Tuesday 16 April 2013

అమ్మా, నాన్న... ఆరుషి!

సంచలనాల్లో సంచలనం!
కన్న బిడ్డను తల్లిదండ్రులే చంపుకుంటారా...?! అలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయనిపించవచ్చు. కానీ ఇక్కడ తల్లిదండ్రులిద్దరూ మంచి పేరున్న డెంటిస్టులు. ఆ బిడ్డకు పట్టుమని పధ్నాలుగేళ్లు కూడా నిండలేదు. ఐదేళ్లుగా జాతీయ స్థాయిలో అత్యధిక ప్రచారం జరుగుతున్న మర్డర్ కేసు ఇది. అదే ఆరుషి హత్య కేసు. ఐదేళ్లుగా దర్యాప్తు సాగిస్తున్న ఈ సంచలన హత్య కేసులో ఆరుషి తల్లిదండ్రులైన డాక్టర్లు రాజేష్ తల్వార్, నూపుర్ తల్వార్ హంతకులని సీబీఐ కోర్టుకు విన్నవించింది.

ఐదేళ్లుగా మలుపులే మలుపులు

నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తొమ్మిదో క్లాసు చదివే ఆరుషి తల్లిదండ్రులతో కలిసి అక్కడే జలవాయు విహార్ అపార్ట్ మెంట్లో నివసించేది.  2008 మే 16న అనుమానాస్పదస్థితిలో మరణించింది. పధ్నాలుగేళ్లయినా నిండని ఆ చిన్నారిని ఎవరో గొంతు కోసి దారుణంగా చంపేశారు. మొదట వీరింట్లో పనిచేసే ఉద్యోగి హేమరాజ్ మీదకు అనుమానం మళ్లింది. పోలీసులు హేమరాజ్ కనిపించకుండాపోయాడంటూ గాలింపు జరుపుతుండగానే ఆ మరుసటి రోజు దారుణంగా హత్యకు గురయ్యాడు. జలవాయు విహార్ అపార్ట్ మెంట్ టెర్రస్ మీద హేమరాజ్ మృతదేహం కనిపించింది. అయితే ఆరుషిని ఎవరు చంపారనేది మిస్టరీగా మారింది.


మీడియా ట్రెండ్ మార్చిన మర్డర్ కేసు

ఆ రోజుల్లో జాతీయ చానళ్లు మిగతా వార్తలన్నీ పక్కన పెట్టేసి ఆరుషి హత్యోదంతం కథనాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. రేటింగ్ యావలో ఉరుకులు పరుగులు పెట్టే చానళ్లకు ఇదొక్కటే వార్తయింది. ఇలాంటి వార్తలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని దూరదర్శన్ న్యూస్ చివరికి ఆ నెలలో పెద్ద మొత్తంలో రేటింగ్ తగ్గి అడ్వర్టయిజ్ మెంట్ల ఆదాయం కోల్పోయిందిట. ఆరుషి మర్డర్ కేసుకు విపరీతమైనర ప్రచారం ఇచ్చిన కొన్ని జాతీయ చానళ్లు అనూహ్యమైన రేటింగ్స్ సాధించాయి. జనం చూసే వార్తలంటే ఇలాంటివేనన్న ఎజెండాను ఎలక్ట్రానిక్ మీడియా ఫిక్స్ చేసేసింది. నిరంతర వార్తాస్రవంతిలాగా కొన్ని తెలుగు చానళ్లు కూడా ఆరుషి హత్యోదంతాన్ని తెగ ఊదరగొట్టాయి. ఈమధ్య ఢిల్లీలో జరిగిన నిర్భయ రేప్ అండ్ మర్డర్ కేసు కూడా ఇలాగే సంచలనం రేపింది. ఆ ఘటన జరిగిన రోజున మన రాష్ట్రంలోనే నాలుగైదు రేప్ కేసులో నమోదయ్యాయి. దారుణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ఆ అభాగ్యురాళ్లు గురించి ఎవరూ పట్టించుకోలేదు. నిర్భయ కేసుకు ఎక్కడాలేని ప్రాధాన్యం వచ్చింది. ఆ ఘటన తర్వాత అదే ఢిల్లీలో డజన్లకొద్దీ అత్యాచారాలు జరిగాయి. మృగాళ్లు రాక్షసంగా, అమానవీయంగా ప్రవర్తించిన ఘటనలూ ఉన్నాయి. కానీ ఆరుషి, నిర్భయ కేసులపై మీడియా మొత్తం ఫోకస్ పెట్టింది. దేశంలో రోజూ వందల మంది చనిపోతుంటారు. వేల హత్యలు జరుగుతుంటాయి. సంచలనాలూ జరుగుతుంటాయి. కానీ ఆరుషి హత్య కేసులో ఆసక్తికరమైన అంశం ఆ బాలికను తల్లిదండ్రులే చంపారన్న అనుమానం.

జనానికి అమితాసక్తి

హత్య జరిగిన వారం రోజులకు డెంటిస్ట్ అయిన తండ్రి రాజేష్ తల్వార్ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత తల్లి నూపుర్ తల్వార్ అరెస్ట్ అయ్యారు. మలుపులు తిరిగిన ఈ కేసును ఉత్తర ప్రదేశ్ పోలీసులు సీబీఐకి అప్పగించారు. కూతురి హత్య కేసుతో పాటు తమ దగ్గర పనిచేసే మేల్ సర్వెంట్ హేమరాజ్ హత్య కేసులోనూ తల్వార్ దంపతులపై నేరారోపణలు నమోదయ్యాయి. మీడియా ప్రచారం, సీబీఐ స్పెషల్ ఫోకస్... అన్నీ కలిసి ఆరుషి హత్య కేసుపై జనాసక్తి అనూహ్యంగా పెరిగింది. ఈ కేసు అప్ డేట్స్ తెలుసుకోవడానికి జనరల్ పబ్లిక్ సీబీఐ ఆఫీసుకు ప్రతిరోజూ వేల టెలిఫోన్ కాల్స్  చేసేవారుట. ఇంతేకాదు కేసు దర్యాప్తు ఎలా సాగించాలి, దోషులను ఎలా పట్టుకోవాలి లాంటి ఐడియాలు కూడా ఇచ్చేవారుట.

మీడియాది అపరిమిత పాత్ర

ఒకదశలో ఎలక్ట్రానిక్ మీడియా అత్యుత్సాహమే కేసును మలుపులు తిప్పుతోందా అన్న అనుమానాలు కలిగాయి. దర్యాప్తు సంస్థలకు సమాంతరంగా టీవీ ఛానళ్లు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగించి సంచలనాల మీద సంచలనాలు సృష్టించిన కేసు ఇది. "నేర ఘటన - కవరేజ్ లో మీడియా పాత్ర" అన్న అంశం మీద ఎవరైనా పరిశోధన చేయాలనుకుంటే ఇంతకు మించిన అంశం, కేసు మరోటి ఉండదు. మీడియా విపరీత పోకడలకు ఈ కేసు సజీవ ఉదాహరణ.

ఇంతకీ ఎందుకు చంపారో...?!

మొత్తానికి ఆరుషిని హత్య చేసింది తల్లిదండ్రులేనని సీబీఐ దర్యాప్తు తేల్చింది. ఆరుషి, హేమరాజ్ హత్యలు జరిగిన రోజులన వారి నివాసంలోకి వేరెవరూ వచ్చే అవకాశం లేదనందున రాజేష్, నూపుర్ నేరం చేసినట్లు భావించాలనేది సీబీఐ వాదన. ఐదేళ్ల దర్యాప్తు తర్వాత ఘజియాబాద్ కోర్టులో సీబీఐ తేల్చిచెప్పిన అంశం ఇది. ఇక తుది నిర్ణయం కోర్టు చేతుల్లోనే ఉంది. అయితే  ఆరుషిని ఎవరు చంపినా, ఎందుకు చంపారన్నది ప్రశ్న. 

4 comments:

జలతారు వెన్నెల said...

"నిర్భయ కేసుకు ఎక్కడాలేని ప్రాధాన్యం వచ్చింది. ఆ ఘటన తర్వాత అదే ఢిల్లీలో డజన్లకొద్దీ అత్యాచారాలు జరిగాయి. మృగాళ్లు రాక్షసంగా, అమానవీయంగా ప్రవర్తించిన ఘటనలూ ఉన్నాయి. కానీ ఆరుషి, నిర్భయ కేసులపై మీడియా మొత్తం ఫోకస్ పెట్టింది. "
ఇలా చాలామంది అనడం చూసాను. నిజమే అన్ని దుర్ఘటనలను త్రీవ్రం గానే పరిగణించాలి. కాని, అప్పుడప్పుడు మాత్రమే కళ్ళు తెరిచి జనం/మనం ఉద్రేకపడుతున్నాము...జరిగిన ఘోరాలను ఖండిస్తూ...కనీసం కొన్ని కేసెస్ లో అన్నా ఇలాంటి స్పందన రావడం మంచి మార్పు కదండి. ఎందుకో ఆరుషిని సొంత తల్లితండ్రులే చంపారేమో అన్న CBI వాదననతో మనసు అంగీకరించటం లేదండి.

nihar said...

జలతారువెన్నెల గారూ... కొన్ని కేసులకు బాగా ప్రచారం జరగడం వల్ల బాధిత కుటుంబాలకు ఎంతోకొంత న్యాయం జరుగుతోంది. అసలు వెలుగులోకి రాని ఘటనల్లో బాధితులకు జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదు. ఇలాంటి వారిని ఆదుకునే వారు, ఓదార్చేవారూ ఉండడం లేదు. అందువల్ల ఎవరికి అన్యాయం జరిగిన సమాజమంతా స్పందించే పరిస్థితి రావాలని ఆశిద్దాం... థాంక్స్ ఫర్ రీడింగ్ మై బ్లాగ్. ... నిహార్

Lakshmi Raghava said...

మీ లాగా అందరు వెలుగు చూపాలని ప్రయత్నం చేస్తే మార్పు వస్తుంది...కేసులు సిక్షలేన కావాల్సింది ? సభ్య సమాజం ఎప్పుడు ఏర్పడాలి?

nihar said...

లక్ష్మీ రాఘవ గారూ స్పందించినందుకు కృతజ్ఞతలు... రోజూ జరుగుతున్న అత్యాచారాల ఘటనలతో మన దేశం పరువు మంటగలుస్తోంది. ఇన్ని కోట్ల జనాభాలో నేర మనస్తత్వం ఉన్న వాళ్ల సంఖ్య చాలా స్వల్పమే. జరుగుతున్న ఘటనల సంఖ్యా తక్కువే. అయితే ఇలాంటి ఘటనలపై మీడియా అతి ప్రచారం వల్ల మనుషుల్లో సున్నితత్వం పూర్తిగా నశించిపోతోంది. దేనికీ స్పందించని మనస్తత్వం అలవడుతోందని నాకనిపిస్తోంది. అందుకే మనిషిలో స్పందించే స్వభావం ఉండాలని ఆశిస్తాను.... నిహార్