజిక సమస్యలు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వం ఇస్తున్న డబ్బంతా కాంట్రాక్టర్లు, అధికారులు, నాయకులు(వాటాల్లో ఈ మూడు ఘటాలు ముందూ వెనకా ఉండవచ్చు!) కలిసి పంచేసుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం. కొద్ది మందికి ఉపాధి లభిస్తోంది. కొన్ని చోట్ల ఏ పనీ చేయకుండానే నాలుగు డబ్బులు చేతికందుతుండడంతో వ్యవసాయ రంగానికి కూలీలు దొరకని సంక్షోభం తలెత్తుతోంది. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో ఎంత మందికి నిజమైన ఉపాధి కల్పిస్తున్నామనేది ఏ ప్రభుత్వాలూ చెప్పలేని పరిస్థితి.

కూడుపెట్టని సంక్షేమ పథకాలు

మనదేశంలో మనిషి ఆకలి తీర్చే పథకాలకూ లెక్కలేదు. ఎన్టీ రామారావు  హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలకు జనాకర్షణ  బ్రాండు వేసింది. ఎన్నికల్లో ఓట్లు రాల్చే పథకాల్లో ఇదొకటి. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు రూపాయికే కిలో బియ్యం అందిస్తోంది. ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో పప్పూ ఉప్పూ లాంటి మిగతా వస్తువల మాటెమిటని అడగకుండా ఓ ప్యాకేజీ స్కీం కూడా ఈమధ్యే మొదలైంది. ఈ పథకం పేదల సంక్షేమం కోసమేనా.... లేదంటే ప్రజాధనం వృధా అవుతోందా.... అనే రెండు ప్రశ్నలపై ప్రజాభిప్రాయం సేకరించాల్సిన అవసరం ఉంది. 

కామరాజ్ పెట్టిన మధ్యాహ్న భోజనమే...

తిండంటే గుర్తొచ్చింది... స్కూలు పిల్లల కోసం తమిళనాడు ప్రభుత్వం మొట్టమొదట మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. 1960లో కె. కామరాజ్ సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత 1982లో ఎంజీ రామచంద్రన్ ప్రభుత్వం మరికొన్ని మార్పులతో దీన్ని ప్రజారంజకంగా మార్చింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తోడ్పడిన స్కీమ్ ఇది. 2001లో సుప్రీంకోర్టు కూడా ఓ కేసులో డైరెక్టన్ ఇవ్వడంతో చాలా రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చాయి. 

 జయ ఇడ్లీ భలే రుచిట!

ఇప్పుడు తమిళనాడులో జయలలిత సర్కారు రూపాయికే ఇడ్లీ పథకం తీసుకువచ్చింది. చెన్నై సహా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వమే హోటళ్లు నిర్వహిస్తూ చౌక ధరలకు ఇడ్లీ, వడ, ఉప్మా లాంటివి అందిస్తోంది. పేదలు, కూలీల ఆకలి  తీరుస్తున్న పథకమిది. చెన్నైలోనే రోజూ రెండు లక్షలకు పైగా ఇడ్లీలు అమ్ముడవుతున్నాయంటే ఎంత మంది పేదలు సర్కారు పథకంతో పొట్ట నింపుకుంటున్నారో అర్థమవుతోంది. ఎన్టీ రామారావు హయాంలో హైదరాబాద్ లోనూ ఇలాగే చౌకగా ఆహార పదార్ధాలు అందించే జనతా హోటళ్లను ప్రారంభించి కొద్దికాలంలోనే ఎత్తేశారు.

మన ఆరోగ్యశ్రీతో మంచి ఫలితం

మనిషికి కావాల్సినవి తిండి, చదువు, ఉపాధి, ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం బహుళ జనాదరణ పొందింది. అలాగే 108 సర్వీసు కూడా జనానికే మంచి చేసింది. అయితే ఆరోగ్యశ్రీ పథకం అమల్లో పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్యం వల్ల కార్పొరేట్ ఆస్పత్రుల ధనదాహం ఈ పథకంలోని సదుద్దేశాన్ని నీరుగార్చేసిందన్నది సత్యం. ప్రజలందరికీ ఆరోగ్యభద్రత కల్పించాల్సిన బాధ్యత సర్కారుది. అంటే అందరికీ ఆరోగ్య బీమా ఉండాలి. కానీ పాలకులు ఇలాంటి విషయాలనే ఎందుకో నిర్లక్ష్యం చేస్తుంటారు. కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ రాష్ట్రీయ స్వాస్త్య బీమా యోజన పేరుతో ఐదేళ్లుగా ఓ స్కీం నడుపుతోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న సుమారు మూడుకోట్ల మందికి స్మార్ట్ కార్డులిచ్చారు. ఈ కార్డున్న వారు ఎక్కడైనా ఉచిత వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం బాగా పనిచేస్తోందని గుర్తించిన ఐక్యరాజ్య సమితి దీన్ని ఇన్నోవేటివ్ కేస్ స్టడీ కింద తీసుకుంది. జర్మనీ సర్కారు కూడా తమ స్కూలు పిల్లల కోసం ఇలాంటి బీమా పథకాన్ని అమలు చేయడానికి మనదేశం సహకారం కోరిందిట. మన సంక్షేమ పథకాలు దేశవిదేశాల్లో ప్రాచూర్యం పొందుతున్నాయి. ఎన్నికల వేళ సరికొత్త ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు ప్రకటించే పార్టీలకు ఓట్లు పడుతున్నాయి. కోట్లకు కోట్లు ప్రజాధనం ఖర్చవుతోంది. అయినా ఎవరిని కదిపినా మొదట వినిపించే పదం "ఆకలి"!. పేదరికం లేని సమసమాజం వస్తుందని ఆశించే జనం గోడు కనవేమిరా... రామా?! 

Wednesday 17 April 2013

డబ్బున్న ఓ బ్యాచిలర్ ఎమ్మెల్యే!

 నేతా బనేగా కరోడ్పతి!

పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే టక్కున నాయకుడినైపోతా అనేస్తున్నారు. ఎందుకంటే... కోట్ల రూపాయల డబ్బు, అది తెచ్చిపెట్టే దర్జా, ఖద్దరుచొక్కాల వైభోగం, పదవుల్లో ఉన్న పెద్దలు వెలగబెట్టే దర్పం... ఎలాఉంటాయో రోజూ టీవీల్లో చూస్తున్నారు కదా. బాగా సంపాదించిన వారు ప్రజా సేవ చేయాలని ఉందంటూ నాయకులైపోతున్నారు. నాయకులైపోయిన వారు ప్రజాసేవను పక్కనతోసేసి బాగా సంపాదించే పనిలో పడుతున్నారు. 

కర్నాటక రాజకీయాల్లో ప్రియా కృష్ణ అనే ఈ యువ ఎమ్మెల్యేది వెరైటీ బ్యాగ్రౌండ్. బెంగళూరు నుంచి గత ఎన్నికల్లో ఓ సారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు రెండోసారి పోటీకి దిగిన ప్రియా కృష్ణ అక్కడి పొలిటీషియన్లలో ఓ రిచెస్ట్ పర్సన్. ఈ యువ ఎమ్మెల్యే వయసెంతో తెలుసా... కేవలం 29 ఏళ్లే. ఇంకా పెళ్లి కూడా అవలేదు. అంటే రిచెస్ట్ బ్యాచిలర్ పొలిటీషియన్ అన్నమాట. బీఏ ఆనర్స్ చదివాక ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ పట్టా పుచ్చుకున్నారు. ఇరవయ్యేళ్లు కూడా నిండకుండానే తండ్రి తరుపున రాజకీయ ప్రచారాల్లో పాల్గొనడం వల్ల ఆసక్తి పెరిగింది. మంచి గోల్ఫ్ ఆటగాడైన ప్రియా కృష్ణ రాజకీయాల్లో సచ్ఛీలత పెరగాలని అభిలషిస్తారు.

రిచెస్ట్ పొలిటీషియన్....

ఈ ఎన్నికల్లో ఎలక్షన్  కమిషన్కు సమర్పించిన అపిడవిట్ ప్రకారం  ఆయన ఆస్తి మొత్తం 910 కోట్ల రూపాయలు. ఇదంతా రియలెస్టేట్ ద్వారా సంపాదించిందేనట. ప్రియా కృష్ణ తండ్రి సీనియర్ కాంగ్రెస్ లీడరు ఎం. కృష్ణప్ప. ఈ కుటుంబం నాలుగు దశాబ్దాలుగా రియలెస్టేట్ రంగంలోనే ఉందిట. అలాగే రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ప్రియా కృష్ణ సిట్టింగ్ బీజేపీ మంత్రి వి. సోమన్నను అవలీలగా ఓడించేసి ఎమ్మెల్యే అయిపోయారు. ఇదంతా డబ్బు మహిమ అనుకోవడానికి లేదు. మనదేశంలో ప్రజాస్వామ్యం ఇలాగే వర్థిల్లుతోంది.  ఆస్తుల మాట బాగానే ఉంది. ఈ బ్యాచిలర్ ఎమ్మెల్యేకున్న అప్పెంతనే డౌటు వచ్చి ఉండవచ్చు!. అక్షరాలా 700  కోట్లట. భూములు కొనుగోలు చేసేందుకు చేసిన అప్పుల చిట్టా చాలా పెద్దదే. అయితే డబ్బు ఎంత ఉన్నా సాదాసీదాగా ఉండడానికే ఇష్టపడతానంటున్నారు ఈ యువ ఎమ్మెల్యే.

Tuesday 16 April 2013

అమ్మా, నాన్న... ఆరుషి!

