Wednesday 3 April 2013

మనాడు మగాడే!

హత్తుకుంటే చిక్కులే!

ఫ్రెండుకో, బంధువులమ్మాయికో మీరు వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకోవడం కామనే. బుగ్గ మీదో, చుబుకం మీదో ప్రేమగా ముద్దు పెట్టుకోవడమూ కామనే. హైఫై ఫ్యామిలీల్లో, కాస్మోపాలిటన్ కల్చర్లో ఇవన్నీ లెక్కలోకి రావు. శృతిమించనంత వరకూ ఇందులో అసభ్యతకు పెద్దగా తావుండకపోవచ్చు. పబ్లిక్ ప్లేసుల్లో ఎంతటి ఎమోషన్స్ అయినా హద్దు ఉంటేనే మంచిది. అయితే ఇలాగే ఓ స్నేహితురాలి విషయంలో భావోద్వేగానికి లోనైన ఓ కుర్రాడు ఏడాది పాటు పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి పోలీసుల మీదే న్యాయపోరాటం చేసి తన తప్పేమీ లేదని కోర్టు ముందు నిరూపించుకోగలిగాడు. అతనే కుబేర్ సరూప్.

మొండి ఘటం...

ముంబైలో ప్రొడక్షన్ కంపెనీ నడుపుకునే పాతికేళ్ల కుబేర్ సరూప్ ఓ అమ్మాయికి సెండాఫ్ చెప్తూ ఎమోషనల్గా ఫీలైపోయాడు. ఆమె చుబుకం మీద ముద్దు పెట్టుకున్నాడు. రోడ్డు మీద జరిగిన ఆ సన్నివేశం ముంబై పోలీసుల కంటపడింది. కేసు రెడీ అయిపోయింది. స్టేషన్ కు తీసుకువెళ్లారు. పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు పెట్టేసి పన్నెండు వందల రూపాయల జరిమానా కట్టమన్నారు. అయితే తాను చేసింది తప్పే కానప్పుడు జరిమానా ఎందుకు కట్టాలంటూ సరూప్ మొరాయించాడు. ఎంత బెదిరించినా లొంగలేదు. కోర్టు డిపాజిట్గా డబ్బు కడితే ఆ మరుసటి రోజు కోర్టులో హాజరుకావవచ్చని, లేదంటే రాత్రంతా లాకప్ లో ఉంచి రెండో రోజు కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. చేసేది లేక డిపాజిట్ కట్టేసిన కుబేర్ సరూప్ ముంబై పోలీసుల మీద న్యాయ పోరాటం మొదలెట్టాడు. 

కోర్టుకు సాక్ష్యం కావాలి కదా...!

కుబేర్ సరూప్ న్యాయమూర్తి ముందూ తాను చేసింది తప్పే కాదని నిర్మోహమాటంగా వాదించాడు. ముంబై బాంద్రా కోర్టులో ఏడాది పాటు విచారణ సాగింది. చివరికి పోలీసులు తగిన ఆధారాలు చూపించలేకపోయారు. కేసు వీగిపోయింది. కుబేర్ సరూప్ విముక్తుడయ్యాడు. ముంబై మోరల్ పోలీసింగ్ కు ఇది ఎదురుదెబ్బే! 

సెన్స్ లేకపోతే న్యూసెన్సే!

అవును నాకెందుకో డౌటుగా ఉంది... నడిరోడ్డు మీద ఓ అమ్మాయిని, ఓ అబ్బాయి హత్తుకుని, ముద్దుపెట్టుకుంటుంటే పబ్లిక్ న్యూసెన్స్ కాకపోతే ఏమవుతుంది?! వదిలేస్తూపోతే ఒకడు ఎమోషనల్ సిచ్యుయేషనంటాడు. మరొకడు హైక్లాస్ లైఫ్ స్టయిలని బుకాయిస్తాడు. మరి పబ్లిక్లో ఏది న్యూసెన్సు, ఏది కాదు?.  

No comments: