Wednesday 10 April 2013

నోరుజారితేనే ప్రచారం!

నాయకులకు పట్టని భయ్యా దీక్ష!
మహారాష్ట్రలో ఓ నాయకుడు నోరుజారితే విపరీతమైన ప్రచారం వచ్చేసింది. పనిలోపనిగా ఇష్యూ కూడా వెలుగులోకి వచ్చింది. ఆ ఇష్యూ మీద రాజకీయ నాయకుల దృష్టి పడేందుకు రెండు నెలలుగా దీక్ష చేస్తున్న రైతు నాయకుడి మాటను ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదు. ఓ నాయకుడు నోటికొచ్చినట్లు మాట్లాడాక అసలు ఇష్యూ మీద అందరూ దృష్టి పెట్టారు. అది మహారాష్ట్రలో కనీవినీ ఎరుగని కరవు సమస్య. గొంతెండుతున్న మరాఠీల తాగు నీటి సమస్య. నోరుజారి ఆపై పశ్చాత్తాపపడుతున్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. ఆ రైతు నాయకుడు ప్రభాకర్ దేశ్ ముఖ్. ఇతడ్ని అంతా భయ్యా అంటుంటారు.

మరాఠ్వాడాలో తీవ్రమైన కరువు

మహారాష్ట్ర మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాల్లోని పదిహేడు జిల్లాల్లో విపరీతమైన కరువు తాండవిస్తోంది. పొలాలు ఎండిపోయాయి. తాగునీరు లేదు. కొన్ని గ్రామాల్లో నెలకు ఓసారి ట్యాంకరు వస్తోంది. ఎవకరాలకొద్దీ పొలాలున్న రైతులు కూలీ పనులు చేసుకుంటున్నారు. యువకులు చదువులు మానేసి ముంబై, పూణేల్లో అడ్డా కూలీలుగా మారిపోయారు. చివరికి అమ్మాయిల పెళ్లిళ్లు కూడా ఆగిపోయాయి. నాలుగు దశాబ్ధాల్లో ఎన్నడూ లేనంత క్షామం తాండవిస్తోంది.

దీక్షలో ఉన్న ప్రభాకర్ దేశ్ ముఖ్

ఎవరికీ పట్టని భయ్యా దీక్ష

 తీవ్రమైన కరువు పరిస్థితుల్లో షోలా పూర్ ప్రాంతానికి చెందిన సామాన్య రైతు ప్రభాకర్ దేశ్ ముఖ్ అలియాస్ భయ్యా  ఆర్ధిక రాజధానిలో నిరహార దీక్ష చేపట్టాడు. ప్రజలను అల్లాడిస్తున్న కరువు పరిస్థితి మీద నాయకులు దృష్టి పడేందుకు భయ్యా తనవంతుగా దీక్షకు దిగాడు. రెండు నెలలుగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈమధ్య కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ బంధువు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్... భయ్యా దీక్ష మీద నోటికొచ్చినట్లు కామెంట్లు చేసి ఇరకాటంలో పడ్డారు. పనిలోపనిగా ఇష్యూ కూడా చర్చలోకొచ్చింది. 'ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు... ఏం చేయాలి... మూత్రం పోయాలా...తాగేందుకే నీళ్లు లేకపోతే మూత్రమెలా వస్తుంది....' ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడుతుంటే అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టడం ఇంకా దౌర్భాగ్యం. 

మరాఠ్వాడాలో నీటి కోసం కోటి కష్టాలు...