సంచలనాల్లో సంచలనం!
కన్న బిడ్డను తల్లిదండ్రులే చంపుకుంటారా...?! అలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయనిపించవచ్చు. కానీ ఇక్కడ తల్లిదండ్రులిద్దరూ మంచి పేరున్న డెంటిస్టులు. ఆ బిడ్డకు పట్టుమని పధ్నాలుగేళ్లు కూడా నిండలేదు. ఐదేళ్లుగా జాతీయ స్థాయిలో అత్యధిక ప్రచారం జరుగుతున్న మర్డర్ కేసు ఇది. అదే ఆరుషి హత్య కేసు. ఐదేళ్లుగా దర్యాప్తు సాగిస్తున్న ఈ సంచలన హత్య కేసులో ఆరుషి తల్లిదండ్రులైన డాక్టర్లు రాజేష్ తల్వార్, నూపుర్ తల్వార్ హంతకులని సీబీఐ కోర్టుకు విన్నవించింది.

ఐదేళ్లుగా మలుపులే మలుపులు

నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తొమ్మిదో క్లాసు చదివే ఆరుషి తల్లిదండ్రులతో కలిసి అక్కడే జలవాయు విహార్ అపార్ట్ మెంట్లో నివసించేది.  2008 మే 16న అనుమానాస్పదస్థితిలో మరణించింది. పధ్నాలుగేళ్లయినా నిండని ఆ చిన్నారిని ఎవరో గొంతు కోసి దారుణంగా చంపేశారు. మొదట వీరింట్లో పనిచేసే ఉద్యోగి హేమరాజ్ మీదకు అనుమానం మళ్లింది. పోలీసులు హేమరాజ్ కనిపించకుండాపోయాడంటూ గాలింపు జరుపుతుండగానే ఆ మరుసటి రోజు దారుణంగా హత్యకు గురయ్యాడు. జలవాయు విహార్ అపార్ట్ మెంట్ టెర్రస్ మీద హేమరాజ్ మృతదేహం కనిపించింది. అయితే ఆరుషిని ఎవరు చంపారనేది మిస్టరీగా మారింది.


మీడియా ట్రెండ్ మార్చిన మర్డర్ కేసు

ఆ రోజుల్లో జాతీయ చానళ్లు మిగతా వార్తలన్నీ పక్కన పెట్టేసి ఆరుషి హత్యోదంతం కథనాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. రేటింగ్ యావలో ఉరుకులు పరుగులు పెట్టే చానళ్లకు ఇదొక్కటే వార్తయింది. ఇలాంటి వార్తలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని దూరదర్శన్ న్యూస్ చివరికి ఆ నెలలో పెద్ద మొత్తంలో రేటింగ్ తగ్గి అడ్వర్టయిజ్ మెంట్ల ఆదాయం కోల్పోయిందిట. ఆరుషి మర్డర్ కేసుకు విపరీతమైనర ప్రచారం ఇచ్చిన కొన్ని జాతీయ చానళ్లు అనూహ్యమైన రేటింగ్స్ సాధించాయి. జనం చూసే వార్తలంటే ఇలాంటివేనన్న ఎజెండాను ఎలక్ట్రానిక్ మీడియా ఫిక్స్ చేసేసింది. నిరంతర వార్తాస్రవంతిలాగా కొన్ని తెలుగు చానళ్లు కూడా ఆరుషి హత్యోదంతాన్ని తెగ ఊదరగొట్టాయి. ఈమధ్య ఢిల్లీలో జరిగిన నిర్భయ రేప్ అండ్ మర్డర్ కేసు కూడా ఇలాగే సంచలనం రేపింది. ఆ ఘటన జరిగిన రోజున మన రాష్ట్రంలోనే నాలుగైదు రేప్ కేసులో నమోదయ్యాయి. దారుణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ఆ అభాగ్యురాళ్లు గురించి ఎవరూ పట్టించుకోలేదు. నిర్భయ కేసుకు ఎక్కడాలేని ప్రాధాన్యం వచ్చింది. ఆ ఘటన తర్వాత అదే ఢిల్లీలో డజన్లకొద్దీ అత్యాచారాలు జరిగాయి. మృగాళ్లు రాక్షసంగా, అమానవీయంగా ప్రవర్తించిన ఘటనలూ ఉన్నాయి. కానీ ఆరుషి, నిర్భయ కేసులపై మీడియా మొత్తం ఫోకస్ పెట్టింది. దేశంలో రోజూ వందల మంది చనిపోతుంటారు. వేల హత్యలు జరుగుతుంటాయి. సంచలనాలూ జరుగుతుంటాయి. కానీ ఆరుషి హత్య కేసులో ఆసక్తికరమైన అంశం ఆ బాలికను తల్లిదండ్రులే చంపారన్న అనుమానం.

