రుచి చూస్తే ప్రాణాలు 'ఉఫ్'!
బీపీ కంట్రోలు మన చేతుల్లోనే....!
మనదేశంలో ఓ ఏడాదికి బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో పేషెంట్లు ఖర్చు పెడుతున్నది నాలుగు వేల మూడు వందల కోట్లుట. ఇది చదివాక కూడా బీపీ నార్మల్ గానే ఉందంటే ఉప్పును అవసరానికన్నా తక్కువ మోతాదులోనే తింటున్నట్లు లెక్క. ఉప్పు ఏ వంటకానికైనా రుచి చేకూరుస్తుంది. మోతాదు మించితే ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెడుతుంది. మనిషిలో రక్తపోటుకు పెరగడానికి ప్రధాన కారణం ఉప్పే. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్శంగా ఉప్పు విషయంలో మనం కొంత జాగ్రత్త పడితే మంచిది. మనం రోజూ ఎంత ఉప్పు తింటున్నాం, ఎంత అవసరం, ఏమేరకు తగ్గించే అవకాశం ఉంది... ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేస్తే రాబోయే ముప్పును ముందుగానే అరికట్టడానికి వీలుంటుంది.
ఈసారి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్నిబ్లడ్ ప్రెషర్(రక్తపోటు) ఇయర్ గా డబ్ల్యూటీఓ ప్రకటించింది. ఈ శతాబ్ధంలో అత్యధిక మందిని బలి తీసుకున్న రోగం అధిక రక్తపోటేనట. అంటే హైబీపీ. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురు పెద్ద వాళ్లలో ఒకరిని బీపీ పట్టి పీడిస్తోందని నిపుణుల అంచనా. మన దేశంలో దీని ముప్పు మరీ ఎక్కువ. 2030 నాటికి సుమారు పాతిక కోట్ల మంది భారతీయులు అధిక రక్తపోటుతో మంచమెక్కుతారని సర్వేలు తేల్చిచెప్తున్నాయి. హైపర్ టెన్షన్ రిలేటెడ్ రుగ్మతల కారణంగా ఏటా తొంభై ఐదులక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్ల కారణంగా యువరతం కూడా హైపర్ టెన్షన్ బారిన పడుతోంది. పాతికేళ్లలోపు యువభారతంలో ముప్పయి శాతం మంది హైపర్ టెన్షన్ లేదా బ్లడ్ ప్రెషర్ కారణంగా జబ్బుల పాలవుతున్నారు. యువకులే కాదు యువతులకు కూడా ఈ జబ్బులు ఇట్టే సోకుతున్నాయి.
మనదేశంలో ఎవేర్ నెస్ లేని కారణంగా హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ బాధితులు ముందుగా రోగాన్ని గుర్తించలేకపోతున్నారు. నివారణ చర్యలపై దృష్టి పెట్టని కారణంగా జబ్బులు ముదిరిపోతున్నాయి. ఇది వరకు అటు ఏడు తరాలు, ఇటు ఏడుతరాల గురించి ఆరా తీసేవారు. ఆస్తిపాస్తుల గురించే కాదు రోగాల చరిత్ర గురించి ముందుగానే తెలుసుకోవడానికి. డాక్టర్ దగ్గరకు వెళితే అక్కడా మనకు ఇవే ప్రశ్నలెదురవుతాయి. అయితే బీపీ. షుగరు, హైపర్ టెన్సన్ లాంటివి ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే ఎవరికైనా, ఏ వయ్సులోనైనా సోకుతున్నాయని వైద్య నిపుణులే చెప్తున్నారు. సుమారు నలబై శాతం బాధితుల్లో ఇలాంటి రోగాలు తమ వెనుకటి వారికి ఉన్నట్లు ఆధారాల్లేవు. దగ్గరి కుటుంబ సభ్యులకూ లేని జబ్బులు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్(షుగర్), హార్ట్ ట్రబుల్(గుండెజబ్బు) ఉన్న వారు హైపర్ టెన్షన్, బీపీల విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి.
జీవనశైలిలో అనూహ్య మార్పులతోనే యాభై శాతం మందికి ఈ జబ్బులు వస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం ఉప్పని ముందే చెప్పుకున్నాం. ఉప్పు తగ్గించమని డాక్టర్లు చెప్తున్నా మన నాలుక రుచి కోసం తహతహలాడుతుంది కదా!. 'ఉప్పు లేని పప్పు చప్పన' అన్న సామెతను గుర్తుచేసుకుంటూ కాస్త ఉప్పు వేసుకుంటాం. ఇక సిగరెట్లు కాల్చొద్దని హెచ్చరించినా పట్టించుకోని పొగరాయుళ్లు ఉండనే ఉంటారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని ఆరోగ్యకరమైన విధంగా మలుచుకుంటేనే మనం పదిలంగా ఉంటాం. లేదంటే కష్టార్జితమంతా డాక్టర్లకు, మందుల షాపులకు సమర్పించుకోవాల్సిందే. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.... బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం ఉత్తమమని, ఒత్తిళ్లు తగ్గించుకుని హైపర్ టెన్షన్ కు దూరంగా ఉండమనీ. లేదంటే నష్టపోదేది మనమే. మనదేశంలో ఏటా ఇలాంటి చిన్నా చితకా జబ్బుల వైద్యానికి ఖర్చుపెడుతున్నది ఎంతో తెలుసా... అక్షరాలా నాలుగు వేల మూడు వందల కోట్లు. చిన్న సైజు రాష్ట్రానికి వార్షిక బడ్జెట్.
No comments:
Post a Comment