 భయ్యా దీక్ష చేస్తున్నది దేనికి?. ప్రజల సమస్యపై చర్చ జరగడానికి!. అజిత్ పవార్ మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి భయ్యా మీదున్న కసిని వెళ్లగక్కారు. విద్యుత్ కోతల మీద మరీ ఘోరంగా... రాయలేని భాషలో మాట్లాడారు. అజిత్ మాటలపై రాజకీయ దుమారం మొదలైంది. ప్రజల సెంటిమెంటు మీద దెబ్బపడింది. భవిష్యత్తులో ఓట్ల మీద ఆ ప్రభావం ఉంటుందేమోనన్న భయంతో... నోరుజారిన నాయకుడు క్షమాపణలు చెప్తున్నాడు. మేనల్లుడి నోరుజారుడు శరద్ పవార్నీ ఇరకాటంలో పడేసింది. పెద్దాయన కూడా ఇప్పుడు క్షమించడండి మహాప్రభో అంటున్నాడు. ఎంతైనా నాయకులు కదా... అందితే జుట్టు... లేదంటే కాళ్లు పట్టుకుంటారు! 

షుగర్ లాబీ పాలిటిక్స్

నోరుజారిన నేత అజిత్ పవార్

మహారాష్ట్రలో షుగర్ లాబీయే రాజకీయాలను శాసిస్తోంది. ప్రాజెక్టుల్లో నీళ్లు లేక కాదు. ఉన్ననీటిని నాయకులకు చెందిన పంచదార బిల్లులకు మళ్లించేస్తున్నారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్... ఇలా అన్ని పార్టీల నాయకులకూ అక్కడ షుగర్ మిల్లులున్నాయి. నాయకులంతా కుమ్మక్కై తమ మిల్లులు మూతపడకుండా చూసుకుంటున్నారు. అందరూ కలిసి రైతు నోట మట్టికొట్టారు. వేల ఎకరాల్లో పంటలు, బత్తాయి తోటలు  ఎండిపోయాయి.మనుషులకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. నాయకులు యజమానులైన షుగర్ మిల్లులకు మాత్రం నీళ్లు వస్తున్నాయి. అందుకే జనం కడుపు మండుతోంది. ముఖ్యంగా శరద్ పవార్ కుటుంబానికి రాజకీయ జీవితం ఇస్తున్న పూణే రీజియన్లో షుగర్ లాబీ ఎక్కువ. ఆ లాబీ మాటకాదని పవార్ ఒక్కడుగు ముందుకు వేయలేడు. అందుకే ప్రాజెక్టుల్లోని నీరంతా మిల్లులకు మళ్లుతున్నా ఎవరూ అడగలేరు. అడిగే ప్రయత్నం చేస్తున్న భయ్యా దేశ్ ముఖ్ లాంటి వారి నోళ్లను నొక్కేసేందుకు అన్ని పార్టీల నాయకులూ ఒక్కటైపోతున్నారు. అందుకే ప్రజల సమస్యలపై గొంతువిప్పే ప్రభాకర్ దేశ్ ముఖ్ లాంటి వారికి దేశ పౌరులంతా అండగా నిలబడాలి. మనకోసం పోరాడే వారిని మనమే ముందుకు నడిపించాలి.      

2 comments:

kvsv said...

@మనుషులకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. నాయకులు యజమానులైన షుగర్ మిల్లులకు మాత్రం నీళ్లు వస్తున్నాయి.....
ఈ దేశం ఇంతే...ఇలానే ఉంటుంది..ఇక ముందు కూడా...మీరు సానుభూతి చూపిస్తున్న ఆ ప్రజలే ప్రవాహాల్లావెళ్ళి ఆ నాయకులకి ఘన స్వాగతాలు చెపుతారు...ఓట్లు వెసి గెలిపిస్తారు...వాళ్ళ గురించి భాద పడకండి...మద్యలో మసయి పోయేది మద్య తరగతి వాళ్ళే...

nihar said...

కేవీఎస్వీ గారూ బాగా స్పందించారు. మన నాయకుల్లో గుణాత్మకమైన మార్పు వచ్చే అవకాశం లేదు. "ధనా'''త్మకమైన మార్పు వస్తుంది. అందువల్ల ప్రజల్లోనే మార్పు ఆశిద్దాం.... నిహార్