జనానికి అమితాసక్తి

హత్య జరిగిన వారం రోజులకు డెంటిస్ట్ అయిన తండ్రి రాజేష్ తల్వార్ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత తల్లి నూపుర్ తల్వార్ అరెస్ట్ అయ్యారు. మలుపులు తిరిగిన ఈ కేసును ఉత్తర ప్రదేశ్ పోలీసులు సీబీఐకి అప్పగించారు. కూతురి హత్య కేసుతో పాటు తమ దగ్గర పనిచేసే మేల్ సర్వెంట్ హేమరాజ్ హత్య కేసులోనూ తల్వార్ దంపతులపై నేరారోపణలు నమోదయ్యాయి. మీడియా ప్రచారం, సీబీఐ స్పెషల్ ఫోకస్... అన్నీ కలిసి ఆరుషి హత్య కేసుపై జనాసక్తి అనూహ్యంగా పెరిగింది. ఈ కేసు అప్ డేట్స్ తెలుసుకోవడానికి జనరల్ పబ్లిక్ సీబీఐ ఆఫీసుకు ప్రతిరోజూ వేల టెలిఫోన్ కాల్స్  చేసేవారుట. ఇంతేకాదు కేసు దర్యాప్తు ఎలా సాగించాలి, దోషులను ఎలా పట్టుకోవాలి లాంటి ఐడియాలు కూడా ఇచ్చేవారుట.

మీడియాది అపరిమిత పాత్ర

ఒకదశలో ఎలక్ట్రానిక్ మీడియా అత్యుత్సాహమే కేసును మలుపులు తిప్పుతోందా అన్న అనుమానాలు కలిగాయి. దర్యాప్తు సంస్థలకు సమాంతరంగా టీవీ ఛానళ్లు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగించి సంచలనాల మీద సంచలనాలు సృష్టించిన కేసు ఇది. "నేర ఘటన - కవరేజ్ లో మీడియా పాత్ర" అన్న అంశం మీద ఎవరైనా పరిశోధన చేయాలనుకుంటే ఇంతకు మించిన అంశం, కేసు మరోటి ఉండదు. మీడియా విపరీత పోకడలకు ఈ కేసు సజీవ ఉదాహరణ.

ఇంతకీ ఎందుకు చంపారో...?!

మొత్తానికి ఆరుషిని హత్య చేసింది తల్లిదండ్రులేనని సీబీఐ దర్యాప్తు తేల్చింది. ఆరుషి, హేమరాజ్ హత్యలు జరిగిన రోజులన వారి నివాసంలోకి వేరెవరూ వచ్చే అవకాశం లేదనందున రాజేష్, నూపుర్ నేరం చేసినట్లు భావించాలనేది సీబీఐ వాదన. ఐదేళ్ల దర్యాప్తు తర్వాత ఘజియాబాద్ కోర్టులో సీబీఐ తేల్చిచెప్పిన అంశం ఇది. ఇక తుది నిర్ణయం కోర్టు చేతుల్లోనే ఉంది. అయితే  ఆరుషిని ఎవరు చంపినా, ఎందుకు చంపారన్నది ప్రశ్న. 

Friday 12 April 2013

ఎజెండా సెట్టర్ సోషల్ మీడియా!

ఓటర్ల చేతుల్లో బ్రహ్మాస్త్రం

2104 జనరల్ ఎన్నికలు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ నాయకత్వ పటిమకు పరీక్ష కాబోతున్నాయి. అంతేకాదు సోషల్ మీడియా ప్రభావం కూడా ఈ ఎన్నికల మీద గణనీయంగా ఉంటుందని సర్వేలు తేల్చాయి. 

 ఐరీస్ నాలెడ్జ్ ఫౌండేషన్, ఇండియన్ ఇంటర్నెట్, మోబైల్ యూజర్స్ అసోసియేషన్ నిర్వహించిన  అధ్యయనం ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన అంశాలను బయటపెట్టింది. ఇకపై ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారే కాదు ఫేస్ బుక్ అక్కౌంటు హోల్డర్స్ కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ధారించనున్నారు. ఇది శుభపరిణామమే. 

 నరేంద్ర మోడీ నిరుడు డిసెంబర్  ఎన్నికల్లోగుజరాజ్ ఓటర్లను ఆకట్టుకోవడంలో టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేనటువంటి హైటెక్ పోకడ నరేంద్ర మోడీకి ఉంది. ఫేస్ బుక్ చాటింగులు, ట్విటర్లో అభిప్రాయాలను షేర్ చేసుకోవడం, వెబ్ సైట్లో వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడంలో మోడీ టీం ముందుంటుంది. ఎన్నికల ప్రచారంలోనూ మోడీ ఈసారి వెరైటీగా త్రీడీ పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. రాహుల్ గాంధీ కూడా టెక్ సావీయే. అయితే ఇంకా సోషల్ మీడియాలో ఓపెన్ అవ్వాలి. ప్రజలకు పేస్ బుక్, ట్విటర్, వెబ్, మెయిల్ మార్గాల ద్వారా ఇంకా ఇంకా దగ్గరవ్వాలి. నాయకులు మాత్రమే కాదు ఓటర్ల కూడా టెక్నాలజీ మార్గాల ద్వారా ఒక్కతాటిపైకి వస్తున్నారు. ఆ ప్రభావం ఏంటన్నది వచ్చే ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని సర్వేలు వెల్లడించాయి.

యూత్ ఫుల్ థాట్స్

నిర్భయ ఘటన తర్వాత దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయంటే సోషల్ మీడియాయే జనాన్ని ఏకాభిప్రాయం దిశగా నడిపింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం కెరటంలా ఉప్పొంగిందంటే సమాచార సాంకేతిక విప్లవమే కారణం. అనేక అంశాల మీద యువతరం పోరాట మార్గంలో నడుస్తున్నది ఇలాగే. ఎవరూ పిలుపునివ్వకపోయినా సోషల్ మీడియాయే ఎజెండా సెట్ చేస్తోంది. ఒకే అంశం మీద యువతంతా ఒకే విధంగా స్పందించేలా చేస్తున్న పవర్ ఫుల్ ఆయుధాలు బ్లాగ్, ఫేస్ బుక్, ట్విటర్, మెయిల్, వెబ్ సైట్.


2014 ఎలక్షన్స్ లో ఫేస్ బుక్ ఎఫెక్ట్

వచ్చే ఎన్నికల్లో యువ ఓటర్లు వీటిని బాగా వినియోగించుకోబోతున్నారని తేలింది.
2014 పార్లమెంటు ఎన్నికల్లో  దేశంలోని 543 నియోజకవర్గాల్లో 160 చోట్ల సోషల్ మీడియా ఎపెక్ట్ ఉంటుందిట. అంటే నగరాలు, ప్రధాన పట్టణాల్లో నెటిజన్లు తమ సత్తా ఏమిటో చాటబోతున్నారన్నమాట!. 67 సెగ్మెంట్లలో ఓ మోస్తరు ప్రభావం ఉంటుందని తేలింది. 60 చోట్ల స్వల్ప ప్రభావం కనిపిస్తుంది. 256 నియోజకవర్గాల్లో ఈ మీడియా ప్రభావం అసలే ఉండదట. అంటే ఇవన్నీ గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలై ఉండవచ్చు. ఫేస్ బుక్ లేదా ఇతర సామాజిక అనుసంధాన మీడియాతో ఇక్కడి ఓటర్లకు లింకు లేనట్లు లెక్క.

ఏపీలో 11 సెగ్మెంట్లు కీలకం

మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, కరీంనగర్, నరసరావుపేట, చిత్తూరు పార్లమెంటరీ స్థానాల్లో సోషల్ మీడియా ద్వారా కనెక్టయిన ఓటర్ల ప్రభావం ఎన్నికల ఫలితాల మీద కనిపిస్తుందని తేలింది. మహారాష్ట్రలో అత్యధిక ప్రభావం ఉండే నియోజకవర్గాలు 21 దాకా లెక్కతేలాయి. అదే గుజరాత్ లో 17 నియోజకవర్గాలున్నాయి. అత్యధిక ప్రభావం ఉండే నియోజకవర్గాలంటే మొత్తం ఓటర్లలో పది శాతానికన్నా ఎక్కువ ఫేస్ బుక్ అక్కౌంట్లున్న వారుండడమే. చివరి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి సాధించిన మెజారిటీ కన్నా ఎక్కువ సంఖ్యలో ఫేస్ బుక్ వాడకం దారులు ఉన్నట్లు లెక్క. అంటే ఈ మార్జిన్ లో ఉన్న ఓటర్లే అభ్యర్థి గెలుపోటములను ప్రభావితం చేయబోతున్నారన్న మాట!. ఈలెక్కన మన రాష్ట్రంలో పదకొండు నియోజకవర్గాల్లో సోషల్ మీడియా ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు అంచనా. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య దాదాపు సమానంగానే ఉంది. దినపత్రికలు, టీవీ న్యూస్ ఛానళ్లు కొనేసుకుని అదేపనిగా ఊదరగొట్టేస్తూ సొంత ప్రచారం చేసుకునే నాయకులకు సోషల్ మీడియా సరికొత్త సవాల్ విసరబోతున్నట్లే. అభ్యర్థులను అందలమెక్కించడానికీ, చాపకిందనీరులా పునాదులను కదిలించడానికీ సోషల్ మీడియా పనిచేస్తుంది. యువతరం ఆగ్రహించిందంటే ఎలాంటి నాయకుడికైనా డేంజరే. తమ అరచేతుల్లోనే ఉంది అతిపెద్ద ఆయుధం అదే సోషల్ మీడియా. బీ కేర్ ఫుల్!

Wednesday 10 April 2013

'అపరబ్రహ్మ' అజరామరుడే!

ఆ ప్రతిసృష్టితో లక్షల కుటుంబాల్లో వెలుగులు

ఈ సృష్టిలో సంతానం లేకపోవడమనేది అతిపెద్ద శాపం. పిల్లలను మించిన ఆస్తిపాస్తులేవీ ఈ లోకంలో ఉండవు. ఈ మాటలు చెప్పిన అపరబ్రహ్మ సర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్ (87) ఏప్రిల్ 10న మరణించారు. నిజంగా ఆయన అజరామరుడు. కృత్రిమ గర్భదారణ ద్వారా సంతానం కలుగుతున్న లక్షల కుటుంబాల్లో ఆయన పసిపాపలా జీవిస్తూనే ఉంటాడు. ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఈ భూమ్మీదకు వస్తున్న ప్రతి బిడ్డా రాబర్ట్స్ ప్రసాదించిన వరమే. టెస్ట్ ట్యూబ్ బేబీలకు తల్లిదండ్రులవుతున్న జంటలు అ అపరబ్రహ్మకు రుణపడి ఉండాల్సిందే.

టెస్ట్ ట్యూబ్ బేబీల ప్రాణదాత

సృష్టికి ప్రతిసృష్టి చేయాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా బ్రిటీష్ సైంటిస్ట్ రాబర్ట్ ఎడ్వర్డ్స్ టెస్ట్ ట్యూబ్ ప్రక్రియ ద్వారా జీవాలకు ప్రాణం పోసే ప్రయోగాలు చేశాడు. కొన్ని దశాబ్దాల నిర్విరామ ప్రయోగాల ఫలితంగా  1978లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ ఈ ప్రపంచంలోకి వచ్చింది. ల్యాబ్లో ప్రాణం పోసుకున్న బిడ్డ... తల్లి ఒడిలోకి చేరి కెవ్వుమన్న క్షణాలకు అప్పుడే ముప్పయి ఐదేళ్లు దాటిపోయింది. తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయీస్ బ్రౌన్. ఆ వైద్య ప్రయోగాల ఫలితంగా ప్రపంచంలో లక్షల మందికి ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియ ద్వారా సంతానయోగం కలుగుతోంది.

టెస్టు ట్యూబ్ బేబీలతో రాబర్ట్ ఎడ్వర్డ్స్

ఎన్నో అవమానాలు... చివరికి విజయం

రాబర్ట్ ఎడ్వర్డ్స్ ప్రయోగాలను సహచర సైంటిస్టులు తక్కువ అంచనా వేశారు... నిరుత్సాహపరిచారు.... గేలిచేశారు. క్యేథలిక్ చర్చి పెద్దలు తప్పుబట్టారు. అయినా పట్టుదలతో కృషి చేసిన ఎడ్వర్డ్స్ ఐవీఎఫ్ ప్రక్రియలో సక్సెస్ అయ్యారు. టెస్ట్ ట్యూబ్ బేబీని ఈ ప్రపంచంలోకి రప్పించగలిగారు. వైద్య పరమైన లోపాలతో సంతాన యోగం లేని లక్షల మంది దంపతులకు రాబర్డ్స్ ప్రయోగాలు వరంలా మారాయి. రాజుల కాలంలో పుత్రకామేష్టి యాగాలతో బిడ్డలు పుడతారని నమ్మేవారు. కలియుగంలో ఇప్పటికీ ఇలాంటి యాగాలు జరుగుతూనే ఉన్నాయి. పుత్రకామేష్టి యాగంతో బిడ్డలను పుట్టిస్తామని నమ్మిస్తున్న స్వామీజీలు, నమ్మేసి వేల రూపాయలు దండగ చేసుకుంటున్న అమాయక దంపతులు మనకు తారసపడతారు. ఇలాంటి యాగాలను గంటలకొద్దీ ప్రసారం చేసే టీవీ చానళ్లు మూఢనమ్మకాలను పెంచిపోషిస్తూ తెగడబ్బు సంపాదిస్తున్నాయి. 

తొలి టెస్ట ట్యూబ్ బేబీతో సృష్టికర్త రాబర్ట్ ఎడ్వర్డ్స్

 రాబర్ట్స్ ఎడ్వర్డ్స్ మాత్రం అతీంద్రయశక్తులను నమ్ముకోలేదు... సైన్సును నమ్మాడు. సత్ఫలితం సాధించాడు. 2010లో మెడిసిన్లో ఆయనకు నోబెల్ పురస్కారం లభించింది. లక్షల మంది బిడ్డలకు ప్రాణం పోస్తున్న టెక్నాలజీకి రూపకల్పన చేసిన రాబర్ట్ ఎడ్వర్డ్స్, రూథ్ దంపతులకు ఐదుగురు ఆడ సంతానం.    

నోరుజారితేనే ప్రచారం!

నాయకులకు పట్టని భయ్యా దీక్ష!
మహారాష్ట్రలో ఓ నాయకుడు నోరుజారితే విపరీతమైన ప్రచారం వచ్చేసింది. పనిలోపనిగా ఇష్యూ కూడా వెలుగులోకి వచ్చింది. ఆ ఇష్యూ మీద రాజకీయ నాయకుల దృష్టి పడేందుకు రెండు నెలలుగా దీక్ష చేస్తున్న రైతు నాయకుడి మాటను ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదు. ఓ నాయకుడు నోటికొచ్చినట్లు మాట్లాడాక అసలు ఇష్యూ మీద అందరూ దృష్టి పెట్టారు. అది మహారాష్ట్రలో కనీవినీ ఎరుగని కరవు సమస్య. గొంతెండుతున్న మరాఠీల తాగు నీటి సమస్య. నోరుజారి ఆపై పశ్చాత్తాపపడుతున్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. ఆ రైతు నాయకుడు ప్రభాకర్ దేశ్ ముఖ్. ఇతడ్ని అంతా భయ్యా అంటుంటారు.

మరాఠ్వాడాలో తీవ్రమైన కరువు

మహారాష్ట్ర మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాల్లోని పదిహేడు జిల్లాల్లో విపరీతమైన కరువు తాండవిస్తోంది. పొలాలు ఎండిపోయాయి. తాగునీరు లేదు. కొన్ని గ్రామాల్లో నెలకు ఓసారి ట్యాంకరు వస్తోంది. ఎవకరాలకొద్దీ పొలాలున్న రైతులు కూలీ పనులు చేసుకుంటున్నారు. యువకులు చదువులు మానేసి ముంబై, పూణేల్లో అడ్డా కూలీలుగా మారిపోయారు. చివరికి అమ్మాయిల పెళ్లిళ్లు కూడా ఆగిపోయాయి. నాలుగు దశాబ్ధాల్లో ఎన్నడూ లేనంత క్షామం తాండవిస్తోంది.

దీక్షలో ఉన్న ప్రభాకర్ దేశ్ ముఖ్

ఎవరికీ పట్టని భయ్యా దీక్ష

 తీవ్రమైన కరువు పరిస్థితుల్లో షోలా పూర్ ప్రాంతానికి చెందిన సామాన్య రైతు ప్రభాకర్ దేశ్ ముఖ్ అలియాస్ భయ్యా  ఆర్ధిక రాజధానిలో నిరహార దీక్ష చేపట్టాడు. ప్రజలను అల్లాడిస్తున్న కరువు పరిస్థితి మీద నాయకులు దృష్టి పడేందుకు భయ్యా తనవంతుగా దీక్షకు దిగాడు. రెండు నెలలుగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈమధ్య కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ బంధువు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్... భయ్యా దీక్ష మీద నోటికొచ్చినట్లు కామెంట్లు చేసి ఇరకాటంలో పడ్డారు. పనిలోపనిగా ఇష్యూ కూడా చర్చలోకొచ్చింది. 'ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు... ఏం చేయాలి... మూత్రం పోయాలా...తాగేందుకే నీళ్లు లేకపోతే మూత్రమెలా వస్తుంది....' ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడుతుంటే అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టడం ఇంకా దౌర్భాగ్యం. 

మరాఠ్వాడాలో నీటి కోసం కోటి కష్టాలు...

 భయ్యా దీక్ష చేస్తున్నది దేనికి?. ప్రజల సమస్యపై చర్చ జరగడానికి!. అజిత్ పవార్ మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి భయ్యా మీదున్న కసిని వెళ్లగక్కారు. విద్యుత్ కోతల మీద మరీ ఘోరంగా... రాయలేని భాషలో మాట్లాడారు. అజిత్ మాటలపై రాజకీయ దుమారం మొదలైంది. ప్రజల సెంటిమెంటు మీద దెబ్బపడింది. భవిష్యత్తులో ఓట్ల మీద ఆ ప్రభావం ఉంటుందేమోనన్న భయంతో... నోరుజారిన నాయకుడు క్షమాపణలు చెప్తున్నాడు. మేనల్లుడి నోరుజారుడు శరద్ పవార్నీ ఇరకాటంలో పడేసింది. పెద్దాయన కూడా ఇప్పుడు క్షమించడండి మహాప్రభో అంటున్నాడు. ఎంతైనా నాయకులు కదా... అందితే జుట్టు... లేదంటే కాళ్లు పట్టుకుంటారు! 

షుగర్ లాబీ పాలిటిక్స్

నోరుజారిన నేత అజిత్ పవార్

మహారాష్ట్రలో షుగర్ లాబీయే రాజకీయాలను శాసిస్తోంది. ప్రాజెక్టుల్లో నీళ్లు లేక కాదు. ఉన్ననీటిని నాయకులకు చెందిన పంచదార బిల్లులకు మళ్లించేస్తున్నారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్... ఇలా అన్ని పార్టీల నాయకులకూ అక్కడ షుగర్ మిల్లులున్నాయి. నాయకులంతా కుమ్మక్కై తమ మిల్లులు మూతపడకుండా చూసుకుంటున్నారు. అందరూ కలిసి రైతు నోట మట్టికొట్టారు. వేల ఎకరాల్లో పంటలు, బత్తాయి తోటలు  ఎండిపోయాయి.మనుషులకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. నాయకులు యజమానులైన షుగర్ మిల్లులకు మాత్రం నీళ్లు వస్తున్నాయి. అందుకే జనం కడుపు మండుతోంది. ముఖ్యంగా శరద్ పవార్ కుటుంబానికి రాజకీయ జీవితం ఇస్తున్న పూణే రీజియన్లో షుగర్ లాబీ ఎక్కువ. ఆ లాబీ మాటకాదని పవార్ ఒక్కడుగు ముందుకు వేయలేడు. అందుకే ప్రాజెక్టుల్లోని నీరంతా మిల్లులకు మళ్లుతున్నా ఎవరూ అడగలేరు. అడిగే ప్రయత్నం చేస్తున్న భయ్యా దేశ్ ముఖ్ లాంటి వారి నోళ్లను నొక్కేసేందుకు అన్ని పార్టీల నాయకులూ ఒక్కటైపోతున్నారు. అందుకే ప్రజల సమస్యలపై గొంతువిప్పే ప్రభాకర్ దేశ్ ముఖ్ లాంటి వారికి దేశ పౌరులంతా అండగా నిలబడాలి. మనకోసం పోరాడే వారిని మనమే ముందుకు నడిపించాలి.      

Tuesday 9 April 2013

మోడీ చెప్పిన పిజ్జా కథ!

విజయానికి శ్రమ, కృషి మాత్రమే మెట్లు!
మన ఊతప్పాలు, దిబ్బట్లు(మినప రొట్టెలు) మనకు మొహం మొత్తేశాయి. అందుకే వెస్ట్రన్ పిజ్జాలంటే తెగనోరూరిపోతోంది ఈ తరానికి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సడెన్ గా ఓ పిజ్జా కథ చెప్పి దేశవాళీ పిజ్జా పవరేంటో ప్రపంచానికి చాటిచెప్పారు. అదే జసు బెన్ పిజ్జా.

అహ్మదాబాద్లో నోరూరించే పిజ్జా

అహ్మదాబాద్ వాసులకు తెగ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ జసు బెన్ పిజ్జాయే. దేశమంతా పిజ్జా హట్, డోమినోస్ లాంటి హేమాహేమీ మల్టీ నేషనల్, విదేశీ కంపెనీలు రాజ్యమేలుతుంటే గుజరాత్లో మాత్రం దేశవాళీ జసు బెన్ పిజ్జాకే క్రేజ్. అహ్మదాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యే జసు బెన్ పిజ్జా గురించి నరేంద్ర మోడీ ఢిల్లీలో జరిగిన ఫిక్కీ మహిళా సదస్సులో ప్రస్తావించారు.  తమ రాష్ట్ర మహిళలు పారిశ్రామిక రంగంలో ఎలా ముందుకు పోతున్నారో  వివరిస్తూ జసు బెన్ సక్సెస్ స్టోరీ చెప్పారు. పిజ్జా అంటే ఇటాలియన్ డెలీషియస్ డిష్. జసు బెన్ పిజ్జాకు ఏ ఇటాలియన్ పిజ్జా కూడా సరిసమానం కాదంటూ పరోక్షంగా ఇటలీ మహిళ సోనియా గాంధీ మీద మోడీ సెటైర్ వేశారు.

బ్రాండ్ వాల్యూ సృష్టించుకున్న మహిళ

ఇరవై ఏళ్లుగా జసు బెన్ పిజ్జాలు అహ్మదాబాద్ మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. జసు బెన్ భర్త జొరావర్ సింగ్ తో కలిసి మొదలు పెట్టిన ఈ సొంత వ్యాపారం గుజరాతీ మోడల్ ఎంటర్ ప్రైజెస్ గా ఎదిగింది.  ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా గుజరాతీలను జసు బెన్ పిజ్జా కార్నర్ నుంచి తమ హట్ వైపు రప్పించుకోలేకపోయింది. జసు బెన్ అనే గుజరాతీ మహిళ సొంత కాళ్ల మీద నిలబడి తన వ్యాపారానికి తిరుగులేని బ్రాండ్ వాల్యూ సంపాదించుకుంది. ఈమెను మిగతా మహిళలందరూ ఆదర్శంగా తీసుకుని సొంత వ్యాపారాల్లో ఘన విజయాలు సాధించాలని మోడీ ఆశించారు. 

 మోడీ నోటి వెంట జసు బెన్ పిజ్జా ప్రస్తావన రాగానే చాలా మంది దృష్టి అటు వెపు మళ్లింది. అసలు ఈ దేశవాళీ పిజ్జాకు ఇంతటి క్రేజ్, బ్రాండ్ వాల్యూ ఎలా వచ్చిందన్న ఆసక్తి కలిగింది. అయితే ఈ సక్సెస్ స్టోరీలో ముఖ్య పాత్ర  జసు బెన్... ఐదేళ్ల క్రితమే మరణించారని మోడీయే చెప్పారు. ఆమె భౌతికంగా లేకపోయినా ఆ పిజ్జాల రుచి మాత్రం ఏమాత్రం  తగ్గడం లేదు. డిమాండూ తగ్గలేదు. సొంత కాళ్ల మీద ఎదగాలనుకునే మహిళలకు జసు బెన్ స్పూర్తిదాయకమే.